గుంటర్ గ్రాస్

జర్మన్ నవల కారుడు ,కవి ,మొదలైనవి
(గుంటర్‌ గ్రాస్‌ నుండి దారిమార్పు చెందింది)

గుంటర్‌ గ్రాస్‌, మాజిక్‌ రియలిజం అనే సాహితీ ప్రక్రియను తన నవల ‘టిన్‌ డ్రం’ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన ప్రఖ్యాత రచయిత. గ్రాస్‌ మొదటి నవల ‘టిన్‌ డ్రం’ 1959లో అచ్చయింది. తీవ్రమైన విమర్శలు, ప్రతిఘటనలు, నవలను తగులబెట్టడాలు అయ్యాక కూడా అది అద్భుతంగా అమ్ముడుపోయింది. ఒక్కరోజులో గ్రాస్‌ గొప్ప రచయితగా అవతరించాడు. మాజిక్‌ రియలిజం అనే లాటిన్‌ అమెరికన్‌ సాహితీ ప్రక్రియను తన నవలలో ఉపయోగించడమే కాకుండా ఆ ప్రక్రియకు సరైన న్యాయం చేసేట్లుగా కథను మలచుకున్నాడు. మాజిక్‌ రియలిజాన్ని లాటిన్‌ అమెరికా తర్వాత మొద టగా ప్రయోగించి ఎంతో మంది రచయితలకు ప్రేరణగా నిలిచాడు. ఈ నవల 20వ శతాబ్దపు మొదటి యాభై సంవత్సరాల జర్మన్‌చరిత్రతో పాటు రెండవ ప్రపంచయుద్ధ పోకడల్ని, దేశాల మధ్య చెలరేగిన ద్వేషాలు, వైషమ్యాలు, జరిగిన మారణకాండ, విధ్వంసం, వినాశనం, అమానుషత్వాలను కళ్ళకు కట్టినట్లు వివరించింది. నాజీల దురాగతాలకు ఎన్నో దశాబ్దాల వరకు జర్మన్లు నైతిక బాధ్యత వహించాలని గ్రాస్‌ తన రచనల్లో హెచ్చరించాడు. అచ్చయిన 40 ఏళ్ల తర్వాత ఈ నవలకు నోబెల్‌ పురస్కారం అందింది. ‘‘సరదా సరదాగా ఉండేలా అనిపించినప్పటికీ వాస్తవం, కల్పన మిళితమైన ఈ కుటుంబ కథ జర్మన్ల గతించిన చీకటి చరిత్రగా రాయబడింది’’ అని స్వీడిష్‌ అకాడమీ పేర్కొంది.

గుంటర్‌ గ్రాస్‌
2006 లో గుంటర్‌ గ్రాస్‌
పుట్టిన తేదీ, స్థలంగుంటర్‌ విల్ హెల్మ్ గ్రాస్‌[1]
డాన్జింగ్‌,
డాన్జింగ్‌
మరణంల్యూబెక్, జర్మనీ
వృత్తినవలా రచయిత, కవి, నాటక రచయిత, శిల్పి, గ్రాఫిక్ డిజైనర్
భాషజర్మన్
కాలం1956–2013
సాహిత్య ఉద్యమంVergangenheitsbewältigung
గుర్తింపునిచ్చిన రచనలుది టిన్‌ డ్రం (1959)
క్యాట్‌ అండ్‌ మౌస్‌ (1961)
డాగ్‌ ఇయర్స్‌ (1963)
క్రాబ్ వాక్ (2002)
వాట్ మస్ట్ బి సెడ్ (2012)
పురస్కారాలుజార్జ్ బుచ్నెర్ బహుమతి
1965
సాహిత్యం లో రాయల్ సొసయిటీ సభ్యత్వం
1993
నోబెల్ బహుమతి
1999
ప్రిన్స్ ఆఫ్ ఆస్ట్రియా బహుమతి
1999

సంతకం

బాల్యం

మార్చు

గ్రాస్‌ జర్మనీ ఆక్రమిత ప్రాంతంలోని డాన్జింగ్‌ అనే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పట్టణంలో (ఇప్పుడది గ్దాన్స్క్గా- పోలాండ్‌లో వుంది) 1927లో జన్మించారు. తండ్రి విల్‌ హెల్మ్‌ జర్మన్‌ దేశస్థుడు, తల్లి హెలెన్‌ పోలండ్‌ దేశస్తురాలు. చిల్లరకొట్టు నడుపుకుంటూ బతికేది గ్రాస్‌ కుటుంబం. అతను తన పదహారవ ఏట ఎడాల్ఫ్ హిట్లర్ సైన్యంలో భాగంగా ఉండే ‘వాఫన్‌-ఎ్‌స.ఎస్‌’ అనే సైనిక విభాగంలో ట్యాంక్‌ గన్నర్‌ ట్రైనీగా పనిచేస్తున్నప్పుడే గాయపడి అమెరికన్‌ సైనికులకు బందీగా చిక్కి, రెండవ ప్రపం చయుద్ధం తర్వాత విడుదల అయ్యాడు. ఈ విషయం 2006లో అతని ఆత్మకథ ‘పీలింగ్‌ ద ఆనియన్‌’ పుస్తకం విడుదల అయ్యేవరకు ప్రపంచానికి తెలియదు.

