గోదావరి కథలు
గోదావరి కథలు పుస్తకాన్ని బి.వి.ఎస్.రామారావు వ్రాశారు. ఈ పుస్తకం గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల చుట్టూ అల్లుకున్న కథల సంకలనం.
రచన నేపథ్యం
మార్చు1980 ప్రాంతాల్లో వివిధ తెలుగు వార, మాస పత్రికల్లో బి.వి.ఎస్.రామారావు వ్రాసిన పలు కథలను ఈ సంకలనంగా ప్రచురించారు. పోలవరం, భద్రాచలం నుంచి గోదావరి పాయలు సముద్రంలో కలిసేవరకూ ఉన్న వివిధ ప్రాంతాలలో నదితో జీవితాన్ని పెనవేసుకున్న వారి జీవితాలను ఈ కథల్లో చిత్రీకరించారు. అన్ని కథలకూ గోదావరి నది నేపథ్యంగా అమరడం, రచయితకు గోదావరి పట్ల అభిమానం ఉండడం వంటి కారణాలతో సంకలనానికి గోదావరి కథలు అని పేరుపెట్టారు. సుప్రసిద్ధ చిత్రకారుడు, దర్శకుడు బాపు ఈ కథలకు బొమ్మలు వేశారు. చాలా కథలకు బాపు రెండు, మూడు బొమ్మలు వేయడంతో వాటన్నిటినీ చేర్చి మరీ ప్రచురించారు. ఈ కథాసంకలనాన్ని అక్టోబరు, 2012లో ఎమెస్కో బుక్స్ ప్రచురణ సంస్థ ప్రచురించింది. రామారావు తనకు ఆప్తమిత్రులు, దర్శక నిర్మాతలుగా, చిత్రకార రచయితలుగా సుప్రసిద్ధులైన ద్వయం బాపు-రమణలకు గోదారితల్లిని ఆటలతో పాటలతో అర్చించిన పాగోజీ బాపు తూగోజీ రమణలకు మూడో పూజారి సీతారాముడు ఇస్తున్న తీర్థప్రసాదాలు ఈ గోదావరి కథలు అంటూ అంకితం చేశారు. ఈ పుస్తకానికి ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ, సుప్రసిద్ధ కథకుడు, సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్యశర్మ ముందుమాటలు వ్రాశారు.
ఇతివృత్తాలు
మార్చుగుండెల్లో గోదావరితో ప్రారంభించి ఆవకాయ కథతో ముగిసిన ఈ సంకలనంలో మొత్తం 11కథలు ఉన్నాయి. గుండెల్లో గోదావరి కథ వరద బీభత్సం నేపథ్యంగా సాగుతుంది. మధ్యలో పెళ్ళి, ఆపై పెళ్ళికొడుకు, పెళ్ళికూతురులకు పరస్పరం అపనమ్మకం కలుగుతుంది. దాంతో వారిద్దరూ పెళ్ళినాడే పూర్వం తాము లైంగికంగా ఎదుర్కొన్న ఎదురుదెబ్బలు చెప్పుకోవడం వైపుకు సాగుతుంది. త్రిలోక సుందరి గోదావరి వాసుల చైతన్యంతో ముడిపడ్డ కథ. కూనవరం సంతకు వెళ్ళిరావడానికి త్రిలోక సుందరి అనే లాంచి ఏకైక తరుణోపాయం. ఈ కథలో లాంచి యజమాని దృక్పథం మానవ విలువలకు చోటులేని దోపిడీ తత్త్వం. డాక్టర్ అవధాని ప్రజల మనిషి. గాంధేయవాది. హింస రేపే ప్రతిహింస సమర్థనీయమా కాదా అనే అంశం ఈ కథలో ప్రధానాంశం. అద్దరి-ఇద్దరి మనిషి ఎంత ఎత్తుకు ఎదగగలడో ఎంత, లోతుకు జారగలడో చూపే కథ. ఒకపక్క ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి నీచప్రవర్తన, పేదవాడి ఉన్నత వ్యక్తిత్వ ప్రదర్శన ఈ కథలో కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ధోరణిలో చూపారు కథకుడు. పురాణం సుబ్రహ్మణ్యశర్మ ఈ కథను ఈ సంపుటిలోకెల్లా తలమానికం అనదగ్గ కథ అని ప్రశంసించారు. బైరాగి కథలో గోదావరి ఒడ్డున నావ సంస్కృతిని అద్దం పట్టారు రచయిత.