నెల్సన్ మండేలా

దక్షిణాఫ్రికా అధ్యక్షుడునెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (18 జూలై, 1918 - డిసెంబరు 5, 2013) దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. అధ్యక్షుడు కాకముందు ఇతను జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ కారుడు, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (African National Congress) కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఒక మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు "రోబెన్" అనే ద్వీపంలో కారాగార శిక్షననుభవించాడు. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఒకడు. నల్లజాతి సూరీడు అని పలు తెలుగు వ్యాసాలలో ఈయన గురించి వర్ణించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపే పొరాటాలకు, వర్ణ సమానతకు నెల్సన్ మండేలా సంకేతంగా నిలిచాడు.

నెల్సన్ మండేలా

1990 ఫిబ్రవరి 11లో కారాగారం నుండి విడుదల అయిన తరువాత నెల్సన్ మండేలా రాజకీయంగా తన లక్ష్యాన్ని సాధించడానికి, దేశంలో నెలకొన్న జాతి వైర్యాన్ని నివారించడానికి, అందరి మధ్య సయోధ్య పెంచడానికి కృషి చేశాడు. తన పూర్వపు ప్రతిస్పర్థుల నుండి కూడా ప్రశంసలు అందుకొన్నాడు. వందకు పైగా పురస్కారాలు, సత్కారాలతో వివిధ దేశాలు, సంస్థలు మండేలాను గౌరవించాయి. వాటిలో 1993లో లభించిన నోబెల్ శాంతి బహుమతి ముఖ్యమైనది. స్వదేశంలో మండేలాను మదిబా అని వారి తెగకు సంబంధించిన గౌరవసూచకంతో మన్నిస్తారు.

మహాత్మా గాంధీ బోధించిన శాంతియుత విధానాలు, అహింస, శత్రువును సంస్కారయుతంగా ఎదుర్కొనే పద్ధతి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని మండేలా పెక్కుమార్లు చెప్పాడు. భారత దేశం మండేలాను 1990 లో 'భారత రత్న', జవహర్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ సయోధ్య బహుమతులతో సత్కరించింది. భారత దేశం నుండి మండేలాకు ఎంతో సమర్థన లభించింది. ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే కోట్ల మంది ప్రజలకు మండేలా ఒక ప్రతీకగా మారారు. పశ్చిమ దేశాలు కూడా హక్కుల ఉద్యమ కారులైన అబ్రహం లింకన్‌, మార్టిన్‌ లూథర్‌కింగ్‌లతో సమానంగా ఆయన్ను గౌరవిస్తున్నాయి. హింసా మార్గంలో ప్రారంభించిన ఉద్యమాన్ని గాంధేయ మార్గంలోకి ఆయన మలచుకున్న తీరు ఆయనకు దక్షిణాఫ్రికా గాంధీగా పేరు తెచ్చింది. నోబెల్‌ శాంతి బహుమతితో అంతర్జాతీయ సమాజం ఆయన్ను గౌరవించుకోగా, 1990లో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చి భారతీయ సమాజం గౌరవించింది. మండేలా 2013 డిసెంబరు 5 న మరణించారు. మండేలా మానవతకే స్ఫూర్తి ప్రదాతని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కొనియాడారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా మృతికి గౌరవసూచకంగా కేంద్ర ప్రభుత్వం ఐదు రోజుల సంతాపదినాలు ప్రకటించింది.

జననం సవరించు

మండేలా కుటుంబం "తెంబు" వంశానికి చెందినది. వీరు దక్షిణ ఆఫ్రికాలో "కేప్ ప్రాంతం"లో "ట్రాన్సకెయన్" భాగాలకు సాంప్రదాయికంగా పాలకులు. ఇతడు ఉమాటా జిల్లాలో మవెజో అనే వూరిలో 18 జూలై 1918న జన్మించాడు. ఇతని తాతలకాలంలో వారు పాలించే తెంబూ తెగల ప్రాంతం బ్రిటిష్ వలస పాలకుల పరమయ్యింది. మండేలా తండ్రి "గాడ్లా" హక్కుల ప్రకారం పాలకుడు కాకపోయినా కొన్ని స్థానిక తెగలకు నాయకుడిగా గుర్తింపు కలిగి ఉండేవాడు. స్థానిక మండలిలో సభ్యుడు. గాడ్లాకు నలుగురు భార్యలు. పదమూడు మంది పిల్లలు. వారిలో గాడ్లా 3వ భార్య "నోసెకెని ఫాన్నీ"కి జన్మించిన మగబిడ్డకు "రోలిహ్లాహ్లా" (అంటే కొమ్మలు లాగేవాడు -"దుడుకు స్వభావం కలవాడు" ) అని పేరు పెట్టారు. మండేలా బాల్యం తల్లి కుటుంబానికి చెందిన గూడెం ("ఉమ్జీ")లో అధికంగా గడిచింది.[1][2]

చదువు సవరించు

ఏడవయేట రోలిహ్లాహ్లా చదువు ప్రారంభమైంది. (వారి కుటుంబంలో బడికి వెళ్ళిన మొదటి వ్యక్తి అతనే.) ) బడిలోని ఒక మెథడిస్ట్ ఉపాధ్యాయుడు అతనికి "నెల్సన్" అనే పేరు తగిలించాడు. (ప్రసిద్ధుడైన బ్రిటిష్ నావికాదళ నాయకుడు హొరేషియో నెల్సన్ పేరు మీద). ఎందుకంటే ఆ ఉపాధ్యాయునికి రోలిహ్లాహ్లా పేరు పలకడం రాలేదు.

రోలిహ్లాహ్లా 9వ యేట అతని తండ్రి క్షయ వ్యాధితో మరణించాడు. తరువాత నెల్సన్ మండేలా చదువు వివిధ పాఠశాలలలో సాగింది. తెంబూ తెగల ఆచారం ప్రకారం ప్రివీ కౌన్సిల్‌లో అతని తండ్రి స్థానం అతనికి సంక్రమిస్తుంది. 1937లో మండేలా "ఫోర్ట్ బ్యూఫోర్ట్"లో "హీల్డ్‌టౌన్" కళాశాలలో చేరాడు. అతనికి బాక్సింగ్, పరుగు పట్ల ఆసక్తి పెరిగింది.

మెట్రిక్యులేషన్ తరువాత మండేలా ఫోర్ట్‌హేర్ విశ్వవిద్యాలయంలో బి.ఎ.లో చేరాడు. అక్కడ అతనికి పరిచయమైన ఆలివర్ టాంబో అతని జీవితకాలం మిత్రుడైనాడు. అదే సమయంలో అతని తెగకు వారసత్వంగా నాయకుడు కావలసిన కైజర్ మతంజిమా కూడా మిత్రుడయ్యాడు కాని కాలక్రమంలో వారిద్దరూ రాజకీయ ప్రతిస్పర్థులయ్యారు. ఎందుకంటే మతంజిమా "బంతూస్తాన్" కార్యకలాపాల పక్షం వహించాడు.[1] ఒక సంవత్సరం తరువాత విశ్వవిద్యాలయం రాజకీయాలలో పాల్గొన్న ఫలితంగా మండేలాను విశ్వవిద్యాలయం నుండి తీసేశారు.

తరువాత అతను కారాగారంలో ఉన్నపుడు లండన్ విశ్వవిద్యాలయం వారి దూర విద్యా సదుపాయంతో బి.ఎల్. పూర్తి చేశాడు.

