గాథా సప్తశతి

(గాథాసప్తశతి నుండి దారిమార్పు చెందింది)


గాథా సప్తశతి మహారాష్ట్రీ ప్రాకృత భాషలో సంకలనమైన రెండు వేల సంవత్సరాల నాటి 700 (సప్త అనగా ఏడు; శత అనగా వంద) ప్రాకృతగాథల సంకలనం. శాతవాహన ప్రభువులలో ఒకడైన హాలమహారాజుచేగ్రంథం సంకలించబడింది. ప్రాకృత భాషలో ఈ గ్రంథానికి గాహా సత్తసఈ అని పేరు. శాతవాహనులు ఆంధ్రులని ప్రతీతి. ఆనాటి తెలుగు దేశపు ప్రజల ఆచార వ్యవహారాలు చాలా ఈ గాథల్లో ప్రతిబింబించాయి. ఈ గాథలు ముఖ్యంగా ధ్వని ప్రధానమైనవి. ఆనందవర్ధనుడు, ముమ్మటుడు వంటి అలంకారికులు తమ గ్రంథాల్లో వీటిని ఉదాహరణలుగా వాడుకున్నారు. ప్రాకృత గాథా సప్తశతి భారతదేశంలో వెలసిన అత్యంత ప్రాచీనమైన లౌకిక సాహిత్యానికి సంబంధించిన సంకలన గ్రంథం.

గాథా సప్తశతి
కృతికర్త: హాలుడు
దేశం: భారతదేశం
భాష: ప్రాకృత భాష
విభాగం (కళా ప్రక్రియ): గాథా సంకలనం
ప్రచురణ:
విడుదల:

గ్రంథకర్త గురించి

మార్చు

గాథా సప్తశతిలోని కథలను వందలాది మంది కవులు రాశారు. శాతవాహన సామ్రాజ్యానికి చెందిన హాలమహారాజు ఆ గాథలను సంకలనం చేసి గాథా సప్తశతిని కూర్చాడు. హాల మహారాజు సా.శ.19-24 సంవత్సరాల మధ్య కాలంలో రాజ్యపాలన చేశాడని చరిత్రకారులు చెబుతారు. హాలుడు అశ్మక రాజ్యంలోని ప్రతిష్ఠానమును పరిపాలిస్తూ ఉన్నాడని ప్రాకృతంలో రచింపబడిన ‘లీలావతి’ కావ్యం చెబుతుంది. పరిపాలించినది ఆరేళ్ళే అయినప్పటికీ, శాతవాహన వంశపు రాజులందరిలోకీ హాలుడు అత్యంత ప్రసిధ్ధుడు కావడానికి కారణం ఆ మహారాజు సంకలించి ప్రపంచానికి అందించిన గాథా సప్తశతి గ్రంథం. గాథా సప్తశతిలోని ఏడు వందల గాథలలో దేనికది అనాటి సామాన్య జనజీవనంలోని ఏదో ఒక పార్శ్వాన్ని భావితరాలకు గ్రంథస్తం చేసి చూపించడంలో సఫలీకృతమై కనిపిస్తుంది. హాలుడు పరిపాలించిన ఆ ఆరేళ్ళ కాలం ప్రాకృత వాఙ్మయానికి స్వర్ణ యుగమని కూడా చెబుతారు.

హాలుని మనస్సంతా ఆ కాలపు సామాన్య జనజీవితంలోని సుఖదుఃఖాలూ, కష్టనష్టాలకు సంబంధించిన సంగతుల చుట్టూనే తిరుగుతూండేది అనడానికి గాథా సప్తశతి నిలువెత్తు సాక్ష్యం. ప్రాకృతం ఆ కాలపు జనుల భాష. అదే రాజభాష కూడా అయింది. కవితాత్మ కలిగి ఉన్నప్పటికిన్నీ, కవులుగా పేరు పడని సామాన్య ప్రజానీకంలోని ఎందరో వ్యక్తులు – అలఅస్స, మాణస్స, మఅరందస్స, రాఅవగ్గస్స, విగ్గహస్స, వంగవిఅరస్స, అణంగస్స, పాలిఅస్స, ఇత్యాది నామధేయాలతో ఉన్న వ్యక్తులు – ఎందరెందరో రోజువారీ జీవనపు సంఘటనలలోని సంతోషాలనూ, దుఃఖాలనూ, ప్రేమికుల వియోగాలనూ, విరహాలనూ, వినోదాలనూ, విలాసాలనూ, పల్లె సంబరాలనూ, పెళ్ళి సంబరాలనూ, అలంకారాలనూ, అనుభూతులనూ, ఇలా ఎన్నెన్నిటినో గాథలలో బంధిస్తే, వాటిల్లో ఉత్తమమైన వాటన్నిటినీ సేకరించి గుదిగుచ్చి గ్రంథంగా చేసాడు హాలుడు. శాతవాహన రాజుల కాలపు జనుల జీవనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే దృశ్యకావ్యం గాథా సప్తశతి.

