గణపతి స్థపతి
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
గణపతి స్థపతి (26 ఏప్రిల్ 1931 - 7 ఏప్రిల్ 2017) ప్రముఖ స్థపతి, వాస్తు శిల్పి.
ఎస్.ఎం.గణపతి స్థపతి | |
---|---|
జననం | సత్యనాథ ముత్తయ్య గణపతి 1931 ఏప్రిల్ 26 ఎలువం కోటై , రామనాథపురం జిల్లా, తమిళనాడు, భారతదేశం |
మరణం | 2017 ఏప్రిల్ 7 | (వయసు 85)
వృత్తి | సాంప్రదాయ వాస్తుశిల్పిt శిల్పి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | హిందూ దేవాలయ వాస్తుశిల్పం |
జీవిత భాగస్వామి | సీతై అమ్మాళ్ |
పిల్లలు | జి.శంకర స్థపతి, జి.జయేంద్రన్ స్థపతి, ఐదుగురు కుమార్తెలు |
తల్లిదండ్రులు | ముత్తు స్థపతి గౌరి అమ్మన్ |
పురస్కారాలు | పద్మశ్రీ |
వెబ్‌సైటు | http://www.sankarasilpasala.com/ |
శ్రీశైలం దేవస్థాన పునరుద్ధరణ, భద్రాచలం రామాలయ మహామండప గోపురాల నిర్మాణంతో గణపతి స్థపతి పేరు తెచ్చుకొన్నారు. హుస్సేన్ సాగర్‌లోని జిబ్రాల్టర్ రాక్‌పై 58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు[1].
ఆరేళ్ల చిరుత ప్రాయంలోనే ఉలిని చేతబట్టి అలవోకగా చెక్కు తున్న గణపతిని చూచి, ఎప్పటికైనా దేశం గర్వించదగ్గ శిల్పి అవుతాడనుకున్న తమిళనాడులోని రామనాథపురం జిల్లా, ఎలువం కోటై శిల్పుల ఊహల్ని నిజం చేశారు పద్మశ్రీ ఎస్.ఎం. గణపతి స్థపతి. 1931, ఏప్రిల్ 26న ముత్తు స్థపతి, గౌరీ అమ్మన్‌లకు పుట్టిన గణపతి, సాంప్రదాయ ఆలయ, వాస్తు, శిల్ప శాస్ర్తాలను, కుటుంబ పెద్దల దగ్గర 17 సంవత్సరాల పాటు శిక్షణ పొందారు. శిల్పాలు చెక్కడంలోనూ, ఆలయాలను నిర్మించటంలోనూ కొత్త ఒరవడిని సృష్టించి, ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్న గణపతి 1964లోనే అప్పటి మంత్రివర్యులు కల్లూరి చంద్రమౌళి దృష్టిని ఆకర్షించారు. అంతే, తమిళనాడు వదిలి, తెలుగునాట కాలుమోపారు. శ్రీశైలం దేవస్థాన పునరుద్ధరణ, భద్రాచలం రామాలయ మహామండప గోపురాల నిర్మాణంతో పేరుతెచ్చుకొన్న గణపతి స్థపతి నైపుణ్యం గురించి, ఆనోటా, ఈనోటా విన్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, బద్రీనాధ్ దేవాలయ మహామండప పని అప్పగించారు. మండప భాగాలను హైదరాబాద్‌లో తీర్చిదిద్ది, బద్రీనాధ్‌కు తరలించి నిర్మించిన తీరుకు అచ్చెరువొందిన ఆమె, ఒక బంగారు గొలుసు, 60 తులాల డాలర్‌ను బహూకరించి సత్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల పిలుపునందుకొని, తిరుమలలో వసంతరాయ మంటపాన్ని పునర్నిర్మించి, ఆస్థాన స్థపతి పదవిని దక్కించుకొన్నారు.
దేవాదాయ, ధర్మాదాయ శాఖలో స్థపతిగా చేరిన గణపతి స్థపతి, ఉమ్మడి రాష్ట్రంలో వందల, వేల ఆలయాలను నిర్మించి, చీఫ్ స్థపతిగా ఎదిగారు. శిల్పుల గౌరవాన్ని ఇనుమడింపజేశారు. తరతరాల వాస్తుశిల్ప సంప్రదాయం, నిరంతరం కొనసాగాలన్న తపనతో, తన ఆధ్వర్యంలో దేవాదాయ శాఖలో ఒక శిల్ప కళాశాలను స్థాపించి, కొన్ని వందల మంది శిల్పుల్ని తయారుచేసి, కొరతను తీర్చారు.ప్రముఖ స్థపతి, పురాతత్వవేత్త, చరిత్ర పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి గారు వీరి శిష్యులే.
రాష్ట్రవ్యాప్తంగా, శిథిలాలయాలను పదిలం చేస్తూ, లేనిచోట కొత్త వాటిని కడుతూ తలమునకలై ఉన్న గణపతి స్థపతికి శ్రీశైలం జలాశయ నీటి ముంపు దేవాలయాల తరలింపు ఒక సవాలుగా మారింది. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 102 గ్రామాల్లో ముంపునకు గురైన దాదాపు 108 దేవాలయాలను ఊడదీసి ఎగువన పునర్నిర్మించిన ఘనతను దక్కించుకొన్నారు. 1978–89 మధ్య చేపట్టిన ఈ చారిత్రక కార్యక్రమంలో ఏ.వేలు, ఈమని శివనాగిరెడ్డి, సుందరరాజన్, పి.సుబ్రమణి లాంటి శ్రీమువస్థపతులకు స్వయంగా తర్ఫీదునిచ్చిన ఘనత కూడా గణపతి స్థపతి గారిదే.
