గోన బుద్ధారెడ్డి
గోన బుద్ధారెడ్డి ఒక తెలుగు కవి. పదమూడవ శతాబ్దమునకు చెందిన ఇతను కాకతీయుల సామంతరాజుగా పనిచేశాడు. కందూర్ రాజధానిగా పాలిస్తూ తన తండ్రి పేర రంగనాథ రామాయణము గ్రంథాన్ని రచించాడు. ఇది పూర్తిగా ద్విపద ఛందస్సులో సా.శ.1294-1300 కాలంలో[1] రచించబడింది. యుద్ధకాండ వరకు ఇతను రచించగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు పూర్తిచేశారు. ఇతని కుమారుడు గోన గణపతిరెడ్డి తండ్రిపేరిట బుద్ధేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఉత్తరకాండ కర్తలయిన కాచ, విఠలనాథులు ఇతని కుమారులేనని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.[2] ఐతే ప్రముఖ సాహిత్య విమర్శకుడు వేటూరి ప్రభాకరశాస్త్రి గోన బుద్ధారెడ్డి పినతండ్రి కుమారుడైన మరో గన్నారెడ్డి కుమారులే ఉత్తర రంగనాథరామాయణ కర్తలను పరిశోధన వెలువరించారు.[3] గోన బుద్ధారెడ్డి రచించిన రామాయణమే తెలుగులో తొలి రామాయణ కావ్యంగా ప్రశస్తి వహించింది. అంతకుముందు తిక్కన రచించినది నిర్వచనోత్తర రామాయణమే కాని సంపూర్ణ రామాయణం కాదు.[4]

కుటుంబ నేపథ్యం సవరించు
కాకతీయుల సైన్యంలో సేవలందించే ఉన్నతోద్యోగాలకు చెందిన కుటుంబంలోనివారు గోన గన్నారెడ్డి రచించిన రంగనాథ రామాయణం అనుసరించి ఆయన పూర్వీకుల విశేషాలు తెలుసుకోవచ్చు. రామిరెడ్డి తండ్రి పేరు విట్ఠలభూపతి (లేదా విట్ఠలరెడ్డి). ఆయన తండ్రి పేరు కూడా బుద్ధారెడ్డియే. బుద్దారెడ్డి ముత్తాత పేరు గోన రుద్ర. తండ్రి గోనరెడ్డి.
జీవిత విశేషాలు సవరించు
కాకతీయ రుద్రదేవుడు కందూరు చోడులను (నేటి మహబూబ్ నగర్ జిల్లా) లోని వర్ధమానపురం (నేటి నందివడ్డేమాన్, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నది) నుంచి పారద్రోలడంతో, ఆ స్థానంలో గోరెడ్డిని తన సామంతుడిగా నియమించాడు. ఇతని కుమారుడు గన్నారెడ్డి రాజధానిగా పాలించాడు.[5] ఇతని అల్లుడు మాల్యాల గుండ దండధీశుడు వర్థమానపురం పాలకుడైనాడు. ఇతని మరణానంతరం గోన బుద్ధారెడ్డి గుండేశ్వరాలయం నిర్మించింది.[3] ఈమె తొలి తెలుగు కవయిత్రిగా ఖ్యాతి చెందింది.
సాహిత్యం సవరించు
గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి సంపూర్ణ రామాయణంగా సుప్రఖ్యాతి చెందినది. అంతకుమునుపు తిక్కన వ్రాసిన నిర్వచనోత్తర రామాయణం సంపూర్ణమైన రామాయణంగా చెప్పేందుకు వీలులేని రచన. రంగనాథ రామాయణాన్ని ద్విపద ఛందస్సులో రాశారు. తెలుగులో ద్విపద ఛందస్సును ఉపయోగించి ప్రధానమైన కావ్యాన్ని రచించడంలో పాల్కురికి సోమనాథుని తర్వాత రెండవవారిగా బుద్ధారెడ్డి నిలుస్తున్నారు.
ప్రాచుర్యం సవరించు
గోన బుద్ధారెడ్డి వ్రాసిన రంగనాథ రామాయణం తెలుగు నాట అత్యంత ప్రాచుర్యం వహించిన గ్రంథాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఆంగ్ల విద్య తెలుగు నాట ప్రవేశించని రోజుల్లో సంస్కృత భాషా పాఠకులు తప్ప తక్కిన విద్యార్థులందరికీ చిన్నతనంలోనే పెద్ద పుస్తకం పట్టించి చదివించేవారు. ఇంతకీ ఈ పెద్ద పుస్తకం అంటే మూడు పుస్తకాలకు సామాన్య నామం. ఆ మూడు పుస్తకాలు ఇవి:
- కవిత్రయం వారి ఆంధ్రమహాభారతం
- గోన బుద్ధారెడ్డి కృతమైన రంగనాథ రామాయణము
- పోతన భాగవతం
గోన బుద్ధారెడ్డి ములికినాటి సీమకు రాజధాని అయిన గండికోటకు అతిచేరువలోని పెద్దపసుపల లేదా కొట్టాలపల్లెకు చెందినవాడు. నేటికీ గోనా వంశస్ధులు ఆగ్రామాలలో మరియూ జమ్మలమడుగులో నివసించుచున్నారు.
గోన సంస్థానం సవరించు
కాకతీయ పరిపాలన కాలం (995-1323) లో గోన బుద్ధారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలోని రాజ్యాలైన వర్ధమానపురం (ప్రస్తుతం నంది వడ్డెమాన్), ఖిల్లా ఘన్‌పూర్ (ఘనపూర్ కోట) నుండి పరిపాలన చేసాడు. అతని కుటుంబం, గోనప్రసిద్ధమైనది. అతని మరణం తరువాత అతని సోదరుడూ గోన లుకుమా రెడ్డి రాజ్యపాలన బాధ్యతలను స్వీకరించాడు.[6]
మూలాలు సవరించు
- ↑ తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, రచన: ఆచార్ ఎస్వీ రామారావు, పేజీ 28
- ↑ కాకతీయ చరిత్రము, తేరాల సత్యనారాయణశర్మ రచన, ముద్రణ 2002, పేజీ 168
- ↑ 3.0 3.1 ప్రభాకరశాస్త్రి, వేటూరి (2009). సింహావలోకనము. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం. Retrieved 7 December 2014.
- ↑ పాలమూరు సాహితీ వైభవము, ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ, పేజీ 8
- ↑ తెలంగాణ చరిత్ర, సుంకిరెడ్డి నారాయణరెడ్డి రచన, 2011, పేజీ 129
- ↑ "History of District § Kakatiyas (995-1323)". mahabubnagar.nic.in. The Official Website of Mahabubnagar District. Archived from the original on 2018-05-21. Retrieved 2018-06-22.