విజయనగరం జిల్లా

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా

విజయనగరం జిల్లా, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్యాన ఉంది. విజయనగరం జిల్లాకు ముఖ్యపట్టణం విజయనగరం బంగాళాఖాతం నుండి 18 కి.మీ.ల దూరంలో, విశాఖపట్నం నకు 40 కి.మీ.లు దూరంలో ఈశాన్యాన ఉంది. 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందున్న ఈ జిల్లా రాష్ట్రం లోని పూర్వపు జిల్లాలన్నిటికంటే, విజయనగరం జిల్లా అత్యంత కొత్తది. ఈ జిల్లా 1979 జూన్ 1 న ఏర్పడింది. దీనితో 2014లో తెలంగాణ విభజనకు ముందున్న పూర్వపు సంకీర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య దీనితో 23 కు చేరింది. 2011 జనాభా లెక్కల ప్రకారం విజయనగరం జిల్లా జనాభా 2,342,868.[1] ఈ జిల్లాకు సరిహద్దులుగా శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు, ఒడిషా రాష్ట్రం, బంగాళాఖాతం ఉన్నాయి. 2022 లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా, పార్వతీపురం రెవెన్యూ డివిజనులోని 11 మండలాలు పార్వతీపురం మన్యం జిల్లాలో చేర్చారు.అలాగే శ్రీ కాకుళం జిల్లా పాలకొండ రెవెన్యూ డివిజనులోని 4 మండలాలు ఈ జిల్లాలో కొత్తగా ఏర్పడిన చీపురుపల్లి రెవెన్యూ డివిజనులో చేరాయి. Map

విజయనగరం జిల్లా
.
.
Vizianagaram in Andhra Pradesh (India).svg
దేశంభారత దేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ప్రాంతంకోస్తా
ప్రధాన కార్యాలయంవిజయనగరం
విస్తీర్ణం
 • మొత్తం6,539 కి.మీ2 (2,525 చ. మై)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం23,42,868
 • సాంద్రత358/కి.మీ2 (930/చ. మై.)
భాషలు
 • అధికార భాషతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 0( )
అక్షరాస్యత51.82 (2001)
పురుషులు అక్షరాస్యత63.0
స్త్రీలు అక్షరాస్యత40.73
లోకసభ నియోజక వర్గంవిజయనగరం లోకసభ నియోజకవర్గం
జాలస్థలిhttps://www.guntur.ap.gov.in/

