గిరిజన సహకార సంస్ధ (జిసిసి)

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వారిని దళారి వ్యాపారస్తుల నుంచి కాపాడే లక్ష్యంగా ఏర్పాటైన రాజ్యాంగబద్ద సంస్థ గిరిజన సహకార సంస్థ ( జిసిసి ). ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సహకార సంస్థ (జిసిసి)ను 1956లో ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంది. రాష్ట్రంలో జిసిసికి ఏడు డివిజనల్ కార్యాలయాలు ఉన్నాయి. సంస్థ పరిధిలో 25 గిరిజన ప్రాథమిక పరపతి సహకార సంఘాలున్నాయి. ప్రస్తుతం వైస్ చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ గా శ్రీమతి కల్పనా కుమారి IAS బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్నది.

జిసిసి ప్రధాన కార్యాలయం, విశాఖపట్నం
గిరిజన మహిళల ధింసా నృత్యం

గిరిజనుల నుంచి సేకరించిన తేనె, చింతపండు, నరమామిడి వంటి చిన్న తరహా అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం, విక్రయించడం, ప్రాసెసింగు చేసి ఆ ఉత్పత్తులను మార్కెట్లో వినియోగదార్లకు అందుబాటులోకి తీసుకురావడం వంటి బాధ్యతను గిరిజన సహకార సంస్థ నిర్వహిస్తుంది. సేకరించిన అటవీ, ఇతర ఫలసాయ ఉత్పత్తులను నిల్వ వుంచేందుకు జిసిసికి రాష్ట్రంలో 70 నిల్వ కేంద్రాలు ఉన్నాయి. సేకరించిన ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకోచ్చేందుకు గాను రాష్ట్రంలో జిసిసి ఆధ్వర్యంలో ఏడు పారిశ్రామిక సముదాయాలు నడుస్తున్నాయి. వీటిలో తయారు చేయబడ్డ పసుపు, కుంకుమ, తేనె, షరబత్, షాంపూలు, సబ్బులు, కాఫీ పొడి వంటి 27 ఉత్పత్తులను రిటైల్ గా ప్రత్యేక ఔట్ లెట్లు, సూపర్ బజార్లు, రైతు బజార్లు, ఆన్ లైన్ల విక్రయాల ద్వారా విక్రయిస్తుంది.

రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో 5500 ఆవాసాల్లో 891 డి.ఆర్.డిపోలను జిసిసి నిర్వహిస్తుంది. వీటి ద్వారా గిరిజనులకు సబ్సిడీతో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం, చక్కెర, కందిపప్పుతో పాటు జీసీసీ బ్రాండ్‌ పసుపు, కారం, చింతపండు, కాఫీ, సబ్బులు, షాంపులు, తదితర వస్తువులు ఇక్కడ అందిస్తారు. అలాగే, ఐటీడీఏ పరిధిలో కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 100 గిరిజన హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. వీటికి కావల్సిన ఆహార వస్తువులు, కాస్మోటిక్స్, శానిటరీ వస్తువులు కూడా శ్రీశైలం ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేసి సరఫరా చేస్తారు. దీంతో పాటు వీరి అభివృద్ధి కోసం 171 చెంచుగూడేల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఫలితంగా గిరిజనుల ఆర్థిక స్తోమత పెరిగి సంతోషంగా జీవిస్తున్నారు.

విశాఖ జిల్లాలో అరకు, చింతపల్లి ప్రాంతాల్లో గిరిజనులు పండించే కాఫీ గింజలను జిసిసి కొనుగోలు చేస్తుంది. వాటిని ఈ వేలం ద్వారా అంతర్జాతీయ మార్కెట్ లో విక్రయించడంతో పాటు అరకు వ్యాలీ, వైశాఖి కాఫీ బ్రాండుల పేరుతో బహిరంగ మార్కెట్లో వినియోగదార్లకి విక్రయిస్తుంది. గిరిజన సహకార సంస్థ కాఫీ గింజలను గిరిజనుల నుంచి సేకరించి విక్రయాలు జరపడంతో పాటు గిరిజనులకు గిట్టుబాటు ధరను కల్పిస్తుంది.

