వాస్తు శాస్త్రం

భారతీయ నిర్మాణ శాస్త్రం

వాస్తు శాస్త్రం : వసతి ఇతి వాస్తుః వాస్తు అంటే నివాసగృహం లేదా నివస ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది లేదా రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. ప్రాచీన కాలం నుండి భారత దేశంలో దేవాలయాలు, గృహాల నిర్మాణాలు దీనికి అనుగుణంగా నిర్మించారు. వాస్తు శాస్త్రంలో ప్రధానం గా నాలుగు భాగాలు ఉన్నాయి.[1]

  1. భూమి వాస్తు.
  2. హర్మ్య వాస్తు
  3. శయనాసన వాస్తు.
  4. యాన వాస్తు.

వాస్తు పురుషుడుసవరించు

పూర్వ కాలంలో అంధకాసురడనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పతిప్పలు పెట్టుచుండెను. అప్పుడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో శివుని లలాటం నుండి రాలిన ఒక చమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళవదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమ క్రమంగా భూమి, ఆకాశాలను ఆవరించసాగింది. ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు. బ్రహ్మదేవుని శరణువేడారు. సమస్త భూతములను సంభవించువాడు, సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ దేవతలను ఊరడించి 'ఆ భూతమును అధోముఖంగా భూమి యందు పడవేసే విధానం చెప్పాడు. బ్రహ్మ దేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముఖంగా క్రిందకు పడవేశారు.

వాస్తు పద మండలంసవరించు

32 రకాల చతురస్రాకారపు వాస్తు పద మండలంలో ముఖ్యమైనవి 64 గడులు (8X8) , 81 గడుల (9 X9), 100 గడులు (10 X10) తో ఉన్నవి. ఆ భూతం భూమిపై(మండలం) ఈశాన్య కోణమున శిరస్సు, నైరుతి కోణమున పాదములు, వాయువ్య, ఆగ్నేయ కోనాలందు బాహువుల వుండునట్లు అధోముకంగా భూమిపై పండింది. అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై ఈ విధంగా కూర్చున్నారు.వీటిలో పవళించిన వాస్తు పురుషుని పై ఉన్న పదదేవతలు[2]

పద దేవతలుసవరించు

శిరస్సున - శిఖి(ఈశ)

దక్షిణ నేత్రమున - సర్జన్య

వామనేత్రమున - దితి

దక్షిణ శోత్రమున - జయంతి

 
వాస్థు పదవిన్యాసం - గృహ అమిరిక

వామ శోత్రమున - జయంతి

ఉరస్సున (వక్షమున) - ఇంద్ర, అపవత్స, అప, సర్ప

దక్షిణ స్తనమున - అర్యమా

వామ స్తనమున - పృధ్వీధర

దక్షిణ భుజమున - ఆదిత్య

వామ భుజమున - సోమ

దక్షిణ బాహువున - సత్య, భృశ, ఆకాశ, అగ్ని, పూషా

వామ బాహువున - పాప యక్ష, రోగ, నాగ, ముఖ్య, భల్లాట

దక్షిణ పార్శ్వమున - వితధి, గృహక్షత

వామ పార్శ్వకామున - అసుర, శేష

ఉదరమున - వినస్వాన్, మిత్ర

దక్షిణ ఊరువున - యమ

వామ ఊరువున - వరుణ

గుహ్యమున - ఇంద్ర జయ

దక్షిణ జంఘమున - గంధర్వ

వామ జంఘమున - పుష్పదంత

దక్షిణ జానువున - భృంగరాజ

వామ జానువున - సుగ్రీవ

దక్షిణ స్పిచి - మృగబు

వామ స్పిచి - దౌవారిక

పాదములయందు - పితృగణము

కేంద్రము (మధ్యబాగం) - బ్రహ్మ

ఇంతమంది దేవతల తేజస్సముదాయంతో దేదీప్య మానంగా వెలుగొందుతున్న ఆ భూతకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు దాన్నే 'వాస్తు పురుషుడు'గా సృష్టి గావించాడు.