జిల్లా చరిత్రసవరించు

క్రీస్తు శకం 15 వ శతాబ్దం వరకూ కళింగ దేశం మీద ఎందరెందరో దండయాత్రలు చేసినా...ఇక్కడి భాషా సంస్కృతులు మారలేదు. గోదావరి నదికి అవతలి వారిని తెలుగువారని, ఇవతలి వారిని కళింగులని కొందరు భావించారు. ఒడిషా రాష్ట్రం సరిహద్దుగా ఉండడం వల్ల ఆ సంస్కృతి కొంత ఆంధ్రుల మీదా పడుతోంది. తెలంగాణా, రాయలసీమల లానే...కళింగం కూడా సమగ్రాంధ్రలో ఒక ప్రాంతం. ఒకప్పుడు ఇది చాలా వెనుక బడి ఉండేది. అందుచేత సంస్కృతాంధ్ర భాషాప్రభావం తక్కువ గానే ఉండేది. దీర్ఘతమసుడు అనే ఆయన అంగవంగ కళింగాలని ఏక దేశంగా చేసుకొని పాలించాడని మహా భారతంలో చెప్పబడింది. కళింగ దేశంలో ఏనుగులు ఎక్కువని అందుకే ఇక్కడి రాజులకి "గజపతులు" అని పేరు వచ్చిందని అర్ధశాస్త్రంలో ఉంది. విదేశీ చరిత్రకారులు ప్లీనీ, మెగస్తనీస్, హుయన్ చాంగ్ లు కళింగ దేశ నాగరికత గురించి రాశారు. కళింగ భూములు ఎంతో సారవంతమయినవని...బెల్లంకొండ నుంచి పాలకొండ వరకూ ఎన్నో కొండలున్నాయని ప్లీనీ రాశాడు. అక్కడి ప్రజలు మోటు వారయినా న్యాయం తప్పని వారని హుయాన్ చాంగ్ రాశాడు. క్రీస్తు పూర్వం తరువాత గంగరాజులు ఈ దేశాన్ని పాలించారు. బౌద్ధ, జైన మతాలు ఎక్కువ ప్రాభవం పొందాయి. సాలిహుండం మొదలు కొని జామి వరకూ బౌద్ధులూ జైనులూ నివసించారనడానికి ఆధారాలున్నాయి. అశోకుని సైతం అహింసావాదిగా మార్చిన అమృత సీమ ఈ కళింగసీమ అంటారు. ప్రస్తుత విజయనగరం జిల్లా పూర్వం శ్రీకాకుళం, విశాఖ జిల్లాలలో కలసి వుండేది. క్రీ.పూ. 4వ శతాబ్దం నాటికే గోదావరి మహానదుల మధ్య భాగాన్ని అంటే కటక్ నుంచి పిఠాపురం వరకూ ఉన్న ప్రాంతాన్ని కళింగదేశం అన్నారు. తూర్పు గాంగులు ఈ ప్రాంతాన్ని బహుకాలం పాలించారు.మధ్యయుగంలో దక్ష్ణిణకళింగంలో వడ్డాది మత్స్య వంశీయులు, జంతర్నారు, వీరకోతాం పల్లవులు మొదలగు చిన్నచిన్న రాజ్యాలు తలెత్తాయి.గోల్కొండ నవాబ్, మొఘల్ ఫౌజ్ దారీల అధికారం ఈ ప్రాంతంపై చెల్లింది.17వ శతాబ్దం మధ్యలో విజయనగరం, బొబ్బిలి సంస్థానాలు ఏర్పడ్డాయి.అంతకుముందు జయపురం ఒరిస్సా సంస్థానం, ఈ ప్రాంతమందు విస్తరించుకొని ఉండేది.ఆండ్ర, సాలూరు, సంగమవలస, పాచిపెంట , పార్వతీపురం మొదలగు చిన్న సంస్థానాలు జయపురం వారి చేతనే సృష్టించబడినవి.తూర్పు గాంగులకు, చోళులకు మధ్య రాజకీయ వైవాహిక సంబంధాలు ఏర్పడిన మీదట, ఇక్కడ ప్రాంతాల పేర్లు క్రమేపి మార్పు చెందాయి. గంగచోళ్ళపేట (చోళ+గంగ), చోడవరం మొదలైనవి.చోళ్ళు అనేవి ఆహారధాన్యాలలో ఒకటిగా ఉన్నాయి.వాటికి ఆపేరు కూడా చోళ సంబంధం వలన వచ్చిందే! తూర్పు గంగ రాజులలో మూడవ అనియంక భీముడు (12-11-1238) ప్రముఖుడు.భీమ నామధేయులు వడ్డాది మత్స్య వంశీకులలోనూ కనిపిస్తారు.భీమవరం అనేగ్రామం బాడంగి, శృంగవరపుకోట, చీపురుపల్లి తాలూకాలలో ఉంది. తూర్పు గాంగుల ముఖ్య దైవం మధుకేశ్వరుడు. గజపతినగరంలో అందుకే మధుపాడ అనే గ్రామం ఉంది.

