గాంధిజీ శతకము

గాంధిజీ శతకము దుగ్గిరాల రాఘవచంద్రయ్య రచించిన తెలుగు శతకం.

గాంధిజీ శతకము
దస్త్రం:Gaandhiji shatakamu-page-001.jpg
పుస్తకం మొదటి పేజి
కవి పేరుదుగ్గిరాల రాఘవచంద్రయ్య
మొదటి ప్రచురణ తేదీ1941
దేశంభారతదేశం
భాషతెలుగు
మకుటంగాంధిజీ!
పద్యం/గద్యంపద్యం
ఛందస్సుఉత్పలమాల,చంపకమాల & మత్తేభము
ప్రచురణ కర్తరాధాకృష్ణ & కంపెనీ, బెజవాడ
ప్రచురణ తేదీ1941
మొత్తం పద్యముల సంఖ్య101
ముద్రణా శాలరాధాకృష్ణ ముద్రాక్షరశాల

మహాత్మా గాంధీగా పిలుచుకునే మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ భారతదేశానికి జాతిపిత అన్న గౌరవాన్ని అందుకున్నారు. జాతీయోద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనాయకునిగా సత్యం, అహింస అనే ఆయుధాలతో పోరాడారు. ప్రపంచానికి అత్యంత నాగరికమైన సత్యాగ్రహమనే ఆయుధాన్ని అందించిన మహా నాయకుడు. గాంధీ ప్రభావం ప్రపంచంలో పలువురు మహా నాయకులు మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఆన్ సాంగ్ సూకీ, బరాక్ ఒబామా వంటి వారిపై బలంగా నిలిచివుంది. శతక సాహిత్యం తెలుగులో శాఖోపశాఖలుగా విస్తరించింది. అదే క్రమంలో మహాత్మా గాంధీ గురించి కవి ఈ శతకం రచించారు. గుడివాడ పక్కన ఓ చిన్న గ్రామం - అంగలూరు. ఊరు చిన్నదే కానీ దీని ఘనత మాత్రం అసమాన్యం. త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి ప్రముఖులు ఎందరో ఈ గ్రామవాసులే! స్వాతంత్ర్య సంగ్రామంలోనూ, కమ్యూనిస్టు ఉద్యమంలోనూ ఈ గ్రామ ప్రజలు చాలా చురుగ్గా ఉండేవారు. అలాంటి అంగలూరులో దుగ్గిరాల రాఘవచంద్రయ్య అనే స్వాతంత్ర్య సమరయోధుడు ఉండేవాడు.

రాఘవచంద్రయ్య వ్యక్తిగత జీవితం గురించి తక్కువ విశేషాలే తెలుస్తున్నాయి. తెలిసినంతలో ఆయనకు గాంధీజీ అంటే వీరాభిమానం అని మాత్రం తేలుతోంది. గాంధీ పిలుపు విని ఆయన సహాయనిరాకరణోద్యమం వంటి పోరాటాలలో పాల్గొనేవారు. అలాంటి ఓ సందర్భంలో జైలుకి కూడా వెళ్లారు. నీలం సంజీవరెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటి కాంగ్రెస్ యోధులు ఆయనతో సన్నిహితంగా ఉండేవారు.

రాఘవచంద్రయ్యగారికి మొదటినుంచీ సాహిత్యం మీద మంచి పట్టు ఉండేది. చదువుకునే రోజుల నుంచి అద్భుతమైన రచనలు చేసేవారు. దానికి తోడు వేదాల నుంచి పురాణాల దాకా శాస్త్రగ్రంథాలన్నింటి మీదా ఆయనకు అవగాహన ఉంది. తనకి ఉన్న పాండితీప్రకర్షతో, సాహిత్యాభిలాషతో రాఘవచంద్రయ్యగారు ఒక శతకాన్ని రాయాలని అనుకున్నారు. కానీ ఎవరి మీద రాయడం. శతక కవులంతా కూడా తమకి ఇష్టమైన దేవుళ్ల మీద శతకాలను రూపొందించారు. కానీ రాఘవచంద్రయ్యగారికి గాంధీజీనే దేవునితో సమానం. అందుకని ఆయన మీదే ఒక శతకాన్ని రాయాలని సంకల్పించారు.

అలా గాంధీగారికి ఉన్న 20కి పైగా లక్షణాలని వర్ణిస్తూ 101 పద్యాలలో ‘గాంధిజీ శతకం’ పేరుతో ఒక శతకాన్ని రూపొందించారు. హరిజనసేవ, స్వరాజ్యదీక్ష, అహింసాచరణ, శాకాహారదీక్ష, అహింస, క్షమ, సత్యం, అభయం, కారుణ్యం, నిష్కామసేవ, పితృమాతృభక్తి... ఇలా గాంధీజీలో ఉన్న గొప్ప లక్షణాలని వర్ణిస్తూ ఈ శతకం సాగుతుంది. 1941లో ముద్రించిన ఈ శతకం అప్పట్లో ఒక సంచనంగా మారింది.

ప్రస్తుతానికి ఈ శతకం దొరకడం కష్టంగానే ఉంది. ప్రభుత్వపు డిజిటల్‌ లైబ్రరీలో దీని ప్రతి ఉంది.

ఇది 1941 సంవత్సరంలో బెజవాడలోని రాధాకృష్ణ ముద్రాక్షరశాలలో ముద్రించబడి, రాధాకృష్ణ అండ్ కంపెనీ ద్వారా ప్రచురించబడినది.

విషయసూచికసవరించు

  1. భారతదేశసేవ
  2. హరిజనసేవ
  3. త్రావుడు
  4. దృష్టిదోషము
  5. స్పర్శదోషము
  6. సర్వసమత్వము
  7. అహింస
  8. పితృమాతృభక్తి
  9. హిందూమహమ్మదీయ మైత్రి
  10. ప్రజాసేవ
  11. క్షమ
  12. సంఘసంస్కారము
  13. స్వరాజ్యప్రదానము
  14. హిందూమతభక్తి
  15. సత్యము
  16. శాకాహారదీక్ష
  17. ఆర్తరక్షణము
  18. మిత్రప్రేమ
  19. స్వరాజ్యదీక్ష
  20. అభయము
  21. విద్యాభ్యాసము
  22. కారుణ్యము
  23. బ్రహ్మచర్యము
  24. ఖద్దరు ప్రబోధము
  25. నిష్కామసేవ
  26. అహింసాచరణము
  27. లోకపూజ్యత

కొన్ని పద్యాలుసవరించు

శా|| స్వాతంత్ర్యంబు తొలంగ దేజమది సర్వమ్మున్‌ నశింపంగ దా
    నేత్రోవంగనలేక చిక్కి శవమై యెంతే విహీనస్థితిన్‌
    హా! తండ్రీ! నను గావవేయనుచు దీనాలాపయై దైవమున్‌
    చేతుల్మోడిచి మ్రొక్కు భారతిని రక్షింపంగదే గాంధిజీ!.

ఉ|| పంచములంచుఁ బిల్చుటది పాపమటంచును బల్కి యెంతయు
    న్మంచితనమ్ముతో హరిజనమ్ములు నాఁజను పేరు నిచ్చి ధ
    ర్మాంచితరీతి హైందవుల యాదరణమ్మును బొందఁ జేసి ర
    క్షించితి కోట్ల సజ్జనుల నెల్లరు మెచ్చఁగ నీవు గాంధిజీ!

మూలాలుసవరించు


శతకములు
ఆంధ్ర నాయక శతకము | కామేశ్వరీ శతకము | కుక్కుటేశ్వర శతకము | కుప్పుసామి శతకము | కుమార శతకము | కుమారీ శతకము | కృష్ణ శతకము | గాంధిజీ శతకము | గువ్వలచెన్న శతకము | గోపాల శతకము | చక్రధారి శతకము | చిరవిభవ శతకము | చెన్నకేశవ శతకము | దాశరథీ శతకము | దేవకీనందన శతకము | ధూర్తమానవా శతకము | నరసింహ శతకము | నారాయణ శతకము | నీతి శతకము | భారతీ శతకము | భాస్కర శతకము | మారుతి శతకము | మందేశ్వర శతకము | రామలింగేశ శతకము | విజయరామ శతకము | విఠలేశ్వర శతకము | వేమన శతకము | వేంకటేశ శతకము | వృషాధిప శతకము | శిఖినరసింహ శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | శ్రీ కాళహస్తీశ్వర శతకము | శ్రీవేంకటాచల విహార శతకము | సర్వేశ్వర శతకము | సింహాద్రి నారసింహ శతకము | సుమతీ శతకము | సూర్య శతకము | సమాజ దర్పణం | విశ్వనాథ పంచశతి | విశ్వనాథ మధ్యాక్కఱలు | టెంకాయచిప్ప శతకము | శ్రీగిరి శతకము | శ్రీకాళహస్తి శతకము | భద్రగిరి శతకము | కులస్వామి శతకము | శేషాద్రి శతకము | ద్రాక్షారామ శతకము | నందమూరు శతకము | నెకరు కల్లు శతకము | మున్నంగి శతకము | వేములవాడ శతకము