గణేష్ శంకర్ విద్యార్థి

భారతీయ పత్రికా రచయత

గణేష్ శంకర్ విద్యార్థి (26 అక్టోబర్ 1890 – 25 మార్చి 1931) ఒక భారతీయ పాత్రికేయుడు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు,[1] భారత జాతీయోద్యమ కార్యకర్త.ఇతడు సహాయ నిరాకరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించాడు.[2]స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. విక్టర్ హ్యూగో నవల "నైంటీ త్రీ"ని అనువదించాడు.[3] ఇతడు ముఖ్యంగా హిందీ వార్తాపత్రిక "ప్రతాప్" వ్యవస్థాపక సంపాదకుడిగా సుపరిచితుడు.[4][5][6]

గణేష్ శంకర్ విద్యార్థి
1940నాటి చిత్తరువు
జననం(1890-10-26)1890 అక్టోబరు 26
ప్రయాగ్‌రాజ్, యునైటెడ్ ప్రావిన్సెస్, బ్రిటీష్ ఇండియా
మరణం1931 మార్చి 25(1931-03-25) (వయసు 40)
కాన్పూర్, యునైటెడ్ ప్రావిన్సెస్, బ్రిటీష్ ఇండియా
వృత్తిపాత్రికేయుడు
క్రియాశీల సంవత్సరాలు1890–1931
బిరుదుసంపాదకుడు- ప్రతాప్ (1913–1931)

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు ఫతేపూర్ జిల్లా హాథ్‌గావ్ అనే గ్రామంలో ఒక క్షత్రియ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి జయనారాయణ్ మంగోలి అనే గ్రామంలో ఒక మాధ్యమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు.[7] తన తండ్రి శిక్షణలో ప్రాథమిక విద్యను అభ్యసించి తర్వాత మంగోలి, విదిశలలో హైస్కూలు విద్య చదివాడు. పేదరికం వల్ల చదువును కొనసాగించలేక గుమాస్తాగా, అధ్యాపకునిగా కాన్పూరులో పనిచేశాడు. తన 16వ యేట ఇతడు తన మొదటి పుస్తకం "హమారీ ఆత్మోగ్సర్గర్త్" రచించాడు. 1909 జూన్ 4న ఇతనికి చంద్రప్రకాశ్వతితో వివాహం జరిగింది.[8]

ఇతనికి ప్రజాజీవితం పట్ల, జర్నలిజం పట్ల ఆసక్తి కలిగివుండి జాతీయోద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. విప్లవ భావాలను ప్రచారం చేస్తున్న కర్మయోగి, స్వరాజ్య అనే హిందీ ఉర్దూ పత్రికలకు ఇతడు పంపిణీదారుగా పనిచేస్తూ క్రమేపీ ఆ పత్రికలలో రచనలు చేయడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో ఇతడు "విద్యార్థి" అనే కలంపేరును పెట్టుకున్నాడు. ఇతడి ప్రతిభను చూసి పండిట్ మహావీర్ ప్రసాద్ ద్వివేది 1911లో ఇతడిని తన హిందీ సాహిత్య మాసపత్రిక "సరస్వతి"లో ఉప సంపాదకునిగా చేర్చుకున్నాడు. అయితే ఇతనికి సాహిత్యం కంటే వర్తమాన విషయాలు, రాజకీయాలలో ఉన్న ఆసక్తితో హిందీ రాజకీయ వారపత్రిక "అభ్యుదయ"లో ఉపసంపాదకునిగా చేరాడు.

1913లో ఇతడు కాన్పూరుకు తిరిగి వచ్చి పాత్రికేయుడిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా తన జీవితాన్ని మలుచుకున్నాడు. "ప్రతాప్" అనే విప్లవాత్మక వారపత్రికను స్థాపించి తను మరణించేవరకు 18 సంవత్సరాలపాటు నడిపాడు. ఈ పత్రిక అనతికాలంలోనే అన్నిరకాల అణచివేతలు వ్యతిరేకంగా పోరాడే పత్రికగా గుర్తింపు పొందింది. 1913లో 500 ప్రతులతో ప్రారంభమైన ఈ పత్రిక 1916 నాటికి 600 ప్రతులను ప్రచురించింది.[9] ఈ పత్రిక ద్వారా గణేష్ శంకర్ రాయబరేలీ రైతుల పక్షాన, కాన్పూరు మిల్లు కార్మికుల పక్షాన నిలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఈ క్రమంలో ఇతడు పలుమార్లు న్యాయస్థానాలలో అభియోగాలను ఎదుర్కొని భారీ జరిమానాలను చెల్లించాడు. ఐదు సార్లు జైలుకు వెళ్ళివచ్చాడు.

1916లో లక్నోలో ఇతడు మహాత్మా గాంధీని తొలిసారి కలిసి మనస్ఫూర్తిగా జాతీయోద్యమంలో చేరాడు. 1917-18లలో హోమ్ రూల్ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. కాన్పూర్ జౌళీ కార్మికుల మొదటి సమ్మెను ఇతడు ముందుకు నడిపించాడు. 1920లో ఇతడు ప్రతాప్ దినపత్రిక ఎడిషన్‌ను ఆరభించాడు. అదే ఏడాది రాయ్‌బరేలీ రైతాంగ పోరాటంలో అరెస్ట్ అయ్యి రెండేళ్ళు కఠిన కారాగారశిక్ష అనుభవించాడు. 1922లో విడుదలై ఫతేగఢ్‌లో ఒక సభలో రాజ్యద్రోహాన్ని ప్రేరేపించే విధంగా ప్రసంగించాడనే కారణంతో తిరిగి వెంటనే అరెస్టు చేశారు. 1924లో ఇతడు మొదటిసారి భగత్‌సింగ్‌తో కలిసి పోరాడాడు.[10] భగత్‌సింగ్ ఇతనికి సన్నిహిత మిత్రుడయ్యాడు.[11][12] తరువాతి కాలంలో ఇతడు చంద్రశేఖర్ అజాద్‌కు కూడా సన్నిహితుడయ్యాడు.[13] 1925లో కాన్పూర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశాల నిర్వహణకు పాటుపడినాడు. కాకోరి స్మారక స్థూపం నిర్మించబడిన అమరులైన వీరుల కొరకు కాకోరి షహీద్ అనే పుస్తకాన్ని రచించాడు. బిస్మిల్ రాంప్రసాద్ ఆత్మకథ ఆంగ్లేయుల కళ్ళలో పడకుండా తన ముద్రణా సంస్థలోనే దానిని చిన్న చేతిలో సరిపడే పుస్తకాన్ని ముద్రించి విడుదల చేశాడు. సేవాశ్రమాన్ని స్థాపించి, సత్యాగ్రహాన్ని ప్రోత్సాహిస్తూ హిందీ భాష ప్రచారానికి కృషి చేశాడు.

1925లో స్వరాజ్ పార్టీ తరఫున ప్రావెన్షియల్ శాసన సభలకు జరిగిన ఎన్నికలలో కాన్పూర్ నుండి శాసన సభ్యుడిగా ఎన్నికై 1929 వరకు కొనసాగాడు. 1929లో కాంగ్రెస్ పార్టీలో చేరాక తన సభ్యత్వానికి రాజీనామా చేశాడు. 1928లో ఇతడు మజ్దూర్ సభను స్థాపించి మరణించేవరకూ దాని నాయకత్వం వహించాడు.[4] 1929లో యునైటెడ్ ప్రావిన్స్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించ బడ్డాడు. ఆ ప్రాంతంలో సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. ఇతడు హిందీ భాషాభిమాని కూడా. 1930లో గోరఖ్‌పూర్[14], న్యూఢిల్లీ [6]లలో జరిగిన హిందీ సాహిత్య సమ్మేళనాలకు హాజరయ్యాడు. అదే సంవత్సరం తిరిగి అరెస్టయి జైలుకు వెళ్ళాడు. గాంధీ-ఇర్విన్ సంధి ప్రకారం 1931 మార్చి 9న విడుదలయ్యాడు.

కరాచీలో జరిగే కాంగ్రెస్ సమావేశాలకు హాజరు కావాలని తయారవుతుండగా అదే సమయంలో కాన్పూరులో మత ఘర్షణలు చెలరేగాయి.గణేష్ శంకర్ విద్యార్థి అల్లరి మూకల మధ్య నిలబడి వారిని వారించి వేలాది మంది అమాయకుల ప్రాణాలను కాపాడాడు. వారిలో హిందువులు, ముస్లిములు కూడా ఉన్నారు. ఈ ప్రయత్నంలో ఇతడిని ఒక అల్లరి మూక దారుణంగా పొడిచి చంపింది. అనేక కత్తిపోట్లతో ఇతని శరీరం గుర్తు పట్టలేకుండా పోవడంతో ఇతడిని శవాన్ని గుర్తుపట్టడానికి కొన్ని రోజుల సమయం పట్టింది.[1][15][16]

