కొండా లక్ష్మణ్ బాపూజీ

భారత రాజకీయ నాయకుడు

నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా, వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు.[1] స్వాతంత్ర్యోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా నుంచి ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. 1969, 2009-12 తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషిచేశాడు.

కొండా లక్ష్మణ్ బాపూజీ
కొండా లక్ష్మణ్ బాపూజీ

కొండా లక్ష్మణ్ బాపూజీ


నియోజకవర్గం అసిఫాబాద్, చిన్నకొండూర్, భువనగిరి

వ్యక్తిగత వివరాలు

జననం (1915-09-27)1915 సెప్టెంబరు 27
వాంకిడి, కొమరంభీం జిల్లా, తెలంగాణ
మరణం 2012 సెప్టెంబరు 21(2012-09-21) (వయసు 96)
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
జీవిత భాగస్వామి శకుంతల
సంతానం ఇద్దరు కుమారులు,
ఒక కూతురు
మతం హిందూ

బాల్యం, విద్య

కొండా లక్ష్మణ్ బాపూజీ 1915, సెప్టెంబర్ 27న కొమరంభీం జిల్లా, వాంకిడిలో జన్మించాడు.[2] 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లి మరణించింది. రాజురామానికి ఘర్ లో బాల్యం గడిచింది. ప్రాథమిక విద్యాబ్యాసం ఆసిఫాబాదులో, న్యాయశాస్త్రవిద్య హైదరాబాదులో పూర్తిచేశారు. 1940లో న్యాయవాద వృత్తి చేపట్టారు.[3]

వ్యక్తిగత జీవితం

బాపూజీ భార్య శకుంతల. ఈమె వైద్యురాలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. ఒక కుమారుడు భారత సైన్యంలో వైమానిక దళంలో ఉంటూ దేశసేవలో వీరమరణం పొందినారు.

స్వాతంత్ర్యోద్యమం

1938లో పౌరహక్కుల ఉద్యమ సత్యాగ్రహంలో పాల్గొని పుత్లీబౌలిలో అరెస్టయ్యారు. 1940లో న్యాయవాద వృత్తి చేసేటప్పుడు బాపూజీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారి తరఫున వాదించి కేసులను గెలిపించేవారు.[4] 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో, వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారు.[5] 1940లో ఆంధ్ర మహాసభలో చేరి ఖద్దరు వస్త్రాల ప్రచారం, అమ్మకం చేపట్టారు. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో ఆబిడ్స్‌ పోస్టాఫీసుపై, కోఠీలో ఉన్న బ్రిటిష్‌ రెసిడెన్సీపై జాతీయ జెండా ఎగురవేసి సంచలనం సృష్టించారు.[3]

నిజాం విమోచనోద్యమం

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దేశమంతటా ప్రజలు ఆనందోత్సవాలలో పాల్గొంటున్ననూ, తెలంగాణ ప్రజలు నిజాం నిత్య అకృత్యాలకు లోనై ఉండటాన్ని చూసి విమోచనోద్యమంలో పోరాడినారు. హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌పై, పౌర హక్కులపై తీవ్ర నిర్బంధం కొనసాగుతున్న రోజుల్లో తాను అధ్యక్షునిగా ‘సిటిజన్‌ ప్రొటెక్షన్‌ కమిటీ’ ఏర్పాటుచేసి ప్రజాచైతన్య కార్యక్రమాలు రూపొందించారు.

నిజాం రాజును అంతమొందిచడం కోసం బాంబు దాడికి వ్యూహం రచించిన బాపూజీ. నారాయణరావ్‌ పవార్‌, గండయ్య, గూడూరు నారాయణ స్వామి, జగదీష్‌ ఆర్య అనే నలుగురు యువకులకు షోలాపూర్‌ క్యాంపులో శిక్షణ ఇచ్చారు. 1947 డిసెంబరు 4న నిజాం కారుపై సుల్తాన్‌ బజార్‌లో నారాయణరావు పవార్‌ బాంబు విసిరాడు. కొద్ది తేడాతో అది కారు వెనుక భాగాన పేలింది. పవార్‌ను అక్కడికక్కడే నిర్బంధించి అతనికి ఉరిశిక్ష, ఇతరులకు జైలుశిక్ష విధించారు. హత్యకు కుట్ర పన్నినందుకు బాపూజీని ప్రాసిక్యూట్‌ చేశారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిర్బంధించబడిన నాయకులకు ఉచిత న్యాయసహాయం చేశారు. విస్నూరు దేశ్‌ముఖ్‌పై హత్యాయత్నం కేసు, హుస్నాబాద్‌ బాంబు కేసు, కమ్యూనిస్టు నాయకులు రావి నారాయణరెడ్డి, నల్లా నర్సింహులు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ‘నయాజిందగీ’ పత్రిక సంపాదకులు ఆచార్య జె.ఎన్‌. శర్మలపై బనాయించిన కుట్ర కేసులను వాదించి గెలిచారు.[3]

రాజకీయ జీవితం

హైదరాబాద్‌ విముక్తి పోరాటంలో విప్లవ పంథాను అనుసరించిన బాపూజీ స్వాతంత్ర్యానంతరం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉపసభాపతిగా, మంత్రిగా, శాసనసభ్యునిగా సేవలందించారు.