జొహన్నెస్‌బర్గ్ కు సవరించు

ఫోర్ట్‌హేర్ వదలిన కొద్దికాలానికే మండేలా సంరక్షకుడైన జోగింతాబా మండేలాకు పెండ్లి నిశ్చయించాడు. అదే సమయంలో జోగింతాబా కొడుకు (కుటుంబ వారసుడు)కు కూడా వివాహం నిశ్చయమైంది. ఇది ఇష్టం లేక యువకులిద్దరూ తమ సంపన్న కుటుంబాలను వదలి జోహాన్నెస్‌బర్గ్‌కు వెళ్ళిపోయారు. నగరంలో మండేలా చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. తాను మధ్యలో ఆపివేసిన బి.ఎ. డిగ్రీ కోర్సును దూరవిద్య ద్వారా పూర్తి చేశాడు. తరువాత విట్‌వాటర్స్‌రాండ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువసాగాడు. ఆ సమయంలో అతనికి పరిచయమైన కొందరు మిత్రులు తరువాత జాతివివక్ష వ్యతిరేక కార్యశీలురయ్యారు.

రాజకీయ కార్యకలాపాలు సవరించు

1948లో ఆఫ్రికనెర్‌లు అధికంగా ఉన్న దక్షిణాఫ్రికా నేషనలిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. నల్ల, తెల్ల జాతుల మధ్య వివక్షత, ఇద్దరినీ వేరువేరుగా ఉంచడం వారి విధానం. ఆ పరిస్థితులలో 1952 డిఫెన్సు కాంపెయిన్, 1955 పీపుల్స్ కాంగ్రెస్ కార్యక్రమాలలో నెల్సన్ మండేలా ప్రముఖంగా పాల్గొన్నాడు. వారు ఆమోదించిన "స్వాతంత్ర్య చార్టర్" వారి జాతివివక్షత వ్యతిరేక విధానానికి ప్రాథమిక దశానిర్దేశకంగా రూపొందింది. ఈ సమయంలో మండేలా, అతని మిత్రుడు కలసి స్థాపించిన ఒక లా సంస్థ ద్వారా అనేక పేద నల్లజాతి వారికి ఉచితంగా న్యాయవాద సౌకర్యం కలిగించారు.

మండేలా కార్యక్రమాలపైన, ఇతర దక్షిణాఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమాలపైనా జాతీయ మహాత్మా గాంధీ ప్రభావం గాఢంగా ఉంది.[3][4] మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం విధానాన్ని ప్రవేశపెట్టి 100 సంవత్సరాలు గడచిన సందర్భంగా ఢిల్లీలో 29 జనవరి30 జనవరి 2007న జరిగిన సమ్మేళనానికి నెల్సన్ మండేలా హాజరయ్యాడు.[5]

మొదట్లో మండేలా శాంతియుతంగానే తన ప్రతిఘటనను నిర్వహించినా గాని 5 డిసెంబరు 1956న మండేలా, మరో 150 మంది దేశద్రోహనేరంపై అరెస్టు చేయబడ్డారు. 1956-61 కాలంలో సుదీర్ఘంగా నడచిన ఈ విచారణ అనంతరం వారందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. అయితే 1952-59 కాలంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌ (ఆ.నే.కా.)లో చాలామంది అసహనానికి గురై తమ ఆశయాలను సాధించిడానికి మరింత తీవ్రమైన చర్యలు చేపట్టాలని వత్తిడి చేశారు. అంతకుముందు ఆ.నే.కా.లో ఉన్న మితవాద నాయకుల నాయకత్వానికి సవాళ్ళు ఎదురయ్యాయి. దక్షిణ ఆఫ్రికా కమ్యూనిస్టు పార్టీ ఈ కాలంలో బలం పుంజుకుంది. 1959లో అతివాద ఆఫ్రికనిస్టులు ఆ.నే.కా.ను సమర్థిస్తున్న "పాన్ ఆఫ్రికనిస్ట్ కాంగ్రెస్" నుండి విడిపోయారు. అలా విడిపోయినవారికి ఘనా వంటి ఇతర దేశాలనుండి మద్దతు కూడా లభించింది.

గెరిల్లా కలాపాలు సవరించు

1961లో మండేలా ఆ.నే.కా.కు సాయుధ విభాగాన్ని ఏర్పరచి దానికి అధ్యక్షుడు అయ్యాడు. ఈ విభాగం పేరు "ఉమ్‌ఖోంటో వి సిజ్వె" (అనగా దేశపు బల్లెం). ఈ విభాగం దళాలు ప్రభుత్వ, సైనిక స్థానాలను లక్ష్యాలుగా చేసుకొని దాడులు నిర్వహించింది. జాతి వివక్షతను అంతం చేయడానికి గెరిల్లా పోరాటం కొరకు ప్రణాళికలు కూడా తయారు చేసుకొన్నారు. 1980 దశకంలో వీరి దళాలు నిర్వహించిన గెరిల్లా పోరాటాలలో అనేకులు మరణించారు. శాంతియుత ప్రతిఘటన వల్ల ప్రయోజనం లేనందునా, ప్రభుత్వం విచక్షణారహితంగా దమన విధానాన్ని అమలు చేస్తున్నందువలనా, తతిమ్మా మార్గాలన్నీ మూసుకుపోవడం వల్లనే తాము సాయుధపోరాటం వైపు మళ్ళవలసివచ్చిందని మండేలా సమర్థించుకొన్నాడు.[2][6]

అయితే ఈ విధమైన సాయుధచర్లవలన ఆ.నే.కా. మానవ హక్కులను ఉల్లంఘించిందని తరువాతికాలంలో మండేలా అంగీకరించాడు. తన ఈ అంగీకారాన్ని తన పార్టీలోని కొందరు సత్య, సర్దుబాటు కమిషన్ రిపోర్టులనుండి తొలగించడానికి ప్రయత్నించగా అందుకు వ్యతిరేకించాడు.[7]

అరెస్టు, రివోనియా విచారణ సవరించు

5 ఆగస్టు 1962న మండేలా అరెస్టు చేయబడ్డాడు. అంతకుముందు అతను 17 నెలలు అజ్ఞాతంలో ఉన్నాడు. అతని ఉనికిని గురించిన సమాచారం ప్రభుత్వానికి అందించడంలో సి.ఐ.ఎ. హస్తం ఉండి ఉండవచ్చును.[8][9][10] మూడు రోజుల తరువాత అతనిపై అభియోగాలు న్యాయస్థానంలో వెళ్ళడించబడ్డాయి - 1961లో కార్మికులచే సమ్మె చేయించడమూ, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళడమూ. 25 అక్టోబర్ 1962న మండేలాకు ఐదు సంవత్సరాల శిక్ష విధించబడింది. రెండేళ్ళ తరువాత 11 జూన్ 1964న, అంతకుముందు ఆ.నే.కా.లో అతని కార్యకలాపాల విషయంలో మరొక తీర్పు వెలువడింది.

మండేలా అరెస్టు అయిన సమయంలోనే ప్రభుత్వం అనేక ప్రముఖ ఆ.నే.కా. నాయకులను అరెస్టు చేసింది. మండేలాపైన, తక్కినవారిపైన తీవ్రమైన నేరాలు ఆరోపించారు. దేశద్రోహ చర్యల అభియోగాన్ని, విదేశాలతో కూడి దేశంపై దాడిజరపడాన్నీ మండేలా నిరాకరించాడు. కొన్ని విధ్వంసకర చర్యల బాధ్యతను మండేలా ఒప్పుకొన్నాడు.

