గల్ఫ్ దేశాలలో తెలుగు సంస్థలు
ఆసియా ఖండపు నైరుతి దిక్కులోనున్న పర్షియా అగాధము (Gulf) ను ఆనుకొని ఉన్న ఏడు అరబ్ దేశాలను గల్ఫ్ దేశాలు అని పిలుస్తారు. అవి కువైట్, బహ్రయిన్, ఇరాక్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు. ఈ దేశాలలో దాదాపు 10లక్షల మంది తెలుగువారు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది బ్రతుకుతెరువు కోసం వలస వెళ్లిన శ్రామికులు. వారితో పాటు వృత్తి నైపుణ్యత కలిగిన ఇంజనీర్లు, డాక్టర్లు, కంప్యూటర్ నిపుణులు, బ్యాంకింగ్ నిపుణులు, అకౌంట్ రంగ నిపుణులు ఉన్నారు. అయితే వీరి సంఖ్య 30 శాతానికి మించి లేదు. మిగిలిన వారంతా నిరక్షరాస్యులు లేదా తక్కువ చదువుకొన్నవారు. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న భారతీయులలో తెలుగు రాష్ట్రాల (తెలంగాణా, ఆంధ్రప్రదేశ్) నుండి వెళ్లిన వారి జనాభా కేరళ రాష్ట్రం తరువాత రెండవస్థానాన్ని ఆక్రమిస్తుంది.
తెలుగు వారి చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, కళలను గల్ఫ్ దేశాలలో ప్రచారం చేస్తూ, తోటి కార్మికుల సంక్షేమం కోసం పాటుపడటానికి అనేక తెలుగు సంస్థలు కృషి చేస్తున్నాయి. విద్యావంతులైన నైపుణ్య కార్మికులు, ఇంజనీర్లు, డాక్టర్లు, మేధావులు మొదలైన వారి కృషి ఫలితంగా తెలుగుజాతి అస్తిత్వం, భాష, సంస్కృతులు ఈ దేశాలలో విలసిల్లుతున్నాయి. లాభాపేక్షలేని అనేక సాంస్కృతిక, సాహిత్య సంస్థలలో ఈ క్రింద పేర్కొన్న సంస్థలు చెప్పుకోదగిన ప్రగతిని సాధించాయి.[1]
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తెలుగు స్రవంతి
మార్చుభారతీయ సంస్కృతి, ఐక్యతను పరిరక్షించే సాంస్కృతిక కార్యకలాపాలను నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన ఆశయం. తెలుగు ప్రజల మానసికోల్లాసానికి సంగీతం, సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమాలను, క్రీడలను, పండుగలను నిర్వహించడం ఈ సంస్థ చేస్తున్న పనులు. ఈ సంస్థకు వొబ్బిలిశెట్టి అనూరాధ తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు.[2] ప్రస్తుతం ఈ సంస్థకు అధ్యక్షురాలిగా లక్ష్మీరెడ్డి, ఉపాధ్యక్షురాలిగా దీపికా కిషోర్, జనరల్ సెక్రటరీగా వెంకట్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా జి.సుధాకర్ రావు, కె.సుబ్బారెడ్డి, సాంస్కృతిక కార్యదర్శులుగా మాలాగోపీనాథ్, లతానగేష్, కోశాధికారిగా లక్ష్మీ పన్యాల, కార్యక్రమాల నిర్వాహకుడిగా రాజేష్ కుమార్, కమిటీ మెంబర్లుగా నాగార్జునరావు, అనిల్ గురానా, ప్రసాద్ పెండ్యాల మొదలైనవారు పనిచేస్తున్నారు.[3]
కువైట్ తెలుగు కళాసమితి
మార్చు1979-80 ప్రాంతాలలో కొంతమంది తెలుగు కుటుంబాలు సమావేశమై సాంస్కృతిక అంశాల గురించి చర్చించుకొని ఒక సంస్థను నెలకొల్పాలని తీర్మానించారు. కాని అది సాకారం కావడానికి తొమ్మిదేండ్లు పట్టింది. 