వాస్తు, శిల్ప విద్యను అందరికీ అందుబాటులోకి తేవడానికి పూనుకుని, తమిళ, సంస్కృత భాషల్లోనున్న వాస్తు, శిల్ప, ఆగమ శాస్ర్తాలను తెలుగులోకి అనువదించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెదపాటి నాగేశ్వరరావు సహకారంతో రూపధ్యాన రత్నావళి, కాశ్యప శిల్ప శాస్ర్తాలను వెలువరించారు. నిరంతర అధ్యయనంతో పాటు, పరిశోధనలపై దృష్టి సారించిన గణపతి స్థపతి, తెలుగు విశ్వవిద్యాలయం, సచివాలయం భవనాల్లో ఆధునికతకు, సాంప్రదాయ వాస్తును జోడించి, కొత్త ఒరవడిని సృష్టించారు.
ఒకసారి అమెరికా వెళ్లిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకు, న్యూయార్క్‌లో గణపతి స్థపతి తారసపడగా, లిబర్టీ స్టాట్యూ లాంటి విలక్షణ విగ్రహాన్ని హైదరాబాద్‌లో సృష్టించలేమా అన్న ప్రశ్నకు సమాధానంగా, హుస్సేన్ సాగర్‌లోని జిబ్రాల్టర్ రాక్‌పై 58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ విగ్రహం కోసం యాదగిరిగుట్టకు సమీపంలోని రాయగిరి నుంచి 100అడుగుల రాయిని, 100 చక్రాల వాహనంపై హైదరాబాద్‌కు తరలించి, ప్రపంచ ఖ్యాతిని గడించారు గణపతి స్థపతి. తెలుగు నేలపైనే కాక విదేశాల్లో సైతం ఆలయాలను నిర్మించి, తెలుగు శిల్పుల కీర్తిని దశదిశలా చాటటంలో భాగంగా, పిట్స్‌బర్గ్‌లోని బాలాజీ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం అమెరికా తిరుపతిగా ప్రసిద్ధి చెంది, రోజూ వేల మంది భక్తులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
ప్రచారం కోరుకోని నిరాడంబర జీవితం గడిపిన గణపతి స్థపతి శిల్పకళా చాతుర్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం, 1990లో అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీనిచ్చి గౌరవించింది. ఆయన ప్రతిభకు గుర్తింపుగా, శిల్పకళానిధి, కళైమామణి, శిల్పకళా రత్న వంటి బిరుదులెన్ని వరించినా, సాధారణ శిల్పుల గౌరవాన్ని పొందటమే మిన్న అని నమ్మారు.
వందలాది దేవుళ్లకు వేలాది ఆలయాలను నిర్మించిన గణపతి స్థపతి స్వర్ణభైరవారాధకుడు. అయినా, కంచి కామకోటి పీఠ పరంపరలోని 68వ శంకరాచార్యులైన శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామికి పరమభక్తుడు. ఆయన ఆకాంక్ష మేరకు, కంచి సమీపంలోనున్న ఒరుక్కై గ్రామంలో అనల్ప శిల్పకల్పనా చాతుర్యంతో మలచిన 100 స్తంభాలతో నిర్మించిన మణి మంటప నిర్మాణం, తన చిరకాల వాంఛగా తరచూ పేర్కొనేవారు గణపతి స్థపతి. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. శంకరాచార్య స్వామి ఆశీస్సులతో అక్కడే శంకర శిల్పశాలను స్థాపించి, వాస్తు, శిల్ప, ఆగమ శాస్ర్తాల్లో విద్యార్థులకు శిక్షణనిస్తూ కడశ్వాస విడిచారు.
ఉలి చప్పుళ్ల మధ్య కళ్లు తెరిచి, ఉలి చప్పుళ్ల మధ్యే కళ్లుమూసిన పద్మశ్రీ గణపతి స్థపతి, ఏప్రిల్ 7న, దేవశిల్పి విశ్వకర్మ పిలుపుపై తిరిగిరాని లోకాలకెళ్లారు. ఈ మహాశిల్పి లేకున్నా, ఆయన సృష్టించిన శిల్పాలు, నిర్మించిన ఆలయాలు, ప్రతినిత్యం, తెలుగు శిల్పుల్ని, స్ఫూర్తిమంతం చేస్తూ, కాంతులీనుతూనే ఉంటాయి. ఆయన లేడు. హుస్సేన్ సాగర్‌లో బుద్ధుడున్నాడు. భద్రాచలంలో మహా మండపం ఉంది.
మూలాలు
మార్చు- ↑ "ఆయన లేడు... బుద్ధుడున్నాడు! - ఈమని శివనాగిరెడ్డి". Archived from the original on 2017-04-09. Retrieved 2017-04-08.