పచ్చబొట్టు

(టాటూ నుండి దారిమార్పు చెందింది)

పచ్చబొట్లు (Tattoos) చర్మం మీద వేయించుకొనే ఒకరకమైన చిహ్నాలు. దీనిలో వివిధ వర్ణపదార్ధాలను సన్నని సూదుల ద్వారా గుచ్చి వేస్తారు. మనుషులలో ఇవి వారివారి అభిరుచులను బట్టి వేయించుకొనే గుర్తులు. జంతువులలో వీనిని ఎక్కువగా గుర్తించడానికి వీలుగా పెంచుకోనేవారు వేయిస్తారు.

ఒక 'మాఓరి' నాయకుడు, తన శరీరంపై టట్టూలు (పచ్చబొట్టు బొమ్మలు) పెట్టుకుని వున్నాడు.

పచ్చబొట్టు శరీరంపై వేసుకుంటే ఏ హానీ జరగదా?

మార్చు

సహజరూపమైన శరీరంమీద శాశ్వత ప్రాతిపదికన ఏ పచ్చ పొడిపించుకున్న, ఎలాంటి టాటూస్ వేయించుకున్నా ఎంతో కొంత ప్రమాదం ఉండకమానదు. అందుకే పెద్దలు అడుసు తొక్కనేల, కాలు కడుగనేల అన్నారు. కాసేపు పూసుకుని సాయంత్రానికో, మధ్యాహ్నానికో స్నానం చేస్తే శుభ్రమయ్యే విధంగా ఉన్న ప్రమాద రహిత వర్ణాల్ని చర్మం మీద ఎవరికి తోచిన విధంగా వారు బొమ్మల్ని గీయించుకొంటే పెద్దగా ప్రమాదం లేదు. కానీ టాటూస్ అలా కాదు. శాశ్వత ప్రాతిపదికన పచ్చబొట్టులాగా కొన్ని రంగుల్ని బొమ్మలుగా సూదుల సాయంతో చర్మంలోకి నింపుతారు. ఈ రంగు ద్రవ్యాలు చాలా మట్టుకు క్యాన్సర్ కారక ద్రవ్యాలు. కాబట్టి అక్కడ చర్మ క్యాన్సరు వచ్చే దురవకాశాలు లేకపోలేదు. చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే వృక్ష సంబంధ కారకాలు ప్రమాద రహితమైనవనీ కేవలం కర్మాగారాల్లో తయారై కృత్రిమ, రసాయనాలు ప్రమాదకరమనీ అంటుంటారు. ఆపేరుతో విచ్చలవిడిగా ఈ మధ్య వృక్షోత్పత్తి (herbel products) మందులంటూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. వృక్షాల నుంచి తీసినా, కృత్రిమంగా చేసినా బెంజీన్ బెంజీనే. రసాయనిక పదార్థాల ధర్మాలు వాటి మాతృకను బట్టి మారవు. చాలా వృక్షసంబంధ రసాయనాలు కూడా ప్రమాదకరంగా ఉంటాయి.

పచ్చబొట్టు తయారీ సమయంలో రికార్డ్ చేయబడిన చిన్న వీడియో. ప్రక్రియ సమయంలో నైట్రిల్ గ్లోవ్స్ వాడకాన్ని గమనించండి, ఇది చర్మానికి చిల్లులు పడేటప్పుడు అంటువ్యాధులను నివారించడానికి