20 ఏప్రిల్ 1964న ప్రిటోరియాలో న్యాయస్థానం ఎదుట మండేలా తమ లక్ష్యాలను సాధించడానికి ఆ.నే.కా. సాయుధ పోరాట విధానాన్ని ఎందుకు అవలంబింపవలసి వచ్చిందో వివరించాడు. తమ శాంతియుత ప్రతిఘటన ఎలా విఫలమైందో తెలియజెప్పాడు. ప్రభుత్వ దమన విధానం తరువాత కూడా తాము అలానే ఉండిపోతే ప్రభుత్వ విధానాలకు అంగీకరించి లొంగిపోయినట్లే అవుతుందని తేల్చిచెప్పాడు. ప్రభుత్వ విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేస్తున్నాయో వివరించాడు.[11] ఆ సందర్భంలో అతని చివరి వాక్యాలు:

నా జీవితమంతా ఆఫ్రికన్ జనుల సంఘర్షణకే అంకితం. తెల్లవారి పెత్తనాన్నీ, నల్లవారి పెత్తనాన్నీ నేను ప్రతిఘటించాను. అందరూ సుహృద్భావంతో కలిసి ఉండే, అందరికీ సమానావకాశాలు లభించే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా సమాజం నాకత్యంత ప్రియమైన లక్ష్యాలు. అందుకోసమే నేను జీవిస్తాను. అవసరమైతే అందుకోసం మరణించడానికి కూడా నేను సంసిద్ధుడను.[6]

నిందితుల పక్షాన కూడా ప్రసిద్ధులైన న్యాయవాదులు వాదించారు. కాని ఒకరు తప్ప మిగిలినవారందరూ దోషులుగా తీర్మానించబడింది. కాని ఉరి శిక్ష పడలేదు. జీవితకాలం ఖైదు శిక్ష 12 జూన్ 1964న విధించబడింది.

కారాగార జీవితం సవరించు

 
రొబెన్ దీవిలో మండేలా ఉన్న చెరసాల గది

తరువాతి 18 సంవత్సరాలు నెల్సన్ మండేలా రొబెన్ దీవిలో కారాగారశిక్ష అనుభవించాడు. అతని 27 సంవత్సరాల కారాగార జీవితంలో 18 సంవత్సరాలు ఇక్కడే గడిచింది. "డి"-గ్రేడ్ ఖైదీ (అంతదరికంటె తక్కువ స్థాయి ఖైదీ)గా మండేలాకు చాలా తక్కువ సదుపాయాలు లభించాయి. ఆరు నెలలకొక ఉత్తరం (అదీ సెన్సార్ చేయబడింది), ఒక సందర్శకుడు. సున్నపు క్వారీలో శారీరిక శ్రమ. అతి తక్కువ రేషనులు.[2]

కారాగారంలో ఉన్న కాలంలోనే మండేలా లండన్ విశ్వవిద్యాలయం వారి విదేశీ కార్యక్రమం ద్వారా న్యాయవాద పట్టాను సాధించాడు. తరువాతి కాలంలో 2009లో మండేలా పేరు లండన్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా ప్రతిపాదింపబడింది. (కాని ఎన్నిక కాలేదు. రాకుమారి యాన్నె ఆ ఎన్నికలో విజయం సాధించింది)

1981 తాను వ్రాసిన Inside BOSS అనే జ్ఞాపిక రచనలో గోర్డాన్ వింటర్ అనే గూఢచారి ఉద్యోగి సంచలనాత్మక విషయాలు వ్రాశాడు[12] మండేలాను చెరసాల నుండి తప్పించడానికి ఒక పథకం వేయబడింది. ఆ పథకం వేసే బృందంలో (విశ్వాస పాత్రునిగా) దక్షిణ ఆఫ్రికా గూఢచారి గోర్డాన్ వింటర్ చొరబడ్డాడు. అతని ఆలోచన ఏమంటే మండేలా కారాగారంలోంచి పారిపోయే పరిస్థితులు కల్పించి, అతను పారిపోయేటప్పుడు ఆతనిని కాల్చి చంపాలని. బ్రిటిష్ గూఢచారి సంస్థ ద్వారా ఈ పథకం భగ్నం చేయబడింది.[13].

మార్చి 1982లో మండేలా, మరికొందరు నాయకులను రాబెన్ దీవి నుండి పోల్స్‌మూర్ కారాగారానికి మార్చారు. బహశా ఇతర యువ ఖైదీలపై మండేలా ప్రభావం పడకుండా కావచ్చును. లేదా హడావుడి లేకుండా మండేలాతో చర్చలు జరపాలని ప్రభుత్వం భావించి ఉండవచ్చును.

ఫిబ్రవరి 1985లో మండేలా గనుక సాయుధ పోరాటాన్ని త్యజిస్తే అతనిని విడుదల చేస్తానని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు పీటర్ విలియన్ బోథా ప్రకటించాడు. అయితే మండేలా ఈ ప్రభుత్వ ప్రతిపాదనను తృణీకరించాడు. అతని కుమార్తె ద్వారా అతను విడుదల చేసిన ప్రకటనలో ఇలా ఉన్నది - "ప్రజల సంస్థలను నిషేధించినపుడు నాకిచ్చిన స్వేచ్ఛకు అర్థం ఏమున్నది? స్వతంత్రుడైన వ్యక్తి మాత్రమే ఇచ్చిపుచ్చుకొనే చర్చలు జరుపవచ్చును. ఖైదీ ఇటువంటి ఒప్పందాలలో ప్రవేశించలేడు" [14]

1985లో మండేలా, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య మొదటి సమావేశం (ఒక ఆసుపత్రిలో) జరిగింది. తరువాతి 4 సంవత్సరాలలో అనేక సమావేశాలు జరిగాయి. వీటివల్ల మరిన్ని చర్చలకు అవకాశం కలిగింది. కాని జరిగిన ప్రగతి చాలా అల్పం.[14] మండేలా కారాగారంలో గడిపిన కాలమంతా దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి బయటి నుంచి, లోపలి నుంచి అతన్ని విడుదల చేయమని ఒత్తిళ్ళు ఎక్కువయ్యాయి. 1989 లో బోతా వైఫల్యంతో ఫ్రెడెరిక్ విలియం క్లర్క్ అధ్యక్షుడయ్యాడు. క్లర్క్ ఫిబ్రవరి 1990 లో మండేలా ను విడుదల చేయడానికి ఉత్తర్వులు జారీ చేశాడు.

విడుదల సవరించు

ఫిబ్రవరి 2, 1990న దక్షిణాఫ్రికా అధ్యక్షుడైన ఫ్రెడెరిక్ డీ క్లర్క్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, ఇతర జాతి వివక్ష వ్యతిరేక పోరాట సంస్థల మీద నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు, మండేలా తొందరలో విడుదలవబోతున్నట్లు ప్రకటించాడు. దాంతో మండేలా విక్టర్ వెర్స్టర్ కారాగారం నుంచి ఫిబ్రవరి 11, 1990న విడుదల అవడం జరిగింది. ఈ దృశ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం చేశారు.

మండేలా విడుదలైన రోజున ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ఉపన్యాసంలో ఆయన తను శాంతికి కట్టుబడి ఉన్నానని, ఇందుకోసం శ్వేత జాతీయులతో ఒప్పందానికి సిద్దమనీ ప్రకటించాడు. కానీ జాతి వివక్షకు వ్యతిరేకంగా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సాగించే పోరు మాత్రం ఆగదని సూచనప్రాయంగా తెలిపారు.

1960 లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ లో భాగంగా మేము ప్రారభించిన సాయుధ బలగం పూర్తిగా జాతి వివక్ష నుంచి మమ్మల్ని మేం కాపాడుకోవడానికి ఉద్ధేశించినది. ఆ కారణాలు ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి దానిని మేము కొనసాగించడం తప్ప వేరే మార్గం లేదు. అందరికీ ఆమోదయోగ్యమైన సుహృద్భావ వాతావరణం ఏర్పాటు అవుతుందని, ఆయుధ పోరు అవసరం రాకూడదనీ ఆశిస్తున్నాం.

అంతే కాకుండా నల్ల జాతి వారి జీవితాలలో శాంతిని నెలకొల్పడం, వారికి జాతీయ, ప్రాంతీయ ఎన్నికలలో వోటు హక్కును కల్పించడం తన ప్రాథమ్యాలలో భాగమని పేర్కొన్నాడు.