ప్రభావం, ప్రాచుర్యం

మార్చు

గాథా సప్తశతి సౌందర్యానికి ముగ్ధుడై, నూనూగు మీసాల నూత్న యవ్వనం నాటికే గాథా సప్తశతిని ‘శాలివాహన సప్తశతి’గా తెలుగులోకి అనువదించానని చెప్పుకున్నాడు శ్రీనాథుడు. గాథా సప్తశతి తెలుగువారి ఆచార వ్యవహారాలనూ, ఆనాటి ప్రజల అనుభవాలనూ అనుభూతులనూ చిన్నచిన్న గాథలలో గ్రంథస్తం చేసిన ఒక గని లాంటిది కావడంతో సంస్కృత, తెలుగు భాషాకవులు పలువురు ఈ ప్రభావానికి లోనయ్యారు. గాథా సప్తశతి లోని సంగతులను ఎన్నిటినో తెలుగు వారికి పరిచయం చేసిన వారిలో అతి ముఖ్యులు తిరుమల రామచంద్ర, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి. తిరుమల రామచంద్ర గాథా సప్తశతి గురించి వ్రాసిన వ్యాసాలు 1940-1980 మధ్య కాలంలో అప్పటి ‘భారతి’ ‘ఆంధ్ర ప్రభ వార పత్రిక’ లాంటి వాటిలో ప్రచురించబడినాయి. ఈ వ్యాసాలనే సంకలించి రాష్ట్ర పురావస్తు శాఖ వారు ఒక పుస్తకంగా కూడా ప్రచురించారు. పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి ‘ప్రాకృత గ్రంథకర్తలూ – ప్రజాసేవానూ’ అనే పెద్ద వ్యాసంలో గాథా సప్తశతి లోని ఎన్నో సంగతులను ముచ్చటించారు.

తెలుగు అనువాదాలు, అనుసృజనాలు

మార్చు

శ్రీనాధుడు ఈ గ్రంథాన్ని శాలివాహన సప్తశతి పేరిట అనుసృజన చేశారు. కాశీఖండం అవతారికలోని పద్యంలో నూనుగు మీసాల నూత్న యౌవనమున/శాలివాహన సప్తశతి నుడివితి అని స్వయంగా చెప్పుకున్నారు.[1] శ్రీనాథుడు ఆంధ్రీకరించిన ‘శాలివాహన సప్తశతి’ ఇప్పుడు అలభ్యం. అందులోనివిగా చెప్పబడే ఐదు పద్యాలు మాత్రమే ఇప్పుడు లభ్యమై ఉన్నాయి. ఈ అయిదింటిలో రెండు వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామంలోను, మిగతా మూడూ విడిగానూ దొరుకుతున్నాయి. అనంతరం రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గాథా సప్తశతి లోని వంద గాథలను తెలుగులోకి అనువదించి ప్రచురించారు. దీవి సుబ్బారావు 700 గాథల్నీ తెలుగులోకి ప్రాకృత గాథా సప్తశతి పేరిట అనువదించారు. నరాల రామారెడ్డి 300 కథలను ఎంచుకుని గాథా త్రిశతిగా పద్యరూపంలోకి అనువదించారు. తిరుమల రామచంద్ర ఈ గాథల్లోని కొన్ని రమణీయమైన ఊహలను, భావచిత్రాలను ఎన్నుకొని రెండు మూడిటినీ కలిపో, ఒకటే ఉంచో కథలు కథలుగా చెప్పారు. వాటిని ప్రాచీనాంధ్ర గాథలుగా ప్రచురించారు.

ఉదాహరణలు

మార్చు
 
గాథా సప్తశతిలోని ఒక గాథకు చిత్రకారుడి దృశ్యరూపం

గాథా సప్తశతి నుండి కొన్ని గాథలు
గాథా సప్తశతిని హాలుడు సంకలించడమే కాదు, తాను రచించిన కొన్ని గాథలను అందులో చేర్చాడు కూడా. హాలుడు రచించిన గాథలలో అతని వ్యక్తిత్వానికి ప్రతిబింబా లనదగినవి ఉన్నాయి. వాటిలో హాలుని సహృదయతనూ, సున్నితమైన మనస్తత్త్వాన్ని తెలియ చెప్పే గాథ ఇది:
“పాణఉడీఅ వి జలిఊణ హుతవఓ జలఇ జణ్ణ వాడమ్మి
ణ హు తే పరిహరిఅవ్వా విసమదసా సంఠిఆ పుంసా.”

దీని సంస్కృత అనువాదం:
“పానకుట్యామపి జ్వలిత్వా హుతవహో జ్వలతి యజ్ఞవాటేపి,
నహితే పరిహర్తవ్యా విషమదశా సంస్థితాః పురుషాః”

తెలుగు అనువాదం:
అగ్నిహోత్రుడు యజ్ఞవాటిలో ఎలా మండుతాడో, కల్లు పాకలోనూ అలానే మండుతాడు. అలాగని అగ్నిహోత్రుని అపవిత్రుడైనాడని వదిలి పెట్టడం కుదురుతుందా? కుదరదు. అలాంటిదే ఉత్తములైన వారి సాంగత్యం. కొన్ని కొన్ని పరిస్థితులలో తమకు తగని ప్రదేశాలలో వారు ఉండడం, మనం చూడడం సంభవించినంత మాత్రాన, వారి సాంగత్యాన్ని వదులుకో చూడడం తగదు. దాని వలన మనకే నష్టం. ఇదీ ఈ గాథ అర్ధం.

