కొంజేటి సత్యవతి

కొంజేటి సత్యవతి (రంగక్క) తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు. నల్లమలలోని ఒక దళానికి అధినాయకురాలుగా పనిచేసిన సత్యవతి, తుపాకీ పట్టి పెత్తందారీలను హడలెత్తించడమేకాకుండా అనేక ఊర్లను వెట్టిచాకిరీ నుంచి విడిపించడంలోనూ, పేదలకు భూములు పంచడంలోనూ ప్రధాన పాత్ర పోషించింది. ‘రంగక్క’ పేరు వింటే అమ్రాబాద్‌ చుట్టుపక్క గ్రామాల్లోని పెత్తందారులు, జాగీర్దారులు హడలెత్తిపోయేవాళ్ళు.[1] సత్యవతి భర్త కొంజేటి నారాయణ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ నాయకుడిగా, నాగర్‌కర్నూలు ప్రాంతంలోని దళానికి కమాండర్‌ గా పనిచేశాడు.[2]

కొంజేటి సత్యవతి
కొంజేటి సత్యవతి
జననం
ఇతర పేర్లురంగక్క
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు
జీవిత భాగస్వామికొంజేటి నారాయణ
పిల్లలుజ్యోతిబాబు
తల్లిదండ్రులు
  • అప్పిరెడ్డి (తండ్రి)

జీవిత విశేషాలు మార్చు

సత్యవతి అమ్మమ్మ ఊరు ఉమ్మడి నల్గొండ జిల్లా, చివ్వెముల. తండ్రి అప్పిరెడ్డి సన్నకారు రైతు.

సాయుధ పోరాటం మార్చు

సాయుధ పోరాట సమయంలో దేవులపల్లి వెంకటేశ్వరరావు, రాఘవేంద్రరావు వంటి కమ్యూనిస్టు నాయకులు అప్పుడప్పుడు వచ్చి సత్యవతి వాళ్ళ బావికాడ తలదాచుకునేవాళ్ళు. సత్యవతి కుటుంబ సభ్యులు రహస్యంగా వాళ్ళకు అన్నం పెడుతుండేవారు. రజాకార్లకు ఆ విషయం తెలిసి ఇంటిమీద దాడిచేయడానికి వస్తున్నారన్న సమాచారం రావడంతో సత్యవతి నడుచుకుంటూ జగ్గయ్యపేటకు వెళ్ళి, అక్కడినుండి రైలులో విజయవాడకు చేరుకొని స్థానిక కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుకు చేరుకొని నెలరోజులు అక్కడ గడిపింది. పార్టీలో పనిచేయాలనుందని సత్యవతి అక్కడి నాయకులకు చెప్పడంతో రంగమ్మగా పేరు మార్చి, నల్లమలకు పంపించారు.[1]

ఢిల్లీ నుంచి వచ్చిన కామ్రేడ్‌ దగ్గర తుపాకీ వాడడంలో ట్రైనింగ్‌ తీసుకుంది. 15 ఏళ్ళ వయసులో దళ కమాండర్‌గా నియమించబడింది. అంగీ, నిక్కరుతో భుజానికి ఒకవైపు రైఫిల్‌, మరోవైపు బుల్లెట్ల సంచీ తగిలించుకొని నల్లమల అడవుల్లో కొండలు, గుట్టల చాటున నాలుగేళ్లు రహస్య జీవితం గడిపింది. అచ్చంపేట, అమ్రాబాద్‌ చుట్టుపక్క ఊర్లలో పెత్తందారులు చేస్తున్న దోపిడీ, దౌర్జన్యాల నుంచి ప్రజలకు విముక్తి కలిగించింది. భూస్వాములు అక్కమంగా దాచిన ధాన్యాన్ని పేదలకు పంచింది.[3]

జైలు జీవితం మార్చు

సాయుధ పోరాట విరమించిన తరువాత ఆత్మకూరులో రైతు సభకు వెలుతున్న సత్యవతిని పోలీసులు అరెస్టు చేసి, అండర్‌ గ్రౌండ్‌లో ఉన్న నాయకుల ఆచూకీ చెప్పమని హింసించారు. సత్యవతి మీద తొమ్మిది కేసులు పెట్టి, ఏడాదిన్నరపాటు జైల్లో నిర్బంధించారు. ఏడాదిపాటు మహబూబ్‌నగర్‌ జైలులో ఉన్నది. సరిపడా సబ్బులు, వేడినీళ్లు ఇవ్వాలని తోటి మహిళా ఖైదీలతో కలిసి జైల్లోనే ఉద్యమం చేసింది. ఆ తరువాత చంచల్‌గూడ జైలులో ఆరునెలలు శిక్ష అనుభవించింది. అ సమయంలో రెండేళ్ల వయసున్న సత్యవతి పెద్దకొడుకు జ్యోతిబాబు కూడా ఆమెతోనే జైల్లో ఉన్నాడు.[1]

వివాహం మార్చు

పెంచికల్‌ దిన్నె గ్రామానికి చెందిన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ నాయకుడు కొంజేటి నారాయణ నాగర్‌కర్నూలు ప్రాంతంలోని మరొక దళానికి కమాండర్‌ గా పనిచేస్తుండేవాడు. అతనితో పరిచయంతో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. చల్లా సీతారాంరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, ఎల్వీ గంగాధరరావు వంటి పార్టీ పెద్దలు, కార్యకర్తల సమక్షంలో అమ్రాబాద్‌ అడవుల్లోని ఒక కొండమీద వివాహం జరిగింది. నారాయణ రెండుసార్లు గ్రామ సర్పంచ్‌గా పనిచేశాడు. ఒకసారి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. 2020, ఏప్రిల్ 19న నారాయణ చనిపోయాడు.[4]

నిజాం నిరంకుశత్వాన్ని, భూస్వాముల ఆగడాలను వ్యతిరేకించిన పెంచికల్ దిన్నె గ్రామానికి చెందిన ఏడుగురు పోరాట యోధులను 1948 జనవరిలో రజాకార్లు చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు. పెంచికల్‌ దిన్నెకు తెలంగాణ ‘మాస్కో’గా పిలుస్తారు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 ఆంధ్రజ్యోతి, నవ్య (30 September 2021). "రంగక్క అంటే పెత్తందారులకు హడల్‌". andhrajyothy. కె. వెంకటేశ్‌. Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
  2. డైలీహంట్, ప్రజాశక్తి (20 April 2020). "తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు కొంజేటి నారాయణ మృతి". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
  3. నవతెలంగాణ, నల్గొండ (16 September 2021). "కొంజేటి సత్యవతికి సన్మానం". NavaTelangana. Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
  4. డైలీహంట్, నవతెలంగాణ (20 April 2020). "తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొంజేటి నారాయణ మృతి". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.