జీవితం (1949 సినిమా)
జీవితం ఏ.వి.యం.ప్రొడక్షన్స్ వారు 1949 లో తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఎం.వి.రామన్ దర్శకత్వంలో నిర్మించిన మొదటి చిత్రం. ప్రముఖ నటి వైజయంతిమాలకు ఇది తొలి తెలుగు చిత్రం.
జీవితం (1949 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.వి.రామన్ |
---|---|
నిర్మాణం | ఎ.వి.మొయప్పన్ |
తారాగణం | టి.ఆర్.రామచంద్రన్ (పతి), సి.హెచ్.నారాయణరావు (మూర్తి), వైజయంతిమాల (మోహిని), యస్.వరలక్ష్మి (వరలక్ష్మి), సి.యస్.ఆర్.ఆంజనేయులు, కంచి నరసింహారావు |
సంగీతం | ఆర్.సుదర్శనం |
నేపథ్య గానం | యస్.వరలక్ష్మి, ఎమ్.ఎస్.రామారావు |
గీతరచన | వెంపటి సదాశివబ్రహ్మం |
సంభాషణలు | తోలేటి వెంకటరెడ్డి |
నిర్మాణ సంస్థ | ఎ.వి.యం.ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సంక్షిప్త చిత్రకథ
మార్చుమద్రాస్లోని పేరు మోసిన వ్యక్తి శివశంకర లింగేశ్వర ప్రసాద్ (సిఎస్‌ఆర్). అతని కుమార్తె మోహిని (వైజయంతిమాల) విద్యావతి, నృత్యకళాకారిణి అయిన అందమైన యువతి. శివశంకర్ రెండో భార్య దుర్గమ్మ (అన్నపూర్ణ) తమ్ముడు మూర్తి (సిహెచ్ నారాయణరావు) మోహినిని వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. మోహినీ అందుకు అంగీకరించదు. అశోక్ అనే రచయితను ఇష్టపడుతుంది. ఆ రచయిత, బ్యాంక్ ఉద్యోగి అయిన నారాయణపతి (టిఆర్ రామచంద్రన్) పక్కింట్లో ఉంటుంటాడు. అతనే అశోక్ అని తెలియకపోయినా, వారిరువురూ ఒకరినొకరు ఇష్టపడడం, వివాహం చేసుకోవాలనుకుంటారు. మూర్తి పనిమీద పల్లెటూరికి వెళ్తాడు. ఆ వూరిలో పేద, అమాయక యువతి వరలక్ష్మి (ఎస్.వరలక్ష్మి). వడ్డీ వ్యాపారి బసవయ్య (కంచి నరసింహారావు) వృద్ధుడు. ఆమెను తండ్రి బాకీల నిమిత్తం పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మూర్తి ఆ బాకీలు తీరుస్తానని, ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేస్తాడు. ఫలితంగా గర్భవతియైన వరలక్ష్మి మూర్తిని వెతుకుతూ మద్రాస్ వెళ్తుంది. ఆసుపత్రిలో బాబును ప్రసవించి మూర్తిని కలుసుకున్న ఆమెను ‘కులట’ అని నిందించి, మూర్తి తిరస్కరిస్తాడు. ఆత్మహత్య చేసుకోవాలని వరలక్ష్మి బాబును పతి కారులో విడిచివెళ్తుంది. ఈ బాబును చూసి, మూర్తి చెప్పుడు మాటలవల్ల పతికి, మోహినికి జరిగే పెళ్లి నిశ్చితార్థం ఆగిపోతుంది. జాలరులచే కాపాడబడిన వరలక్ష్మి తిరిగి బాబుకోసం వచ్చి, పతివద్ద చూసి, దూరంగా బతుకుతుంటుంది. మోహినికి, మూర్తికి పెళ్లి నిశ్చయం కావటం, బాబుకు ప్రమాదంగా వుందని చూడాలని వెళ్లి మోహిని, అక్కడకు వచ్చిన వరలక్ష్మి, మూర్తిల గురించి నిజం తెలుసుకోవటం, మూర్తిని, పతి దెబ్బలనుంచి కాపాడబోయిన వరలక్ష్మి తీవ్రంగా గాయపడటం, ఈ సంఘటనతో మూర్తిలో మార్పువచ్చి వరలక్ష్మిని, బిడ్డను స్వీకరించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది[1].
పాటలు
మార్చు- ఆంధ్ర యువత నీదే జయమురా జయము జయము - డి.కె. పట్టమ్మాళ్ బృందం
- ఆనందమౌగా పల్లెసీమ మా పల్లె సీమ దాన ధర్మాల - ఎస్. వరలక్ష్మి
- ఆశలన్నీ గాలిలోన కలసిపోయెనే నా ఆశలన్నీ - ఎస్. వరలక్ష్మి
- ఇదేనా మా దేశం ఇదేనా భారతదేశం ఇదేనా మా దేశం - మాధవపెద్ది
- గోపాల నీతో నే ఆడుతానోయి నంద గోపాల నీతో - భగవతి
- చక్కనైన కోయారాజుని ఎక్కడైన చూశారా - ఎం. ఎస్. రాజేశ్వరి, టి.ఎస్.భగవతి
- చూపవా నాపతి తోవ దేవా ఆపద్బంధవా నీదరి గొనిపోవా - ఎస్. వరలక్ష్మి
- టిక్కు టిక్కు టక్కులాడి తక్కితారు లాడేద చక్కనైన - ఎం.ఎస్. రాజేశ్వరి
- నీకన్నే బ్రమించిన నాపై కోపం నీకెందుకు - ఎం.ఎస్. రాజేశ్వరి
- నీకన్నే బ్రమించిన నాపై కోపం నీకెందుకు డడ డా - టి. ఆర్. రామచంద్రన్
- భూమి దున్నాలోయి మన దేశం పండాలోయి - టి.ఎస్. భగవతి, ఎం.ఎస్.రాజేశ్వరి బృందం
- మనమనసు మనసు ఏకమై నవలోకం చూద్దామా - టి. ఆర్. రామచంద్రన్, భగవతి
- మేలుకోండి తెల్లవారే తెల్లగా వేగ కళ్ళాపి జల్లి - ఎస్. వరలక్ష్మి
ఇతర విశేషాలు
మార్చు- వైజయంతిమాలకు తెలుగులో ఇది మొదటి సినిమా
- ఈ చిత్రానికి మూలం తమిళ సినిమా వాళ్‌గై. ఇది వైజయంతిమాల మొట్టమొదటి సినిమా.
- ఈ చిత్రాన్ని హిందీ భాషలో బహార్ అనే పేరుతో ఏ.వి.యం. ప్రొడక్షన్స్ సంస్థనే రీమేక్ చేసింది.
మూలాలు
మార్చు- ↑ సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (4 May 2019). "ఫ్లాష్ బ్యాక్@50 జీవితం". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 17 మే 2019. Retrieved 17 May 2019.
- నవరస భరితం ఏ.వి.యం.వారి 'జీవితం', నాటి 101 చిత్రాలు, ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006, పేజీలు 50-51.