చర్చలు సవరించు

విడుదలైన తరువాత ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వ పగ్గాలను తిరిగి స్వీకరించాడు. 1990, 1994 మధ్యలో బహుళ పక్షాలతో సమావేశాన్ని ఏర్పరిచి దేశంలో మొట్టమొదటిసారిగా అన్ని జాతులవారికీ కలిపి ఎన్నికలను నిర్వహించేటట్లు చేశాడు.

ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, దాని మీద నిషేధం ఎత్తివేసిన తరువాత మొదటిసారిగా 1991లో జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి మండేలాను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. మండేలా కారాగారంలో ఉన్నపుడు పార్టీ పగ్గాలు చేపట్టిన పాత స్నేహితుడు ఆలివర్ టాంబో జాతీయ అధ్యక్షుడయ్యాడు. [15]

మండేలా కారాగారంలో ఉండగానే దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ డి క్లర్క్‌తో చర్చలు సాగించాడు. 1993లో వారిద్దరికి సమిష్టిగా నోబెల్ బహుమతి ఇవ్వడం ద్వారా వారి కృషికి మరింత గుర్తింపు, ప్రోత్సాహం లభించాయి. సుదీర్ఘ కాలం జరిగిన ఈ చర్చలకు అనేక అవాంతరాలెదురయ్యాయి. బోయ్‌పాటాంగ్ ఊచకోత తరువాత ఈ చర్చలు నిలిపివేశారు.[16] మళ్ళీ 1992లో పునఃప్రారంభించారు.[2]

1993లో సీనియర్ ఆ.నే.కా. నాయకుడు క్రిస్ హని హత్య జరిగినపుడు దేశం అంతర్యుద్ధంలో పడిపోయే పరిస్థితి ఎదురయ్యింది. అప్పుడు దేశంలో శాంతి కోసం మండేలా ఇచ్చిన పిలుపు ఒక దేశాధ్యక్షుడి సందేశంలాగానే ఉంది:

ఈ రాత్రి నేను నా హృదయాంతరాళాలనుండి ప్రతి నల్ల, తెల్ల జాతీయునికి నా స్నేహహస్తాన్ని అందిస్తున్నాను. విద్వేషంతో నిండిన ఒక తెల్ల జాతీయుడు చేసిన ఈ నీచకార్యం దేశాన్ని ప్రమాదం అంచులకు నెడుతున్నది. ఆ హంతకుడిని చట్టానికి అప్పగించడానికి మరొక తెల్లజాతి వనిత ప్రాణాలకు తెగించింది. క్రిస్ హనీ హత్య దక్షిణాఫ్రికాలోను, ప్రపంచంలోను తీవ్రమైన ప్రకంపనాలకు దారి తీసింది. ఇది దేశంలో అందరూ ఐక్యమై దేశాన్ని కల్లోలంలోకి నెడుతున్నవారిని ప్రతిఘటించాల్సిన సమయం. క్రిస్ హని ఏ స్వేచ్ఛ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడో ఆ మహదాశయాన్ని నాశనం చేసేవారికి ఎదురు తిరగాల్సిఉంది.

కొద్దిపాటి అలజడుల తరువాత దేశంలో శాంతి నెలకొంది. మరల చర్చలు వూపందుకొన్నాయి. 27 ఏప్రిల్ 1994లో సార్వజనిక ఎన్నికలు జరగాలని నిశ్చయించారు.[14]

స్వియ చరిత్ర సవరించు

మండేలా స్వియ చరిత్ర లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ 1994లో ప్రచురింపబడింది. అతను కారాగారంలో ఉండగానే రహస్యంగా ఇది వ్రాయడం మొదలుపెట్టాడు. కాని అందులో మండేలా డి క్లర్క్ దురాగతాల గురించి గాని, కొన్ని హింసా కార్యక్రమాలలో తన భార్య విన్నీ మండేలా పాత్ర గురించి గాని ఏమీ వ్రాయలేదు. ఇవీ, మరికొన్ని వివాదాస్పద విషయాలు తరువాత మండేలా అనుమతి, సహకారాలతో ప్రచురింపబడిన మరొక జీవిత చరిత్రలో వ్రాయబడ్డాయి. మండేలా: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ. [17]

దక్షిణ ఆఫ్రికా అధ్యక్ష పదవి సవరించు

ఏప్రిల్ 27, 1994న దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా పూర్తి ప్రజాస్వామ్యంతో కూడిన ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ 62 శాతం ఓట్లను సాధించింది. 1994, మే 10 వతేదీన మండేలా దేశానికి నల్లజాతికి చెందిన మొట్టమొదటి అధ్యక్షుడయ్యాడు. డీ క్లర్క్ ఉపాధ్యక్షుడిగానూ, థాబో ఎంబెకీ రెండవ ఉపాధ్యక్షుడిగానూ ఎన్నికయ్యారు. [18]

జాతీయ సయోధ్య విధానం సవరించు

మే 1994 నుంచి జూన్ 1999 దాకా అధ్యక్షుడిగా పని చేసిన మండేలా జాతీయ, అంతర్జాతీయ విధానాలలో ఆయన చూపిన చొరవకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు లభించాయి.

1995 లో దక్షిణాఫ్రికాలో జరిగిన రగ్బీ ప్రపంచ కప్ పోటీల సందర్భంగా నల్లజాతీయులైన దక్షిణాఫ్రికన్లను జాతీయ జట్టులో చేరమని మండేలా ప్రోత్సహించాడు. ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు న్యూజీలాండ్ జట్టుపై గెలిచిన తరువాత మండేలా దక్షీణాఫ్రికా జెర్సీని ధరించి ఆ జట్టు నాయకుడైనటువంటి ఫ్రాంకాయిస్ పైనార్ కు ట్రోఫీ అందజేశాడు. ఈ సంఘటనను దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయులకు, నల్లజాతివారికీ కుదిరిన సయోధ్యలో ముఖ్యమైన అధ్యాయంగా అభివర్ణించవచ్చు.[ఆధారం చూపాలి]

మండేలా అధ్యక్షుడైన తరువాత ఆయన ముఖ్యమైన సందర్భాలలో కూడా బాటిక్ చొక్కాలను వాడేవాడు. వీటినే మడీబా చొక్కాలంటారు.

లిసోతో పై దాడి సవరించు

దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష వ్యతిరేక పోరాటాల అనంతరం జరిగిన మొట్టమొదటి సంఘటన లిసోతోపై దాడి. సెప్టెంబరు 1998 న మండేలా అప్పటి ప్రధాని పకలిత మొసిసిలి ప్రభుత్వాన్ని కాపాడడానికి తన సేనలను లిసోతో పై దాడికి పంపించాడు. ఎన్నికల వివాదంతో వ్యతిరేక పక్షాలు ప్రభుత్వాన్ని కూలదోస్తామన్న బెదిరింపే ఇందుకు కారణం.[19]

ఎయిడ్స్ వ్యాధి గురించిన వ్యాఖ్యలపై విమర్శలు సవరించు

ఎడ్విన్ కామెరాన్ మొదలైన ఎయిడ్స్ ఉద్యమ కారులు, వ్యాఖ్యాతలు, విమర్శకులు ఎయిడ్స్ పట్ల మండేలా ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని విమర్శించారు.[20][21] మండేలా పదవీ విరమణ చేసిన తరువాత ఎయిడ్స్ నివారణలో తన ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకున్నాడు.[22][23] అప్పటి నుంచీ ఆయనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని గురించి ప్రస్తావించేవారు.