1989లో లాభాపేక్షలేని సామాజిక, సాంస్కృతిక సంఘంగా కువైట్ తెలుగు కళాసమితి స్థాపించబడింది. ప్రస్తుతం ఈ సంస్థలో 400 మంది సభ్యులు ఉన్నారు. తెలుగు భాషాసంస్కృతుల అభ్యున్నతికి పాటుపడిన ప్రముఖులను సన్మానించడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశాలలో ఒకటి. ఈ సంస్థచే సత్కరించబడినవారిలో వెంపటి చినసత్యం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాండొలిన్ శ్రీనివాస్, గజల్ శ్రీనివాస్, వాసిరెడ్డి నవీన్, మిమిక్రీ శ్రీనివాస్ మొదలైనవారు ఉన్నారు. భారతదేశంలో జాతీయ విపత్తులు సంభవించినప్పుడు కువైట్ తెలుగు కళా సమితి స్పందిస్తున్న తీరు అధ్భుతం. ఉత్తరాంధ్ర జిల్లాలు హుదూద్ తుఫాన్ వల్ల అతలాకుతలమవడంతో వారికి సాయం చేసేందుకు ఈ సంస్థ ముందుకొచ్చింది. తుఫాను బాధితుల కోసం తమవంతు సాయంగా రూ. 15.42 లక్షల విరాళం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది.[4] ప్రస్తుతం ఈ సమితికి కోడూరి వెంకటశివరావు అధ్యక్షుడిగా, ఎ.ఉదయ్ ప్రకాష్ ఉపాధ్యక్షుడిగా, ఆర్.శ్రీధర్ కార్యదర్శిగా, ఎన్.మహేశ్వరరెడ్డి సంయుక్త కార్యదర్శిగా, ఆర్.సత్యమూర్తి కోశాధికారిగా, జి.ఎ.నరసింహరాజు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కొనసాగుతున్నారు.
హైటెక్ తెలుగు కళాసమితి కువైట్
మార్చుకువైట్, భారతదేశాల మధ్య వైజ్ఞానిక సాంస్కృతిక సంబంధాల్ని పెంపొందించే ఉద్దేశంతో హైటెక్ కళాసమితి ఏర్పడింది. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న తెలుగువారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో అమలవుతున్న గ్రీన్, హైటెక్ కార్యక్రమాలను ప్రోత్సహించి, మాతృభూమితో సంబంధాలను పెంపొందించడం ఈ సంస్థ ముఖ్యోద్దేశం.
రసమయి తెలుగు సంఘం
మార్చుయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నివసించే తెలుగువారందరికి ఈ సంఘం ఒక వేదికగా ఉంది. రసమయి ఆంధ్రాకల్చరల్ ఫోరం ఆఫ్ దుబాయ్ పేరుతో ఈ సంస్థ 1988లో ప్రారంభమైంది. తెలుగువారిలో సాంస్కృతిక, సాంఘిక, సంక్షేమ సంబంధాలు పెంపొందించడం ఈ సంస్థ ఆశయాలు. ఇది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ దుబాయ్, యునైటెడ్ అసోసియెషన్ ఆఫ్ దుబాయ్ అనే సంస్థలకు అనుబంధంగా పనిచేస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని భారతదౌత్య కార్యాలయంలోని భారతీయ ప్రజల సంక్షేమ సంఘంలో ఈ సంస్థకు సభ్యత్వం ఉంది.
ఎమిరేట్స్ తెలంగాణా సాంస్కృతిక సంఘం
మార్చుఈ సంస్థ 2011లో ఏర్పడింది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశాలు ఈ విధంగా ఉన్నాయి.
- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నివసిస్తున్న తెలంగాణ ప్రాంత ప్రజల్ని ఒకే త్రాటిపై తెచ్చి వ్యూహాత్మకమైన, ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతో అన్ని రంగాల ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోనికి తీసుకుని ఒక శక్తివంతమైన ఐక్య సంఘంగా ఏర్పడి ముందుకు సాగడం.
- తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన పండుగలను, వేడుకలను జరుపుకోవడం.
- మనోల్లాసానికై సాంస్కృతిక, క్రీడా సంబంధమైన కార్యక్రమాలను నిర్వహించడం.
- ఆపదలో ఉన్న తోటి తెలంగాణ వాసులకు చారిటీ రూపంలో సహాయాన్ని అందించడం.
- తెలంగాణ ఉద్యమానికి సంఘీభావంగా కార్యక్రమాలను నిర్వహించడం.
- మన దేశ జాతీయ దినోత్సవాలను, జాతీయనాయకులను గౌరవిస్తూ దేశభక్తికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం మొదలైనవి.
