గాయత్రి (మలయాళ సినిమా)
గాయత్రి 1973వ సంవత్సరానికిగాను మలయాళ భాషలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 21వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఎంపికైన సినిమా.
గాయత్రి | |
---|---|
దర్శకత్వం | పి.ఎన్.మీనన్ |
రచన | మలయత్తూర్ రామకృష్ణన్ |
స్క్రీన్ ప్లే | మలయత్తూర్ రామకృష్ణన్ |
తారాగణం | జయభారతి ఆదూర్ భాసి శంకరది శుభ |
ఛాయాగ్రహణం | అశోక్ కుమార్ |
కూర్పు | రవి |
సంగీతం | జి.దేవరాజన్ |
నిర్మాణ సంస్థ | శ్రీరాం పిక్చర్స్ |
పంపిణీదార్లు | త్రివేణి పిక్చర్స్ |
విడుదల తేదీ | 14 మార్చి 1973 |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
నటీనటులు
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకుడు: పి.ఎన్.మీనన్
- కథ, స్క్రీన్ ప్లే:మలయత్తూర్ రామకృష్ణన్
- కూర్పు: రవి
- ఛాయాగ్రహణం: అశోక్ కుమార్
- పాటలు: వాయలార్ రామవర్మ
- సంగీతం: జి.దేవరాజన్
- నేపథ్య గాయకులు: కే.జే. యేసుదాస్, పి.మాధురి
- నిర్మాతలు: ఎ.ఆర్.శ్రీధరన్ ఇలాయిడం, పి.బి.ఆశ్రమ్
కథ
మార్చుసహస్రామ శాస్త్రి గారిది వైదిక సాంప్రదాయాలను తు.చ.తప్పకుండా అనుసరిస్తూ వస్తున్న కుటుంబం. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని నిర్వహించడం చాలా కష్టంగా వున్నా, తమ ఆచార వ్యవహారాలలో మాత్రం ఎటువంటి లోటుపాట్లు రాకూడదని ఆయన, ఆయన కొడుకు శంకరశాస్త్రి భావిస్తూ ఉంటారు.
ఆ గ్రామంలోని చిన్న చిన్న దేవాలయాలలో అర్చనలు, ఆరాధను వంటివి ఏమైనా సహస్రామశాస్త్రి గారి చేత చేయించడం, శంకరశాస్త్రి తర్పణాలు చేయించడం జరిగితేనే వాళ్ళింట్లో వంట కార్యక్రమం ఉంటుంది. లేనప్పుడు ఆ రోజు గడవడం అన్నది వాళ్ళకు ఒక సమస్యే అవుతుంది. ఐనా సహస్రామశాస్త్రి గారికి తమ ఆర్థిక పరిస్థితిపై ఎటువంటి చింతాలేదు. చివరి వరకు తమ బ్రాహ్మణ సంప్రదాయాలను కాపాడుకుంటూ రావడమే ఆయన జీవితాశయం.
శంకరశాస్త్రి కొడుకు రాజామణి, కూతురు కనకం మారుతున్న యువతరానికి ప్రతినిధులు. జీవితాలకు ప్రయోజనదాయకం కాని ఈ సనాతన సంప్రదాయాల పట్ల రాజామణికి నమ్మకం లేదు. అందువల్లనే అతను తన తండ్రి, తాతగారి పద్ధతులను అనుసరించడం లేదు. మనుషుల మధ్య భేదాలను సృష్టించే ఈ కులాలు, మతాలు ఇవన్నీ కొందరు స్వార్థపరులల్లిన కుట్రలని అతని నమ్మకం. రాజామని చెల్లెలు కనకానికి కూడా ఇవే అభిప్రాయాలున్నాయి.