2.
వియోగం ఒక అవస్థ. తప్పనిసరి పరిస్థితులలో వేరైపోయి ఒకరినొకరు చేరుకోలేని దూరాలలో ఉండాల్సి వచ్చిన స్త్రీపురుషుల హృదయాలను తెరిచి చూడడం గనుక చేయగలిగితే, అక్కడ అన్యులకు అర్ధంకాకుండా కనిపించే ఒక surrealistic చిత్రం లాంటి భాధామయ దృశ్యం అది. అలాంటి ఒక మహా బాధామయ సన్నివేశాన్ని అంతే గొప్పదైన, ఉదాత్తమైన రీతిలో కళ్ళకుకట్టినట్లుగా కవిత్వీకరించి చూపిస్తుంది ఈ గాథ.
మూలం:
“పిఅ సంభరణ పలోట్టంత వాహధారా నివాఆ భీఆఏ
దిజ్జఇ వంకగ్గీవాఏ దీవఓ పహిఠ జాయయా.”
(3వ శతకం -22వ గాథ)

దీని సంస్కృత చాయ:
“ప్రియ సంస్మరణ ప్రలుఠ ద్భాష్ప ధారానిపాతభీతయా
దీయతే వక్రగ్రీవయా దీపకః పథిక జాయయా.”

తెలుగు అనువాదం:
భర్త వ్యాపార నిమిత్తం దూరం వెళ్ళి పరదేశంలో ఎక్కడున్నాడే తెలియకుండా ఉన్నాడు. సంజె వేళ అయింది. ఆమే ఇంటిలో దీపం పెడుతోంది. కనుల ఎదుట వెలిగిన దీపం ఆమెకు వెంటనే భర్తను తలపులలోకి తెచ్చింది. తలపులలో అతను మెదిలినదే తడవుగా, కనులలో కన్నీళ్ళు నిండి ధార కట్టడానికి సిధ్ధమయ్యాయి. చెంపల మీదుగా క్రిందకు జారి పడడానికి సిధ్ధంగా ఉన్న కన్నీళ్ళు ఎదురుగా ఉన్న దీపాన్ని ఆర్పివేస్తాయేమో అన్న భయంతో ఆమె తన ముఖాన్ని అటుగా తిప్పి దీపం పెడుతున్నది. ఇది ఈ గాథ భావం. ఈ సన్నివేశం, భావం కరిగించలేని హృదయం ఉండగలదా!?

మూలం:
“ణిప్పణ్ణ సస్సరిధ్ధీ సచ్చందం గాఇ పామరో సరఏ,
దలిఅ ణవసాలి తండుల ధవల మిఅంకాసు రాఈసు.”
(7వ శతకంలో 89వ గాథ)

సంస్కృత అనుసృజన:
“నిష్పన్న సస్య ఋధ్ధిః స్వఛ్ఛందం గాయతి పామరః శరది,
దలితనవశాలి తండుల ధవల మృగాంకాసు రాత్రిషు.”

తెలుగు అనువాదం:
‘కోర్కె తీరగా పంట పండింది. దంచిన కొత్త బియ్యపు పిండి ఆరబోసినట్లున్న శరత్కాలపు వెన్నెలరాత్రిలో ఆనందంతో రైతు గొంతు విప్పి పాట పాడు తున్నాడు’ అని ఈ గాథకు అర్ధం. భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగించే ఒక పల్లెటూరి రైతు జీవితంలో దైవం అనుగ్రహిస్తే పదే పదే పునరావృతమయ్యే ఒక సన్నివేశాన్నీ, ఆ సన్నివేశంలోని సౌందర్యాన్నీ కనులకు కట్టినట్లు అతి తక్కువ మాటలలో వర్ణించి చూపించే గాథ ఇది.

4.
శ్రీనాథుడు ఆంధ్రీకరించిన ‘శాలివాహన సప్తశతి’ ఇప్పుడు అలభ్యం. అందులోనివిగా చెప్పుకునే ఐదు పద్యాలు మాత్రమే ఇప్పుడు లభ్యమై ఉన్నాయి. ఈ అయిదింటిలో రెండు వినుకొండ వల్లభరాయని ‘క్రీడాభిరామం’లో ఉన్నాయి. మిగతా మూడూ విడిగా లభ్యమై ఉన్నాయి. ఈ మూడింటిలో ప్రసిధ్ధమైనది ‘వారణ సేయ దావ గొనవా’ అనే పద్యం. సా.శ.1960 సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు మాసాల భారతి సంచికలలో ఈ పద్యం పై ‘తెలుగు మఱుగులు’ శీర్షికన చర్చ జరిగింది. ఈ పద్యానికి మూలమైన ప్రాకృత గాథ పాఠం, దాని సంస్కృత చాయ, చర్చ చివరన పెద్దలు అంగీకరించిన శ్రీనాథుని పద్య పాఠం (ఉత్పలమాల వృత్తంలో) వరుసగా:
మూలం:
“కస్స వ ణ హోఇ రోసో దష్టూయ పియాఏ సవ్వణం అహరమ్
సభమర ఉపమగ్ఘాఇణి వారిఅవామే సహసు ఏహ్మిమ్”

సంస్కృత అనుసరణ:
“కస్యవా న భవతి రోషో దృష్ట్వా, ప్రియాయాః సవ్రణ మధరమ్
సభ్రమర పద్మా ఘ్రాణశీలే! వారితవామే! సహస్వేదానీమ్.”

