జాకబ్ డైమండ్
జాకబ్ డైమండ్ (ఇంపీరియల్ లేదా విక్టోరియా డైమండ్) హైదరాబాద్ రాష్ట్ర నవాబు నిజాం రాజులకు చెందిన వజ్రం. రంగులేని ఈ గోల్కొండ వజ్రం, మెరుగుపెట్టిన వజ్రాలలో ప్రపంచంలో ఐదవ అతిపెద్ద వజ్రం.[1][2] హైదరాబాద్ రాష్ట్ర చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, చౌమహల్లా ప్యాలెస్ వద్ద తన తండ్రి (మహబూబ్ అలీ ఖాన్) షూలో ఈ వజ్రాన్ని కనుగొన్నాడు. చాలాకాలంపాటు ఆ వజ్రాన్ని కాగితపు బరువుగా (పేపర్ వెయిట్) ఉపయోగించాడు. 1995లో భారత ప్రభుత్వం ఈ వజ్రాన్ని $ 13 మిలియన్లకు కొనుగోలు చేసింది. దీర్ఘచతురస్రాకార పరిపుష్టి-కట్ లో 58 కోణాలను, 39.5 మి.మీ.ల పొడవు, 29.25 మి.మీ.ల వెడల్పు, 22.5 మి.మీ.ల లోతుతో ఈ వజ్రం ఉంది. ఈ వజ్రం బరువు 184.75 క్యారెట్లు (36.90 గ్రా) ఉంటుంది. ప్రస్తుతం ఇది ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉంచబడింది. 2001, 2007లో నిజాం ఆభరణాల ప్రదర్శనలో భాగంగా, హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియంలో జాకబ్ డైమండ్ ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
బరువు | 184.5 క్యారట్లు (36.90 గ్రా.) |
---|---|
రంగు | రంగులేనిది |
కోత | దీర్ఘచతురస్రాకార పరిపుష్టి-కట్ |
వెలికితీసిన దేశం | |
వెలికితీసిన గని | గోల్కొండ |
కనుగొన్నవారు | 1884 |
తొలి యజమాని | హైదరాబాద్ రాష్ట్ర నవాబు నిజాం |
యజమాని | భారత ప్రభుత్వం |
విలువ (అంచనా) | £100 million (2008) |
కో-ఇ-నూర్ వజ్రం మాదిరిగా కాకుండా, జాకబ్ డైమండ్ దాని చరిత్రలో రెండుసార్లు మాత్రమే చేతులు మారింది. దీనికోసం ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగలేదు.[3]
చరిత్ర
మార్చుకత్తిరించడానికి ఐరోపాకు పంపడానికి ముందు, కత్తిరించని జాకబ్ వజ్రం 400 క్యారట్లు (80 గ్రా.) బరువులో ఉండేది.[4]
అలెగ్జాండర్ మాల్కం జాకబ్ 1891లో ఈ వజ్రాన్ని అమ్మకానికి పెట్టడంతో ఈ వజ్రానికి జాకబ్ డైమండ్ అనే పేరు వచ్చింది. హైదరాబాదు ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్కు ఈ వజ్రం అందించబడింది. మొదట్లో ఈ వజ్రం పట్ల నిజాం పెద్దగా ఆసక్తి చూపలేదు, కేవలం 40 లక్షలు (4 మిలియన్ రూపాయలు) ఇచ్చాడు. యూరోపియన్ నగల వ్యాపారులు ఈ ఆఫర్‌ని ఇష్టపడక, నిజాం డిపాజిట్ ట్రాక్‌ను కోల్పోయినప్పుడు కోర్టులో కేసు వేశారు. చివరకు, నిజాం కేసును పరిష్కరించినప్పుడు అతని అసలు ఆఫర్‌లో దాదాపు సగం, 23 లక్షలు (2.2 మిలియన్ రూపాయలు, సుమారుగా $ 50,000 ధరలకు)లకు వజ్రాన్ని ప్రదానం చేశారు. ఈ ప్రక్రియతో నిరుత్సాహపడ్డ నిజాం రాజు ఆ వజ్రాన్ని దురదృష్టంగా భావించి, దానిని వస్త్రంతో చుట్టి దాచిపెట్టాడు.[5]
తండ్రి మరణించిన చాలా సంవత్సరాల తరువాత, చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్, చౌమహల్లా ప్యాలెస్‌లోని తన తండ్రి షూలో జాకబ్ డైమండ్‌ను కనుగొన్నాడు. అది ఒక వజ్రమని తెలిసేవరకూ దానిని చాలాకాలంపాటు పేపర్ వెయిట్‌గా ఉపయోగించాడు. దాని విలువను తెలుసుకున్న తరువాత రాజ కుటుంబం ఇతర ఆభరణాలతోపాటు ఈ వజ్రాన్ని కూడా విక్రయించాలనుకుంది. కానీ ఆభరణాలు అనేవి విదేశీయులకు విక్రయించలేని జాతీయ సంపద అని పేర్కొంటూ భారత ప్రభుత్వం అమ్మకానికి అనుమతినివ్వలేదు.[5]
అనేక వ్యాజ్యాల తరువాత, 1995లో భారత ప్రభుత్వం ఈ వజ్రాన్ని నిజాం ట్రస్ట్ నుండి నిజాం ఇతర ఆభరణాలతో పాటుగా 13 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖజానాలో ఉంచబడింది.[6]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Bedi, Rahul (12 April 2008). "India finally settles £1million Nizam dispute". The Daily Telegraph. London. Retrieved 15 September 2021.
- ↑ "The Victoria". Famous, Historic and Notable Diamonds. Retrieved 15 September 2021.
- ↑ "Nizams' Jewellery". National Museum, New Delhi. Archived from the original on 11 December 2009. Retrieved 15 September 2021.
- ↑ Srivastava, Ahana (2019-04-29). "10 Interesting Facts About The Diamond That's Bigger Than The Kohinoor". www.scoopwhoop.com (in English). Retrieved 15 September 2021.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ 5.0 5.1 "Diamond in a Shoe: The Jacob Diamond". www.livehistoryindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 14 మార్చి 2021. Retrieved 15 September 2021. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "The world's largest diamonds". business.rediff.com. Retrieved 15 September 2021.