చాతుర్మాస్య వ్రతం
చాతుర్మాస్య వ్రతం హిందువులు ఆచరించే ఒక వ్రతం. ఈ వ్రతంలో భాగంగా వర్షాకాలంలో నాలుగు నెలలపాటు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు.[1] ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయనైకాదశి అంటారు. ఆరోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) రోజున మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ కాలంలో యతులు ఎటువంటి ప్రయాణాలు తలపెట్టక ఒకేచోట ఉండి అనుష్టానం చేస్తారు. చాతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుండి హిందూదేశంలో మునీశ్వరులు పాటిస్తూ వస్తున్న వ్రతం. చాతుర్మాస్య వ్రతం అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతమని అర్ధం. కొందరు రెండు నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి అర్ధచాతుర్మాస్యం అనే పేరుతో చేస్తారు. ఈ వ్రతాచరణకు స్త్రీ, పురుష భేదం కానీ, జాతి భేదం కానీ లేదు. వితంతువులు, యోగినులు మొదలైనవారెవరైనా చేయవచ్చును. ఇది హిందువులతో పాటు జైన, బౌద్ధ మతస్థులు ఉండే సమాజములోను ఆచరణలో కనిపిస్తుంది. ఈ వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు గానీ, వీలుకాకపోతే కటక సంక్రాంతి, కాకపొతే ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుంచి విధిగా ఆచరించాలని చెప్తారు.
చాతుర్మాస్యం | |
---|---|
ప్రారంభం | శయన ఏకాదశి |
ముగింపు | ప్రబోధిని ఏకాదశి |
ఆవృత్తి | వార్షికం |
చరిత్ర
మార్చుఈ చాతుర్మాస వ్రతం ఆచరించడమనేది ఇటీవలి కాలంలో వచ్చినది కాదు. యుగ యుగాలుగా ఆచరణలో ఉందని భవిష్య, స్కాంద పురాణాలలోని కథనాల వలన అవగతమవుతుంది. ఒకప్పుడు ఇప్పటిలాగా కాక నాలుగు నెలలుపాటు కొనసాగే ఋతువులు మూడే ఉండేవట. అనంతర కాలంలో రెండేసి నెలల పాటు ఉండే ఆరు ఋతువులుగా అవి మారాయి . తొలినాళ్ళలో వర్ష, హేమంత, వసంత - అనే మూడు ఋతువులు మాత్రమే ఉండేవి. వర్ష ఋతువుతోనే సంవత్సరము ఆరంభామవుతూ ఉండేది . ఈ కారణం వల్ల సంవత్సరానికి " వర్షం" అనే పేరు వచ్చింది. సంవత్సరానికి మూడు ఋతువులున్న ఆ కాలములో ఒక్క ఋతువు ప్రారంభంలో ఒక్కో యజ్ఞం చేస్తుండేవారు. ఆషాఢ పూర్ణిమ నుండి వరుణ ప్రఘాస యజ్ఞం, కార్తీక పూర్ణిమ నుండి సాకమేద యజ్ఞం, ఫాల్గుణ పూర్ణిమ నుండి వైశ్వ దేవయజ్ఞము చేస్తూ ఉండేవారు. ఆ నాటి ఆషాఢంలో చేసే యజ్ఞమే అనంతర కాలం నాటికి చాతుర్మాస్య వ్రతముగా మారి ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెబుతున్నారు. చాతుర్మాస వ్రతము పాటించేవారు. ఆహార నియమాలలో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను, భాద్రపద మాసంలో పెరుగును ఆశ్వయుజ మాసంలో పాలను కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలి పెట్టాలి. వాటిని ఆహారముగా ఏ మాత్రము స్వీకరించ కూడదు. పాత ఉసిరి కాయ పచ్చడి మాత్రం వాడవచ్చును. ఈ ఆహార నియమాలన్నీ వాత, పిత్త, శ్లేష్మ సంబంధ రోగాల నుంచి కాపాడు కోవటానికి బాగా ఉపకరిస్తాయి. ఇలా ఎటు చూసినా చాతుర్మాస్య వ్రతదీక్ష అనేది - మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రత దీక్ష అని పురాణ వాఙ్మయం వివరిస్తోంది .
ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్
వ్రతచర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్
దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః
వ్రత నియమాలు
మార్చుచాతుర్మాస్యాన్ని అన్ని ఆశ్రమాల (బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస) వారు పాటించవచ్చు.[2] కుల, వర్గ నియమాలు కానీ, లింగ వివక్ష కానీ లేదు. చాతుర్మాస్య వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించింది. చాతుర్మాస్య వ్రతం పాటించే విధానం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ మొదటి నెలలో కూరలు, రెండవ నెలలో పెరుగు, మూడవ నెలలో పాలు, నాల్గవ మాసంలో పప్పు దినుసులూ తినకూడదు. భాగవతం వంటి గాథలు వింటూ ఆథ్యాత్మిక చింతనతో ఈ నాలుగు నెలలూ గడపాలి. వైరాగ్యాన్ని అలవరుచుకునేందుకు ఎక్కువగా సన్యాసులు, వృద్ధులు ఈ వ్రతం ఆచరిస్తారు.
- ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు.
- ఈ కాలంలో అరుణోదయవేళ స్నానం చేయడం అవసరం.
- వ్రతకాలంలో బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస పాటించాలి.
- ఇష్టదేవతలకు చెందిన దివ్యమంత్రాన్ని అక్షరలక్షలుగా జపించాలి.
- ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి.
- భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి.
- యోగసాధన చేయడం శ్రేయస్కరం.
- దానధర్మాది కార్యాలు విశేష ఫలాన్నిస్తాయి.
వ్రత వృత్తాంతము
మార్చుచతుర్మాసాలు అంటే, ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు గల సమయం నాలుగు నెలలు. ఆషాఢ, శ్రావణ, బాధ్రపద, ఆశ్వయుజ మాసాల్లోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ఇందులో మొదటిది దేవశయన ఏకాదశి. చివరిది దేవ ఉత్థాన ఏకాదశి. క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు నెలలు శయనిస్తాడు. విష్ణువు శయనించే కాలంలో సాధకులు భూశయనం చేయటం, ఆకుకూరలు, వెల్లుల్లి, సొరకాయ, టమాట, ఆవనూనెల సేవనం మానివేయటం, నిరంతర జప, తప, హోమ, పురాణ కథా శ్రవణాల్లో కాలం గడపటం, రోజూ ఒకే పూట భోజనం చేయటం, ఏకాదశులలో పూర్తిగా ఉపవాస దీక్ష చేయటం వంటి దీక్షా ధర్మాలను పాటిస్తారు. పీఠాధిపతులు, దీక్షితులు ఒకే స్థానంలో నివసించటం, క్షురకర్మలు నిషేధించడం వంటి నియమాలు పాటిస్తారు. శ్రావణ, బాధ్రపద మాసాలు గృహస్థుల నియమాలకు సరైనవని పద్మపురాణం తెలుపుతోంది. బాధ్రపద కృష్ణ ఏకాదశిని అజా ఏకాదశి అంటారు. ఇది సమస్త పాపాలను తొలగిస్తుందంటారు. హరిశ్చంద్ర మహారాజు సత్యం, ధర్మం తప్పక తన భార్యకు దూరమై అనేక ఇక్కట్ల పాలైనప్పటికీ చాతుర్మాస్య వ్రతాన్ని మరువలేదని, చివరికి విజయం చేకూరిందని చెబుతారు. చాతుర్మాస్య దీక్షలో గోపద్మవ్రతం గురించి మూడు పురాణ గాథలు వాడుకలో ఉన్నాయి.