శ్రీనాథుని తెలుగు పద్యం:
“వారణసేయ దావ గొనవా? నవ వారిజ మందు తేటి క్రొ
వ్వారుచునుంట నీ వెరుగవా? ప్రియ వాతెఱ గంటు కంటి కె
వ్వారికి కెంపు రాదు? తగవా మగవారల దూఱ? నీ విభుం
డారసి నీ నిజం బెరుగు నంతకు నంతకు నోర్వు నెచ్చెలీ!”

ఈ ప్రాకృత గాథను రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు క్రింది విధంగా తెనిగించారు:
“ఎవరి కలుక గలుగదే ప్రియురాలి కె
మ్మోవి కాటుగన్న? ముగుద! తేంట్లు
ముసరియున్న తమ్మి మూరుకొంటివి వల
దన్న వినక! సైపవమ్మ యిపుడు.”

తెలుగు అనువాదం:
“ఓ చెలీ! వలదని ఎంత వారించినా విన్నావా, చెవిన పెట్టావా? అప్పుడే వికసిస్తూన్న కమలంలో కనిపించకుండా తేనెటీగ మకరందాన్ని చప్పరిస్తూ వుంటుందని నీకు తెలియదా? ఇప్పుడు చూడు, నీ పెదవిపై ఏర్పడిన ఈ గంటు నీ ప్రియునికి (పతికి) కోపం తెప్పించిందంటే తెప్పించదా మరి? ఇందులో అతని తప్పేమున్నది? దానికి అతనితో తగవా? నిజం తెలిసిన మీదట అతని కోపం ఉపశమించి నీ దరి చేరేవరకూ నీవు సహించి ఊరక ఉండవలసినదే, తప్పదు మరి!” అని ఈ గాథ తాత్పర్యం.
5.
“అవిరల పడంత ణవజలధారా రజ్జు ఘడిఅం పఅత్తేణ,
అపహుత్తో ఉక్ఖేత్తుం రసఇవమేహో మహిం ఉఅహ.” (5వ శతకంలో 36వ గాథ)
తెలుగులో:
‘వర్షాకాలం. కుండపోతగా కురుస్తూ బలమైన జలధారలనే పగ్గాలను కట్టి మేఘుడు భూమిని తనవైపు లాగే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా లాగలేక పోతున్నాడు. మూల్గుతున్నాడు. ఆ మూల్గులే ఉరుములు’ అని ఈ గాథ అర్ధం.

6.
మూలం:
‘సహి సాహసు సభ్భావేణ పుచ్ఛిమో కిం అసేస మహిలాణమ్,
బడ్డంతి కరఠ్ఠిఆ వ్విఅ వలఆ దఇఏ పఉట్టమ్మి.’ (శతకం 5 – గాథ 53)
సంస్కృత అనుసృజన:
‘సఖి కథయ సద్భావేన పృచ్ఛామః కి మశేష మహిలానామ్,
వర్ధంతే కరస్థితా ఏవ వలయా దయితే ప్రోషి తే.’

తెలుగు అనువాదం:
‘ఎంత అమాయకురా లీమె? భర్త పరదేశం వెళ్ళాగానే బెంగపడిపోయి, తామరతూడులాగా వసివాడి పోయింది. చెలికత్తెను అడుగుతుంది గదా – భర్తలు దూరం వెళ్ళగానే ప్రతి వనిత చెతిలోని గాజులూ ఇలాగే పెరుగుతాయా? – అని. బాగుందమ్మా బాగుంది. ఇలా అడక్కు. ఎవరైనా వింటే నవ్వుతారు!’

పై ప్రాకృత గాథకు తిరుమల రామచంద్ర గారి వివరణాత్మక వ్యాఖ్య
చిక్కి శల్యమయిపోతున్న శరీరాన్ని వదిలి, దృష్టిని చేతులకున్న గాజుల మీదికి మళ్ళించి అవి పెరిగి పెద్దవవుతున్నట్లుగా ఊహించుకుని విస్తుపోతున్న ఆ స్త్రీ హృదయపు అమాయకత్వాన్ని అంత అందంగానూ ఊహించి ఆవిష్కరించిన ఆ అజ్ఞాత ప్రాకృతకవి హృదయ సౌందర్యాన్ని ఆవిష్కరించే గాథ ఇది.