అష్ట దిక్పాలకులుసవరించు

ఎనిమిది దిక్కులకు పరిపాలించే అష్టదిక్పాలకులు ప్రధాన మండలాధిపతులు:[2]

పంచ భూతాలుసవరించు

  • భూమి
  • జలం
  • అగ్ని
  • వాయు
  • ఆకాశం

వాస్తుశాస్త్ర గ్రంధాలుసవరించు

  • మనసార శిల్ప శాస్త్రము (రచన : మనసారా),
  • మాయామతం (రచన : మాయా),
  • విశ్వకర్మ వాస్తుశాస్త్రము (రచన : విశ్వకర్మ),
  • అర్ధ శాస్త్రం
  • సమారంగణ సూత్రధార (రచన : రాజా భోజ),
  • అపరాజిత పృచ్చ (విశ్వకర్మ అతని కుమారుడు అపరాజిత మధ్య సంవాదము, రచన భువనదేవాచార్య)
  • మానుషాలయ చంద్రిక
  • శిల్పరత్నం
  • పురాణాలలో-మత్స్య, అగ్ని, విష్ణు ధర్మొత్తరం, భవిష్య పురాణాలలో వాస్తు ప్రకరణలు ఉన్నాయి.
  • సంహితా గ్రంధాలు ;బృహత్సహిత,గార్గసంహత,కాశ్యప సంహిత
  • ఆగమ గ్రంధాలు:శైవాగమాలు,వైష్ణవాగమాలు

ప్రధాన వస్తువులుసవరించు

ఆనాటి నిర్మాణాలలో రాతి శిలలు, ఇటుక, కలప ప్రధాన మైన వస్తువులు. బంక మన్ను, సున్నం వంటి వాటితో నిర్మాణాలు చేసేవారు. ఆనాటి వాస్తు ననుసరించి నిర్మించిన దేవాలయాలను, కోటలను ఇప్పటికి మనం చూడవచ్చు.

చైనా వాస్తు శాస్త్రం - పెంగ్ షూయ్సవరించు

చైనా భాషలో ఫెంగ్ -అంటే గాలి, షుయి - అంటే నీరు అని అర్థం. ఫెంగ్ షుయ్ అనే ఈ మార్మిక కళను జియోమెన్సీ అనికూడా పిలుస్తారు. జియోమెన్సీ అంటే భూమిపై ఉండే దైవిక చిత్రాలు. చైనా,థాయిలాండ్ దేశాలలో శుభాశుభాల పోకడలను సూచించే ఒక తాంత్రిక విద్యగా ప్రాచీన కాలం నుండి కొనసాగుతూ వస్తుంది.  మనిషి మనుగడకు గాలి, నీరుకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి వాటిని నివాసానికి  ఎలా వర్తింపజేయాలనే సూత్రాన్ని ఆధారం చేసుకొని, యాంగ్-యాన్ అనే తాత్విక సృష్టి సిద్ధాంతాన్ని మేళవించి  ఆధునీకరించి రూపొందించినదే ఈ చైనా దేశవాళీ వాస్తు.[3]

అన్ని ప్రాచీన సమాజాలలో ప్రకృతిని అర్ధం చేసుకునే తీరులో అనేక ఊహాకల్పనలు ఉద్బవించాయి. అలాంటి వాటిలో ప్రాచీన చైనావాసుల ఊహా కల్పనలకు ఒక చక్కని రూపమే ఈ వాస్తు మర్మకళ.

ఈనాడు ఇది రకరకాల పోకడలతో క్రొత్త పుంతలు త్రొక్కుతూ ప్రజలను వెర్రి వాళ్ళను చేస్తూ ఒక గాలి ధుమారం వలె మన దేశంలోకి దిగుమతి అయింది. దినికి మన భారతీయ వాస్తుకు అసలు సంభంధమే లేదు.

