దేవులపల్లి వెంకటేశ్వరరావు

దేవులపల్లి వెంకటేశ్వరరావు కమ్యూనిస్టు పార్టీ సెక్రటేరియట్ సభ్యుడు, నల్లగొండ జిల్లా పార్టీ కార్యదర్శి.[1] 1951 వరకు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి గుండెలాంటి నల్గొండ జిల్లా పార్టీ సారధిగా అటు పోరాటంలోనూ, ఇటు సిద్ధాంత చర్చలోనూ అగ్రభాగాన నిల్చిన వ్యక్తి.

జీవిత విశేషాలు మార్చు

ఆయన 1917 జూన్ 2న వరంగల్ జిల్లా ఇనుగుర్తిలో జన్మించారు. కానీ ఆయన స్వస్థలం సూర్యాపేట సమీపంలోని చందుపట్ల గ్రామం. ఆయన సంపన్న భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. ఆయన బాలవితంతువైన శ్రీరంగమ్మను వివాహం చేసుకున్నారు. దేవులపల్లి ప్రాథమిక విద్యాభ్యాసం చందుపట్ల సమీపంలోని తిరుమలగిరి, నామవరం గ్రామాల్లోనూ, మాధ్యమిక విద్య సూర్యాపేటలోనూ, హైస్కూలు చదువు వరంగల్‌లోనూ సాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరింనబడంతో జబల్పూరు వెళ్ళి అక్కడ బి.ఎ. డిగ్రీ పూర్తి చేసుకున్నారు. అక్కడే జాతీయోద్యమంతోనూ కమ్యూనిస్టు సాహిత్యంతోనూ పరిచయం ఏర్పడింది.[2]

స్వగ్రామం వచ్చిన ఆయన 1939లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అప్పటికే నిజాం పాలనలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉంది. హైదరాబాద్‌లో ‘కామ్రేడ్స్‌ అసోసియేషన్‌’ నిర్మాతల్లో ఆయన ప్రథములు. ఉద్యమం సాయుధ పోరాట రూపం తీసుకున్న కాలంలో అంటే 1941-51 దశాబ్దంలో కీలకమైన నల్గొండ జిల్లా పార్టీ బాధ్యతలు చేపట్టి యూనియన్‌ సైన్యాలపై కొనసాగిన పోరాటానికి కూడా నాయకత్వం వహించి పోరాట విరమణ వాదాన్ని వ్యతిరేకించాడు. తెలంగాణ పోరాట చరిత్రను ఆయన సవివరంగా గ్రంథస్థం చేసినా అందులో మొదటి భాగమే అందుబాటులోకి వచ్చింది. ‘జనగామ ప్రజల వీరోచిత పోరాటం’. ‘హైదరాబాద్‌ కౌల్దారీ చట్టం’ అనే పుస్తకాలు రాశారు. పోరాట విరమణ తర్వాత కాలంలో 1957లో నల్గొండ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయారు. ఆయన మొత్తం పొలాన్ని కౌలుదారులకే ఇచ్చేశాడు. 1962లోనూ, 1964లోనూ డిటెన్యూగా, 1970లో నాగిరెడ్డి కుట్రకేసులో ముద్దాయిగానూ జైలు జీవితం గడిపారు. కుట్ర కేసులో నాలుగు సంవత్సరాలు కారాగార శిక్ష విధించగా బెయిల్‌పై విడుదలయ్యారు.[2]

తెలంగాణ సాయుధ పోరాటంలో మార్చు

తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఎనిమిది సంవత్సరాలు, నక్సల్‌బరి పోరాటకాలంలో 9 సంవత్సరాలు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యునిగా, సీపీయం నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ విప్లవ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా, అనంతరకాలంలో ‘భారత విప్లవకారుల సమైక్యతా కేంద్రం’ కేంద్ర కమిటీ కార్యదర్శిగా, ప్రొలిటేరియన్‌ పాత్‌, సంకేతం, జనశక్తి పత్రికల ద్వారా దేశంలో కమ్యూనిస్టు విప్లవకారుల్లో పొడ చూపిన అతివాద, మితవాద పెడధోరణులకు వ్యతిరేకంగా తరిమెల నాగిరెడ్డితో కల్సి ఆయన చేసిన పోరాటం అద్వితీయం. ఈ సిద్ధాంత పోరాటంలో వారి జోడి అపూర్వం.