లాకర్బీ విచారణ సవరించు

లిబ్యా ప్రెసిడెంట్ ముహమ్మద్ గద్దాఫీకి, అమెరికాకు మధ్య చిరకాలం నడచిన లాకర్బీ వివాదం పరిష్కారం కొరకు మండేలా చొరవ చూపాడు. 21 డిసెంబర్ 1988లో పాన్‌అమ్ విమానం 103 కూలిపోవడానికి కారకులని నిందింపబడిన ఇద్దరు లిబ్యనులను అప్పగించడానికి లిబ్యా నిరాకరంచడమే ఈ వివాదానికి మూలకారణం. ఈ ప్రమాదంలో 270 మంది మరణించారు. ఈ వివాదంలో నిందితుల విచారణ దక్షిణాఫ్రికాలో జరపమని మండేలా ప్రతిపాదించాడు కానీ అందుకు అమెరికఅ, బ్రిటన్ ప్రభుత్వాలు అంగీకరించలేదు.[24][25]. కాని మళ్ళీ మండేలా 1997లో "నేరారోపణ చేయడం, విచారణ జరపడం, తీర్పు ఇవ్వడం - అన్నీ ఒకే దేశం అధీనంలో ఉండడం న్యాయం కాదు" అన్న వాదనతో ఇదే ప్రతిపాదన చేశాడు. సుదీర్ఘ చర్చల తరువాత నెదర్లాండ్స్‌లో స్కాటిష్ న్యాయచట్టం ప్రకారం విచారణ జరగాలని ఒప్పందం జరిగింది. తరువాత మండేలా గద్దాఫీని కలిసి 1999లో ఈ ప్రతిపాదనకు ఒప్పించాడు.[26] 9 నెలల విచారణ తరువాత ఒకరిని విడుదల చేశారు. మరొకరికి 27 సంవత్సరాల కారాగార శిక్ష విధించారు. అనంతర కాలంలో 2002లో జైలులో ఉన్న మెగ్రాహీని మండేలా పరామర్శించాడు. అతని ఒంటరితనంపై విచారం వ్యక్తం చేశాడు.

వివాహం, కుటుంబం సవరించు

మండేలా మూడు సార్లు వివాహం చేసుకున్నాడు. ఆరు మంది సంతానం, 20 మంది మనుమలు, మనుమరాళ్ళు, ఇంకా పెద్ద సంఖ్యలో ముని మనుమలు ఉన్నారు. ఇతని మనుమడు మండ్లా మండేలా ఒక తెగకు నాయకుడు కూడా.[27]

మొదటి వివాహం మండేలా మొదటి వివాహం దక్షిణాఫ్రికాలో నల్లజాతి వారు ఎక్కువగా నివసించే ట్రాన్స్కీ అనే ప్రదేశం నుంచి వచ్చిన ఎంటోకో మేస్ అనే మహిళతో జరిగింది. వీరు మొట్టమొదట కలుసుకొన్నది జొహన్నెస్ బర్గ్ లో. వీరికి ఇద్దరు కొడుకులు, మడిబా థెంబెకైల్ (1946 లో జననం), మగాతో (1950 లో జననం), ఇద్దరు కూతుర్లు. ఇద్దరి పేర్లూ మకాజివే మండేలానే. మొదటి కూతురు తొమ్మిది నెలల వయసులోనే కన్ను మూసింది. కాబట్టి రెండవ కూతురికి ఆమె జ్ఞాపకార్థం అదే పేరు పెట్టారు. వీరి వివాహమైన 13 సంవత్సరాల తరువాత, 1957 లో, నెల్సన్ ఎక్కువగా విప్లవం వైపు మొగ్గు చూపుతూ ఉండట వలన, ఆయన భార్య రాజకీయ తటస్థతను విశ్వసించడం వలన, అభిప్రాయ భేదాలతో విడిపోయారు. మండేలా కారాగారంలో ఉండగా మొదటి కొడుకు 25 సంవత్సరాల వయసులో కారు ప్రమాదానికి గురై మరణించాడు. అందరు పిల్లలు వాటర్ ఫోర్డ్ కామ్లాబా అనే చోటనే విద్యనభ్యసించారు. ఎవెలీన్ మేస్ 2004లో చనిపోయింది.

రెండవ వివాహం మండేలా రెండవ భార్య విన్నీ మడికిజెలా మండేలా లేదా విన్నీ మండేలా. ఆమె జోహాన్నెస్ నగరంలో సమాజ కార్యకర్త అయిన మొదటి నల్ల జాతి వనిత. వారికి ఇద్దరు కుమార్తెలు. ఈ వివాహంలో కూడా దక్షిణాఫ్రికా నల్లజాతివారు ఎదుర్కొనే రాజకీయ, సాంఘిక అంతఃసంఘర్షణ ఛాయలు ప్రబలంగా పడ్డాయి. 1992లో వారు విడాకులు తీసుకొన్నారు. వీరి కుమార్తె జింద్జీకి జొలేకా మండేలా 1980లో జన్మించింది. ఆమె రచయిత, ఆరోగ్య సంరక్షణ కార్యకర్త.[28]

మూడవ వివాహం 1998లో, తన 80వ జన్మదినం సందర్భంగా నెల్సన్ మండేలా మూడవసారి గ్రాచా మాచెల్‌ను పెళ్ళి చేసుకొన్నాడు. ఈ వివాహానికి ముందు ఎన్నో నెలల చర్చలు (కన్యాశుల్కానికి సంబంధించిన బేరసారాల వంటివి) జరిగాయి. (ఈ పెళ్ళి కుదిర్చిన పెద్దమనిషే అంతకుముందు ఒకమారు మండేలాకు సంబంధం నిర్ణయిస్తే, అందుకు ఒప్పుకోని కుర్ర మండేలా ఇల్లు వదలి వెళ్ళిపోయాడు.)

పదవీ విరమణ, అనంతరం సవరించు

1994 లో మండేలా 77 సంవత్సరాల వయసులో అధ్యక్ష పదవిని చేబట్టి ఆ పదవిని అలంకరించిన వారిలో అతి పెద్ద వయస్కుడయ్యాడు. రెండవసారి మరలా ఎన్నికల్లో పోటీ చేయరాదని నిశ్చయించుకున్నాడు. 1999లో పదవీ విరమణ చేశాడు. ఆయన తరువాత థాబో ఎంబెకీ ఆ పదవిని స్వీకరించాడు.

జూలై 2001లో మండేలాకు ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధి ఉన్నదని నిర్ధారించబడింది. రేడియేషన్ వైద్యం చేశారు.[29] జూన్ 2004లో తాను పబ్లిక్ జీవితం నుండి విరమిస్తున్నట్లుగాను, అధికంగా కుటుంబంతో గడపదలచుకొన్నట్లుగాను మండేలా ప్రకటించాడు. కాని పూర్తిగా సమాజం నుండి దూరంగా ఉండలేదు. "My appeal therefore is: Don't call me, I will call you."[30] 2003 తరువాత తన సాంఘిక కార్యక్రమాలను మండేలా బాగా తగ్గించుకొన్నాడు.[31] పైబడుతున్న వయసు కారణంగా అతని ఆరోగ్యం కొంత క్షీణించింది. 2003లో మండేలా మరణం గురించిన సంతాపవార్త పొరపాటున సి.ఎన్.ఎన్. వారి వెబ్సైటులో ప్రచురింపబడింది. వారు మండేలా వంటి ప్రముఖుల మరణవార్తల సందేశాలను ముందుగా వ్రాసి ఉంచుకుంటారు.[32]

సామాజిక కార్యాలు సవరించు

పదవీ విరమణానంతరం మండేలా మానవహక్కులకు సంబంధించినవి, పేదరికం నిర్మూలనకు అంకితమయినవి అయిన వివిధ సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నాడు. 2006 శీతాకాలపు ఒలింపిక్ క్రీడల టెలివిజన్ ప్రచారంలో కనిపించాడు. [33]

17 రోజులు వాళ్ళు రూమ్ మేట్స్
17 రోజులు వాళ్ళు ఆత్మబంధువులు
22 సెకన్లు వారు ప్రతిస్పర్థులు
17 రోజులు సమానులు, 22 సెకన్లు విరోధులు
ఇది ఎంత అద్భుతమైన ప్రపంచం?
ఇదే ఒలింపిక్ ఆటలలో నాకు కనిపించే ఆశాభావం.

ఇంకా కొన్ని సామాజిక కార్యక్రమాలలో మండేలా పాత్ర వహించాడు.

పెద్దలు సవరించు

18 జూలై 2007న నెల్సన్ మండేలా, గ్రాచా మాకెల్, డెస్మండ్ టుటు కలిపి జోహాన్నెస్‌బర్గ్‌లో వృద్ధులైన ప్రపంచనాయకుల స్వతంత్ర సమూహాన్ని ప్రపంచ పెద్దలు అనే పేరుతో స్థాపించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న కొన్ని తీవ్రమైన సమస్యల పరిష్కారానికి వారి అనుభవాన్ని, వివేకాన్ని అందించి సహకరించడమే వారి ఆశయం.[34] బిషప్ టుటు అధ్యక్షతన ప్రాంభమైన ఈ సమూహంలో మరికొంతమంది పేరెన్నికగన్న ప్రపంచ నాయకులు ఉన్నారు. వారి ఆశయాన్ని గురించి మండేలా ఇలా చెప్పాడు.

ఈ సమూహం స్వేచ్ఛగాను, ధైర్యంగాను, పబ్లిక్‌గాను, ప్రచ్ఛన్నంగాను కూడా పనిచేస్తుంది. భయం ఆవహించిన చోట ధైర్యాన్ని సమర్థించడం, సంఘర్షణలు నెలకొన్నచోట సుహృద్భావం నెలకొల్పడం, నిరాశ గూడుకట్టుకొన్నప్పుడు ఆశను చిగురింపజేయడం మా ధ్యేయాలు.

[35]

ఎయిడ్స్ నియంత్రణకు చర్యలు సవరించు

తన పదవీ విరమణ తరువాత ఎయిడ్స్ వ్యాధి నివారణకు మండేలా విశేషంగా కృషి చేశాడు. ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలకు తన సహకారం అందించాడు. మండేలా కుమారుడు మకఘతో మండేలా ఎయిడ్స్ వ్యాధితో మరణించాడు.

ఇరాక్ పై దాడి గురించి సవరించు

2003లో జార్జి బుష్ అధ్వర్యంలో అమెరికా ఇరాక్ పై చేసిన దాడినీ, అమెరికా విదేశాంగ విధానాన్నీ మండేలా నిశితంగా విమర్శించాడు. ఐక్య రాజ్య సమితిని బుష్ నిర్వీర్యం చేస్తున్నాడని ఆరోపించాడు. ఈ విధానంలో అమెరికా యొక్క జాతి వివక్ష భావాలు కనిపిస్తున్నాయని కూడా విమర్శించాడు.[36] ఒక దేశం ప్రపంచంపై పెత్తనం సాగించడాన్ని వ్యతిరేకించమని చాటిచెప్పాడు. మానవాళి మనుగడకు ప్రమాదకరమైన సంఘటనలు అందరికంటే అధికంగా అమెరికా వల్లనే జరిగాయన్నాడు.[36]

ఇస్మాయిల్ అయూబ్ వివాదం సవరించు

ఇస్మాయిల్ అయూబ్ 30 సంవత్సరాలకు పైగా మండేలాకు నమ్మకమైన వ్యక్తిగత న్యాయవాదిగా పని చేశాడు. 2005 మేలో తను సంతకం చేసిన ప్రతులను అమ్మవద్దనీ, ఇంతకు ముందు అమ్మినవాటి డబ్బులు లెక్క చూపమనీ ఇస్మాయిల్‌ను మండేలా ఆదేశించాడు. ఈ విషయంపై నెలకొన్న వివాదం ఉన్నత న్యాయస్థానం వరకు వెళ్ళింది. చాలా కాలం నడచింది. అయితే తాను ఏ విధమైన చట్టవిరుద్ద చర్యా చేయలేదని, తనను అపఖ్యాతి పాలుజేయడానికి కుట్ర జరుగుతున్నదని ఇస్మాయిల్ వాదించాడు.[37] 2005, 2006 సంవత్సరాలలో మండేలా అనుయాయులు ఇస్మాయిల్ కుటుంబంపై దాడి చేశారు. ఈ వివాదం రచ్చన పడి దేశమంతా చర్చనీయాంశం అయ్యింది. ఇస్మాయిల్ అయూబ్ కుటుంబాన్ని దాదాపు వెలివేశారు. 2007లో అయూబ్ వివాదం పరిష్కారానికి మండేలా కుటుంబం ట్రస్టుకు R700 000 విరాళం ఇచ్చి క్షమాపణ చెప్పాడు. అయితే మండేలాకున్న ఉన్నత స్థాయి వలన అయూబ్ పక్షం వాదనను నిష్పక్షపాతంగా పరిశీలించే అవకాశం లేకుండా పోయిందని కొందరు వ్యాఖ్యానించారు.[38]

ఆరోపణలు సవరించు

నెల్సన్ మండేలా వారసుల కోసం ఏర్పరచిన నెల్సన్ మండేలా ట్రస్ట్‌కు ప్రముఖ వాణిజ్యవేత్తలనుండి పెద్ద పెట్టున విరాళాలు లభించడం వల్ల వారి ఆర్థిక లావాదేవీల గురించి కూడా కొన్ని వివాదాలు జరిగాయి. మండేలా విదేశీ బ్యాంకు ఖాతాల గురించి, పన్నులు కట్టకపోవడం గురించిన ప్రస్తావనలు కూడా ఈ వివాదాలలో ఉన్నాయి.[39]

వజ్రాల వాణిజ్యంపై వివాదం సవరించు

దక్షిణాఫ్రికా ఆర్థిక స్థితికి వజ్రాల గనులు ఒక ముఖ్యమైన వనరు. రక్తపు వజ్రాల గురించి ఈ విషయంలో కొన్ని విమర్శలున్నాయి. ఆ విషయంపై వజ్రాల వ్యాపారాన్ని పరిరక్షించే దిశలో మండేలా చేసిన వ్యాఖ్యల గురించి పెక్కు విమర్శలు వచ్చాయి. తన మిత్రుడైన వజ్రాల వ్యాపారిని సమర్థిస్తున్నాడని, సంకుచితమైన స్వదేశ ఆర్థిక లాభాలను కాపాడుకొంటున్నాడని విమర్శించారు.[40]

జింబాబ్వే, రాబర్ట్ ముగాబే సవరించు

1980లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జింబాబ్వేకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రాబర్ట్ ముగాబే 1980లలో గుకురాహుండి అనే ప్రదేశంలో 20,000 మందిని వధించడంలోనూ, అవినీతి, అసమర్థ పరిపాలన, రాజకీయంగా అణగదొక్కడం వంటి విషయాలపైననూ అంతర్జాతీయంగా చాలా విమర్శలకు గురయ్యాడు. అంతే కాకుండా ఆర్థికంగా ఆ దేశం వెనుకబాటు తనానికి కారణమయ్యాడు. మండేలా 2000 సంవత్సరంలో ఆ ప్రభుత్వాన్ని విమర్శించాడు.[41][42] కానీ 2003 నుంచీ జింబాబ్వే పై, ఇతర అంతర్జాతీయ విషయాలపై మండేలా మౌనంగా ఉన్నాడు.[31] తన ప్రభావాన్ని ఉపయోగించి ముగాబే విధానాలను సరిదిద్దుకోమని చెప్పడం మాని మౌనంగా ఉండడం అనేక విమర్శలకు దారి తీసింది.[43]

ప్రశంసలు, సన్మానాలు సవరించు

 
దక్షిణాఫ్రికా విముక్తి పోరాట యోధుడు - 1988 లో సోవియట్ యూనియన్‌లో విడుదలయిన స్మారక తపాళా బిళ్ళ

పురస్కారాలు సవరించు

మండేలా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు. 1993 లో ఫ్రెడెరిక్ విలియం డీ క్లర్క్ తో కలిసి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నాడు. ఇంగ్లండు రాణి ఎలిజబెత్ -2 నుంచి "వెనెరబుల్ ఆర్డర్ ఆఫ్ సెయింట్ జాన్", కామన్వెల్త్ కూటమి ప్రధానం చేసే "ఆర్డర్ ఆఫ్ మెరిట్", జార్జి బుష్ నుంచి "ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్" గౌరవాలను అందుకున్నాడు. జూలై 2004 లో జొహన్నెస్ బర్గ్ నగరంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం "ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ" ని ఓర్లాండో లో జరిగిన కార్యక్రమంలో ప్రధానం చేశారు.