పొడిపించుకునే విధానము

మార్చు

పచ్చబొట్లు[1] పొడిపించుకోవడం అత్యంత పురాతనమైన కళ . ఒక వ్యక్తి శరీరంలోని చర్మాన్ని సూదితో గుచ్చి రంగులను, వర్ణాలను దానిపై వేయటమనే ఈ కళ కొన్ని తెగలకు సంప్రదాయంగా వస్తున్నది. నేడు పశ్చిమ దేశాల్లో ఇది ఒక ఫ్యాషన్ . భారత దేశానికి కూడా విస్తరించింది. మానవ శరీరాన్ని ఒక నారగుడ్డగా ఉపయోగించుకోవటమే పచ్చబొట్టు పొడిపించుకోవడం అనవచ్చు. ఈ ప్రక్రియకు స్ఫూర్తి ప్రాచీన కాలపు పచ్చబొట్లే. గతంలో ఈ రంగు నల్లగా (నూనెను కాల్చినపుడు వచ్చే మసి) ఉండేది. దీన్ని అవిసె నూనెలో కానీ లేదా పసుపు ముద్దలో కానీ మూలికలతో సహా కలిపి వేసేవారు. ప్రస్తుతం ఈ రంగుల ప్రత్యామ్నాయాలకు బదులు మాసిపోని సిరా వచ్చింది. ఇవి రుద్దినా పోదు. రంధ్రాలలో రంగులను చొప్పించేందుకు ఉపయోగించిన బాధాకరమైన ముల్లుకు బదులుగా విద్యుత్ శక్తిసంపన్నమైన సూది వచ్చింది. ప్రాచీన ఈజిప్టు నాగరికతంత పురాతనమైనది ఈ పచ్చబొట్టు. 4000 ఏళ్ళనాటి ఈజిప్టియన్ మమ్మీలకు నైట్ దేవత చిహ్నాలైన పచ్చబొట్లు ఉన్నాయి. ప్రాచీన గ్రీకులలో పచ్చబొట్టు కులీనులకు మాత్రమే ప్రత్యేకించబడింది. వార్తాహరుల నున్నటి బోడిగుండ్లపైన పచ్చబొట్లు చెక్కి సంకేత సందేశాలు గ్రీకులు పంపేవారు. ప్రాచీన రోమన్లు బానిసలకు, నేరస్థులకు పచ్చబొట్లు గుర్తులుగా చేసేవారు. 7వ శతాబ్ది ఏ.డి. ప్రాంతాలలో పచ్చబొట్లు ఏ మతాన్నీ నమ్మనివారు చేసేపనిగా పరిగణించి కొన్ని శ్డతాబ్దాల వరకు యూరప్‌లో నిషేధించారు. కానీ ఇది ఇతర చోట్ల కొనసాగుతూ వచ్చింది. కాలక్రమేణా ప్రపంచమంతటా ప్రజాదరణకు పాత్రమైంది.

చరిత్రలో పచ్చబొట్లు

మార్చు

బ్రిటన్‌ కు చెందిన ఐదవ జార్జి చక్రవర్తి, డెన్మార్క్ రాజు ఫ్రెడెరిక్, బ్రిటిష్ సైనిక దళానికి చెందిన ఫీల్డ్ మార్షల్ మాంట్‌గోమరీ తమ శరీరాలపై పచ్చబొట్లు పొడిపించుకున్నారు.[2] జపాన్‌లో పచ్చబొట్లను ఎప్పుడూ అత్యంత గౌరవభావంతో చూసేవారు. డ్రాగన్ల అందమైన రూపాలు, పుష్పాలు, పక్షులు, తుదకు ప్రకృతి దృశ్యాలతో శరీరపు పచ్చబొట్లను జపాన్ కళాకారులు రూపొందించేవారు. భారతదేశంలో ప్రాచీన కాలం నుంచీ పచ్చబొట్ల కళ పరిఢవిల్లింది. యుద్ధవీరులు, మల్లయోధులు తమ పటుత్వం కల నరాలపై, మణికట్లపై హనుమంతుడు, కత్తులు, త్రిశూలం మొదలైన రూపాలతో పచ్చబొట్లు పొడిపించుకునేవారు.