వాస్తు దోషాలకు రకరకాల వాస్తు పూజలు, శాంతులు, వాస్తు తాయెత్తులు(మత్స్యయంత్రాలు,కుబేర,లక్ష్మీ...యంత్రాలు), నరదృష్టికి  దిష్టి పిడతలు/బొమ్మలు, గుమ్మడికాయలు, భూత, ప్రేత భయాలకు  నిమ్మకాయలు, చెప్పులు, వెంట్రుకలు, మిరపకాయలు వంటి వాటిని ఇంట్లో ఉంచుకొనే మన ప్రాచీన దేశీవాళి చిట్కా పద్దతుల స్థానే ఇప్పుడు ఆకర్షణీయమైన చైనా దేశపు చిట్కాలు, చిత్రాలు, చిందులు ఫెంగ్ - షుయి పేరుతో మార్కెట్టులోకి వెల్లువలా వచ్చాయి. ఫెంగ్ షుయి పేరుతొ జరిగే మోసాలు, దోపిడిలు గమనించిన చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం తమ దేశంలో దీనిపై నిషేధం విధించినదన్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. చట్ట విరుద్దంగా ఎవరైనా ఫెంగ్ షుయి ని చూపి ప్రలోభపెట్టి ప్రజల నుండి డబ్బు గుంజితే వారికి ఆ దేశంలో చేరసాలే గతి.

ఈ నిషేధం తో ఫెంగ్ షుయి సిద్దాంతులు జీవనోపాది కోల్పోయి చైనాను వదిలి ఇతర బౌద్ధ దేశాలలో కాలం గడుపుతూ ఈ నమ్మకాలను ప్రపంచవ్యాప్తంగా వెదజల్లుచున్నారు.[3]

అభిప్రాయాలుసవరించు

ఎంత పకడ్బందీగా వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకున్నా మనిషికి కేవలం సుఖాలే కాక కష్టాలు కూడా కలుగుతాయని, మనిషి నమ్మకానికే శక్తి ఉందని, మనిషికి కలిగిన ఓటమికి, అనారోగ్యాలకు, బాధలకు వాస్తుతో సంబంధం లేదని, మనిషిలో ఏవో తెలియని భయాలే వాస్తుని నమ్మేలా చేస్తాయని పలువురి లౌకిక వాదుల అభిప్రాయం. వాస్తు పై జరిగే చర్చలో కేవలం ఫలిత వాస్తును మాత్రమే పరిగణలోకి తీసుకోరాదు.అలాగే అనుభవాల పేరుతో చెప్పే వాస్తు సిద్ధాంతుల మాటలు ముమ్మాటికి నిజమని అనుకోరాదు. వాటిలో 99 శాతం అబద్దాలు, అతిశయోక్తులు. నిజానికి,ఆనాడు వాస్తులోచెప్పబడిన ఫలితాలు ఆశాస్త్రాన్ని తు.చ. తప్పకుండాఆచరించటానికి, ఫలితాల పేరుతో ప్రజలను భయపెట్టి శాస్త్రాన్ని నూరు శాతం అమలు జేయటానికి చేప్పబడినవే. వాస్తు శాస్త్రం అనేది మన ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా స్వీకరించితే ఈ అపోహలు తొలగతాయని ఈ శాస్త్రాన్ని పరిశోధించిన వారి అభిప్రాయం.[1]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 ప్రొఫెసర్ కొడాలి, శ్రీనివాస్ (1996). వాస్తులో ఏముంది? వాస్తుపై సమగ్ర పరిశోధనా గ్రంథం. విజయవాడ: రాయల్ సివిల్ పబ్లికేషన్.
  2. 2.0 2.1 ప్రొఫెసర్ కొడాలి, శ్రీనివాస్ (2007). వాస్తు విద్య ,వరాహమిహిరుని బృహత్సంహితా భాగం. గుంటూరు: రాయల్ పబ్లికేషన్.
  3. 3.0 3.1 "చైనా వాస్తు -ఫెంగ్ షుయి". వాస్తు విద్య. 21 May 2015. Retrieved 30 August 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  • D. N. Shukla, Vastu-Sastra: Hindu Science of Architecture, Munshiram Manoharial Publishers, 1993, ISBN 978-81-215-0611-3.
  • B. B. Puri, Applied vastu shastra in modern architecture, Vastu Gyan Publication, 1997, ISBN 978-81-900614-1-4.
  • Vibhuti Chakrabarti, Indian Architectural Theory: Contemporary Uses of Vastu Vidya Routledge, 1998, ISBN 978-0-7007-1113-0.

బయటి లింకులుసవరించు