నారేళ్ళనాచి కథ
మార్చుఒకసారి కైలాసంలో శివునిచేతి మెత్తదనాన్ని చూసిన పార్వతి- చేయి మెత్తగా, మృదువుగా ఉండటానికి కారణం అడిగింది. పరోపకారం చేయడం వలన చేతులు మెత్తగా ఉంటాయని శివుడు చెప్పాడు. అందుకే 'ఎముక లేని చెయ్యి' అని దానం చేసేవారిని వర్ణిస్తారు. పార్వతికి పరోపకార సేవ చేయాలనే కోరిక కలిగింది. మారువేషంతో భూలోకానికి వెళ్లింది. నారేళ్ళనాచి అనే పేరు గల గర్భిణికి చేయూతనిచ్చి, సేవచేసి, 11 రోజుల తరువాత సకలైశ్వర్యాలు కలగజేసి, చాతుర్మాస్య గోపద్మ వ్రతాన్ని తెలిపి అంతర్ధానమైపోయింది. అయిదేళ్ళ తరువాత అమ్మకు నారేళ్ళనాచి పరిస్థితిని తెలుసుకోవాలనిపించింది. అప్పుడు నారేళ్ళనాచి గోపద్మవ్రత ఉద్యాపన చేసుకొంటోంది. పార్వతి ఓ ముసలమ్మ రూపంలో వెళ్ళి మంచి నీళ్ళడిగింది. నారేళ్ళనాచి కోపంతో ఆమెకు బయట తొట్టిలో నీరిమ్మని తనవారితో చెప్పింది. అవమానపడిన పార్వతి తిరిగి శివుని దగ్గరకు వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయాలని కోరింది. అది సాధ్యపడదన్నాడు శివుడు. విష్ణువూ తానేం చేయలేనన్నాడు. చివరికి నారదుడు వెళ్ళి నారేళ్ళనాచికి తెలిపాడు. తన అపరాధాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు పాయసం, గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం చేసి, క్షమించమని కోరింది. పార్వతీ పరమేశ్వరులు ఆమెకు సకలైశ్వర్యాలు అందజేశారు.
రాజు రాణి కథ
మార్చుఇదే విధంగా ఒక రాజు సంతానం లేని కారణంగా చెరువులు, బావులు తవ్వించడం, బాటలు వేయించడం, బాటల పక్క చెట్లు నాటించడం చేసి తన రెండో భార్యకు అయిదుగురు సంతానాన్ని పొంది, తన మొదటి భార్యలో గల ఈర్ష్య వల్ల రెండో భార్య గోపద్మ వ్రతానికి భంగం కలగకుండా చేశాడు. మరో కథలో యముడు గోపద్మ వ్రతం చేయనివారి వెన్నెముక చర్మాన్ని తెచ్చి జయభేరి మోగించాలని తన భటులను కోరాడట.
సుభద్ర వ్రతాచరణ
మార్చుతన చెల్లెలు ఈ వ్రతాన్ని చేయలేదని తెలిసిన శ్రీకృష్ణుడు వెంటనే సుభద్ర వద్దకు వెళ్ళి అయిదేళ్ళ వ్రతాన్ని ఒకేరోజు జరిపించాడట. దాంతో యమభటులకు జయభేరిని మోగించడానికి చర్మం లభించలేదట. తూర్పు దిక్కుకు తలపెట్టి పడుకొన్న ఓ జీవి వెన్నెముక చర్మాన్నైనా తెచ్చి జయభేరి మోగించాలన్నాడట యముడు. అప్పుడు ఓ దున్నపోతు అలా నిద్రిస్తుండటం చూసి దాని చర్మాన్ని తెచ్చి డోలు వాయించారని కథనం.
ముత్తైదువులు
మార్చుచాతుర్మాస్య గోపద్మ వ్రతంలో ముత్త్తెదువలు తొలి ఏకాదశి నుంచి ప్రతిరోజు కొన్ని చొప్పున 1100 వత్తులు, 11 వందల ముగ్గులు పెట్టుకుంటారు. అయిదేళ్ళు నోముకున్నాక కన్నెముత్తైదువకు పసుపు, కుంకుమ, గాజులు, బట్టలు, భోజనం, బియ్యం, నువ్వుపిండి పెట్టి నమస్కరిస్తారు. గణపతికి ఉండ్రాళ్ళు నివేదన చేస్తారు. దూర్వాలతో గౌరమ్మను పూజించి, తులసికోటవద్ద దీపం వెలిగిస్తారు. జామపండ్లు, సీతాఫలాలు, చెరకు, ఖర్జూర పండ్లు వంటివాటితో కన్నె పిల్లల ఒడినింపి, గౌరమ్మకు నమస్కరిస్తారు. పరోపకారం, సేవాభావం, పరులను గౌరవించడం, చాతుర్మాస్య నియమాలు పాటించడం- మానవాళికి ఎంతో శుభం, ఆనందం చేకూరుస్తాయని అందరి నమ్మకం.
సూచికలు
మార్చు- ↑ మహాత్మా గాంధీ. సత్యశోధన. వికీసోర్స్. p. 1.
- ↑ సముద్రాల, లక్ష్మణయ్య (1992). శ్రీ విద్యాప్రకాశానంద స్వాముల వారి జీవిత చరిత్ర (PDF). శ్రీకాళహస్తి: శ్రీ శుకబ్రహ్మాశ్రమం. p. 140.