గౌరు తిరుపతిరెడ్డి

గౌరు తిరుపతిరెడ్డి ప్రముఖ వాస్తునిపుణుడు.

గౌరు తిరుపతిరెడ్డి
జననంగౌరు తిరుపతిరెడ్డి
1935, ఆగస్టు 20
బొల్లవరం,కడప జిల్లా
మరణం2016, జనవరి 28
ప్రొద్దుటూరు
మరణ కారణంఅనారోగ్యం
వృత్తివ్యాపారవేత్త, వాస్తు సలహాదారు
ప్రసిద్ధివాస్తు నిపుణుడు
మతంహిందూ
భార్య / భర్తరామసుబ్బమ్మ
పిల్లలులక్ష్మినారాయణరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, వెంకటలక్ష్మమ్మ,లీలావతి,శారద
తల్లిదండ్రులుగౌరు నాగిరెడ్డి, వెంకటమ్మ

జీవిత విశేషాలు మార్చు

గౌరు తిరుపతిరెడ్డి 1935, ఆగస్టు 20వ తేదీన కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, బొల్లవరం గ్రామంలో గౌరు నాగిరెడ్డి వెంకటమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి సాధారణ రైతు. ఐదవ తరగతి వరకు బొల్లవరం ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాడు. 1955లో బొల్లవరం గ్రామానికే చెందిన రామసుబ్బమ్మను పెళ్ళి చేసుకున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగారు. ఇతడు వివాహం అయ్యాక ప్రొద్దుటూరులోని దేవరశెట్టి మండిలో నెలకు 8 రూపాయల వేతనానికి పనిచేసేవాడు. ఆ సమయంలో పప్పు కొనడానికి గుంటూరు వెళ్లి వస్తుండగా 800 రూపాయలు పోగొట్టుకున్నాడు. అయితే ఆ డబ్బుకుగాను ప్రతి నెలా తన జీతాన్ని జమ చేయించగా ఇతడి నిజాయితీకి మెచ్చి మిల్లు యజమాని మిల్లులో కొంత భాగం ఇచ్చాడు. తరువాత ఇతడు ఆ మిల్లును అభివృద్ధి చేశాడు. ఇతడు వ్యాపార నిమిత్తం విజయవాడకు రైలులో వెళుతుండగా రామబ్రహ్మం అనే వాస్తు పండితుడు పరిచయమయ్యాడు. రామబ్రహ్మం బొల్లవరంలోని ఇతడి ఇంటిని పరిశీలించి వాస్తు సరిగా లేదని చెప్పడంతో ఆ ఇంటిని పడగొట్టించి రామబ్రహ్మం చెప్పిన ప్రకారం తిరిగి నిర్మించాడు. ఆ సందర్భంలో ఇతడికి వాస్తుశాస్త్రం పట్ల ఆసక్తి ఏర్పడి రామబ్రహ్మం వద్ద వాస్తు మెళకువలు తెలుసుకున్నాడు. అనంతరం ఉత్తర కాశీ రాష్ట్రాలకు యాత్రలకు వెళ్లి ఆలయాలను, భవంతులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాడు. అప్పటి నుండి వాస్తు పండితుడిగా ఎనలేని ఖ్యాతిని గడించాడు[1].

వాస్తు ప్రస్థానం మార్చు

ఇతడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే కాక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ప్రఖ్యాత వాస్తుశిల్పిగా ప్రాచుర్యం పొందాడు. ఇతడు వాస్తు, తదితర అంశాలపై సుమారు 190 పుస్తకాలు రచించాడు. ఇతడు రచించిన 'గౌరు వాస్తు శాస్త్రం' పుస్తకం ఐదు భాషలలోకి అనువదించబడింది. ఈ పుస్తకం 4 లక్షల ప్రతులు అమ్ముడుపోయి 2009 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఇతడు గౌరువాస్తు పేరుతో ఒక మాసపత్రిక నడిపాడు. ఇతని వద్ద వాస్తు చెప్పించుకున్న వారిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, మాజీ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, నందమూరి తారక రామారావు, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ, రామోజీరావు మొదలైన ప్రముఖులున్నారు. వీరేకాక అనేకమంది రాజకీయ సినీ ప్రముఖులు ఇతని సేవలను ఉపయోగించుకున్నారు. ఇతడు ప్రతి యేటా వెలువరించే క్యాలెండరుకు మంచి గిరాకీ ఉంది.