2022-23లో  జి.సి.సి. కార్యకలాపాలు

  • గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జిసిసి) 2022-23లో తన ప్రధాన కార్యకలాపాల ద్వారా రూ.494.25 కోట్లను గిరిజన ఆర్థిక వ్యవస్థలోకి పంపింది. రూ.75.56 కోట్ల అటవీ, వ్యవసాయ ఉత్పతుల కొనుగోలు చేయడం జరిగింది.
  • జిసిసి యాజమాన్యంలోని డిఆర్ డిపోలు (ఫెయిర్ ప్రైస్ షాప్ లు) ద్వారా రూ.16.65 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులను, రూ.360.78 కోట్ల విలువైన గృహావసరాల వస్తువులను గిరిజన కుటుంబాలకు జిసిసి పంపిణీ చేసింది.
  • రాష్ట్రంలోని అర్బన్, సెమీ-అర్బన్ ప్రాంతాల వినియోగదారులకు ఈ సహజ సేంద్రియ ఉత్పత్తులను చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇటీవల మైదాన ప్రాంతాల్లో MDUల ద్వారా GCC "గిరిజన్" బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించింది, ఇది సంస్థ, గిరిజనుల ఆర్థిక వృద్ధిని ప్రతిబింబిస్తుంది.
  • జిసిసి ఫారెస్ట్ ప్రొడక్ట్స్, కాఫీ (ఫిల్టర్ & ఇన్‌స్టంట్), తేనె, చింతపండు, కుంకుడుకాయలు, సీకాకాయ, నాన్నారి, బిల్వ, పసుపు, రాజమా, కొండ చీపుర్లు, సబ్బులు (టాయిలెట్ & డిటర్జెంట్) తయారు చేసి గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా రూ.17.75 కోట్ల విలువైన ఉత్పత్తులు విక్రయించబడ్డాయి. అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు  విలువ జోడించడం ద్వారా కొత్త ఉత్పత్తులను ప్రారంభించేందుకు, గిరిజన ప్రాంతాల్లో పండించే మిల్లెట్‌లను ప్రోత్సహించడానికి, మార్కెట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయబడ్డాయి.
  • రిటైల్ విక్రయ ధరకు నాణ్యమైన ఇంధనాన్ని అందించడానికి, ప్రైవేట్ డీలర్ల దోపిడీ నుండి గిరిజనులను రక్షించడానికి జి.సి.సి. గిరిజన ప్రాంతాల్లో 16 పెట్రోల్ బంక్‌లు, 12 ఎల్.పి.గ్యాస్  గోడౌన్లను నడుపుతోంది.

సంవత్సరం వారీగా జి.సి.సి. టర్నోవర్

సంవత్సరము విలువ (రూ.కొట్లలో)
2019-20 రు.370.61 కోట్లు
2020-21 రు.450.74 కోట్లు
2021-22 రు.461.02 కోట్లు
2022-23 రు.494.25 కోట్లు
2023-24

(తేది: 30.06.2023 వరకు)

రు.110.21 కోట్లు

(వార్షిక లక్ష్యానికి  రు.557.01 కోట్లు)

వన్ ధన్ వికాస్ కేంద్రాలు (విడివికె) గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ట్రైఫెడ్) రూ.61.63 కోట్ల అంచనా వ్యయంతో భారత ప్రభుత్వం  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని  8 సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలో 415  విడివికెలను గిరిజన సహకార సంస్థ ద్వారా ఏర్పాటు చేసింది, గిరిజన మహిళా సమూహాల జీవనోపాధి, ఆదాయ ఉత్పత్తి కోసం కనీస అటవీ ఉత్పత్తుల విలువ జోడింపు, మార్కెటింగ్ దిశగా రూ.36.04 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది.

కాఫీ తోటల పునరుజ్జీవనం/అభివృద్ధి

గిరిజన రైతుల జీవనోపాధి, ఆదాయ స్థాయిలను కాఫీ తోటల ద్వారా మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఐ.టి.డి.ఏ, పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ అభివృద్ధి కోసం సమగ్ర ప్రాజెక్ట్ ను రూ.526.16 కోట్లను మంజూరు చేసింది. ప్రాజెక్ట్ పదవీ కాలం :2015-16 నుండి 2025-26 వరకు (పది సంవత్సరాలు)

లక్ష ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 65,000 ఎకరాలలో ప్లాంటేషన్ పూర్తి అయినది.

కాఫీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద రూ.5.00 కోట్లు (కాంపోజిట్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నుండి రూ.3.00 కోట్లు & కాఫీ పెంపకందారులకు మార్కెటింగ్ మద్దతు కోసం రూ.2.00 కోట్లు 2023-24కి కేటాయించబడ్డాయి, ఈ మొత్తాన్ని  కాఫీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అమలు కోసం వెచ్చించవలెను.

గిరిజన కాఫీకి అత్యధిక ధర చెల్లింపు

ప్రస్తుత సీజన్‌లో గిరిజన రైతులు పండించిన కాఫీను జిసిసి  ఎన్నడూలేని విధముగా  పార్చ్మెంట్ కాఫీకి కిలోకు రూ. 285/-, చెర్రీ కాఫీకి కిలోకు రూ.145/- మార్కెట్ ధరగా ప్రకటించుట ద్వారా మధ్యవర్తుల దోపిడీని నిరోధించడమే కాకుండా వారి జీవనోపాధికి తగిన ఆదాయాన్ని అందించడానికి దోహదపడుతుంది.

2022-23 కాఫీ సీజనులో 480.11 MTs అరబిక పార్చ్మెంట్, 516.08 MTs అరబిక చెర్రీ కాఫీని కొనుగోలు చేసి గిరిజన కాఫీ రైతులకు రూ.20.07 కోట్లు చెల్లించారు

కనీస అటవీ ఉత్పత్తుల కొనుగోలు ధరల పెంపు

జిసిసి ప్రస్తుత సంవత్సరంలో గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తుల కోసం కొనుగోలు ధరలను పెంచింది. ఇది వారి ఆదాయాన్ని పెంచడంతో పాటు వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుంది

.

క్ర.సంఖ్య

కొనుగోలు వస్తువు కొనుగోలు ధర  (రూ. కేజీ కి)
పాత ధర పెంచిన ధర
1 తేనె 170.00 200.00
2 కుంకుడుకాయలు  30.00 50.00
3 ముషిడి గింజలు 55.00 60.00
4 కరక్కాయలు 12.00 18.00
5 మారేడుగడ్డలు 400.00 500.00
6 ఉసిరి పప్పు 60.00 80.00
7 నల్లజీడి పిక్కలు   12.00 18.00
8 రాజమా (ఎరుపు) 70.00 75.00
9 రాజమా (తెలుపు) 80.00 90.00

 కాఫీ ఆర్గానిక్ సర్టిఫికేషన్

చింతపల్లి మండలానికి చెందిన 1300 మంది రైతులకు 884.55 హెక్టార్లలో పండించిన కాఫీకి జిసిసి సేంద్రీయ ధ్రువీకరణ, జి.కె.వీధి మండలానికి చెందిన 1374 హెక్టార్లలో పండించిన 1300 కాఫీకి 3వ సంవత్సరం స్కోప్ సర్టిఫికేషన్‌ను అందించింది. ఈ 2600 మంది గిరిజన కాఫీ రైతులకు వారి ఆర్గానిక్ కాఫీకి మెరుగైన అమ్మకాలను పొందేందుకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ సంవత్సరములో జి.సి.సి. గిరిజన రైతులనుండి కొనుగోలు చేసిన కాఫీని విదేశాలకు ఎగుమతి చేసే ప్రయత్నాలు చేస్తోంది.