బొబ్బిలికి 13 మైళ్ళదూరంలో 11వ శతాబ్దానికి చెందిన నీలేశ్వరాలయం నారాయణపురంలో ఉంది. అక్కడ రేపర్తి నాయకుల శాసనాలు కూడా లభించాయి.వారిలో మేడపరాజు (1100-1180) ప్రముఖుడు.ఇతని పేరుతోనే కాబోలు పెదమేడపల్లి, చినమేడపల్లి (గ) ఏర్పడినవి.అలానే జయపురం సంస్థానీయుల మూలపురుషుల పేర్లతో ఏర్పడిన గ్రామాలు, నందాపురం, భరిపురం, ముకుందరాజపురం, విశ్వనాధపురం, వినాయకపల్లి, బలభద్రారాజపురం మొదలైనవి.పూసపాటి వారి తొలి స్థావరాలలో ఒకటి కుమిలి. దీని ప్రాచీన నామధేయం కుంభిశాపురం.కుమిలి కోటకట్టిన కృష్ణంరాజు పితామహుడు పెదకృష్ణభూపతి ఇతని పేరుమీదన వెలసిందే పెదకృష్ణరాజపురం. గజపతినగరం, శృంగవరపుకోట, వియ్యంపేట, పార్వతీపురం, కురుపాం, సాలూరు, బొబ్బిలి, బాడంగి తాలూకాలలో మొత్తం 11 సీతారామపురాలు కలవు.పూసపాటి పాలకులలో దేవులపల్లి పాలకుడు సీతారామరాజు (1717-1741), ఇంకా దివాన్ సీతారామరాజు (1748-1794) పేర్ల మీదనే ఏర్పడి ఉండవచ్చును.కురుపాం సంస్థాన సంపాదకుడు సన్యాసిదొర. పెద సన్యాసిరాజు కుమారుడు శివరామరాజు (1740-1794). ఈతని కుమారుడు చిన సన్యాసిరాజు పేరుతోనే 1803లో శాశ్వత పరిష్కారం జరిగింది. ఇతని దత్తపుత్రుడు సీతారామరాజు 1830లో చనిపోగా అతని భార్య సుభద్రమ్మ 1841లో ఆమె మరణకాలంవరకు జమీను నిర్వహించింది. వీరి పేర్లమీదన పలు గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి.శృంగవరపు సంస్థానానికి మరియొకపేరు కాశీపురం. బొబ్బిలి యుద్ధంలో (1757) విజయనగరం పక్షం వహించాడు ముఖీకాశీపతిరాజు. కాశీపతిరాజపురం ఇప్పటికీ శృంగవరపుకోట తాలూకాలో ఉంది.అందువలన ఈ జిల్లాలో అధికభాగం గ్రామాలు లేదా ప్రాంతాల పేర్లు ఈప్రాంతాన్ని ఏలిన రాజవంశీయుల, జమిందారుల, తదాశ్రితుల రాజోద్యోగుల, కవి పండితుల గృహనామాలబట్టి ఏర్పడినవి. 17వశతాబ్దం నుంచి ఈప్రాంతంనందు గ్రామాలు ఎక్కువగా ఏర్పడినట్లు గ్రహించవచ్చు. వలసలు ఎక్కువగా ఉండటంవలన ఒకప్రాంతంనుండి వేరొక ప్రాంతానికి వలసిపోయారు. అందుకే పెక్కుగ్రామాల పేర్లు వలస చివరగా ఉండును.

విజయనగరానికి ఆపేరు ఎలాగ పెట్టారో తెలుసుకోవడం ఆసక్తిదాయకంగా వుంటుంది. విజయనామ సంవత్సరం (1713) విజయదశమి జయవారం నాడు విజయరామరాజు పేరన నిర్మించబడింది.కావున పంచజయశబ్దపూర్వకంగా విజయనగరం అనే పేరు సార్థకం చేయబడింది.

భౌగోళిక స్వరూపంసవరించు

వాతావరణంసవరించు

విజయనగరం-వాతావరణం
నెల జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు సంవత్సరం
సగటు అధిక °C (°F) 38.7 31.3 36.2 37.2 37.0 35.1 32.9 32.8 33.3 31.9 30.2 29.8 33.87
సగటు అల్ప °C (°F) 17.2 19.1 23.2 26.1 27.0 26.8 25.7 26.3 25.7 22.8 19.5 17.1 23.04
అవక్షేపం mm (inches) 11.4 7.7 7.5 27.6 57.8 105.6 134.6 141.2 174.8 204.3 65.3 7.9 945.7
Source: [2]

ఆర్ధిక స్థితి గతులుసవరించు

పరిశ్రమలుసవరించు

 
ఫేకర్ ఖనిజ పరిశ్రమ (FACOR main unit of Ferro-alloy production unit)

ఈ జిల్లాలోని ప్రారిశ్రామిక అభివృద్ధి ప్రధానంగా వ్యవసాయ పంటల మీద ఆధారపడింది. వీనిలో నార మిల్లులు, చక్కెర కర్మాగారాలు, ధాన్యం, నూనె మిల్లులు, పెంకుల తయారీ ముఖ్యమైనవి. ఇక్కడి ఖనిజాల్ని ఫేకర్, ఇతర పరిశ్రమలు వినియోగిస్తున్నాయి. ఈ జిల్లాలో సుమారు 520 కర్మాగారాలు నమోదు చేయబడి ఇంచుమించు 27,800 కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి.