చదువు

మార్చు

గ్రాస్‌, డాంజింగ్ జిమ్నాజియం కార్నాడినం లో పాఠశాల విద్యని అభ్యసించి కొంతకాలం వైమానిక సహాయకుడిగా ఉండి తర్వాత శిల్పకళ, గ్రాఫిక్ డెజైనింగ్ కూడా నేర్చుకున్నాడు.

రచనలు

మార్చు

గాయం నుండి బాధ, బాధనుండి ఆందోళన, ఆక్రోశం- వీటినుండి ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితి నుండి గ్రాస్‌ లోని రచయిత మేల్కొన్నాడు. ఇదే అతన్ని ‘టిన్‌ డ్రం’ లాంటి నవల రాసేట్టు చేసింది. జర్మన్‌ చీకటి రక్తచరిత్రను అనేక కోణాల్లో నీలం రంగు సిరాతో ఆయన రాస్తే నలుపు రంగు అక్షరాలతో పుస్తకం అచ్చయింది. నిజానికి రంగు మారినా ప్రతి అక్షరం లో ఎర్రటి రక్తమే పాఠకుడికి కనపడుతుంది. తర్వాత అతని నవల ‘క్యాట్‌ అండ్‌ మౌస్‌’ 1961లో వచ్చింది, 1963లో వచ్చిన ‘డాగ్‌ ఇయర్స్‌’ కూడా ‘టిన్‌ డ్రం’ లాగే గతించిన జర్మన్‌ చీకటి రోజుల్ని, రెండవ ప్రపంచయుద్ధంలో ప్రపంచ సానుభూతి అంతా యూదుల పట్ల, మిత్ర మండలి పట్ల వున్నప్పుడు, రష్యన్‌ సబ్‌ మెరైన్‌ జర్మన్లు ప్రయాణిస్తున్న ఓడను ముంచేయడం గురించి రాసిన నవల ఇది. దీన్ని ‘టిన్‌ డ్రం’ కొనసాగింపుగా అనుకోవచ్చు. ‘డాన్జింగ్‌ త్రయంగా’ చెప్పబడే ఈ మూడు నవలలు విస్తుల నది ప్రవాహక ప్రాంతంతో ముడిపడివుంటాయి. అంతే కాకుండా అనేక జాతుల మధ్య విభేదాలు, అనేక జాతుల, సంస్కృతుల చరిత్రల గురించి అద్భుతమైన భాషా ప్రయోగంతో ఉత్తేజకరంగా గ్రాస్‌ నవలలు రాయబడ్డాయి.


గ్రాస్‌ పసితనంలో ఎదుర్కొన్న బాధాకరమైన అనుభవాల సారాన్ని, తగిలిన గాయాల్ని తన రచనల్లో తన రాజకీయ ఉపన్యాసాలలో పొందుపరిచాడు. తన తప్పుల్ని మరిచిన జర్మనీ ప్రవర్తనను ‘తృప్తి తో కట్టుకున్న అందమైన సమాధి’గా అభివర్ణించాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ పునర్నిర్మాణం అమెరికా సహాయంతో జరిగింది. దాంతో జర్మనీ తాను గతంలో చేసిన అరాచకాల్ని, జరిగిన నష్టాన్నికూడా మరిచింది. ఇదే సమయంలో ‘టిన్‌ డ్రం’ పిడుగులా వచ్చింది. గ్రాస్‌ తన తోటి రచయితలకు, దేశభక్తులకు జర్మనీ గత చరిత్రతో భావితరం సిగ్గు పడనీయకుండా బాధ్యతాయుతంగా దేశాన్ని అభివృద్ధి చేయాలని పిలుపు నిచ్చాడు.