జిసిసి సహజ ఉత్పత్తులు

గిరిజన్ తేనె

గిరిజన్ తేనె

ఆంధ్ర ప్రదేశ్ అడవుల నుంచి సేకరించే రాక్ బీ ముడి తేనె సేకరణపై ఆధారపడిన గిరిజన కుటుంబాలు చాలా ఉన్నాయి. ప్రతి సంవత్సరం జిసిసి 180 నుండి 200 మెట్రిక్ టన్నుల రాక్ బీ ముడి తేనెను గిరిజనుల నుంచి సేకరిస్తుంది. ఈ తేనెను గిరిజన్ తేనె అనే బ్రాండ్ పేరుతో జిసిసి వివిధ సైజుల్లో విక్రయిస్తుంది. తేనె శుద్ధి, ప్యాకింగ్ కొరకు జిసిసికి రాజమండ్రి, చిత్తూరులో ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. అగ్ మార్క్, ఆర్గానిక్ గుర్తింపు పొందిన గిరిజన్ తేనే పోషక, ఔషద విలువలు కలిగినది. దగ్గు, జలుబు, జ్వరం మొ॥ వాటి నుండి రక్షించడంతో పాటు రక్తశుద్ధికి, గాయాలు మాన్పడానికి తోడ్పడుతుంది. ఇంకా ఎన్నో రకాల ఆయుర్వేద మందులలో వినియోగింపబడుతుంది. గిరిజన్ తేనే 5 కేజీలు, 1 కేజీ, 500గ్రా॥లు, 250 గ్రా॥లు 200 గ్రా॥లు, 50 గ్రా॥లు, 20 గ్రా॥లు సీసాల్లో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. జిసిసి తమ పంపిణీదార్లు, విక్రయశాలల ద్వారా దేశవ్యాప్తంగా విక్రయిస్తుంది.


అరకువ్యాలీ కాఫీ

అరకువ్యాలీ కాఫీ

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు వేలాది ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్నారు. గిరిజనుల నుంచి కాఫీ గింజలను జిసిసి కొనుగోలు చేసి మార్కెట్లో గింజలు గాను, కాఫీ పొడి రూపంలోనూ విక్రయిస్తుంది. గిరిజనులు కాఫీని సేంద్రీయ పద్ధతుల్లో పండించడానికి తోడు ఇక్కడి మట్టి లక్షణాలతో కాఫీ మంచి సువాసన, రుచి కలిగి వుంటుంది. ఈ ప్రాంతంలో పండే అరబికా కాఫీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాఫీ సాగు పర్యావరణ పరిరక్షణ, సమతుల్యతతో పాటు గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది

జిసిసి ఫిల్టర్ కాఫీని అరకు వ్యాలీ & వైశాఖి ఫిల్టర్ కాఫీ బ్రాండ్ పేరుతో నాలుగు రకాలలో ప్రాసెస్ చేసి వివిధ సైజులలో డబ్బాలు, ప్యాకెట్లలో మార్కెటింగ్ చేస్తుంది. ఇంకా జిసిసి అరబికా హాట్ పేరుతొ ప్రత్యేకంగా విశాఖ, హైదరాబాదు నగరాలతో పాటు రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో కాఫీ షాపులను నడుపుతుంది. గిరిజనుల నుంచి కొనుగోలు చేస్తున్న కాఫీ గింజలు, మిరియాలకు భారత వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (అపెడా) 2023 మేలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ మంజూరు చేసింది.

త్రిఫల చూర్ణం

ఉసిరి కాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమంతో జిసిసి త్రిఫల చూర్ణం తయారు చేస్తారు. చలువచేసే గుణం ఉసిరి సొంతం. మలబద్ధకాన్ని పోగొడుతుంది. కరక్కాయ కాలేయ లోపాలను సరిదిద్దుతుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. తానికాయ ఆస్తమా చికిత్సకు ఉపకరిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. త్రిఫలచూర్ణమును త్రిదోష రసాయనంగా పరిగణిస్తారు.

మూలాలు

  1. గిరిజన సహకార సంస్థ అధికారిక వెబ్ సైట్ Archived 2019-03-26 at the Wayback Machine
  2. గిరిజన సహకార సంస్థ ఉత్పత్తుల ఆన్ లైన్ విక్రయాల వెబ్ సైట్
  3. జీసీసీని లాభాల బాట పట్టిస్తా: ఎండీ సురేష్‌
  4. కాఫీకి అంతర్జాతీయ ధర కంటే ఎక్కువ చెల్లిస్తోన్న జిసిసి Archived 2023-02-03 at the Wayback Machine