పాలనా విభాగాలుసవరించు

విజయనగరం జిల్లా మండలాల పటం (Overpass-turbo)


 
పార్వతీపురం, విజయనగరం రెవెన్యూడివిజన్లుతో ఉన్న పూర్వపు విజయనగరం జిల్లా

2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు భౌగోళికంగా విజయనగరం జిల్లా 34 మండలాలు, [3] 1552 రెవెన్యూ గ్రామాలు (అందులో 67 నిర్జన గ్రామాలు), 2 రెవెన్యూ డివిజన్లుతో కొనసాగుతుంది. 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత ఈ జిల్లా 27 మండలాలతో ఏర్పడింది.2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణలో పార్వతీపురం రెవెన్యూ డివిజనులోని 11 మండలాలు కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో రెవెన్యూ డివిజనుతో కలిపి చేరాయి.అలాగే శ్రీ కాకుళం జిల్లా, పాలకొండ రెవెన్యూ డివిజను లోని 4 మండలాలు 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణలో విజయనగరం జిల్లాలో చేరాయి.[4]

పునర్వ్యవస్థీకరణ తరువాత జిల్లాలోని మండలాలుసవరించు

గమనిక:చీపురుపల్లి రెవెన్యూ డివిజను లోని 6 నుండి 9 వరకు గల మండలాలు శ్రీకాకుళం జిల్లా, పాలకొండ రెవెన్యూ డివిజను నుండి విజయనగరం జిల్లాలో చేరాయి.

పార్వతీపురం మన్యం జిల్లాలో చేరిన మండలాలుసవరించు

 1. పార్వతీపురం మండలం
 2. సీతానగరం మండలం
 3. బలిజిపేట మండలం
 4. సాలూరు మండలం
 5. పాచిపెంట మండలం
 6. మక్కువ మండలం
 7. కొమరాడ మండలం
 8. గరుగుబిల్లి మండలం
 9. జియ్యమ్మవలస మండలం
 10. గుమ్మలక్ష్మీపురం మండలం
 11. కురుపాం మండలం

గమనిక: పైవాటిలో 1 నుండి 8 వరకు గల మండలాలు పార్వతీపురం రెవెన్యూ డివిజనులో, 9 నుండి 11 వరకుగల 3 మండలాలు పాలకొండ రెవెన్యూ డివిజనులో చేరాయి.

రెవెన్యూ డివిజన్లుసవరించు

2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముందు జిల్లా విజయనగరం, పార్వతీపురం అనే రెండు రెవెన్యూ డివిజన్లుగా విభజింపబడింది, పునర్వ్యవస్థీకరణ తరువాత ఈ జిల్లా 3 రెవెన్యూ డివిజన్లుతో ఏర్పడింది.అందులో విజయనగరం పాత రెవెన్యూ డివిజను కాగా, బొబ్బిలి, చీపురుపల్లి రెవెన్యూ డివిజన్లు జిల్లాలో కొత్తగా ఏర్పడినవి,

మరి కొన్ని విశేషాలుసవరించు

 • నదులు: గోస్తని, చంపావతి, నాగావళి, గోముఖనది, సువర్ణముఖీ, వేగావతి. నాగావళిని దిగువ ప్రాంతాల్లో లాంగుల్య నది అని వ్యవహరిస్తారు.
 • ఆంధ్రుల పౌరుషాన్ని చాటిచెప్పిన బొబ్బిలి యుద్ధం జరిగిన జిల్లా.

