గుడిగంటలు

(గుడి గంటలు నుండి దారిమార్పు చెందింది)

గుడిగంటలు 1964లో వి.మధుసూదన రావు దర్శకత్వంలో, ఎన్టీ రామారావు, కృష్ణకుమారి, జగ్గయ్య ప్రధాన పాత్రధారులుగా నిర్మితమైన మెలోడ్రామా ప్రధానమైన తెలుగు చలనచిత్రం. తమిళచిత్రం ఆలయమణి (శివాజీ గణేశన్) ఆధారంగా నిర్మించబడింది. (హిందీలో ఆద్మీ (దిలీప్ కుమార్) గా తీశారు) .

గుడిగంటలు
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదన రావు
తారాగణం నందమూరి తారక రామారావు,
కృష్ణకుమారి,
జగ్గయ్య,
మిక్కిలినేని,
నాగయ్య,
వాసంతి
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1964 వ సంవత్సరానికి గాను ఈ చిత్రానికి తృతీయ ఉత్తమ చిత్రంగా కాంస్య నంది అవార్డు ప్రకటించింది.

చిత్రకథ మార్చు

ఎన్.టి.ఆర్ శ్రీమంతుడు. జగ్గయ్య అతని స్నేహితుడు. తన ఎస్టేటులో పనిచేసే వ్యక్తి కూతురు కృష్ణకుమారి. ఎస్టేటుకు వచ్చిన రామారావు కృష్ణకుమారిని చూసి ఇష్టపడతాడు. ఐతే జగ్గయ్య, కృష్ణకుమారి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. స్నేహితులిద్దరూ తమ ప్రేమకథలు చెప్పుకుంటారు కాని ఇద్దరి ప్రేయసి ఒకరే అని వారికి తెలియదు. చిత్రంలో రామారావు, జగ్గయ్యలు ప్రేమగురించి చర్చించే సన్నివేశంలో గోడమీద ఉన్న పెయింటింగులో రెండు పులుల మధ్య ఒక లేడి బొమ్మ ఉంటుంది. చిత్రకథను ఇది సింబాలిక్ గా చూపుతుంది. ఒక ప్రమాదంలో రామారావు కాళ్ళు దెబ్బతింటాయి. కృష్ణకుమారి, రామారావుకు పరిచర్యలు చేస్తుంది. కృష్ణకుమారి పట్ల జగ్గయ్య ఇష్టాన్ని రామారావు గమనిస్తాడు. తను స్వంతం అనుకున్న వస్తువులు వేరే వారు కోరితే భరింపలేని మనస్తత్వం రామారావుకు చిన్నప్పటి నుండి ఉంది. చిన్నతనంలో తనకిష్టమైన బొమ్మను తీసుకున్నస్నేహితుడు ఊబిలో పడిపోయి మరణిస్తునా రక్షించకుండా ఆనందం పొందుతుంటాడు. అదే సంఘటన అతడ్ని వెంటాడుతుంది. అదే మనస్తత్వంతో తన కిష్టమైన కృష్ణకుమారిని అభిలషించే జగ్గయ్యను చంపేయాలనుకుంటాడు. తనకు ఇష్టమైన సముద్రపు ఒడ్డున ఉన్న శిఖరం మీద నుండి జగ్గయ్యను తోసి చంపాలని ప్లాను వేసుకుంటాడు. ఐతే నిజం తెలుసుకుని తానే అక్కడినుండి సముద్రంలో దూకేస్తాడు. వేరే వ్యక్తి సాయంతో బ్రతికి సత్యదర్శనం పొంది అనేక భావావేశాల నుండి విముక్తుడౌతాడు.

నిర్మాణం మార్చు

అభివృద్ధి మార్చు

తమిళంలో శివాజీ గణేశన్, ఎస్.ఎస్.రాజేంద్రన్, బి.సరోజా దేవి ముఖ్యతారాగణంగా తెరకెక్కిన భారీ నాటకీయ చలనచిత్రం ఆలయమణి. ఉద్వేగభరితుడు, అసూయగ్రస్తుడు అయిన వ్యక్తి, అతని వల్ల కల్లోలపడిన అతని స్నేహితుల ప్రేమ ఇందులో ప్రధాన కథాంశం. సినిమా తమిళనాట మంచి విజయాన్ని సాధించింది.[1]