1998లో ఆయన పాల్గొన్న కెనడా పర్యటనలో టొరంటో లోని స్కైడోమ్ లో ఏర్పాటు చేసిన ఉపన్యాస సభలో 45,000 మంది స్కూలు విద్యార్థులు మండేలాకు స్వాగతం పలికారు. ఈ సంఘటన అతనికి విదేశాలలో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలియజేస్తుంది. 1989 లో అతనికి కెనడా గౌరవ పౌరసత్వాన్ని ప్రకటించింది. జీవించి ఉన్న వ్యక్తికి కెనడా గౌరవ పౌరసత్వాన్ని ఇవ్వడం అదే మొదటిసారి. అంతకు మునుపు మరణానంతరం ఈ గౌరవాన్ని పొందింది రావుల్ వాలెన్ బర్గ్.

1990లో భారత ప్రభుత్వం మండేలాకు భారతదేశపు అత్యున్నత పురస్కారం భారతరత్న ను ప్రకటించింది. అదే సంవత్సరం సోవియట్ ప్రభుత్వం లెనిన్ శాంతి బహుమతిని ప్రకటించి సత్కరించింది. 1992 లో అతనికి టర్కీ "అటాటర్క్ శాంతి బహుమతి"ని ప్రకటించింది. దీనిని మొదట్లో అప్పట్లో టర్కీలో మానవ హక్కుల ఉల్లంఘనను కారణంగా చూపి తిరస్కరించినా, 1999 లో మండేలా అంగీకరించడం జరిగింది.[44]

పాటలు, చలనచిత్రాలు, రోడ్లు, విగ్రహాలు సవరించు

పెక్కు మంది సంగీత కళాకారులు తమ పాటలను మండేలాకు అంకితం చేశారు. వీటిలో బాగా ప్రచారం పొందినది ది స్పెషల్స్ 1983 లో రూపొందించిన నెల్సన్ మండేలా అనే గీతం. స్టెవీ వండర్ కు ఐ జస్ట్ కాల్డ్ టు సే ఐ లవ్ యు అనే గీతానికి 1985లో లభించిన ఆస్కార్ పురస్కారాన్ని మండేలాకు అంకితం చేశాడు. దాంతో అప్పటి దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆ దేశంలో అతని సంగీతాన్ని నిషేధించింది.[45] 1985 లో యూసౌ ఎండూర్ కూడా అమెరికాలో నెల్సన్ మండేలా మీద ఆల్బమ్ ను విడుదల చేశాడు.

1988 లో మండేలా 70వ జన్మదినం నాడు లండన్ లోని వెంబ్లే స్టేడియంలో ఒక సంగీత ప్రదర్శన జరిగింది. జాతి వివక్ష వ్యతిరేక పోరాటానికి అది ఒక కేంద్ర బిందువుగా నిలిచింది. ఈ ప్రదర్శనలో చాలామంది కళాకారులు మండేలాకు తమ మద్దతు ప్రకటించారు. నెల్సన్ మండేలా అనే పుస్తకాన్ని రచించిన జెర్రీ డామర్స్ నేతృత్వం లోఈ కార్యక్రమం జరిగింది. సింపుల్ మైండ్స్ అనే బృంద ప్రదర్శన కోసం మండేలా డే అనే గీతాన్ని సమకూర్చగా, శంతన మండేలా అనే వాయిద్య సంగీతాన్ని సమకూర్చింది. ట్రేసీ చాప్ మాన్ మండేలాకు అంకితంగా ఫ్రీడమ్ నౌ అనే గీతాన్ని ఆలపించింది. ఈ గీతాన్ని క్రాస్ రోడ్స్ అనే ఆల్బమ్ తో కలిపి విడుదల చేసింది. మాలి నుంచి వచ్చిన సలీఫ్ కీటా తరువాత దక్షిణాఫ్రికాను సందర్శించి 1995లో ఫోలోన్ అనే ఆల్బమ్ కోసం మండేలా పై ఒక పాటను స్వరపరిచాడు.

 
లండన్ లోని పార్లమెంటు స్క్వేర్ వద్దగల మండేలా విగ్రహం

ఇంకా మండేలాను గౌరవిస్తూ వివిధ దేశాలలో పెక్కు పాటలు, ఆల్బమ్‌లు, సంగీత కార్యక్రమాలు అతనికి అంకితం చేయబడ్డాయి. 1997లో వచ్చిన మండేలా అండ్ డీ క్లర్క్ అనే చలన చిత్రం మండేలా జైలు నుంచి విడుదలైన కథ ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో మండేలా పాత్రను సిడ్నీ పాయిటర్ అనే నటుడు పోషించాడు. మండేలా జీవితం మీద ఆధారపడి నిర్మించిన గుడ్ బై బఫానా అనే చిత్రం ఫిబ్రవరి 11, 2007న బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. డెన్నిస్ హేస్బర్ట్ మండేలాగా నటించిన ఒక చిత్రం, జైలు గార్డు జేమ్స్ గ్రెగొరీతో అతని సంబంధాన్ని గురించి వివరిస్తుంది. 1992లో, 27 సంవత్సరాల జైలు జీవితం తరువాత, వచ్చిన ఒక చిత్రం Malcolm X లో మండేలా ఒక పాఠశాల ఉపాధ్యాయునిగా కనిపించాడు. అందులో అతని ప్రసిద్ధి చెందిన ఉపన్యాసాలలో కొన్ని భాగాలు మండేలా స్వయంగా చెప్పాడు. సమాన హక్కుల కోసం మేము పోరాడతాం అనే సందర్భంలో చెప్పిన ఉపన్యాసంలో అవసరాన్ని బట్టి ఏ విధానంలోనైనా అన్న భాగాన్ని ఆ చిత్రంలో మండేలా చెప్పలేదు. ఎందుకంటే ఆ పదాలను అతనిపై నేరారోపణ చేయడానికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం వాడుకోవచ్చునేమోనని.

మండేలా విగ్రహాలు కూడా అనేకచోట్ల నెలకొల్పబడ్డాయి. కొన్ని కూడళ్ళకు, రోడ్లకు మండేలా పేరు పెట్టారు. ఢిల్లీలో కూడా ఒక "నెల్సన్ మండేలా రోడ్" ఉంది.

నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం సవరించు

వర్ణ వివక్షకు వ్యతిరేకంగా, ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్ మండేలా యొక్క జయంతి జూలై 18న నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం జరుపబడుతుంది.[46][47]

అస్తమయం సవరించు

కొంత కాలంగా తీవ్ర శ్వాసకోశ సంబంధ అస్వస్థతతో బాధపడుతూ 2013 డిసెంబరు 5 న 20:50 (దక్షిణాఫ్రికా ప్రాంతీయ సమయం)గంటలకు జోహెన్స్ బర్గ్ లో మరణించారు. వివిధ దేశాలనుండి సుమారుగా 90 మంది ప్రతినిధులు ఆయన అంత్యక్రియలకు హాజరు అయ్యారు.