ఆమె 'అప్పు ' ను ప్రేమించింది. బట్టలుతకడం అప్పు వృత్తి. అప్పుకు కనకమంటే ప్రాణం. ఆ ప్రేమికులిద్దరూ తమ జీవితాల్లోని వసంతోదయం కోసం ఎదురు చూడసాగారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుక్కుంటున్న వార్త తెలిసేసరికి సహస్రామశాస్త్రి, శంకరశాస్త్రి కనకం మీద పిడుగులా విరుచుకు పడ్డారు. "ఒక బ్రాహ్మణ కన్య చాకలివాడ్ని ప్రేమించడమా?" అని గర్జించారు.
ఆచారమనే ఆ అగ్నిపర్వతాల జ్వాలాకీలికలను కనకం కన్నీళ్ళు చల్లార్చలేక పోయాయి. కనకం ఎంత మొత్తుకున్నా వినకుండా ఒక వయసుమళ్ళిన బ్రాహ్మణుడితో ఆమె వివాహం జరిపించడానికి సహస్రామశాస్త్రిగారు అన్ని ఏర్పాట్లు చేయసాగారు. ఫలితంగా కనకం ఆ రోజు రాత్రే తన ప్రేమికుడు అప్పుతో కలిసి ఊరు విడిచి వెళ్ళిపోయింది. ఆనాటి నుంచి 'లేచిపోయిన దాని కుటుంబం' అంటూ ఊళ్ళో వాళ్ళు సహస్రామశాస్త్రి కుటుంబాన్ని హేళన చేయసాగారు. ఇంతకాలంగా వాళ్ళకు ఎటువంటి సహాయం చేయడానికీ ముందుకురాని ఇతర బ్రాహ్మణ కులస్తులు ఈ సంఘటనతో ఒక్కసారిగా వాళ్ళను 'చెడిపోయిన వాళ్ళు'గా, 'అంటరాని వాళ్ళు'గా పేర్కొంటూ తమ కులం నుంచి 'వెలి' వేసినట్లుగా ప్రకటించారు.
సహస్రామశాస్త్రి గారు ఈ అవమానాన్ని భరించలేక మనోవ్యాధితో ఒక రోజు కన్నుమూశారు. పాపం శంకరశాస్త్రికి ఇప్పుడు మరో సమస్య ఎదురైంది. తమ కులంలోంచి వెలివేసిన బ్రాహ్మణులు అందరూ సహస్రామశాస్త్రి శవాన్ని మోయడానికి తిరస్కరించారు. చివరి వరకూ బ్రాహ్మణ సంప్రదాయాలు తనను కాపాడుతాయనే కలలుకన్న సహస్రామశాస్త్రికి అవి కలలుగానే మిగిలిపోయాయి.
ఒక్కో నిమిషం గడుస్తూవుంది. శవం అలాగే ఉంది. శంకరశాస్త్రి తీవ్రమైన సందిగ్ధంలో పడి నలిగిపోతున్న తరుణంలో... ఆ శవాన్ని మోసుకు వెళ్ళడానికి హఠాత్తుగా ఊళ్ళో వాళ్ళు కొందరు ముందుకు వచ్చారు. వాళ్ళలో ఒక వ్యక్తి మహమ్మదీయుడు. ఒకరు క్రైస్తవుడు. మరొకరు బట్టలుతికే వ్యక్తి. వాళ్ళు సహస్రామశాస్త్రిలా మనిషిలోని కులాన్ని చూడలేదు. మనిషినే చూశారు.[1]
పురస్కారాలు
మార్చుసంవత్సరం | అవార్డు | విభాగము | లబ్ధిదారుడు | ఫలితం |
---|---|---|---|---|
1973 | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు | ఉత్తమ మలయాళ సినిమా | ఎ.ఆర్.శ్రీధరన్ ఇలాయిడం, పి.బి.ఆశ్రమ్ | గెలుపు |
1973 | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు | ఉత్తమ నేపథ్య గాయకుడు | కే.జే. యేసుదాస్ | గెలుపు |
మూలాలు
మార్చు- ↑ సంపాదకుడు (1 October 1974). "గాయత్రి". విజయచిత్ర. 9 (4): 40.