దుగ్గిరాల రాఘవచంద్రయ్య

దుగ్గిరాల రాఘవచంద్రయ్య ( ) స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత, హేతువాది. బ్రాహ్మణేతర ఉద్యమంలో కడవరకు పాల్గోని సాంఘిక అసమానతలు రూపుమాపుటకు కృషి చేసారు. సఛ్ఛాస్త్రిగా పేరు పొందిన అభ్యుదయ వాది[1].

జననం, విద్య మార్చు

దుగ్గిరాల రాఘనచంద్రయ్య (సఛ్చాస్త్రి) అని ప్రసిధ్ధిచెందిన దుగ్గిరాల రాఘవచంద్రయ్య చౌదరి గారు కృష్ణాజిల్లా లోని అంగలూరు వాస్తవ్యులు. వారిది విద్యత్కుటుంబము. సంస్కృతాంధ్రములు చదువుకున్నారు. బి.ఎ పట్టభద్రులు. స్కూలులో చదవుకునే రోజులలోనే ఆయన రచించిన విజయనగర సామ్రాజ్యము అను వ్యాసమును కొమర్రాజు లక్ష్మణరావుగారు చూసి సంతోషించి విజ్ఞాన చంద్రికా మండలి పారితోషికమును రాఘవచంద్రయ్యగారికి ఇచ్చారు. రాఘవచంద్రయ్యగారు సంస్కృతాంధ్రగ్రంధములు చదివినవారు. వేదశాస్త్రములలోని సారాంశమును చెప్పగల సామర్ధ్యముగలవారు. సాహిత్యాభిలాషి.[2]

స్వాతంత్ర పోరాటం మార్చు

బెజవాడలో 1923-24 సంవత్సరములలో స్వరాజ్య పత్రిక నడిపేవారు. గాంధీ మహాత్ముని పిలుపుతో 1930 లోసహాయనిరాకరణోద్యమములో పాల్గోని జైలుకు వెళ్ళారు. గాంధేయ వాదిగా వారు చనిపోయోదాకా ఖద్దరు వస్త్రములనే ధరించేవారు[2].

గ్రంథాలయోద్యమం మార్చు

ఆంధ్ర దేశములో ఆలనాటి గ్రంథాలయోద్యమంలో రాఘవచంద్రయ్య పాత్ర గణనీయమైనది. 1919 సంవత్సరము మద్రాసులోని ఆంధ్ర గ్రంథాలయసంఘానికొక ముద్రాక్షరశాలను లిమిటెడ్ కంపెనీగా నేర్పాటు చేయుటకు తీర్మానము చేయబడింది. ఆ సంకల్పమునకు రాఘవచంద్రయ్యగారు చాల ప్రముఖ పాత్రవహించారు. రాఘవచంద్రయ్యగారు మరియూ అయ్యంకి వెంకట రమణయ్య గారు కలిసి ఆ ముధ్రాక్షరశాల స్థావనకు పాటుబడ్డారు. టంగుటూరి ప్రకాశం గారు 300 రూపాయలు విరాళమునిచ్చారు. లిమిటెడ్ కంపెనీగా స్థాపించబోయే ఆంధ్రగ్రంధాలయ ముద్రాక్షరశాలకు వాటాలు (షేర్లు) కొనిపించటానికి దుగ్గిరాల రాఘవచంద్రయ్యగారు చాల కష్టపడి అనేక ఊర్లుతిరిగి వాటామూలధనము (షేర్ కాపిటల్) సమకూర్చారు.చాలమంది వాటాదారులైయ్యారు.

1920-21 లో స్థాపించబడ్డ ఆంధ్ర గ్రంద్రాలయ ముద్రాక్షరశాల లిమిటెడ్ లో అయ్యంకి వెంకట రమణయ్య గారు డైరక్టరు గా. ఇదివరలో వాణీ ముద్రాక్షరశాలలో పనిచేసిన అనుభవజ్ఞులైన కర్లపాలెం కోదండరామయ్య గారిని మేనేజరు గానూ వారికి అసిస్టెంటుగా కె.యల్ నరసయ్యగారు నియమితులైయారు. అయితే వెంకట రమణయ్యగారు వ్యవహార శైలితో ఆ ముద్రాక్షరశాల కంపెనీని స్వల్పకాలములోనే (1923 లో ) నష్టాలు పాలు అవ్వగా దానిని లిక్విడేట్ చేసి, తన స్వంత ముద్రాక్షరశాలగా మార్చుకున్నారు. అయ్యంకి రమణయ్య తీరు రాఘవచంద్రయ్యగారికి తీవ్ర ఆశాభంగము కలిగించింది.