చిత్రీకరణ మార్చు

గుడిగంటలు క్లైమాక్స్ భాగాలను కేరళ తీరంలోని వర్కెలా వద్ద తీశారు. అక్కడి సముద్రపు గట్టు కొండపక్కన వందలాది అడుగుల పాటు కోసినట్టుగా ఉంటుంది. ఈ స్పాట్లో క్లైమాక్సుకు సంబంధించిన ఉద్వేగభరితమైన, నాటకీయమైన సన్నివేశాలు, పాట తీశారు.[1]

చిత్ర ప్రత్యేకతలు మార్చు

ఏ భాషలోనైనా మానసిక విశ్లేషణతో కూడిన చిత్రాలు తక్కువగా వస్తాయి. తెలుగులో మరీ తక్కువ వచ్చాయి. గుడిగంటలు, ఆత్మబలం, కృష్ణవేణి మొదలైన చిత్రాలు ఆ కోవకు వస్తాయి. సినిమాలలో మంచివారు (హీరో మున్నగువారు), చెడ్డవాళ్ళు (విలన్ వైపు) గా రెండు గ్రూపులుగా కనిపిస్తారు. ఒక్క మనిషిలోనే కలిసుండే మంచి చెడును చూపించే చిత్రం గుడిగంటలు. వస్తువు, మనిషి పట్ల ఓవర్ పొజెసివ్ నెస్, కొంత శాడిజం, అసూయ, కొన్నిసమయాలలో కరుణ, ప్రేమ విటన్నిటిని కలిగి ఉన్న మనిషిగా రామారావు పాత్ర రూపొందింది. తొలుత పాత్రకు, పరివర్తన చెందిన పాత్రకు మధ్య వైవిధ్యం కూడా గొప్పగా ప్రదర్శితమయ్యింది. 'జన్మ మెత్తిరా అనుభవించితిరా పాట ', సాహితీ పరంగా, సంగీతపరంగా, చిత్రీకరణ పరంగా, అభినయ పరంగా తెలుచు చిత్రగీతాలలో అత్యుత్తమ గీతాలలో ఒకటిగా చెప్పవచ్చు. అనెక వైరుధ్యాలున్న కథానాయకుడిలో కళాకారుడ్ని (చిత్రకారుడిగా) చూపడం, పాత్ర రూపకల్పనలో చూపిన శ్రధ్ధను తెలియజేస్తుంది. రామారావు నటనలో కొన్ని సార్లు మాతృకలోని శివాజీ నటనను గమనించగలం. (జగ్గయ్య, కృష్ణకుమారి మేడపై నుండి దిగుతున్నపుడు చూడటాన్ని రామారావు కోపంతో గమనించడం, రామారావుతో అతని అంతరాత్మ మాట్లాడుతున్నపుడు)

పాటలు మార్చు

పాట రచయిత సంగీతం గాయకులు
ఎవరికి వారౌ స్వార్ధంలో హృదయాలరుదౌ లోకంలో నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే ఆత్రేయ ఘంటసాల ఘంటసాల
జన్మమెత్తితిరా...అనుభవించితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా మంచి తెలిసి మానవుడుగా మారినానురా అనిసెట్టి ఘంటసాల ఘంటసాల
దూరాన నీలిమేఘాలు నాలోన కొత్త భావాలు పూచేను కోటి మురిపాలు తొంగి చూసేను కన్నె సరదాలు ఆత్రేయ ఘంటసాల పి.సుశీల
నీలోన నన్నే నిలిపేవు నేడే ఏ శిల్పి కల్పనవో ఏ కవి భావనవో శ్రీశ్రీ ఘంటసాల ఘంటసాల, పి.సుశీల
  • నరుల జీవితపధమున నడుపవాడు కాళ్లులేని (సాఖి) - ఘంటసాల
  • నీ కనుదోయిన నిద్దురనై మనసున పూచే శాంతినై - ఎస్. జానకి
  • నీలికన్నుల నీడలలోన దోరవలపుల దారులలోన కరగిపోయే - సుశీల, పి.బి. శ్రీనివాస్

వనరులు మార్చు

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు సంకలనం చేసిన ఘంటసాల 'పాట'శాల, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006

మూలాలు మార్చు

  1. 1.0 1.1 ముళ్ళపూడి, వెంకటరమణ (జూలై 2013). (ఇం)కోతి కొమ్మచ్చి (6 ed.). హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి.