కృష్ణా పత్రిక
కృష్ణా పత్రిక బందరు కేంద్రంగా వెలువడిన ఒక ప్రసిద్ధ వారపత్రిక. దీనిని స్వాతంత్ర్య సమరయోధులు కొండా వెంకటప్పయ్యగారు నడిపించారు. ఈ పత్రిక విశాలాంధ్రకు మద్ధతుగా పనిచేసింది. ప్రత్యేక ఆంధ్రప్రాంతం కావాలని వ్యాసాలు రాసేవారు. వెంకటప్పయ్య తరువాత కృష్ణా పత్రికను ముట్నూరి కృష్ణారావు నడిపారు. ఈ పత్రిక సాహిత్యం, రాజకీయాలు, వేదాంతం, హాస్యం, సినిమా, రంగస్థల కార్యక్రమాల సమీక్షలు, స్థానిక వార్తలు అన్నిటితొ నిండి సర్వాంగ సుందరంగా వెలువడేది. ముట్నూరి తమ అమూల్యమైన రచనలతో కృష్ణాపత్రికకు అపారమైన విలువను సంపాదించి పెట్టాడు. పాత్రికేయుడు పిరాట్ల వెంకటేశ్వర్లు దీనిని దినపత్రికగా పునరుద్ధరించారు.
![]() | |
రకం | ప్రతి దినం దిన పత్రిక |
---|---|
రూపం తీరు | బ్రాడ్ షీట్ |
యాజమాన్యం | శ్రీ గానకృష్ణా ఎంటర్ప్రైజెస్ |
ప్రచురణకర్త | కె.సత్యనారాయణK.SATYANARAYANA |
స్థాపించినది | 1902-02-02(పక్ష పత్రిక), ---(దినపత్రిక) |
కేంద్రం | హైదరాబాద్,ఆంధ్రప్రదేశ్,ఇండియా |
జాలస్థలి | krishnapatrika.com (As of June 24, 2019 - this domain/URL does not work). |
చరిత్రసవరించు
కృష్ణా పత్రిక 1899వ సంవత్సరంలో కృష్ణా జిల్లా సంఘం చే జారీ చేయబడిన తీర్మానమునకు అనుగుణంగా 1902 సంవత్సరం ఫిబ్రవరి 2న ప్రారంభమైంది. రాజకీయంగా ప్రజలను చైతన్యవంతులను చేయుటకు ప్రారంభించబడిన తొలి వార్తాపత్రికగా మొదటి సంచికలో పేర్కొన్నారు. ప్రారంభంలో ఉపసంపాదకుడిగా చేరిన ముట్నూరు కృష్ణారావు 1907లో సంపాదకబాధ్యతను చేపట్టి 1945 లో తను మరణించేవరకు ఆ పదవిలో కొనసాగారు. వ్యక్తిగా కాక ఈ పత్రిక తాలూకు శక్తిగా పేరుపొందారు.ఈ పత్రిక పక్షపత్రికగా ప్రారంభమై ఆతరువాత వార పత్రికగా వెలువడింది.భారత స్వాతంత్ర్యోద్యమంలో ముఖ్య పాత్ర పోషించింది. పట్టణాలకే పరిమితమవకుండా గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలకు ఉచితంగా పంచబడి విద్యార్థుల ద్వారా గ్రామీణులందరని చైతన్య పరచింది.ఎన్.జి.రంగా, బెజవాడ గోపాలరెడ్డి, గొట్టిపాటి బ్రహ్మయ్య, తెన్నేటి విశ్వనాధం తమ చదువులకు స్వస్తి చెప్పి స్వాతంత్ర్యోద్యమంలో చేరటానికి ఈపత్రిక, ఆంధ్ర పత్రికల ప్రభావం వుందని తెలిపారు. బ్రిటీషు ప్రభుత్వం తమ నివేదికలలో ఈ రెండు పత్రికల ప్రభావాన్ని గుర్తించాయి. 1929లో ఈ పత్రికలకు గుర్తింపుగా విజయవాడలో సెప్టెంబరు 9న స్వాతంత్ర్య సమరయోధులు ఎన్.వి.ఎల్ నరసింహారావు అధ్యక్షతన సన్మానం చేశారు. అదే సమయంలో ఆంధ్రజనసంఘ హైదరాబాదులో గుర్తింపుగా తీర్మానం చేసింది. ఆర్థిక ఇబ్బందులకు గురైనా దాతల విరాళాలతో నడిచింది.[1]
పాత్రికేయుడు పిరాట్ల వెంకటేశ్వర్లు దీనిని దినపత్రికగా పునరుద్ధరించారు. దీనిని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణకుమార్ రెడ్డి సోదరుడు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి.[2]
ఇతర విశేషాలుసవరించు
కృష్ణా పత్రికలో సహాయ సంపాదకులుగా శ్రీ కమలాకర వెంకట్రావు గారు, శ్రీ రావూరు సత్యనారాయణ రావు గారు చాలా కాలము పనిచేసారు. రావూరు గారు 12 ఏళ్ళు పైనే "వడగళ్ళు" అనే శీర్షికలో హస్యపు చినుకులు కురిపించి తెలుగు పాఠకులకు నవ్వుల విందు చేశారు. అంతేకాక నవలలు, కథలు, రాజకీయ వ్యాసాలు, సినిమా, నాటకాల విమర్శలు ఇంకా ఎన్నో వ్రాసి పత్రికకు ప్రాచుర్యం కలిగించారు. శ్రీ కాజ శివరామయ్యగారు మేనేజరుగా, శ్రీ అద్దేపల్లి మల్లిఖార్జునరావుగారు అకౌంటంట్ గా పనిచేసారు. 'వడగళ్ళు' శీర్షికలో ఈయన మల్లినాధ సూరిగారు దాదాపు వారం వారం దర్శనమిచ్చేవారు. ఏ విషయమైనా కృష్ణాపత్రికలో ప్రచురించిందంటే అది ప్రజలు ఎంతో విశ్వాసంగా స్వీకరించేవారు. శ్రీ ముట్నూరివారి వ్యాసాలు కృష్ణాపత్రికకి కల్కితురాయిలా భాసించేవి. కృష్ణా పత్రికలో శ్రీ తోట వెంకటేశ్వరరావు గారు చిత్రకారునిగా పనిచేసేవారు. ఆయన సృష్టించిన చిత్రాలు కృష్ణాపత్రికకు సొగసులు దిద్దేవి. పత్రిక ఆవరణలో సాయంకాలాలలో "దర్బారు" నిర్వహించేవారు. బందరులోని కవులు పండితులు, నటులు, గాయకులు, సంగీతకారులే కాక బయటనుంచి కూడా వచ్చి ఈ బర్బారులో పాల్గొని ఆనందించేవారు. వారందరూ విసిరిన చెణుకుల్ని మరుసటి వారం పత్రికలో "పన్నీటి జల్లు" అనే పేరుతో ప్రచురించేవారు. కృష్ణా పత్రికలో తమ రచనలు ప్రకటిస్తే ఎంతో గొప్పగా భావించేవారు. దీనికి కొన్నాళ్ళు శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు కూడా సంపాదకులుగా పనిచేసారు. సమాజంలో దేశభక్తిని, కళాకారుల్లో ఉత్తేజాన్ని నింపిన ఉత్తమ స్థాయి పత్రిక కృష్ణా పత్రిక.
పత్రిక సంపాదకులుసవరించు
మూలాలుసవరించు
- ↑ "About us". కృష్ణాపత్రిక. Archived from the original on 2014-02-08. Retrieved 2014-03-16.
- ↑ "మీడియా, యాత్రలు: కిరణ్ చేతికి కృష్ణాపత్రిక". వన్ ఇండియా. 2013-03-30. Retrieved 2014-03-16.[permanent dead link]