సఛ్చాస్త్రి అనే బిరుదు మార్చు

స్వతంత్రయోధునిగా జైలులోనున్నప్పటి రోజులలో జైలులోని తోటి స్వతంత్ర సమర యోధుడైన బులుసు సాంబమూర్తి గారు బ్రాహ్మణ ఖైదీలకు వేద పాఠం చెప్పెటప్పుడు వినటానికి వెళ్ళాడు. శూద్రుడివి నీకు వేదం వినే అర్హత లేదని రాఘవచంద్రయ్యగారితో అమర్యాదగా అవమానించటం జరిగింది[1]. అంతకు ముందు వెంకట రమణయ్య గారి విషయంలో కూడా ఇలాగే భంగ పడి ఆర్డికంగా నస్టపోవటం జరిగింది. ఈ రెండు ఘటనలకూ కారణమైన బ్రాహ్మణాధిపత్య దోరణికి, కుల వివక్షతకు రాఘవచంద్రయ్యగారికి తీవ్ర వేదన చెందారు.

వారు సాహిత్యకౌశలము కలిగినవారైనందున మహా భారతములోని 18 పర్వములవలె బ్రాహ్మణుల దుర్మార్గములను గూర్చి 18 పర్వములు రచించ పూనుకున్నారు. అందులో ఒక పర్వానికి "బ్రాహ్మణ నక్క" అని పేరు పెట్టారు. "అష్టాదశ పాపియగు బ్రాహ్మణునితో సహాయనిరాకరణము చేయుము" అనే శీర్షికతో తెలుగులోనూ ఇంగ్లీషులోను కొన్ని వందలు పుటలుగల రెండు గ్రంథములును రచించి ముద్రించి ప్రచురించారు[2]. అప్పటినుండి వారినెరుగున్నవారందరూ ఆకాలంలో వారితో సఛ్చాస్త్రి అనే వ్యవహరించేవారు. ఇతరులు పిలవటమే కాక తనుగూడా ఆ సంబోధనను ఒక బిరుదుగా తన పేరు చివర పెట్టుకున్నారు.[1]

ఆ "బ్రాహ్మణ నక్క" పర్వమును ముద్రించి వారి మిత్రుడైన దిగవల్లి వేంకట శివరావుగారికి చూపించగా శివరావుగారు "నీకున్న పాండిత్యమును దుర్వినియోగము చేయుచున్నావు, మన వేదశాస్త్ర పురాణేతహాసములకు అంతరార్ధము చెప్పగలవాడవు వాటిని గురించి వ్రాయక ఇలాంటి రచనలు చేస్తున్నావు, నీది రాక్షస ప్రకృతితో పోల్చాలి" అనిమందలించగా "నువ్వేమన్నా నాకు కోపం రాదు నీవు సద్బ్రాహ్మణుడవు నేను సఛ్చాస్త్రిని" అన్నారు రాఘనచంద్రయ్యగారు.

బ్రాహ్మణేతర ఉద్యమం మార్చు

సాంఘికవ్యవస్థలో అగ్రకులముగ నున్నబ్రాహ్మణులకు తప్ప యితరకులజులకు స్థానములేకపోవుటచే జి.ఎస్.పి. సరస్వతి (నెల్లూరు) స్వాములవారి బోధననలననుసరించి, ఒక బ్రహ్మాండమైన ఉద్యమము సూర్యదేవర రాఘవయ్య చౌదరి గారి నాయకత్వంలో ఆంధ్రదేశములో వాడవాడలా వచ్చింది, 1924 లో తెనాలి తాలుకా కొల్లూరులో బ్రాహ్మణ ప్రతినిధులతో జరిగిన చర్చలలో త్రిపురనేని రామస్వామి, పాలడుగు శేషాచార్యులు, సూర్యదేవర రాఘవయ్యతో పాటు దుగ్గిరాల రాఘవచంద్రయ్య గారు పాల్గోని వేదములు చదువుటకు అన్నివర్ణములకు హక్కుకలదని అదే హిందూ మతం అని వాదించారు. ఈ వాదోపవాదాలను సూర్యదేవర రాఘవయ్య గారు ' బ్రాహ్మణేతర విజయం' అనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు[1],

