తాతా సుబ్బరాయశాస్త్రి

తాతా సుబ్బరాయశాస్త్రి (1867-1944) విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు. సంఘ సంస్కర్త. వితంతు పునర్వివాహాలను సమర్థించాడు. అంటరానితనాన్ని వ్యతిరేకించాడు. మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు.[1]

తాతా సుబ్బరాయశాస్త్రి
Tata subbaraya sastry.png
తాతా సుబ్బరాయశాస్త్రి
జననం1867
విజయనగరం
మరణం1944
నివాస ప్రాంతంవిజయనగరం
వృత్తిరచయిత
సంఘ సంస్కర్త
సాహితీకారుడు
సంస్కృత పండితుడు
ప్రసిద్ధిసంఘ సంస్కర్త
మతంహిందూ

జీవిత విశేషాలుసవరించు

ఇతడు విజయనగరానికి సమీపంలోని ఒంటితాడి అగ్రహారంలో 1867, జనవరి 25న తాతా సూర్యనారాయణావధాని,సోమిదేవమ్మ దంపతులకు జన్మించాడు.[2] సోమిదేవమ్మకు కొడుకును మహాపండితునిగా చేయాలనే బలమైన కోరిక ఉండేది. సుబ్బరాయశాస్త్రి తన తల్లి కోరిక ప్రకారమే నడుచుకున్నాడు. ఇతడు విజయనగరంలో బులుసు సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద సంస్కృత సాహిత్యం అభ్యసించి అందులో ప్రావీణ్యం సంపాదించాడు. ఏకసంథాగ్రాహిగా మన్ననలను అందుకున్నాడు. ఇతనికి చదువుపట్ల ఉన్న శ్రద్ధాసక్తుల గురించి విన్న రుద్రభట్ల రామశాస్త్రి, లక్ష్మణశాస్త్రి సోదరులు ఇతడిని ప్రత్యేకంగా ఆహ్వానించి శిష్యునిగా చేర్చుకున్నారు. వారి వద్ద వ్యాకరణ, అలంకార శాస్త్రాలు ఔపోసన పట్టాడు. తరువాత ధర్మశాస్త్రంపై ఆసక్తితో గుమ్మలూరు సంగమేశ్వరశాస్త్రి వద్ద చేరి ఆ శాస్త్రాన్ని ఆసాంతం చదువుకున్నాడు. తరువాత కొల్లూరు కామశాస్త్రి వద్ద వేదాంతం, కట్టా సూర్యనారాయణ అనే సంగీత విద్వాంసుని వద్ద సంగీతశాస్త్రం అభ్యసించాడు. ఆ కాలంలో ఆంధ్రదేశంలో ఏ శాస్త్రంలో ఏ రకమైన సందేహం వచ్చినా తీర్చగల వారెవరంటే ముందుగా ఇతని పేరే చెప్పుకునేవారు. ఇతను చెప్పే తీర్పు నిష్పక్షపాతంగా, శాస్త్రబద్ధంగా,ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండేది. ఇతడు అనేక పర్యాయాలు విజయనగర పురపాలక సంఘంలోను, సహకార సంఘంలోను సభ్యునిగా, ప్రధానాచార్యునిగా పనిచేశాడు. ఇతడు కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులను స్వాగతించాడు. సాంఘిక దురాచారాలను వ్యతిరేకించాడు. వితంతు పునర్వివాహాలను సమర్థించాడు. అంటరానితనాన్ని వ్యతిరేకించాడు. మహాత్మాగాంధీ పిలుపును అందుకుని జీవితాంతం ఖద్దరు వస్త్రాలను ధరించాడు. ఈయన కాశీ లోని పండితులను సాహిత్య పోటీలో ఓడించిన మొదటి వ్యక్తి.[3] ఇతడు 1944లో కన్నుమూశాడు.

రచనలుసవరించు

  • ధర్మ ప్రబోధము
  • గురుప్రసాదం - భారతదేశంలో ఉత్తమ వ్యాకరణ గ్రంథంగా పరిగణించబడుతున్న నాగేశభట్టు వ్రాసిన "శబ్దేందుశేఖరం" అనే గ్రంథంపై ఉత్తరాది వారు చేసిన విమర్శలను ఖండిస్తూ తన వాదనా పటిమతో ఈ గ్రంథాన్ని వ్రాశాడు. ఈ గ్రంథాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం ముద్రించి పండితలోకానికి అందించింది. అయితే ఈయన ఈ గ్రంథంలో శబ్దేందుశేఖరంలోని స్వరగంథి వరకే తన వ్యాఖ్యను వ్రాశాడు. తరువాత ఇతని శిష్యుడు పేరి వేంకటేశ్వరశాస్త్రి గురుప్రసాద శేషం పేరుతో కారకాంతం వరకూ పూర్తి చేశాడు. ఈ గ్రంథాన్ని కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రచురించింది[2].
  • శబ్దరత్న వ్యాఖ్య

సత్కారాలుసవరించు

ఇతని ప్రజ్ఞకు పట్టం కడుతూ అనేక సంస్థలు ఇతడిని సన్మానించాయి. 1912లో ఇతడు మహామహోపాధ్యాయ బిరుదును పొందాడు. ఈ బిరుదు పొందిన మొట్టమొదటి వ్యక్తి ఈయనే. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారతదేశానికి వచ్చినప్పుడు ఇతడిని మద్రాసుకు ఆహ్వానించి తన పేరు చెక్కబడిన బంగారు కంకణాన్ని స్వయంగా ఇతని చేతికి తొడిగి గౌరవించాడు. ఇది ఒక ఆంధ్రుడికి లభించిన అపూర్వ గౌరవం. ఇతడు కాశీ, దర్భంగా, పుదుక్కోట వంటి సంస్థానాలను దర్శించి శాస్త్ర చర్చలలో పాల్గొని విజేతగా నిలిచి అనేక బహుమతులు పొందాడు. ఇతని 63వ జన్మదినం సందర్భంగా ఇతని శిష్యులు వైభవంగా గురుపూజోత్సవం నిర్వహించారు[2].

మూలాలుసవరించు

  1. "VISIT VIZIANAGARAM" (PDF). Archived from the original (PDF) on 2016-03-10. Retrieved 2015-12-17.
  2. 2.0 2.1 2.2 నియోగి (1 September 2019). అక్షరనక్షత్రాలు (1 ed.). విజయనగరం: భారతీ తీర్థ ప్రచురణ. pp. 4–6.
  3. Vizianagaram - Nostalgia - Prasad Tata and Sarepaka RamaGopal

ఇతర లింకులుసవరించు