పోరాట యోధుడు మార్చు

జనగామ ప్రాంతంలో చెదిరిన ఉద్యమాన్ని సాయుధ పోరాట దశకు చేర్చి, బెదిరిన ప్రజలను వీరుయోధులుగా తీర్చిదిద్ది ఏనాడూ శత్రువు చేతికి చిక్కకుండా పోరాట ప్రాంతాల్లో, సాయుధ దళాలతోనే వుంటూ అడుగడుగున పార్టీలోని మితవాదుల కుట్రలను ఎదిరిస్తూ రజాకార్లకే కాకుండా యాభై వేల నెహ్రూ సైన్యాలను సైతం మూడేళ్లకు మూడేళ్లకుపైగా ముప్పుతిప్పలు పెట్టిన పోరాటానికి, మార్గదర్శి ఆయన. 1944-51 దాకా ఏడేళ్లపాటు ప్రజలను పోరాటానికి సిద్ధం చేయడానికి భావజాల వ్యాప్తికోసం, జరిగిన అన్యాయాలను లోకం దృష్టికి తేవడం కోసం పల్లెపల్లె, ఇల్లిల్లు తిరిగి బాధితులను స్వయంగా కలిసి వెట్టిచాకిరి, ఆకునూరు-మాచిరెడ్డి పల్లె దురంతాలు, నల్గొండ ప్రజల వీరోచిత పోరాటం జనగామ ప్రజల పోరాటం వంటి విలువైన సాహిత్యం వెలువడింది. [3]

నల్గొండ జిల్లా కడవెండి గ్రామంలో శాంతియుతంగా సాగుతున్న వాలంటరీ దళ ఊరేగింపుపై 1946 జూలై 6న భూస్వాముల గూండాలు కాల్పుల్లో దొడ్డి కొమురయ్య మరణించాడు. దీంతో తెలంగాణ రైతాంగ ప్రజా ఉద్యమం ఉన్నత స్థాయికి చేరి, సాయుధ పోరాట రూపం తీసుకున్నది. 1946 డిసెంబర్ నాటికి దాదాపు120 గ్రామాల్లో గ్రామ రాజ్యాలేర్పడి 3,000 ఎకరాల భూస్వాముల భూములను పేదలకు పంచారు. 1946 నుండి 1951 వరకు సాగిన ఈ పోరాటంలో డీవీ ప్రధాన పాత్రధారి. సాయుధ పోరాటాన్ని విరమించాలని 1948లో ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించినప్పుడు డీవీ ‘తెలంగాణ సాయు ధ పోరాటాన్ని విరమించాలనే తప్పుడు ధోరణులపై విమర్శ’ అన్న గ్రంథాన్ని రచించారు.[4]

రచయితగా మార్చు

దేవులపల్లి కలం నుంచే మా భూమి వంటి అనేక నాటకాలకు, కళారూపాలకు, రచనలకు, పాటలకు, బుర్రకథలకు కథావస్తువుగా మారింది. 1983-84లో దేవులపల్లి గళం నుంచి జాలువారి అక్షరరూపం సంతరించుకున్న తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర (1946-1951) సాయుధ పోరాట కాలం నాటి, అంతకన్న రెండు మూడు దశాబ్దాలకు పూర్వం వున్న ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులను, జన జీవన స్థితిగతులను వివరించే సాధికారత కలిగిన ఏకైక ప్రామాణిక గ్రంథమని చెప్పవచ్చు.[3]

1951 నుండి 1968 వరకు కమ్యూనిస్టు పార్టీలు పార్లమెంటరీ పంథాలో కూరుకుపోయినప్పుడు డీవీ తనదైన సైద్ధాం తిక అవగాహనతో రివిజనిస్టులను, నయారివిజనిస్టులతో విభేదిం చారు. 1968-69 కాలంలో ‘పోరాట ఉద్యమానికి పునాదులు వేయం డి’ అన్న సర్క్యులర్‌ను రచించి, ‘తక్షణ కార్యక్రమం’ అనే రచన ద్వారా తిరిగి విప్లవోద్యమానికి నిర్మించవల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. ఫలితంగా 1975లో భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యత కేం ద్రం ఏర్పడింది.

అస్తమయం మార్చు

ఆయన 1984 జూలై 12వ తేదీ అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు.

మూలాలు మార్చు

  1. ఆ యోధున్ని మరిచిపోదామా? SUN,MAY 31, 2015[permanent dead link]
  2. 2.0 2.1 "విప్లవ మార్గదర్శి డీవీ". చెరుకూరి సత్యనారాయణ. Andhra Jyothi. 12 July 2015. Retrieved 7 June 2016.[permanent dead link]
  3. 3.0 3.1 "ఆ యోధున్ని మరిచిపోదామా?". వి.ప్రకాశ్, రాజకీయ విశ్లేషకులు. namasthetelangaana. 31 May 2015. Retrieved 7 June 2016.[permanent dead link]
  4. అవిశ్రాంత ప్రజా పోరాట యోధుడు దేవులపల్లి

ఇతర లింకులు మార్చు