గ్రాస్‌ తన రచనలతో దశాబ్దాల పాటు నిర్వీర్యమైపోయి, నైతికంగా పతనమైన జర్మన్‌ సాహిత్యానికి ఒక కొత్త ఊపిరిని పోశాడు. ‘టిన్‌ డ్రం’ నవలతో ప్రపంచం మరిచిపోయిన జర్మనీ చరిత్రను ప్రపంచపటం మీదికి తెచ్చాడు. గ్రాస్‌ వాడే తీక్షణమైన, విమర్శతో కూడుకున్న జర్మన్‌ జానపదాలు, ఊహాత్మక చిత్రణలు, చిత్రీకరణలు నాజీల అవాస్తవ, పతనావస్థలో వున్న లోపభూయిష్టమైన సిద్ధాంతాల్ని ఎండగట్టాయి. ఆ నవలలో సర్వత్రా తానై వుండి విచిత్ర వ్యక్తిత్వం, అత్మసంస్కారం కొరవడిన ఆస్కార్‌ పాత్ర చిత్రణ సమకాలీన ఆధునిక సాహిత్యంలో ఒక గొప్ప వొరవడిగా, నూతన ఆవిష్కరణగా పేరుగాంచింది. మూడు అడుగుల కంటే ఎక్కువ పెరగ కూడదనే ఆస్కార్‌ నిర్ణయం తిరుగులేనిది. ఎందుకంటే దారుణమైన పరిస్థితుల్ని చూసి పెరగడం ఎందుకనే అతని వాదన ‘‘ఎప్పటికీ మూడేళ్ళ వాడిగా వుండే టిన్‌ డ్రమ్మర్‌’’ (eternal three year old drummer) గా ఉంచేసింది. ఆస్కార్‌లోని అసహజమైన గుణాలు నాజీలు చేసే అరాచకాల్ని వివరించడానికి గ్రాస్‌ కు ఉపయోగపడ్డాయి. పాఠకులు ఆస్కార్‌ను నాజీల క్రూరత్వానికి ప్రతీకగా భావిస్తారు. చివరికి ఆస్కార్‌ ఒక సంక్లిష్టమైన, చిత్ర విచిత్ర లక్షణాలతో వుండి నాజీ పార్టీ అరాచకాలకు సంకేతంగా ఉంటూనే, దాని నాశనానికి పుట్టిన పాత్రగా మనం గుర్తిస్తాము. భారతంలో శకుని పాత్ర ఎలా కురువంశ నాశనానికి కారణమవుతుందో అలా ఆస్కార్‌ జర్మన్‌ హిట్లర్‌-నాజీల పతనానికి కారకుడవుతాడు. ఆస్కార్‌ తన ముప్పైవ ఏట బందీగా చేయబడి తర్వాత పిచ్చాసుపత్రికి పోతాడు. నవల చివర్లో ఆస్కార్‌ తన జీవితం గురించి చెప్పేనిరాశ, నిర్వేదంతో కూడుకున్న మాటలన్నీ 1950 లలో జర్మనీ పరిస్థితిని తెలుపుతాయి.


తన ‘మిడ్నైట్‌ చిల్డ్రన్‌’తో విశ్వవిఖ్యాత రచయితగా ఎదిగిన సల్మాన్ రష్దీ తన నవలకి ‘టిన్‌ డ్రం’ ప్రేరణ అనీ, గ్రాస్‌ తనను ఎంతో ప్రభావితం చేసిన రచయిత అని వివరించాడు. గ్రాస్‌ రష్దీకి మంచి స్నేహితుడయ్యాడు. ‘సెటానిక్‌ వెర్సెస్‌’ తర్వాత ఇరాన్‌ మతపెద్ద ఆయతుల్లా ఖుమేని రష్దీకి మరణశిక్ష ప్రకటించినప్పుడు స్వేచ్ఛను ప్రేమించే గ్రాస్‌ సల్మాన్‌ రష్దీని సమర్థించి రచయితలకు తమ అభిప్రాయాల్ని వ్యక్తపర్చే స్వేచ్ఛ వుందని ఎలుగెత్తి చాటారు.

గ్రాస్‌ మన కాలానికి చెందిన ఒక గొప్ప కవి, రచయిత, సామాజిక తత్వవేత్త. అతని నవలలు, కథలు, నాటకాలు, కవితలు, అనేక సాహితీ ప్రక్రియలు అతని గొప్ప రచయితగా నిలబెట్టాయి. అతడు ఘనాపాటి, మేధావి, సున్నిత మనస్కుడు. వీటన్నిటికంటే ముందు గొప్ప మానవతావాది. రచయితగానే కాకుండా శిల్పిగా, కవిగా, నాటకకర్తగా,వ్యాసకర్తగా, గ్రాఫిక్‌ కళాకారుడిగా... చివరకు రాజకీయాల్లోనూ తన ప్రతిభ చాటాడు. ‘ప్రపంచం చూడని కోణంలో జర్మన్‌ చరిత్రను తన మనోనేత్రంతో చూడగలిగిన గొప్ప దార్శనికుడు గ్రాస్‌’ అని వాషింగ్టన్‌ పోస్ట్‌ శ్లాఘించింది. అతను నాజీకాలం నాటి తరం ప్రజల స్వరం. యువతరానికి ఉత్తేజకర్త. గొప్ప బోధకుడు. ‘‘రచయితలు తమ ఊపిరితో ప్రజలకు కృత్రిమ శ్వాసని అందించి మానవత్వాన్ని ప్రపంచంలో సజీవంగా ఉంచాలని’’ గ్రాస్‌ ఒకచోట అంటారు.