7.
“అవ్వో సోచ్చే అ ఛణో తేణ విణా గామడాహో వ్వ” (శతకం 6, గాథ 35)
“దుఃఖం స ఏవ క్షణః తేన వినా గ్రామదాహ ఇవ” (సంస్కృత ఛాయ)
“అతడు లేకపోయిన ఉత్సవం ఊరిలో నిప్పంటుకున్నట్లుగా వుంది” ( తిరుమల రామచంద్ర గారి తెలుగు అనువాదం)

8.
మూలం:
‘సహి ఈరిసివ్వఇ గ ఈ మా రువ్వసు తంస వలిఅ ముహ అందం,
ఏఅణ బాలవాలుంకి తంతు కుడిలాణ పేమ్మాణం!’ (శతకం 1, గాథ 10)

‘సఖి ఈదృశ్యేవ గతిః మారోదీః తిర్యగ్వలిత ముఖ చంద్రం,
ఏతేషాం బాల కర్కటీ కుటిలానాం ప్రేమ్ణామ్.’ (పై ప్రాకృత గాథకు సంస్కృత ఛాయ)

తెలుగు అనువాదం:
ప్రణయ కలహంతో పెడమొగం పెట్టిన నాయికను ప్రణయాభిముఖనుగా చేయడానికి చెలికత్తె ఇలా అంటున్నది: “సఖి, ఎందుకలా పెడమొగంతో కన్నీళ్ళు కుక్కుకుంటున్నావు? ప్రేమ, వాలుంకి పిల్ల కాళ్ళవలె దగ్గర వున్నవారిని చుట్టుకుంటుంది. కొంచెం లాగితే, వాటివలెనే ముక్కలు, ముక్కలుగా విరిగి పోతుంది.” (పై గాథకు తిరుమల రామచంద్రగారి అర్ధ వివరణ).
ఈ గాథను చెప్పిన కవి పేరు ‘అలఅస్స’ .

9
“ఖరసిప్పర ఉల్లిహిఆఇ కుణఇ పహిఓ హిమాగమ పహాఏ,
ఆచమణ జలోల్లిహిఅ హత్థఫంస మసిణాఇ అంగాఇ.”
గాథసప్తశతి 4వ శతకం 30వ గాథ ఇది. ఈ గాథను చెప్పిన కవి పేరు పసణ్ణస్స. ‘అతనొక పథికుడు, పాదచారుడు. అది చలి కాలం. ఆ నాటి రాత్రి సన్నని పదునైన నూగు గలదైన గడ్డి ప్రాంతంలో (వేడిమి కోసం) పడుకున్నాడు. ఫలితంగా శరీరం మీద అనాచ్ఛాదిత భాగమంతా గీసుకుపోయింది. మంచుతో నిండి ఉన్న ఉదయాన నిద్ర లేవగానే తడిచేతితో ఒంటి మీద (గాయాలైన చోటల) రాచుకుని హాయిని పొందుతున్నాడు’ అని ఈ గాథ అర్ధం.

గాధా సప్తశతిలోని తెలుగుపదాలు

మార్చు

గాధా సప్తశతి తెలుగుగడ్డపై వెలసిన రచన, ప్రజాకవులు రచించిన ఈ అమరగాథలను సేకరించి ప్రాకృత సాహిత్య వధువునకు అందచందాలు సంతరించినవాడు హాలుడు. తెలుగు కవిరాజు సేకరించిన ఈ గాథలలో దేశీపదాలు, ముఖ్యంగా తెలుగుపదాలు, సంప్రదాయమూ వెల్లివిరుస్తుంది. దీనిలో ప్రయోగించిన అత్త, తుప్ప, మయిల, మడహ, కిలించిఅ, పీలుఅ, ఎక్కల, పక్కల మున్నగునవి ప్రాకృత పదాలు కావని, కేవలం దేశ్యాలేలని నిర్ధారించడానికి శ్రీ కులబాలదేవుడు మున్నగు వ్యాఖ్యాతలూ, పాదలిప్తాచార్యుడు మొదలు ఆచార్య హేమచంద్రుడు వరకు గల ప్రాకృత వైయాకరణ నిఘంటకారులూ ప్రమాణము. ఉచ్చారణ సాదృశ్యము, అర్ధ సాదృశ్యము బట్టి ఈ తెలుగు శబ్దాలను అర్ధము చేసుకోవాలి.

1 అత్త
ఏత్ఠణిమజ్జఇ అత్తా
ఏత్ఠ అహం ఏత్ఠ పరిఅణో సఅలో
పంధిఅ రత్తీఅంధఅ
మామహ సఅణే ణిమజ్జిహిసి
(7 వ శతకం, గాథ 67)

ఆ.ఇచటనే పరుండు, నిచ్చట అత్తగా, రిచట పరిజనంబు; లెరిగికొనుము. రాత్రి నీకు గానరాదు, నాశయ్యపై తప్పిపడెద వేమో! దారికాడ!

తన అభిప్రాయాన్ని తెలుసుకున్న తెరువరిని ఉద్దేశించి ఒక జారిణి అన్న మాటలివి:

ఏత్ఠణిమజ్జఇ అత్తా ( ఇక్కడ అత్తగారు పడుకుంటుంది) అనే పాదములో సామా శబ్దానికి మారుగా అత్తా అనే పదాన్ని కవి ప్రయోగించాడు. అత్తా అనే పదం సప్తశతిలో దాదాపు 12 సార్లు ప్రయుక్తమైనది.ఈ అత్తా తెనుగు అత్తగారే అని అనడం స్పష్టం. చాయాకారులు, వ్యాఖ్యాకారులు దీనికి శ్వశ్రూః అని అర్ధం చెప్పడం మన ఊహకు సాధకం. మామ భార్యకు మామీ, మామి అని, మేనత్తకు పిఉచ్చా అనీ పలు గాథలలో ప్రయోగింపబడినవి.