వివిధ కారణాలు

మార్చు

ప్రేమికులు తమ శరీరాలపై వాళ్ళ వాళ్ళ పేర్లు పొడిపించుకునేవారు. జనసమ్మర్ధం కల సంతలలో, సభలలో, గుంపులలో తమ బిడ్డలు తప్పిపోయినట్లైతే సులభంగా గుర్తు పట్టేందుకు వీలుగా జాగ్రత్త కల తల్లిదండ్రులు తమ బిడ్డల చేతులపై పేర్లు పచ్చబొట్టుగా పొడిపించేవారు. స్త్రీలు ఈ పచ్చబొట్ల కళను ఉపయొగైంచుకుని తమ సౌందర్యాభివృద్ధి కోసం గడ్డాలపైన, బుగ్గలపైన సుకుమారమైన చుక్కలు పెట్టించుకునేవారు. భారతదేశంలోని కొండ జాతి ప్రజలలో పచ్చబొట్లు అత్యంత ఆదరణ పాత్రమయ్యాయి. గిరిజన స్త్రీలు తమ శరీరంలోని ముంజేతులు, హస్తాలు, చెవులు, భుజాలు, పాదాలు, బుగ్గలు, గడ్డాలు, నుదురు మొదలైన భాగాలలో పచ్చబొట్లు పొడిపించుకుంటారు. ఈ రూపాలు సాధారణంగా గీతలు, వంపులు, వలయాలు, చుక్కలుగా ఉంటాయి.

వివిధ నమ్మకాలు

మార్చు

పచ్చబొట్టు శరీరానికి రక్షణ కల్పిస్తుందని, శరీరానికి భౌతికమైన శక్తిని సమకూరుస్తుందని, శరీరపు నొప్పులను నయం చేస్తుందని గిరిజనుల విశ్వాసం. ఒక ప్రత్యేకమైన తెగకు గుర్తుగాను, ఒక అంతస్తుకు చిహ్నంగానూ వారు పచ్చబొట్టును ఉపయోగిస్తారు. భిల్ల జాతి మహిళలు వివాహానికి ముందు - ఒక తెగకు చిహ్నంగా - ఒక పక్షి రూపాన్ని పచ్చబొట్టు పొడిపించుకుంటారు. మధ్య ప్రదేశ్ లోని బస్తర్ ప్రాంతానికి చెందిన మురియాలు, మరియాలు తమ రొమ్ము పైన, వెనక వైపున, ముంజేతుల మీద, ముఖాల పైన పచ్చబొట్లు పొడిపించుకునేందుకు ఇష్టపడతారు. గోండు జాతి స్త్రీలు నక్షత్రాలను, శిలువలను, స్త్రీ పురుషుల మోటు రూపాలను పచ్చబొట్లుగా పొడిపించుకుంటారు. పచ్చబొట్లు పొడిచేవారు అన్ని రకాల పాత, కొత్త దిజైన్లను వారాంతపు మార్కెట్లలో, ప్రాంతీయ సంతలలో ప్రదర్శించి ఖాతాదారులు తమకు నచ్చిన రూపాలను ఎంచుకునేందుకు వీలు కలిగిస్తారు. వారికి ఎక్కువ బాధ కలిగించకుండా బేటరీతో నడిచే పెన్నులతో ఈ రూపాలను చర్మం పైన ముద్రిస్తారు. పాశ్చాత్య దేశాలలో పెదవులపై లిప్‌స్టిక్ రంగు శాశ్వతంగా ఉండిపోయే విధంగా పచ్చబొట్ల నైపుణ్యం వృద్ధి పొందింది. ఆకర్షణీయమైన కనుబొమలను పచ్చబొట్లతో ముద్రించడం కూడా జరుగుతున్నది. నేటి నాగరిక యువత ఫేషన్‌గా పచ్చబొట్లు పొడిపించుకోవడం విశేషం.

కారణాలు

మార్చు

పచ్చబొట్లు కొంతమంది ప్రేమించిన వారి గుర్తుగా వేయించుకుంటారు. కొంతమంది దేవుళ్ళ బొమ్మలను భక్తి కొలదీ వేయించుకుంటారు. ఆధునిక యుగంలో పచ్చబొట్లను ఎక్కువగా అమెరికా, ఐరోపా యువతరం పిచ్చిగా వేయించుకుంటున్నారు. శాశ్వతమైన మేకప్ లాగా కొంతమంది పచ్చబొట్లు వాడుతున్నారు.

చిత్రమాలిక

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

ఇతర లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "anchor tattoo". Archived from the original on 2016-09-09. Retrieved 2016-09-02.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-21. Retrieved 2009-07-02.