మ్యాజిక్‌ రియలిజం

మార్చు

1920లో యూర్‌పలో ఫ్రాంజ్‌ రొహ్‌ అనే కళా చరిత్రకారుడు ఇటాలియన్‌ పత్రిక ‘‘నోవోసేంటో’’లో తన వ్యాసంలో కళల్లో ఉండాల్సిన వాస్తవికత గురించి చెబుతూ ‘మ్యాజిక్‌ రియలిజం’ పదాన్ని వాడాడు. 1949లో అలిజో కార్పెంటియర్‌ అనే క్యూబా రచయిత మొదటిసారిగా మ్యాజిక్‌ రియలిజాన్ని సాహిత్యంలో వాడారు. మ్యాజిక్‌ రియలిజం రచనల్లో సామాన్యమైన విషయాలకు కల్పన జోడించినా అసహజంగా అనిపించదు. ఇది ఒక దేశం లేక ప్రాంత చరిత్ర, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాం స్కృతిక పరిస్థితులను కథతో మమేకం చేస్తుంది. ఈ ప్రక్రియ సంక్లిష్ట రాజకీయ, ఆర్థిక, కల్లోల పరిస్థితులు వున్న ప్రాంతాల్లోనే ఎక్కువ ఆదరణ పొందింది. యుద్ధ మేఘాలు కమ్మిన ప్రాంతాల్లోను, వలస నుండి విముక్తులైన దేశాల్లోను, ఒక దేశంలోని ప్రజల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, మత పరిస్థితులు హీనపర్చబడినప్పుడు, అవమానానికి గురైనప్పుడు, అన్ని రకాలుగా దెబ్బతిన్న ప్రాంతాలలోను మ్యాజిక్‌ రియలిజం నేపథ్యం గల రచనలు చాలా ఆదరణ పొందాయి.

వ్యక్తిగత జీవితం

మార్చు

మేధావిగా కంటే సామాన్య పౌరునిగా వుండాలని కోరుకునే అతి కొద్ది మంది జర్మన్‌ రచయితలలో గ్రాస్‌ ఒకరు. 87 ఏళ్ల వయసులో కూడా ఆయన చాలా చలాకీగా ప్రజల్లోకి వెళ్ళేవారు. మరణించే కొద్దికాలం ముందు కూడా ఆయన విస్తృతంగా ప్రజల మధ్య ఉన్నారు.

గుంటర్‌ గ్రాస్‌ 87 ఏట ఏప్రిల్‌ 13, 2015న జర్మనీలోని ల్యుబెక్‌ పట్టణంలో కన్నుమూశారు. రెండవ ప్రపంచ యుద్ధసమయంలోనూ, ఆ తర్వాత జర్మనీ పరిస్థితిని తన నవలల్లో నిర్భయంగా చాటిన ఈ నోబెల్‌ విజేత, మార్చి 28వ తేదీన ‘‘టిన్‌ డ్రం’’ ఆధారంగా ప్రదర్శించబడుతున్న నాటకం ప్రీమియర్‌షోను కుటుంబసభ్యులతో చూసి ఆనందించిన అనంతరం ఇక ప్రపంచానికి కనపడలేదు.

మూలాలు

మార్చు
  1. "Zunge heraus". Der Spiegel. 4 September 1963. (...) wurde Günter Wilhelm Graß am 16. Oktober 1927 geboren.
  2. "Günter Grass nie żyje. Noblista miał 87 lat". Gazeta Wyborcza. 13 April 2015. Retrieved 13 April 2014. Pytany o tożsamość narodową, mówił, że jest Kaszubą. (Asking about his ethnicity, he always said that he's Kashubian)
  3. "Porträt: Der unbequeme Nationaldichter". Focus. 13 April 2015. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 13 April 2014. Aber wenige haben auch soviel einstecken müssen wie der Kaschube aus Danzig. (But, just few people had to take flak like the mustachioed Kashubian from Gdansk)

ఆంధ్రజ్యోతి[permanent dead link]