టి.ఎస్.శంకరన్ ఒక కర్ణాటక వేణుగాన విద్వాంసుడు.

టి.ఎస్.శంకరన్
మనుమడు టి.ఎ.జయరామన్‌తో టి.ఎస్.శంకరన్
వ్యక్తిగత సమాచారం
జననం(1930-10-28)1930 అక్టోబరు 28
సాతనూరు, తమిళనాడు
మరణం2015 ఏప్రిల్ 9(2015-04-09) (వయసు 84)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివేణుగాన విద్వాంసుడు
వాయిద్యాలువేణువు

విశేషాలు

మార్చు

ఇతడు కుంభకోణం సమీపంలోని సాతనూరులో 1930, అక్టోబర్ 28వ తేదీన జన్మించాడు. ఇతని ముత్తాత సాతనూర్ పంచనాథ అయ్యర్ (పంజు అయ్యర్) సంగీత విద్వాంసుడు. అతడు వీణ ధనమ్మాళ్‌కు సంగీత గురువు. శంకరన్ తండ్రి టి.ఎన్.సాంబశివ అయ్యర్ గొప్ప వేణుగాన విద్వాంసుడు. అతడు చాలా సంవత్సరాలు మైసూరు సంస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా పనిచేశాడు. శంకరన్ తన అతి చిన్నవయసులోనే సంగీతంలో పూర్తి స్థాయి శిక్షణ పొందాడు. గాత్ర సంగీతాన్ని వేదారణ్యం రామచంద్ర అయ్యర్ వద్ద, వేణు గానాన్ని తన తండ్రి సాంబశివ అయ్యర్ వద్ద నేర్చుకున్నాడు[1].

ఇతడు 9వ యేటి నుండి తన గ్రామం చుట్టుపక్కల ఉన్న దేవాలయాలలో కచేరీలు చేయడం ప్రారంభించాడు. ఇతడు వేణుగానంలో మెళకువలను నేర్చుకోవడానికి టి.ఆర్.మహాలింగం(మాలి) వద్ద శిష్యునిగా చేరాడు. ఇతడు 1948లో తిరుచ్చి ఆకాశవాణిలో ఉద్యోగంలో చేరాడు. దానితో ఇతనికి అనేకమంది సంగీత విద్వాంసులను కలుసుకునే అవకాశం దక్కింది. తరువాత ఇతడు ఆకాశవాణి ఉద్యోగం మానివేసి తన గురువు మాలి వద్దనే నివసించసాగాడు. ఇతడు అడయార్‌లోని కళాక్షేత్రలో కార్యక్రమాలతో మమేకం అయ్యాడు. అక్కడి సంగీత నృత్య కార్యక్రమాలకు ఇతడు శాశ్వత వేణూనాద విద్వాంసుడయ్యాడు. ఇతడు సంగీత ప్రపంచంలో "ఢిల్లీ శంకరన్"గా పరిచితుడు. 1995లో ఇతడు మృణాళినీ సారాభాయ్ బృందంతో కలిసి జపాన్ పర్యటించాడు.

బరోడా విశ్వవిద్యాలయంలో రెండేళ్ళు సంగీత అధ్యాపకునిగా పనిచేసిన తర్వాత ఇతడు ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో నిలయ విద్వాంసునిగా చేరాడు. ఇతడు తాన్‌సేన్ సంగీతోత్సవాలు, సంకట మోచన ఉత్సవాలలో తరచూ పాల్గొని కచేరీలు చేసేవాడు. సోనాల్ మాన్ సింగ్ బృందంతో కలిసి అనేక దేశాలు పర్యటించాడు. ఆయా దేశాలలో ఒంటరి (సోలో) కచేరీలు కూడా చేశాడు.

మాలి బెంగళూరులో స్థిరపడినప్పుడు ఇతడు తరచూ మాలి వద్దనే ఉండేవాడు. నిజానికి ఇతడు తన కుటుంబంతో కన్నా మాలి వద్దనే ఎక్కువ సమయం గడిపేవాడు. వీరిద్దరూ ఎంత సన్నిహితులంటే మాలి సంగీత కచేరీల కోసం సంగీత సభల కార్యదర్శులు శంకరన్ చుట్టూ తిరిగేవారు. మాలి తన తదనంతరం తన ఆస్తిని ఇతనికే చెందాలని వీలునామా వ్రాశాడు. అయితే శంకరన్ ఆ వీలునామాను చించివేసి మాలి మరణానంతరం అతని ఆస్తిని అతని సోదరునికి చెందేలా చూశాడు.

ఇతడు హరిప్రసాద్ చౌరాసియాతో కలిసి కచేరీలు చేశాడు. "చికాగో సింఫనీ"తో విదేశాలలో రేడియో కార్యక్రమాలు చేశాడు. ఇతని మనుమడు టి.ఎ.జయంత్‌తో కలిసి వందకు పైగా కచేరీలు చేశాడు.

పురస్కారాలు

మార్చు

ఇతనికి కళైమామణి పురస్కారం, సంగీత నాటక అకాడమీ అవార్డులు మాత్రం లభించాయి[1].

ఇతడు తన 85వ యేట 2015, ఏప్రిల్ 9వ తేదీన మరణించాడు[1].

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 V. BALASUBRAMANIAN (16 April 2015). "Mali's favourite". The Hindu. Retrieved 7 March 2021.