2 వాలుంకి
సహి ఈరిసివ్వఇ గఈ
మారువ్వసు తంసవలిఅముహాందం
ఏఆణ బాలవాలుం
కి తంతుకుడిలాణ పేమ్మాణం.
(అలఅస్స 1-10)

ప్రణయకలహంతో పెడమొగం పెట్టిన నాయికను ప్రణయాభిముఖనిగా చేయడానికి చెలికత్తె ఇలా అంటున్నది: సఖి ఎందుకిలా పెడమొగంతో కన్నీళ్ళు కక్కుకుంటావు? ప్రేమవాలుంకి పిల్ల కాళ్ళవలె దగ్గర ఉన్నవారిని చుట్టుకుంటుంది. కొంచెం లాగితే వాటి వలెనె ముక్కలుముక్కలుగా విరిగిపోతుంది.' ప్రేమ చాలా సుకుమారమని తెలుపడానికి గ్రామీణులకు తరచుగా తెలిసిన పిల్లవాలుంకి లేతకాళ్ళను అలఅకవి (బహుశా ఇతను అల్లాయ్య అయిఉంటాడు) చక్కగా పోల్చి చెప్పాడు. వాలుంకి శబ్దానికి కర్కటి (ఎండ్రకాయ) అని వ్యాఖ్య. తెనుగులో ఒల్లెంక, వాలుగ అనే శబ్దాలు మత్స్యభేధాలు తెలిపేవి ఉన్నాయి. ఒల్లెంక=సన్నని కాళ్ళు కలిగి గోళాకారంగా ఉండే చేప. దీని మాంసం విషం అని బ్రౌణ్య నిఘంటువు తెలుపుతున్నది.

3 పీలుఅ
తడసంఠిఅ ణీడేక్కం
తపీలుఆ రక్ఖణేక్క దిణ్ణమణా
అగణిఅ విణివాభయా
పూరేణ సమం వహఇ కాఈ.
(మాణస్స 2-2)

కొమ్మకొనపై గూటిలో కూరుచున్న తనదు పిల్లల కాపాడు పనియె తలచి మునిగిపోవుదు నను భీతి కాకి వెడలెడిన గంటె చెట్టుపై వెల్లివెంట. పీలుకః= కాబకః (పిల్ల) అని కులబాలదేవుని వ్యాఖ్య.తెనుగులో పీలుక శబ్దానికి పక్షిలోనగువాని పిల్ల అని అర్ధము.పిళ్ళై, పిళ్ళే, పిన్న మున్నగు తమిళ, కర్ణాటక శబ్దాలు పిల్ల, పిలుక అనే తెనుగు పదానికి సమానార్ధాలు.ఇదే పిపీలికా కూడా మారింది.

4 పోట్టం
పోట్టం భరంతి సఉణా
విమాఉఆ అప్పణో అణువ్విగా
విహలుద్ధరణ సహావా
హువంతి జఇ కేవి సప్పురిసా.
(అలక్కస్స 3-15)

పక్షులు కూడా ఎదోవిధంగా పొట్టపోసుకుంటాయి. దుఃఖాలనుంచి దీనులను గట్టిక్కించే స్వభావం గల సప్తురుషులు కొందరే సుమా! అని ఈ గాథ అర్ధము. పోట్ట శబ్దము మరి రెండుచోట్ల కూడా ప్రయుక్తమయినది. పోట్ట ఉదరం అని వ్యాఖ్య.దీనిని హేమచంద్రుడు దేశీనామాలలో ఉదహరించాడు. సంస్కృత ప్రాకృత భాషలలో ఒకారం లేదుకనుక పొట్ట శాబ్దమే పోట్టగా ప్రాకృతంలో గ్రహించిఉంటారు.

5 కిలించిఅః
హ్హాణ హలిద్దా భరిఅం-
తరాఇ జాలాఇజాలవల అస్స
సోహంచి కిలించిఅకం
టఏణ కం కాహిసీ కఅత్థం?
(మఅరందస్స 1-80)

పసునీళ్ళాడి దువ్వెనపండ్లనడుమ చిక్కుకొనియున్న మైలను చిన్నముల్లు గ్రుచ్చి తీసెద వెవ్వని కోర్కి పండ జేయనున్నావు తెల్పవే చిన్నదాన? అని ఈ గాథ అర్ధము. ఈ గాథలోని కిలించిఅ అనే శబ్దానికీ, పాఠాంతరంగా గ్రహించిన కిలిచ్చిఅ శబ్దానికి సూక్షం అని వ్యాఖ్యాతల నిర్వచనము. సన్నని, నీచమైన అనే అర్ధాలలో క్రించు, కించు శబ్దాలు తెన్లుగు సాహిత్యంలో లభిస్తున్నవి. తమిళ, కన్నడ భాషలలోని కిళి, కిళింజల్, కీళ్ శబ్దాలకు సన్నని, సన్నగా చేయు, చించు అని అర్ధము.