సామాజిక సేవ మార్చు

ఇతడు ప్రొద్దుటూరులో ఆంధ్రకేసరి స్త్రీల ఉచిత కుట్టుమిషన్ శిక్షణా కేంద్రాన్ని స్థాపించి ఎంతోమంది మహిళలకు జీవనోపాధి కల్పించాడు. ప్రొద్దుటూరులోని మైదుకూరు రోడ్డులో కల వాస్తు కాంప్లెక్స్‌లో వేమన ఉచిత హోమియో ఆసుపత్రిని నడుపుతూ బీద రోగులకు సహాయం చేశాడు. ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులో వేమన మెడికల్స్ ప్రారంభించి తక్కువ ధరకే మందులను సరఫరా చేశాడు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు స్పందించి ఎన్నో సార్లు విరాళాలు ఇచ్చాడు. ఎన్నో సంస్థలకు గుప్త దానాలు చేశాడు.

రచనలు మార్చు

  1. గౌరు వాస్తుశాస్త్రం
  2. గౌరు వాస్తు రత్నాకరం
  3. వాస్తుశాస్త్ర వాస్తవాలు
  4. జ్ఞాపకాల జల్లు
  5. వాస్తు సూక్తులు
  6. వాస్తు నిర్మాణ వాస్తవాలు
  7. గృహవాస్తు ప్లాన్స్
  8. ఇండస్ట్రీస్ వాస్తు
  9. వాస్తు సందేహాలు - సమాధానాలు
  10. తూర్పుస్థలం - వాస్తుఫలం
  11. ఆగ్నేయస్థలం - వాస్తుఫలం
  12. దక్షిణస్థలం - వాస్తుఫలం
  13. నైరుతిస్థలం - వాస్తుఫలం
  14. పడమరస్థలం - వాస్తుఫలం
  15. వాయువ్యస్థలం - వాస్తుఫలం
  16. ఉత్తరస్థలం - వాస్తుఫలం
  17. ఈశాన్యస్థలం - వాస్తుఫలం
  18. తెలుగు తేజోమూర్తులు
  19. గౌరు పెద్దబాలశిక్ష
  20. నేను - నా వాస్తు
  21. చెట్ల చరిత్ర (వేప, చింత వేయి లాభాలు)
  22. ఆచారాలు - శాస్త్రీయ వాస్తవాలు
  23. శుభవాస్తు సూక్తులు
  24. తరగని ఔషధ గని - తులసి
  25. ఆకుకూరలు - ఆరోగ్యవాస్తవాలు
  26. కూరగాయలు - పోషకవిలువలు
  27. సి.పి.బ్రౌన్ (వేమన సాహితీతపస్వి)
  28. ప్రకృతి వాస్తు - ఆరోగ్య వాస్తవాలు
  29. వాస్తు ప్రత్యక్ష వాస్తవాలు
  30. వేమన మతం - సర్వజనహితం
  31. వాస్తు వీధి చూపుల వాస్తవాలు
  32. కడప జిల్లా సాహితీమూర్తులు (సమర్పకుడు)

పురస్కారాలు మార్చు

ఇతడు పలు అవార్డులను పొందాడు. వాస్తు సేవారత్న, వాస్తు భగీరథ, వాస్తుశిల్పి, వృక్షమిత్ర, వాస్తు పెరియార్ మొదలైన బిరుదులను పొందాడు.

మరణం మార్చు

ఇతడు 2016, జనవరి 28 గురువారం నాడు తన 81వ యేట ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో మరణించాడు.

మూలాలు మార్చు

  1. "వాస్తునిపుణుడు తిరుపతిరెడ్డి కన్నుమూత". Archived from the original on 2016-02-01. Retrieved 2016-01-30.

బయటి లింకులు మార్చు