వారికి బ్రాహ్మణ మత ద్వేషమున్నా బ్రాహ్మణులైన శివరావుగారిపట్ల, వారి మిత్రులు ఘంటసాల సీతారామశర్మగారి పట్ల రాఘవచంద్రయ్యగారు చాల గౌరవభావము ఉంది. బెజవాడలో ఆరోజులనాటి రాజకీయ సాహిత్య సాంఘిక విశేషములతో రాఘవచంద్రయ్యగారిని గురించి వారి మిత్రులు దిగవల్లి వేంకట శివరావు గారు తమ " నా జ్ఞాపకాలు, అభిప్రాయాలు" అను రచనలో వ్రాసియున్నారు. దేశంకోసం రాఘవచంద్రయ్యగారు చేసిన త్యాగమునకు వారికున్న సంస్కృతాంధ్ర పాండిత్యమునకూ వారికి రావలసిన గౌరవ ప్రతిష్ఠ, పేరు రాలేదు, దురదృష్ట వంతుడు అని శివరావుగారు తన అప్రచురిత రచనలో వారినిగురించి వాపోయారు.

రచనలు మార్చు

దస్త్రం:Gaandhiji shatakamu-page-001.jpg
గాంధి శతకము - పుస్తకం మొదటి పేజి

1963లో రాఘవచంద్రయ్యగారు "నెహ్రూ పట్టాభిషేకము" అను నాటకము రచించి "ఉత్తరభారతము" అని నామకరణంచేశారు. అందులో బ్రిటిష్ ప్రధాని రాజప్రతినిధి జాతీయొద్యమములో కీలక రాజకీయ నాయకులైన గాంధీ నెహ్రూలే కాక మహా భారతములోని సూత్రధారులను చేర్చారు. ఆ పుస్తకమునకు అప్పటి మాజీ గవర్నరు బూర్గుల రామకృష్ణారావుగారు తొలిపలుకు వ్రాసి దాని ముద్రణకు 500 రూపాయలు విరాళమిచ్చారు.దివాకర్ల వెంకటావధానిగారు ఆ పుస్తకమునకు రెండు పుటల పండితాభిప్రాయం వ్రాసి ప్రశంసించారు. రాఘవచంద్రయ్య గారి రచనలు[3]

 • గాంధీ జీవితం
 • నెహ్రూ జీవితం
 • సుభాష్ చంద్రబోసు జీవితం
 • దీనబందు చిత్తరంజన్ దాస్ జీవిత చరిత్ర (1938)
 • గాంధిజీ శతకము (1941)
 • గాంధీ భారత రత్నములు
 • అష్టాదశ పాపియగు బ్రాహ్మణునితో సహాయనిరాకరణము చేయుము
 • విజయనగర సాం మ్రాజ్యం (నవల) (ఇంటర్ పాఠ్య పుస్తకం)
 • ముంటాజు కుమారి ( బి.ఎ. పాఠ్య గ్రంథం)
 • వెంకటేశ్వర శతకము (సంస్కృతములో)
 • ఉత్తరభారతము (నాటకం)
 • గాంధీ మహాభారతం (వ్యాస భారతం- విరాట, బ్రాహ్మణ నక్క, ఉద్యోగ పర్వాలు)
 • నల్ల కుక్క తెల్ల నగునా ? (పద్య)
 • గాంధీజీ కథలు, నెహ్రూ కథలు (బాల సాహిత్యం)

మూలాలు మార్చు

 1. 1.0 1.1 1.2 1.3 రావిపూడి వెంకటాద్రి, పెనుమత్స సుబ్బరాజు (2003). హేతువాద, మానవవాద ఉద్యమ చరిత్ర. హైదరాబాదు: తెలుగు అకాడమి.
 2. 2.0 2.1 2.2 భావయ్య చౌదరి, కొత్త (2005). కమ్మ వారి చరిత్ర. గుంటూరు: పావులూరి పబ్లికేషన్. p. 293.
 3. దుగ్గిరాల, రాఘవచంద్రయ్య (1941). గాంధీజీ శతకం. బెజవాడ: రాధాకృష్ణా అండ్ కంపెని. p. 57.