జనాభా లెక్కలుసవరించు

2011 జనాభా లెక్కల ప్రకారం విజయనగరం జిల్లా జనాభా 2,342,868,[1] ఇది లాట్వియా (Latvia) దేశ జనాభాకి, అమెరికాలో న్యూ మెక్సికో (New Mexico) [5] రాష్ట్ర జనాభాకి సమానం [6] ఇది భారతదేశంలో జనాభా ప్రకారం 193వ స్థానం ఆక్రమించింది. (640 జిల్లాలలో).[1] ఇక్కడ జనాభా సాంధ్రత 358 inhabitants per square kilometre (930/sq mi) .[1] జనాభా వృద్ధి రేటు (2001-2011) 4.16 %.[1] విజయనగరంలో ప్రతి 1000 మంది పురుషులకు 1016 మహిళలు ఉన్నారు,[1] అక్షరాస్యత రేటు 59.49 %.[1]

ఈ జిల్లా జనాభా 1901 లెక్కల ప్రకారం 9,58,778. ఇది శతాబ్ద కాలంలో 2001 సంవత్సరానికి 22,49,254 చేరుకుంది.[7]వీరిలో 11,19,541 మంది పురుషులు, 11,29,713 మహిళలు. ఇక్కడ 1000 మంది పురుషులకు 1009 స్త్రీలు ఉన్నారు. ఈ జిల్లా మొత్తం 6,539 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. జనాభా సాంధ్రత 344 persons per km². చివరి దశాబ్ద కాలంలో జనాభా వృద్ధి 6.55 శాతం.

ఈ జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు జనాభా 2,38,023, షెడ్యూల్డ్ తెగలు జనాభా 2,14,839. ఇది జిల్లా మొత్తం జనాభాలో 10.58%, 9.55%.

ఈ జిల్లా ప్రజలలో 18.37 లక్షల మంది అనగా 82% పల్లెల్లో నివసించగా 4.12 లక్షల మంది అనగా 18% పట్టణాలలో నివసిస్తున్నారు. ఈ జిల్లాలో 12 పట్టణాలు ఉన్నాయి. అవి: విజయనగరం, చీపురుపల్లి, గాజులరేగ, కనపాక, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, శ్రీరాంనగర్, నెల్లిమర్ల, కొత్తవలస, చింతలవలస, జరజాపుపేట, గజపతినగరం. ఈ జిల్లాలోని ఒకే ఒక్క మొదటి తరగతి పట్టణం విజయనగరంలో 1,95,801 మంది జీవిస్తున్నారు.

2001 జనాభా లెక్కల ప్రకారం విజయనగరం జిల్లా జనాభా మొత్తం 22,45,100.

సంస్కృతిసవరించు

 
విజయనగరం, తూర్పు కోస్తా రైల్వేలో ముఖ్యమైన కూడలి

విజయనగరం జిల్లా ప్రజల సాంఘిక కట్టుబాట్లు చిన్న తేడాలతో దక్షిణ భారతీయ పద్ధతిలో ఉంటాయి. ఇక్కడి ప్రజలు మృదు స్వభావం, జాలిగలిగి, గట్టి కుటుంబ వ్యవస్థను కలిగివుంటారు. గురజాడ అప్పారావు నవలలు, నాటకాలు, గీతాలు, కథలు ఈ ప్రాంత భాషా సంస్కృతులను ప్రతిబింబిస్తాయి.

ఈ ప్రాంతంలో ప్రధానమైనది హిందూ మతం. వీరు జరుపుకునే పండుగలలో సంక్రాంతి, ఉగాది, శ్రీరామ నవమి, మహాశివరాత్రి, దీపావళి, వినాయక చవితి, విజయదశమి ముఖ్యమైనవి. శ్రీరామ నవమి, వినాయక చవితి, దసరా ఉత్సవాలలో భాగంలో జరిగే నవరాత్రోత్సవాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఆ తొమ్మిది రోజులు నాటకాలు, హరికథలు, బుర్రకథలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్న పట్టణాలు కళకలలాడుతాయి. ఇక్కడి గ్రామదేవత పండుగలు బాగా ప్రసిద్ధిచెందాయి. వీటన్నింటిలోకి విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి పండుగ ప్రధానమైంది కాగా శంబర పోలమ్మ జాతర, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం పట్టణాలలో జరుగుతాయి.

వీరి ప్రధాన ఆహారంలో అన్నంతో కలిపి పప్పు, రసం లేదా సాంబారు, కూరలు, ఆవకాయ, పెరుగుతో పరిపూర్ణంగా ఉంటుంది.

పశుపక్ష్యాదులుసవరించు

అరణ్యాలు ఈ జిల్లా ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రధానపాత్ర పోషిస్తుంది. జిల్లాలోని అరణ్యాల రకాలు: 1. దక్షిణ ఉష్ణమండల మిశ్రమ ఆకురాల్చే అడవులు, 2. ఉత్తర ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులు, 3. దక్షిణ ఉష్ణమండల పొడి మిశ్రమ ఆకురాల్చే అడవులు, 4. పొడి ఆకురాల్చే పచ్చని అడవులు 5. పొడి సతత హరిత అడవులు.

దట్టమైన కొండ ప్రాంతాలలో జంతుజాలం నివసిస్తూ; కొన్ని జాతులు అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు అరణ్యాలను నరకడం, అదుపులేని వేట. ఇక్కడి ప్రధానమైన జంతువులు గబ్బిలాలు, ఎలుగుబంట్లు, అడవి దున్న, నక్క, హైనా, తోడేలు, ముంగిస మొదలైనవి. ఇక్కడి పక్షులలో పావురాలు, కాకి, పిచ్చుక మైనా మొ. ముఖ్యమైనవి.

విద్యాసంస్థలుసవరించు

 
కోరుకొండ సైనిక పాఠశాల ప్రధాన ద్వారము

2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు విజయనగరం జిల్లా విద్యావంతుల పరంగా వెనుకబడింది. అక్షరాస్యత రేటు 51.82% రాష్ట్ర సరాసరి 61.55% కన్నా బాగా తక్కువ. ఈ జిల్లాలో 2379 ప్రాథమిక పాఠశాలలు, 462 ప్రాథమికోన్నత పాఠశాలలు, 341 ఉన్నత పాఠశాలలు (2004-2005 అంచనాల ప్రకారం) ఉన్నాయి. అదే ఉన్నత విద్యలో 81 జూనియర్, 33 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ 14 పారిశ్రామిక శిక్షణా సంస్థలు, 2 పాలిటెక్నిక్ కళాశాలు ఉన్నాయి. అదే 9 బి.ఇడి. కళాశాలు, ఒక ఎమ్.ఎడి. కళాశాల, ఒక సంస్కృత కళాశాల, ఒక సంగీత నృత్య కళాశాలలు కూడా ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం క్రింద ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్, 5 ఇంజినీరింగ్ కళాశాలలు, 2 న్యాయ కళాశాలలు, ఒక వైద్య కళాశాల ఈ జిల్లాలో స్థాపించబడ్డాయి.

 
డెంకాడ ఆనకట్ట

ఈ జిల్లాలో 38 గ్రంథాలయ శాఖలు ఉన్నాయి. వీటిని జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్వహిస్తుంది. ఇది ప్రతి మండలంలో 1-2 చొప్పున ఉన్నాయి.

ఆకర్షణలుసవరించు

 
విజయనగరం కోట గోడలు

జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ కలిపి 2017లో 44 లక్షల మంది పైచిలుకు, 2016లో 55 లక్షల పైచిలుకు పర్యాటకులు సందర్శించారని ప్రభుత్వ అంచనా.[8]

క్రీడలుసవరించు

విజయనగరం యువరాజు పూసపాటి విజయానంద గజపతి రాజు క్రికెట్ ఆటలో సర్ విజ్జీగా ప్రసిద్ధిచెందాడు. విజ్జీ ఒకప్పుడు భారత క్రికెట్ టీమ్ కు కెప్టెన్ గా విదేశాలు పర్యటించాడు. ఆ తర్వాత నిర్మాహకుడుగా, వ్యాఖ్యాతగా కూడా పనిచేశాడు. పిదప ఇతడు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షునిగా ఎంపికయ్యాడు. న్యూఢిల్లీ లోని ఫిరోజ్ షా కోట మైదానం నిర్మాణం కోసం భారీగా విరాళం ఇచ్చిన గొప్ప దాత.ఇతని స్మారకార్ధం విజయనగరం పట్టణంలో విజ్జీ స్టేడియం నిర్మించబడింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని మొదటి తరగతి క్రికెట్ ఆడే క్రీడా ప్రాంగణం.