6 అద్దాఏ
పుట్టం తేణ విహఆఏ
ణమామి ణివ్వంజ్జఏ తమ్మి
అద్దఏ పడిబింబం
వ్వ జమ్మి దుఃఖం ణసంకమఇ.
(రాఅవగ్గస్స 3-4)

అద్దమందు నీడ యంటున ట్లెవ్వని ఆత్మ నొరుల వగపు లంటుకొనవొ అట్టివానితోడ నెట్టు సెప్పదు నత్త, మనసు వ్రక్కలైన మానె గాని. అద్దాఏ-ఆదర్శే అని వ్యాఖ్య.దీనిని హేమచంద్రుడు దేశీనామాలలో చేర్చాడు.అద్దునది, ఎదుట ఉన్నదానిని తనలో అద్దుకొనునది కనుక అద్దము. అద్దము, అద్దవు క్రమంగా అద్దాఓ అయింది. అదే ప్రాకృతంలో అద్దాఏ అయినది.

7 భోండీ
దటూణ రుందతుండ
గ్గణిగ్గఅం ణిఅసుఅస్స దాఢగ్గం
భోంఢీ విణావి కజ్జే
ణ గామణఆడే జవే చరఇ.
(విగ్గహస్స 5-2)

వెడనుమూతితుదను వెడలిన వాడియౌ కోరపంటితోడ కొడుకుజూచి తల్లిపండి తనకు నొల్లకున్నను మేయు నూరిప్రక్కతోట నుండు యవలు. భోండీ - సూకరీ అని వ్యాఖ్యానము. దేశీపదం భుండీరో అనే శబ్దము నుంచి గ్రహించబడింది. దీనికి తెనుగులో అర్ధము పంది.

8 సరఅస్స
ఆరుహఇ జుణ్ణఅం ఖు
జ్జఅం విజంఉఅహ వల్లరీ తవసీ
ణీలుప్పల పరిమల వా
సిఅస్స సరఅస్ససో దోసో.

వయసు దిగజారినా చెరుకుకల్లు త్రావి మన్మధ వికారం పొందిన ఒక వనితను చూచి శరద్వర్ణవ్యాజముతో హేళన చెస్తూ చెప్పిన గాథ ఇది.ప్రక్కన ఉన్న వాటిని చుట్టుకొనడమే స్వభావముగా గల దోసతీగ శరత్కాలం రాగానే పక్కన రాయిఉన్నా రప్పవున్నా అల్లుకుంటుంది. సారాయి తాగిన ఈ వయసు జారిన వనితకూడా ప్రక్కనున్నవానిపై తులుతుంది. నీలోత్పల పరిమళం గల సరకపు దోషమే సుమా ఇది. సరఅ అనే శబ్దం శరత్కాలం అనే అర్ధములో తద్భవమే. ఇది తెనుగు చెరుకు. కరచి తినేది కనుక కరంబు, కబ్బు, చెరకు అయి ఉంటుంది. తర్వాత చెరకునుంచి పుట్టిన మద్యానికి లాక్షణికంగా వ్యవహారం కలిగి ఉంటుంది. అందుకే సరక శబ్దాన్ని క్రమంగా మధుపానానికీ, మధుపాత్రకు కూడా వ్యవహరిస్తారు.

9 తుప్ప
తుప్పణణా కిణో చి
టసిత్తి పడిపుచ్చి ఆఎ బహుఆఎ
విఉణావేట్టిఅ జహణ
త్తలాఇ లజ్జోణఆం హసిఅం.
(అలక్కస్స 3-29)

ముఖానికి నెయ్యిపూసికొని ఎందుకు నిలుచున్నావు అని ఆడుగగా, కోడలు సిగ్గుపడి చీరను మరొకమారు ఒంటిచుట్టు చుట్టుకొని నవ్వింది.చెరగుమాసిందని భావము. ఆకాలంలో రజస్వలలు గుర్తుగా మొగానికి వన్నె కలిపిన నెయ్యి పూసుకొనడము ఆచారమని 1-22 వ గాథా వ్యాఖ్యానములో వ్రాయబడింది. ఈ గాథలో ప్రయోగించిన తుప్ప శబ్దము నెయ్యికి ప్రాచీన వ్యాఖ్యానము.తరువు-ఆవు-నుంచి వచ్చింది కనుక తురుప్ప-త్రుప్పు-తుప్పు-తుప్ప అయింది.ఆవు నేయి అన్నమాట.

10 ఫలహీ
ఫలహీ వాహణపుణ్ణా
హమంగలం లంగలే కుణంతీ ఏ
అసతీఆ మణోరహ గ
బ్భిణీఅ హత్తా ధరధరంతి.
(కహిలస్స 2-65)

పత్తిచేను దున్నవలసిన మంచి దినాన మడక పుజ చేయదొడగినపుడు కోర్కు లాత్మ గుబులుకొన గడగడమని వడకదొడగె గాపు చెడిపె కేలు. ఫలహీ= కార్పాసవృక్షః అని వ్యాఖ్యానము.పలహీ అని హేమచంద్రుడు దేశీనామములలో పఠించి వలహీ, వవణీ అని పర్యాయపదాలు పేర్కొన్నాడు. తెనుగు ప్రత్తే ఫలహీ గామారింది. ప్రత్తికి ఆది రుపమైన పరుత్తి పలుత్తి అయి అంత్య ద్విత్వాక్షరాన్ని ఊదిపలుకడము వల్ల క్రమంగా పలుత్తీ-పలహీ అయి వుంటుంది.