ఇవి కూడా చూడండి సవరించు

చదువ దగినవి సవరించు

 • ఆంగ్లంలో పెక్కు రిఫరెన్సులకొరకు ఆంగ్ల వికీ వ్యాసం en:Nelson Mandela చూడండి.

బయటి లింకులు సవరించు

మూలాలు సవరించు

 1. 1.0 1.1 (ఆంగ్లము)"Mandela: The Authorized Portrait". 2006. ISBN 0-7407-5572-2. Archived from the original on 2012-01-06. Retrieved 2007-08-31.
 2. 2.0 2.1 2.2 2.3 (ఆంగ్లము)Mandela, Nelson (1994). Long Walk to Freedom. Little Brown and Company.
 3. Nelson Mandela (2000-01-03). "The Sacred Warrior". TIME 100: Person of the Century. Archived from the original on 2008-10-20. Retrieved 2007-08-27.
 4. Surendra Bhana and Goolam Vahed (2005). The Making of a Political Reformer: Gandhi in South Africa, 1893-1914, p. 149. p. 149.
 5. (ఆంగ్లము)Nita Bhalla (29 January 2007). "Mandela calls for Gandhi's non-violence approach". Reuters. Retrieved 2007-08-27.
 6. 6.0 6.1 (ఆంగ్లము)Nelson Mandela (April 20, 1964). ""I am Prepared to Die" - Nelson Mandela's statement from the dock at the opening of the defence case in the Rivonia Trial". African National Congress. Archived from the original on 1997-10-17. Retrieved 2007-08-27.
 7. (ఆంగ్లము) Mandela admits ANC violated rights, too Archived 2008-01-08 at the Wayback Machine (from findarticles.com, originally published in the Milwaukee Journal Sentinel, 2 November 1998)
 8. (ఆంగ్లము)Blum, William. "How the CIA sent Nelson Mandela to prison for 28 years". Retrieved 2007-04-28.
 9. Stein, Jeff (1996-11-14). "Our Man in South Africa". Salon. Archived from the original on 2000-12-08. Retrieved 2007-04-28.
 10. (ఆంగ్లము)Weiner, Tim (2007). Legacy of Ashes. page 362: Penguin Group. ISBN 978-1-84614-046-4.{{cite book}}: CS1 maint: location (link)
 11. (ఆంగ్లము)"Manifesto of Umkhonto we Sizwe". African National Congress. 1961-12-16. Archived from the original on 2006-12-17. Retrieved 2006-12-30.
 12. Winter, Gordon, Inside BOSS, Penguin 1981
 13. Lobster Magazine 18
 14. 14.0 14.1 14.2 (ఆంగ్లము)Sparks, Allister (1994). Tomorrow is Another Country. Struik.
 15. (ఆంగ్లము)"Profile of Nelson Rolihlahla Mandela". ANC. Archived from the original on 2004-06-10. Retrieved 2007-05-08.
 16. (ఆంగ్లము)"Boipatong Massacre". ANC. 18 June 1992. Archived from the original on 14 మే 2001. Retrieved 2007-04-28.
 17. (ఆంగ్లము)Sampson, Anthony (1999). Mandela: The Authorised Biography. HarperCollins. pp. 217.
 18. (ఆంగ్లము)"Mandela becomes SA's first black president". BBC On This Day. Retrieved 2007-08-27.
 19. (ఆంగ్లము)Bethuel Thai (1998-10-04). "15 నుంచి 18 నెలల్లోపు మళ్ళీ ఎన్నికలు జరపనున్న లిసోతో". Lesotho News Online. Retrieved 2007-08-27.
 20. (ఆంగ్లము)Sampson, Anthony (2003-07-06). "85 లో మండేలా". The Observer.
 21. (ఆంగ్లము)Robinson, Simon (2007-04-11). "The Lion In Winter". TIMEeurope Magazine. Archived from the original on 2004-06-06. Retrieved 2008-04-22.
 22. (ఆంగ్లము)"Can Mandela's AIDS Message Pierce the Walls of Shame?". Peninsula Peace and Justice Center. 2005-01-09. Archived from the original on 2013-02-26. Retrieved 2008-04-22.
 23. Quist-Arcton, Ofeibea (2003-07-19). "South Africa: Mandela Deluged With Tributes as He Turns 85". allAfrica.com.
 24. (ఆంగ్లము)Families say SA trial site acceptable Archived 2009-08-22 at the Wayback Machine
 25. The Guardian 11 May 1999 page 13 "Mandela's parting shot at Major over Lockerbie"
 26. "Analysis: Lockerbie's long road". BBC. 2001-01-31.
 27. (ఆంగ్లము)Henry Soszynski. "Genealogical Gleanings". abaThembu (Tribe). University of Queensland. Archived from the original on 2003-03-11. Retrieved 2006-12-12.
 28. "Zoleka: క్యాన్సర్‌తో మండేలా మనవరాలి కన్నుమూత | Nelson Mandela Granddaughter Zoleka Mandela Died At Age Of 43 Due To Cancer - Sakshi". web.archive.org. 2023-09-27. Retrieved 2023-09-27.
 29. "Mandela 'responding well to treatment'". BBC News. 2001-08-15.
 30. ""I'll call you"". SouthAfrica.info. 2004-06-02. Archived from the original on 2013-02-25. Retrieved 2007-08-27.
 31. 31.0 31.1 Carroll, Rory (18 July 2006). "Mandela keeps his opinions to himself as a nation marks its idol's birthday". The Guardian.
 32. "The Smoking Gun: Archive". 2003. Retrieved 2007-05-01.
 33. "Celebrate Humanity 2004" (PDF). International Olympic Committee. 2004. Archived from the original (PDF) on 2007-06-14. Retrieved 2007-05-01.
 34. "Mandela joins 'Elders' on turning 89". MSNBC. 2007-07-20.
 35. Nelson Mandela announces The Elders Archived 2008-12-24 at the Wayback Machine July 18, 2007
 36. 36.0 36.1 Fenton, Tom (2003-01-30). "Mandela Slams Bush On Iraq". CBS News. Archived from the original on 2013-02-25. Retrieved 2007-08-27.
 37. Abhik Kumar Chanda (2005-05-10). "Mandela sues over forged sketches". Mail & Guardian.
 38. Madondo, Bongani (25 February 2007). "Fawning over St Nelson is no way to do justice to Mandela". Sunday Times.
 39. Mabuza, Ernest (10 March 2007). "Ayob Runs Out of Cash But Accuses Mandela Again". Business Day. Archived from the original on 14 మార్చి 2007. Retrieved 22 ఏప్రిల్ 2008.
 40. "Half Nelson - Mandela, diamond shill". The New Republic. 8 December 2006.[permanent dead link]
 41. "Mandela expresses anger at Mugabe". The Namibian. 8 May 2000. Archived from the original on 20 మే 2003. Retrieved 22 ఏప్రిల్ 2008.
 42. "Mandela repudiates Mbeki on AIDS stance". CNN. 29 September 2000. Archived from the original on 2008-05-12. Retrieved 2008-04-22.
 43. Hentoff, Matt (23 May 2003). "Where is Nelson Mandela?". Village Voice. Archived from the original on 9 మార్చి 2008. Retrieved 22 ఏప్రిల్ 2008.
 44. "Statement on the Ataturk Award given to Nelson Mandela". ANC. 1992-04-12. Archived from the original on 2006-10-01. Retrieved 2008-04-22.
 45. "Stevie Wonder Music Banned in South Africa". New York Times. 1985-03-27.
 46. సాక్షి, ఫన్ డే (ఆదివారం సంచిక) (17 July 2016). "మండే'గాంధీ'లా". Archived from the original on 17 July 2016. Retrieved 18 July 2019.
 47. "UN gives backing to 'Mandela Day'". BBC News. 11 November 2009. Retrieved 18 July 2019.