1952లో బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనారు. 1957లో చిన్నకొండూరు నుంచి విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటి స్పీకరుగా ఎన్నికయ్యారు. 1962లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే ప్రత్యర్థి పాల్బడిన అక్రమాలపై కేసువేసి విజయం సాధించారు. 1967లో భువనగిరి నుంచి విజయం సాధించారు. కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ లో చిన్న తరహా, కుటీర పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేస్తూ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేశారు. 1972లో భువనగిరి నుంచి ఎన్నికయ్యారు. 1973లో పి.వి.నరసింహారావు తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఒప్పుకున్ననూ అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ జలగం వెంగళరావు పేరు ప్రతిపాదించి ఆయన్ను ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రికి బదులుగా గవర్నర్ పదవి ఇస్తానని ఇందిరాగాంధీ ముందుకు వచ్చినా, ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.[6]

సామాజిక సేవలు

  • 1952లో బాపూజీ రూపొందించిన ‘సహకార సంఘాలు’ దేశంలోనే ప్రప్రథమం కావడం విశేషం. చేనేత ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం 1952లో ‘హైకో’ను ఏర్పాటు చేశారు. ఇతర వృత్తుల వారిని కూడా సహకార రంగ పరిధిలోకి తెచ్చారు.
  • తెలుగునేలపై సైకిల్‌ యాత్ర, పాదయాత్రలకు శ్రీకారం చుట్టాడు. 1961లో మూసీ నదికి వరదలు వచ్చినపుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ జిల్లా మూసీ పరివాహక ప్రాంతంలో 220 మైళ్ళు పాదయాత్ర చేసి పునరావాస కేంద్రాలను స్వయంగా పర్యవేక్షించి ప్రజలకు అండగా నిలిచాడు. [3]
  • 2010లో స్వగ్రామంలో లక్ష్మణ్ సేవా సదన్ పేరుతో ఒక స్వచ్చంధ సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాడు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం

తొలి, మలితరం తెలంగాణ ఉద్యమాల్లో ముందుండి నడిపించారు. తొలినాళ్లలో సమైక్యవాది అయిన బాపూజీ, మొదట విశాలాంధ్రకు మద్దతు ప్రకటించినా ఆంధ్ర పాలకుల వివక్షను స్వయంగా ఎదుర్కొని తన అభిప్రాయాలను మార్చుకుని 1969 నాటి తెలంగాణ విముక్తి ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1996 నుంచి మొదలైన మలిదశ ఉద్యమానికి కూడా అండగా నిలిచారు. ‘తెలంగాణ పీపుల్స్‌ పార్టీ’ స్థాపించి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను చాటుతూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఆయన నివాసం ‘జలదృశ్యం’ లోనే పురుడు పోసుకుంది. తెలంగాణ నినాదం ఎత్తుకున్న వారందరికీ అండగా నిలిచారు. 96 సంవత్సరాల వయసులో కూడా ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో తెలంగాణ కోసం దీక్ష చేశారు.[6]

జలదృశ్యం

1958లో సచివాలయం సమీపంలో హుస్సేన్ సాగర్ తీరాన (ప్రస్తుత నెక్లెస్ రోడ్డుపై) భూమి కొని జలదృశ్యం నిర్మించుకున్నాడు. 2002లో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని నేలమట్టం చేయగా కోర్టు తీర్పు బాపూజీకి అనుకూలంగా వచ్చింది.

మరణం

బాపూజీ 97 సంవత్సరాల వయస్సులో 2012, సెప్టెంబరు 21హైదరాబాదులో మరణించాడు. ఆయన అంత్యక్రియలు సెప్టెంబరు 22న జలదృశ్యంలో జరిగాయి.

గర్తింపులు

  • రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవన విశ్వవిద్యాలయంకి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంగా పేరు పెట్టడం జరిగింది.
  • ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్రవ్యాప్తంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలను నిర్వహిస్తోంది. వేడుకల నిర్వహణకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చైర్మన్‌, ఉపాధ్యక్షులు, కన్వీనర్లు, కో-కన్వీనర్లు, కో-ఆర్డినేటర్లతో రాష్ట్రస్థాయి నిర్వహణ కమిటీని ఏర్పాటుచేసి, సెప్టెంబరు 27న ఉదయం 10 గంటల నుంచి నగరంలోని రవీంద్రభారతిలో జయంతి వేడుకులను నిర్వహిస్తోంది. బాపూజీ పేరుమీద జీవన సాఫల్య పురస్కారాలను అందజేస్తోంది.[7]

బాపూజీ విగ్రహాలు

మూలాలు

  1. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటి ప్రచురణ, 2006, పేజీ 40
  2. Eenadu (4 November 2023). "ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే గెలిచారు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  3. 3.0 3.1 3.2 3.3 వంగరి, భూమయ్య (2023-09-27). "ఆత్మగౌరవ పోరాట పతాక". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-09-27. Retrieved 2023-09-27.
  4. చిరస్మరణీయులు, పి.వి.బ్రహ్మ, ప్రచురణ 2009, పేజీ 291
  5. The Hindu : News / National : Agitators, police clash at Osmania varsity[permanent dead link]
  6. 6.0 6.1 "ఉద్యమ కొండ.. లక్ష్మణ్‌ బాపూజీ". EENADU. 2023-09-27. Archived from the original on 2023-09-27. Retrieved 2023-09-27.
  7. "అధికారికంగా.. కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-09-27. Archived from the original on 2022-09-28. Retrieved 2022-09-28.
  8. telugu, NT News (2022-09-28). "కూల్చిన చోటే.. గెలిచి నిలిచినం". Namasthe Telangana. Archived from the original on 2022-09-28. Retrieved 2022-09-28.
  9. "KTR: కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్". EENADU. 2022-09-27. Archived from the original on 2022-09-27. Retrieved 2022-09-30.
  10. "తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కొండా లక్ష్మణ్‌ బాపూజీ". EENADU. 2022-09-27. Archived from the original on 2022-09-27. Retrieved 2022-09-30.
  11. telugu, NT News (2022-09-27). "కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ పోరాటం మ‌రువ‌లేనిది : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-09-27. Retrieved 2022-09-30.