జిల్లాలో ప్రముఖ ఉత్సవాలుసవరించు

ప్రముఖవ్యక్తులుసవరించు

 • మహాకవి గురజాడ అప్పారావు (1862 - 1915) జన్మ స్థానం.
 • హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు (1864 - 1945) జన్మస్థలం.
 • అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి (1878 - 1936) ఉభయ భాషా పండితులు, తపోధనులు. వీరు వాసిష్ఠ గణపతి మునిగా ప్రసిద్ధులు.
 • పద్మశ్రీ పురస్కారం పొందినద్వారం వెంకటస్వామి నాయుడు (1893 - 1964) ఒక గొప్ప వయొలిన్ (వాయులీనం) విద్వాంసుడు. సంగీత కళానిధి పురస్కార గ్రహీత.
 • చెలికాని అన్నారావు (1908 -?) తిరుమల బాలాజీ సన్నిధిలో జీవితాన్ని చరితార్థం చేసుకున్న కార్యనిర్వహణాధికారి. వీరు జిల్లాలోని బొబ్బిలి రాజవంశంలో జన్మించారు.
 • సుప్రసిద్ధ తెలుగు గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు (1922 - 1974) గారు సంగీతం నేర్చుకున్నది విజయనగరంలోనే.
 • సాలూరి రాజేశ్వరరావు (1922 - 1999): తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించి, తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకులలో ఒకడు.
 • సుప్రసిద్ద తెలుగు గాయకురాలు పి. సుశీల గారి జన్మస్థలం. 50 సంవత్సరాల సినీ జీవితములో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో 25 వేలకు పైగా సినిమా పాటలు పాడిన విదుషీమణి.
 • కలియుగ భీమగా పిలువబడే కోడి రామమూర్తి నాయుడు జన్మ స్థలం.
 • విజయనగరం యువరాజు పూసపాటి విజయానంద గజపతి రాజు క్రికెట్ ఆటలో సర్ విజ్జీగా ప్రసిద్ధిచెందారు. విజ్జీ ఒకప్పుడు భారత క్రికెట్ టీమ్ కు కెప్టెన్ గా విదేశాలు పర్యటించాడు. ఆ తర్వాత నిర్వాహకుడు, వ్యాఖ్యాతగా కూడా పనిచేశాడు. పిదప ఇతడు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు. న్యూఢిల్లీ లోని ఫిరోజ్ షా కొట్లా మైదానం నిర్మాణం కోసం భారీగా విరాళం ఇచ్చిన గొప్ప దాత. ఇతని స్మారకార్ధం విజయనగరం పట్టణంలో విజ్జీ స్టేడియం నిర్మించబడింది.
 • కాళ్ల సత్యనారాయణ (1948 - 2018): చిత్రకారుడు. విజయనగరం జిల్లాలో జన్మించాడు.

నియోజకవర్గాలుసవరించు

నియోజక వర్గ పునర్విభజనలో విజయనగరం జిల్లాలోని పార్లమెంట్ నియోజక వర్గాలు రెండు నుండి ఒకటికి తగ్గిపోయాయి.

లోకసభ నియోజకవర్గాలుసవరించు

శాసనసభ నియోజకవర్గాలు:సవరించు

నియోజకవర్గ పునర్విభజనలో విజయనగరం జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాలు 14 నుండి తొమ్మిదికి తగ్గిపోయాయి.

రద్దైన నియోజకవర్గాలుసవరించు

2009 నుంచి ఈ దిగువ నియోజకవర్గాలు, నియోజకవర్గం హోదా కోల్పోయాయి

చిత్రమాలికసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; districtcensus అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 2. Handbook of Statistics, Vizianagaram district, 2004-2005, compiled and published by The Chief Planning Officer, Vizianagaram
 3. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో విజయనగరం జిల్లా తాలూకాల వివరాలు Archived 2007-09-30 at the Wayback Machine. జూలై 28, 2007న సేకరించారు.
 4. "Wayback Machine" (PDF). web.archive.org. Retrieved 2022-04-23.
 5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179
 6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 7 (help)
 7. "Census GIS India". Archived from the original on 2015-04-25. Retrieved 2012-01-13.
 8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఫుట్‌ఫాల్స్ సమాచారం (ఆర్కైవ్)
 9. "విజయనగరం సిరిమానోత్సవమంటే ఏంటి?". BBC News తెలుగు. Retrieved 2022-04-26.

బయటి లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.