చిర్రావూరి సర్వేశ్వర శర్మ

చిర్రావూరి సర్వేశ్వరశర్మ విజయనగరంవాసి. పురిపండా, శ్రీ శ్రీ, ఆరుద్ర, ఝరుక్, నారాయణ బాబు సర్వేశ్వరశర్మ సమకాలికుడు, ఈ కవులకు ఆత్మీయు మిత్రుడు. ఈయన వలస పాలకుల విమానదళంలో సాంకేతిక నిపుణుడుగా దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేశాడు. భార్య శ్రీ మతి లలితమ్మ ఒంటరిగా విజయవాడలో, విశాఖలో కాపురం ఉంటూ ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లల సంరక్షణ చేస్తూ వాళ్ళను చదివించి విద్యావంతుల్ని చేసింది. సర్వేశ్వరశర్మ వైమానిక దళంలో స్వచ్ఛందంగా పదవీవిరమణచేసిన తరువాత, ఒరిస్సా రాష్ట్రం సోనాబేడలోని హిందుస్తాన్ ఎయిరోనాటిక్సులో ఉద్యోగం చేసే, 1998లో పదవీవిరమణ తర్వాత, 80వ ఏట మరణించాడు. పిల్లలు నాన్నగారికి షష్టిపూర్తి చేస్తామనుకొన్నారుగానీ కుదరలేదు. తండ్రిగారి శతజయంతి సందర్భంగా తండ్రిగారిమీద "నడచిన పుస్తకం-చిర్రావూరి సర్వేశ్వరశర్మ" గ్రంథాన్ని తీసుకుని వచ్చారు. ఈ మూడువందల పుటల పుస్తకంలో తన అభిరుచుల ప్రకారం, తన పద్ధతులలో జీవితాన్ని సాగించిన శర్మగారిమీద అనేకదృష్టికోణాలనుంచి మిత్రులు, అభిమానులు, కన్నబిడ్డలు, మనుమలు, మనుమరాళ్ళు రాసిన ఆత్మీయ అనుభవాలు,జ్ఞాపకాలు నిక్షిప్తమైనాయి.

శర్మగారి ఇద్దరు కుమారులూ గొప్ప వైద్యులు. కుమార్తెలు, మనమరాళ్ళూ, మనమలూ అంతా గొప్ప చదువులు చదివి ఉన్నత పదవులను అలంకరించారు. శర్మ చిన్న వేతనశర్మగా ఉంటూనే ముప్ఫైవేల పైచిలుకు గ్రంథాలు, ప్రాచ్య పాశ్చాత్య సంగీత సాహిత్యాలు, సాంస్కృతిక విషయాలమీద పుస్తకాలు కొని చదివి సొంత గ్రంథాలయం ఏర్పాటు చేసుకొన్నాడు. ఆయన అభిరుచులు ఎంతో వైవిధ్య మైనవి. తనకాలంనాటి బుద్ధి జీవులందరితో పరిచయాలు, స్నేహాలు. చలం, రావూరి, శ్రీశ్రీ, ఆరుద్ర, సౌరిస్ ఎందరెందరితోనో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. 1949 నుంచి చిత్రగుప్త, ఆంధ్రప్రభ, జ్యోతి.. వంటి పత్రికలలో కథలు, కవితలు, వ్యాసాలు, సినిమా సమీక్షలు రాశాడు.

తనను గుర్తుపెట్టుకోడానికి  జీవితంపట్ల వారేర్పరచుకొన్న నిరాసక్తమైన తాత్విక దృక్పథం,సరళ జీవనం, పుస్తకాలపట్ల అపరిమిత ప్రేమముఖ్యమయనవి. జీవితం కన్నా మిన్నగా పుస్తకాలను ఆరాధించడం శర్మగ విలక్షణమైన మానవుడు. 

మూలాలు: నడిచిన పుస్తకం -చిర్రావూరి సర్వేశ్వరశర్మ. 2021,జనవరి.