తెలుగు కళా సమితి బహ్రయిన్
మార్చుతెలుగు కళాసమితి బహ్రయిన్ దేశంలో నివసిస్తున్న దాదాపు 50వేలమంది తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక ప్రయోజనాలను కాపాడుతూ అనేక కార్యక్రమాలను చేపడుతోంది. ఈ సంస్థ ప్రతివారం యోగా తరగతులను, కరాటే తరగతులను, సహజయోగా తరగతులను, తెలుగుభాషా తరగతులను, క్రీడలను, హెల్త్ క్లబ్‌ను, లాఫింగ్ క్లబ్‌ను నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం అనేకమంది సినీకళాకారులచే స్టార్‌నైట్ కార్యక్రమాలను ఏర్పాటు చేసి తెలుగువారి కళాభివృద్ధికి పాటుపడుతుంది. సాంఘిక, సాంస్కృతిక, సాహిత్యపరమైన కార్యక్రమాలే కాక ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం, వరద భాదితులకొరకు నిధులు సేకరించడం, రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించడం, చిన్నపిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు పెట్టడం, డ్రాయింగ్ పోటీలు పెట్టడం, ఫుడ్ ఫెస్టివల్స్ ఏర్పాటు చేయడం, సంగీత నాట్యకార్యక్రమాలను నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టింది. విద్యాపరమైన కార్యక్రమాలతో పాటు తెలుగు పండుగలు, క్రిస్మస్, వాలెంటైన్ డే వేడుకలు, శివరాత్రి జాగారాలు, పుట్టిన రోజు పండుగలు, నూతన సభ్యుల పరిచయకార్యక్రమాలు వగైరా నిర్వహిస్తోంది. సాంఘిక బాధ్యతకలిగిన సంస్థగా తెలుగు కళా సమితి తన పరిధిలో ఆపదలో ఉన్న తోటి తెలుగువారిని ఆదుకొని వారికి సహాయ సహకారాలు అందిస్తోంది. 2008 నుండి పేదవర్గాలకు చెందిన వారికి ఆర్థిక సహాయం చేయడానికి ఒక ప్రత్యేకనిధిని నెలకొల్పింది. తన సేవాకార్యక్రమాలలో భాగంగా బహ్రయిన్ లోని ఇసా పట్టణంలో వికలాంగుల గృహాన్ని నిర్వహిస్తోంది. తెలుగువారు నివసించే లేబర్ క్యాంపులలో నెలకొకసారి ఆహారపంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. గల్ఫ్ దేశాలలో పేద కార్మికులు వారి యజమానులతో గొడవపడిన సందర్భాలలో వివాద పరిష్కారానికి ప్రయత్నం చేసింది. తెలుగు రాష్ట్రాలనుండి వలస వచ్చి అనివార్య కారణాలవల్ల మృతి చెందిన కార్మికుల మృతదేహాలను తమ స్వంతఖర్చుతో స్వదేశానికి పంపడం లేదా వారి మతసంప్రదాయాలను అనుసరించి ఆ దేశంలోనే ఖననం చేయడం వంటి వాటిని ఈ సంస్థ చేపడుతోంది. బహ్రయిన్ ప్రభుత్వం అక్రమ వలసదారుల కొరకు అమలు చేసిన సులభ నిష్క్రమణ పథకం ద్వారా అనేక మంది తెలుగు కార్మికులకు ఆర్థిక సహాయం, రవాణా ఖర్చులు చెల్లించి స్వదేశానికి పంపించడం ఈ సంస్థ చేస్తోంది.
పైన పేర్కొన్న సంస్థలే కాకుండా స్పందన, సౌదీ అరేబియా తెలుగు కళాసమితి, ఖతర్ తెలంగాణా ప్రజా సమితి మొదలైన అనేక సంస్థలు తమ పరిధిలో కృషిచేస్తున్నాయి.
మూలాలు
మార్చు- ↑ నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రత్యేక సంచిక - ప్రవాసంలో తెలుగువారు (విభాగం) - గల్ఫ్ దేశాలలో తెలుగువారు (వ్యాసం) - రచన: ఆచార్య అడపా సత్యనారాయణ - పుటలు: 892-893
- ↑ "నమస్తే తెలంగాణ దినపత్రిక జిందగీ శీర్షికలో ప్రచురింపబడిన గల్ఫ్‌గాయానికి స్పందన అనే వ్యాసం". Archived from the original on 2014-08-20. Retrieved 2015-11-19.
- ↑ దుబాయ్ లో తెలుగు స్రవంతి వారి 'దసరా దివాళి ధమాకా-2015' వేడుకలు
- ↑ హుదూద్ తుఫాన్ బాధితులకు కువైట్ 'తెలుగు కళాసమితి' రూ. 15.42 లక్షల విరాళం