సాలార్ ‌జంగ్ మ్యూజియం

భారతదేశ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో గల ఒక సాంస్కృతిక సంగ్రహాలయం (మ్యూజియం)

సాలార్ జంగ్ మ్యూజియం "దార్-ఉల్-షిఫా" వద్ద గల ఒక కళా సంగ్రహాలయము.[2] హైదరాబాదు నగరంలోని మూసీ నది దక్షిణ ఒడ్డున ఉంది. భారతదేశంలోని మూడు జాతీయ మ్యూజియంలలో ఇది ఒకటి. ఇందులో "ఏనుగు దంతాల కళాకృతులు", "పాలరాతి శిల్పాలు" ఆకట్టుకుంటాయి. అలాగే జపాన్, చైనా, బర్మా, నేపాల్, భారతదేశం, పర్షియా, ఈజిప్ట్, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు సంబంధించిన శిల్పాలు, చిత్రలేఖనాలు, బొమ్మలు, వస్త్రాలుచేతి వ్రాతలు, సెరామిక్స్, లోహ కళాఖండాలు, తివాచీలు, గడియారాలు ఉన్నాయి.

సాలార్‌జంగ్ మ్యూజియం
పటం
Established1951
Locationనయాపూల్, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
Collection size10 లక్షలు
Visitors11,24,776 March 2009 నాటికి [1]
Websitehttp://www.salarjungmuseum.in/

చరిత్ర

మార్చు

హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియం ప్రపంచంలోని విభిన్న యూరోపియన్, ఆసియా, దూర ప్రాచ్య దేశాలలో కళాత్మక వస్తువుల భాండాగారం. ఈ సేకరణ ప్రముఖంగా సాలార్ జంగ్ III సేకరించారు. 1914లో సాలార్జంగ్ తర్వాత HEH ప్రధాన మంత్రి, నిజాం VII, నవాబ్ మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్, సేకరించారు. దేశ విదేశాల్లో పర్యటించి అద్భుతమైన కళాఖండాలను సేకరించి, ఈ దివాన్ దేవిడి ప్యాలెస్ (తన ఎస్టేట్‌) లో ఉంచేవాడు.[3] నలభై సంవత్సరాల కాలంలో అతని ద్వారా సేకరించిన విలువైన, అరుదైన కళ వస్తువులు, కళ వంటి అరుదైన చాలా అరుదైన ముక్కలు, సాలార్ జంగ్ మ్యూజియంలో ఉన్నాయి.

సాలార్ జంగ్ మ్యూజియం భారతదేశంలో మూడవ అతిపెద్ద సంగ్రహాలయంగా ప్రసిద్ధి చెందింది. వివిధ నాగరికతలకు చెందిన సేకరణలు, 1వ శతాబ్దంనకు చెందిన పురాతన వస్తువులకు భారతదేశంలో ప్రసిద్ధి. 1951 డిసెంబరు 16న ఈ సంగ్రహాలయం ప్రజలకొరకు తెరవబడింది. హైదరాబాదుకు చెందిన నిజామ్ పరిపాలకుల "సాలార్ జంగ్ కుటుంబం" ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన వస్తు సామగ్రి, కళాఖండాలు సేకరించింది. ఇందులో ఇస్లామీయ కళాఖండాలు, ప్రాచీన ఖురాన్ ప్రతులూ, నగలూ, నగిషీలూ, యుద్ధసామగ్రీ, పర్షియా తివాసీలు మొదలగునవి ఉన్నాయి. ఈ సేకరణలన్నీ దాదాపు మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సేకరించినవే, ఇతను సాలార్ జంగ్ IIIగా ప్రసిధ్ధి. కొన్ని సేకరణలు ఇతడి తండ్రియైన "మీర్ లయీఖ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ II", "నవాబ్ మీర్ తురాబ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ I"కు చెందినవి.

సేకరణలు

మార్చు

సాలార్ జంగ్ కు చెందిన నగరమహలులో 78 గదులలో 40,000 వస్తువులు గలవు. ఇందులో ప్రముఖంగా : పరదాలో యున్న "రెబెక్కా", జహాంగీర్ చురకత్తి, నూర్జహాను పండ్లుకోసే కత్తి, 12వ శతాబ్దానికి చెందిన "యాఖూతి ఉల్-మస్తామీ" ఖురాన్ ప్రతి, మ్యూజికల్ క్లాక్, "స్త్రీ-పురుష శిల్పం" ప్రధానమైనవి.

