తిమ్మరాజు (కవి)
తిమ్మరాజు ప్రముఖ తెలుగు కవి.
ఈకవి రాజవంశంలో జన్మించాడు; ఓబలరాజు కొడుకు; అనంతరాజు మనుమడు. మంగళగిరి శ్రీనృసింహస్వామి కంకితము చేసి పరమయోగి విలాసము అనెడి యైదాశ్వాసముల పద్యకావ్యమును రచించెను. ఈపద్యకావ్యము నితడు తాళ్ళపాక తిరువెంగళనాథుడు చేసిన ద్విపదకావ్యమును జూచియైనను జేసియుండవచ్చును; లేదా స్వతంత్రముగా నైనను జేసియుండవచ్చును. ఇరువురు కవులును నించుమించుగా సమకాలిను లయినందున, ఎవ్వరే గ్రంథమును ముందుగా జేసిరో నిర్ధారణము చేయుటకు శక్యము కాదు.
ఇది పరమయోగివిలాసములోని ప్రధమపద్యము.
శా. శ్రీరంజిల్లగ బానకం బనిశమున్ సేవింపగా దద్గుణం
బారూఢిం బొలుపొందెనో యనగ యోగానందమాధుర్యల
క్ష్మీరమ్యాకృతి నొప్పుమంగళగిరి శ్రీమన్నృసింహుడు స
త్కారుణ్యామృతవృష్టిచే దనుపు నిత్యంబుం బ్రపన్నావళిన్.
ఈకవిత్వము సర్వవిధములచేతను ద్విపదకావ్యమునకంటె శ్రేష్ఠతరముగా నున్నది. ఈకవి కృష్ణదేవరాయనియల్లు డై నయళియరామరాజునకు దోడబుట్టిన పడుచైన కోనమాంబకు కుమారు డై నందున, వసుచరిత్రము కృతినందిన తిరుమలదేవరాయనికిని మేనల్లుడే. ఆకాలమునం దితడు కృష్ణా మండలములోని కొండవీటిసీమకు పరిపాలకుడుగా నుండెను. కవి తాను రామరాజాదులకు మేనల్లు డయినట్లును, కొండవీటికి ప్రభు వయినట్లును, పరమయోగివిలాసములోని యీక్రిందిపద్యములో జెప్పుకొన్నాడు-
సీ. ఏరాజుముత్తాత భూరిసామ్రాజ్యలక్ష్మీధురీణభుజుండు సిద్ధనృపతి
యేనరాధిపుతాత నానార్థిసంతానసంతానశాఖి యనంతశౌరి
యేగుణాఢ్యునితండ్రిభోగ వైభవనూత్నసుత్రాము డోబలక్షోణిభర్త
యేవిభుం డలెరామభూవిభు తిరుమలప్రభువేంకటేంద్రుల భాగినేయు
డట్టితిమ్మభూవరు డాజిహతతురుష్క
రక్తశోణనదీకృతప్రబలసలిల
వితతకృష్ణానదీకు డూర్జితుడు కోన
మాంబసుతుడు శ్రీరంగరాజానుజుడు.
మ. సకలశ్రీయుతకొండవీటినగరీసామ్రాజ్యధౌరేయతా
ధికతన్ మీరుచు నొక్కనా డచలభక్తిస్ఫూర్తి శ్రీవైష్ణవ
ప్రకరంబు న్భజియింపుచున్ హరికథాప్రస్తావనన్ దివ్యయో
గికథల్ వించు దదర్థకావ్యరచనాకేళీసమాసక్తుడై.
ఉ. ఉన్నతి మీరగా బరమయోగివిలాసముపేరికావ్య ము
ద్యన్నవభావబంధురరసాన్వయసన్నుతశబ్దశుద్ధిసం
పన్నత నిట్లు సిద్ధనరపాలునియోబళతిమ్మభువరుం
డెన్నిక జేయ బూని మది నెంతయు సంతస మొందు ధన్యతన్.
పయిపద్యములనుబట్టి యీకవి కావ్యాలంకారసంగ్రహాదులకృతి భర్తలగునరసభూపాలాదులతోను, కృతికర్తలగు రామరాజభూషణాదులతోను, సమకాలికు డగుట స్పష్ట మగునున్నది. కాబట్టి యీ తిమ్మరాజు 1570వ సంవత్సరము మొదలుకొల 1600వ సంవత్సర ప్రాంతములవరకును ప్రసిద్ధు డయియుండవచ్చును. ఈకవి కవితమునం దసమాన మయినప్రజ్ఞ గలవాడు; ఇతడు రచియించిన పరమయోగి విలాసమును నద్భుతములైన చరితములను కలిగియున్నది. పరమయోగి విలాసములోని యీక్రిందిపద్యములవలన కవిత్వప్రౌఢిమ కొంత తేటపడవచ్చును-
ఉ. రెండవమౌనిపుంగవుడు బ్రేమసమాహ్వాయ మైనప్రమ్మిదన్
నిండగ భక్తియన్ చమురు నించి హృదబ్జము వత్తిగాగ ను
ద్ధండతరప్రబోధసముదంచితదీపము సర్వలోకనా
ధుం డగుచక్రికిం బ్రియముతోడ సమర్పణ చేసె నయ్యెడన్. అ. 1.
ఉ. ఇంతుల గూడి చిట్టకము లి ట్లొనరింపగ నించు కేనియున్
వింతతెరంగు లేక ధరణీధరముంబలె నున్నయాదృఢ
స్వాంతుని జూచి రాపతిమచక్కిలిగింతలువోలె గంటిరే
మెంతయు రిత్తవోయె మసయిందరిచేష్టలు నంచు నవ్వుచున్. ఆ. 2.
ఉ. దేవుడొ మౌనియో యని మదిం దలపోతలు నాకె కాని నిన్
వేవురు వేయిచందముల నిందయొనర్చెద రిప్డు మూగయన్
పావులనోరు నీయెడమపాదతలంబున దన్నినట్లుగా
నీవొక యింతయావురని యేడ్వగదన్న కుమారరత్నమా. ఆ. 1.
మూలాలు
మార్చు- ఆంధ్ర కవుల చరిత్రము, కందుకూరి వీరేశలింగం పంతులు, హితకారిణీ సమాజము, రాజమండ్రి, పేజీలు: 185-7.