11 వేంట
అజ్జం మోహణ సుహిఅం
ముఅత్తు మోత్తూ పలాఇఏ హలిఏ
దరపుడిఅ వేంటభారో
ణఆఇ హసిఅంఅ ఫలహీ ఏ.
(జణ్ణంద సారస్స 4-60)

చొక్కి కనులుమూయు సుదతి జచ్చె నటంచు విడిచి పారు కాపువెడగు జూచి పత్తి కొమ్మసగము పగిలిన కాయల మొగము వంచి చేల నగియబోలె. వేంటో- కార్పాసఫలం అని కులదేవుడిని వ్యాఖ్య. ప్రత్తివిళ్ళు, ప్రత్తి వెంట్లు అన్నమాట.గడ్డివెంటు- గడ్డిచుట్ట. ప్రత్తివెంటు-ప్రత్తి చుట్ట.

12 రుంప-రంప
ఉక్కిప్ప ఇమండలి మా
రుఏణ గేహంగణాహి వాహీఏ
సోహగ్గఢఅనడా అ
వ్వ ఉఅహ ధణురుంపరించోలీ.
(హాలస్స 2-20)

చెంచుమగువ ఇంటిచెంగట జెక్కిన మగని పెద్దవింట దెగిన చిరుగు పొట్టు మింటి కెగిరిపోయెడు సుడిగాలి దాని భాగ్యగుణపతాక యనగ. రుంప శబ్దానికి రంప అని పాఠాంతరం. రుంప, రంప = చెక్కినపొట్టు.

13 మడహసరిఆ
ఓహిఅఅ మడహసరిఆ
జలరఆహీరంత దీహదారువ్వ
ఠాణేఠాణే వ్విఅల
గ్గమాణ కేణౌపి ణిజ్జహసి.

చిన్నవాగువడికి జిక్కి కొట్టుకపోవు పొడుగు కట్టెవోలె నడుమనడుమ తగులుకొనెదు మనస, తప్పక ఎవ్వరో కడకు నిన్ను బట్టి కాల్చెవైచు. మడహశబ్ద స్వల్పవాచకః అని వ్యాఖ్య.దేశీశబ్దమాలలోని, సంస్కృత నిఘంటువులలోనూ ఇది లభించడము లేదు. అడగు, మడగు, అణగు, మణగు శబ్దాలకు తగ్గియుండు అని అర్ధము.

14 వోడసుణఓ
వోడసుణఓ విఅణ్ణో
అత్తామత్తా పఈవి అణ్ణత్తో
ఫలిహం వమోడిఅం మహి
సఏణ కోతస్స సాహేఉ.

అత్త పడిన దింట మత్తెక్కి, పతి పొరుగూరు కేగె, కుక్క దోరిపోయె, ప్రత్తిచేను విరుగబడగ మేసె నెనుబోతు దీని నతని కెవరు తెలుపువారు? వోడో దుష్టః చిన్నకర్ణోవా అని వ్యఖ్యానము. చిన్న కర్ణమనగా అవిటు అని అర్ధము.మొదలే అవిటు కుక్క, అదికూడా ఇప్పుడు జబ్బు పడ్డది. ఓడు, ఓట-బీటలు వారినది.

15 సాఉలీ
సుఅణువఅణం చిఅంతం
సూరంమా సాఉలీఅ వారేఇ

తరుణి, నీమొగంబు దాకెడు సూర్యుని చెరగువెట్టి అడ్డుసేయవలదు.సాఉలీ=పల్లవికా అని కులబాలదేవుని టీక.తెలుగు సావులీ = కప్పుకునే వస్త్రము అని అర్ధము.

16 తీరఏ

కేలీఆ విరూసే ఉం
ణ తీరఏ తమ్మి చుక్కవిణామ్మి
జాఇఅఏహి న మాఏ
ఇమేహి అవసేహి అంగేహీం.
(పావచీఖలస్స 2-75)

ఎరవు తెచ్చుకున్న తెరగున వసముగా కుండ చెడిన ఇట్టి యొడలు గలిగి అమ్మ! తప్పు లెన్ని ఇతడు చేసిన నెట్టు లలుగనేర్తు నవ్వులాటకైన?

మూలాలు

మార్చు
  1. కాశీఖండం అవతారికాలోని చిన్నారి పొన్నారి చిరుతకూకటి నాడె పద్యం
  2. "Gadhasaptha Shathi By Bolloju Baba" (in English).{{cite web}}: CS1 maint: unrecognized language (link)
* భారతి- 1948-వ్యాసం- టి.రామచంద్ర.

బయటి లింకులు

మార్చు

హాలుని గాధా సప్తశతి at GRETIL

సంస్కృతంలో గాధా సప్తశతి