ఏనుగు దంతాల కళాఖండాలు: సాలార్ జంగ్ మ్యూజియం లోని ఆరవ నంబరు గ్యాలరీలో ఏనుగు దంతాల కళాఖండాలు ఉంటాయి.

ఏనుగు దంతాల కుర్చీలు: బ్రిటీష్ పాలకులతో వీరోచితంగా పోరాటం సాగించిన టిప్పుసుల్తాన్ కు టైగర్ గా బిరుదు ఉండేది. ఆయన పటిమకు మెచ్చి ఫ్రాన్స్ 16 వ లూయి చక్రవర్తి నాలుగు ఏనుగుదంతాల కుర్చీలను బహూకరించాడు. ఆ కుర్చీల కాళ్ళ చివరిలో పులి పాదాల మాదిరిగా ఉంటాయి. చేతులు పెట్టుకునే స్టాండ్ భాగంలో ఏనుగు దంతంతో పులి తల బొమ్మల మాదిరిగా మలిచారు. వీటిని మ్యూజియానికి తెప్పించడానికి మూడో సాలార్ జంగ్ కృషి చేశారు.1949లో ఆయన చనిపోయిన అనంతరం ఇవి మ్యూజియానికి చేరాయి.

ఏనుగు దంతాలతో అల్లిన చాప: ఏనుగు దంతాల నుండి నార మాదిరిగా పోగులు తీసి అల్లి దానిని చాపలాగా చేసిన ఆకృతిని ఇక్కడ గ్యాలరీలో చూడవచ్చును. దీనిని 19వ శతాబ్దంలో వారణాసి సమీప రాజ సంస్థానంలోని రాంపూర్ లో దీనిని రూపొందించారు.

వీటితో పాటుగా బరువును మెూసే ఒంటెకు ముకుతాడు వేసి ముందుకు తీసుకు వెళుతున్నట్టుగా ఓ మనిషి కనిపిస్తాడు. దీనికి ఉన్న గొలుసు సైతం దంతాలతో మలచినదే. ఇవికాకుండా ఇంకా ఏనుగుదంతంతో మలచిన ఒక బంతిలో ఏడుబంతులు ఇమిడి ఉన్నట్లుగా కనిపించడం కళాకారుల ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుంది. జపాన్ బొమ్మలు, దశావతారాలు, క్రీస్తు, మేరీమాత కళాఖండాలతో పాటుగా దైనందిక జీవితంలోని వివిధ సామగ్రి సైతం దంతాలతో మలచినవి కనిపిస్తాయి. భారత్ తో పాటుగా చైనా, బర్మా, ఐరోపా దేశాల్లో ఈ తరహా కళాఖండాలకు ఆదరణ ఉండేది.

 
సాలార్ జంగ్ మ్యూజియం

సేకరణల్లో గ్రంథాలు, పోర్సిలీన్, తుపాకులు, ఖడ్గాలు, శిల్పాలు ప్రపంచపు నలుమూలలనుండి తెప్పించి భద్రపరచబడినవి. భారత పార్లమెంటు, ఈ సంగ్రహాలయాన్ని "జాతీయ ప్రాముఖ్యం" గల సంగ్రహాలయంగా గుర్తించింది.

సందర్శన సమయాలు

మార్చు

ఈ మ్యూజియం ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకూ సందర్శకులకొరకు తెరవబడి యుంటుంది. ప్రభుత్వ సెలవులతో పాటు ప్రతీ శుక్రవారం శెలవు దినం. పిల్లలు, పెద్దలు, విదేశీయులకు వేరువేరు ప్రవేశ రుసుం ఉంటుంది. దాని అధికారిక వెబ్సైట్ https://salarjungmuseum.in/index.htmlనుండి కూడా ఆన్లైన్ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ముందస్తు అనుమతితో సందర్శకులు ఫ్లాష్ లైట్ లేకుండా స్మార్ట్ ఫోన్, కెమెరాలతో ఫొటోలు, వీడియోలు తీసుకునే అవకాశం ఉంది.

ఫొటో గ్యాలరీ

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

వనరులు

మార్చు
  1. Government of India, Ministry of Culture, ANNUAL REPORT 2008-09 p. 35
  2. "సాలార్ జంగ్ మ్యూజియం జాలస్థలి". Archived from the original on 2012-06-15. Retrieved 2012-09-15.
  3. ఆంధ్రజ్యోతి, తెలంగాణా- కధనాలు (15 January 2015). "సాలార్‌ జంగ్‌.. కళాఖండాల సేకరణే జీవితం". Archived from the original on 16 January 2019. Retrieved 16 January 2019.

బయటి లింకులు

మార్చు