గుర్తింపు

మార్చు
 
1962లో విడుదలైన గణేష్ శంకర్ విద్యార్థి తపాలాబిళ్ళ
  • 1989 నుండి భారత రాష్ట్రపతి ప్రతియేటా ఉత్తమ పాత్రికేయులకు "గణేష్ శంకర్ విద్యార్థి పురస్కారా"న్ని ఇస్తున్నారు.
  • కాన్పూర్‌లో ఇతని పేరుమీద గణేష్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజ్ అనే వైద్య కళాశాలను స్థాపించారు..
  • గోరఖ్‌పూర్ నడిబొడ్డులోని కూడలిని ఇతని పేరుతో గణేష్ చౌక్ అని పిలుస్తారు.
  • కాన్పూరులోని ఫూల్ బాగ్‌ను గణేష్ విద్యార్థి ఉద్యానంగా పిలుస్తున్నారు.
  • ఇతని జ్ఞాపకార్థం గణేష్ శంకర్ విద్యార్థి ఇంటర్ కాలేజ్(GSVIC) పేరుతో కాన్పూరు, హాథ్‌గావ్, మహారాజ్‌గంజ్‌లలో విద్యాసంస్థలు నెలకొల్పారు.
  • 2017 జూలై 18న ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కాన్పూర్ విమానాశ్రయానికి "గణేష్ శంకర్ విద్యార్థి విమానాశ్రయం" అని నామకరణం చేసింది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Gooptu, Nandini (2001). The Politics of the Urban Poor in Early Twentieth-Century India. Cambridge University Press. pp. 90–376. ISBN 978-0521443661.
  2. Pandey, Gyanendra (2002). The Ascendancy of the Congress in Uttar Pradesh. Anthem Press. pp. 37–77. ISBN 978-1843317623.
  3. Simon, Sherry; St. Pierre, Paul (2000). Changing the Terms: Translating in the Postcolonial Era. University of Ottawa Press. p. 89. ISBN 978-0776605241.
  4. 4.0 4.1 Brass, Paul R. (1965). Factional Politics in an Indian State: The Congress Party in Uttar Pradesh. University of California Press. pp. 169–196.
  5. Mukul, Akshaya (2015-11-03). Gita Press and the Making of Hindu India. HarperCollins. ISBN 978-9351772316.
  6. 6.0 6.1 Gould, William (2004-04-15). Hindu Nationalism and the Language of Politics in Late Colonial India. Cambridge University Press. pp. 61–100. ISBN 978-1139451956.
  7. Neeraj Shukla. Ganesh Shankar Vidyarthi Samajik Chetna Ke sarthi. Lokvani Prakashan Delhi. p. 25. ISBN 9789381487853.
  8. "Ganesh Shankar Vidyarthi: Penman in the battle against communalism". merinews.com. 18 April 2015. Archived from the original on 19 April 2015. Retrieved 10 September 2015.
  9. Burton, Antoinette; Hofmeyr, Isabel (2014). Ten Books That Shaped the British Empire: Creating an Imperial Commons. Duke University Press. ISBN 978-0822375920.
  10. Ahuja, M. L. (2008). Eminent Indians: Revolutionaries. Rupa & Co. ISBN 978-8129113955.
  11. Bakshi, S. R. (2001). Early Aryans to Swaraj. Sarup & Sons. pp. 302–304. ISBN 978-8176255370.
  12. Massey, Reginald (2014). Shaheed Bhagat Singh and the Forgotten Indian Martyrs. Abhinav Publications. p. 177.[permanent dead link]
  13. Singh Rana, Bhawan (2005). Chandra Shekhar Azad (An Immortal Revolutionary of India). Diamond Pocket Books. pp. 53–57. ISBN 978-8128808166.
  14. Kothari, Rita (1998). Modern Gujarati Poetry: A Selection. Sahitya Akademi. p. 48. ISBN 978-8126002948.
  15. Gandhi, Rajmohan (2006). Gandhi: The Man, His People, and the Empire. University of California Press. p. 327. ISBN 978-0520255708.
  16. Bakshi, S. R. (1988). Gandhi and the Mass Movements. Atlantic Publishers. p. 198.