తెలుగు విజ్ఞాన సర్వస్వం

(తెలుగు విజ్ఞాన సర్వస్వము నుండి దారిమార్పు చెందింది)

విజ్ఞాన సర్వస్వం, అనగా మానవాళికి తెలిసిన జ్ఞానాన్ని ఒకచోట పొందుపరచిన పుస్తకాలు లేక మాధ్యమాలు. సాధారణంగా విద్యావేత్తలు విజ్ఞాన సర్వస్వ రచనలో పాలు పంచుకుంటారు. ప్రాచీన కాలంలో ఒక్క పండితుడు విజ్ఞాన సర్వస్వం రాయకలిగినా, తరువాతికాలంలో జ్ఞానం విపరీతంగా అభివృద్ధి కావడంతో, ఒక్కరే ఈ పనిచేయటం కష్టసాధ్యం.

తెలుగు భాషలో పెద్ద బాలశిక్ష మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వం. ఆ తరువాత కొమర్రాజు లక్ష్మణరావు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం, తెలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వం ప్రచురణ అయ్యాయి. తెలుగు వికీపీడియా ఆధునిక అంతర్జాల యుగంలో ప్రతిఒక్కరు పాల్గొనగల విజ్ఞాన సర్వస్వం. 2004 తరువాత పెద్దబాలశిక్షపేరుతో చాలా పుస్తకాలు ప్రచురించబడ్డాయి. వాటిలో గాజుల సత్యన్నారాయణ సంకలనంచేసిన తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష ప్రజాదరణ పొందింది.

పెద్ద బాలశిక్ష

మార్చు

ప్రధాన వ్యాసం: పెద్ద బాలశిక్ష

 
పెద్దబాలశిక్ష 11 వ పేజి

1832 లో మేస్తర్ క్లూలో (Clu Low) అనే తెల్లదొర, తన ఆశ్రితుడైన పుదూరు చదలవాడ సీతారామశాస్త్రి చేత బాలశిక్ష అనే గ్రంథాన్ని రచింపచేశాడు. ఇతని రచనా ప్రణాళికను చాలా జాగ్రత్తగా కుర్రవాళ్ళ గ్రహణశక్తిని దృష్టిలో వుంచుకొని రూపొందించాడు. ఇటువంటి పుస్తకం కోసమే ఆవురావురమంటూ ఎదురు చూస్తున్న మన దేశం దీనిని రెండు చేతులా ఆహ్వానించింది. 1856లో అంటే మొదటి ముద్రణకు రెండు పుష్కరాల తర్వాత వెలువడిన బాలశిక్షలోని పుటల సంఖ్య 78. డెమ్మీ ఆక్టావో సైజు. 1865లో అంటే రమారమి పదేళ్ళ తర్వాత ముద్రణలో పుటల సంఖ్య 90. అంటే పన్నెండు పేజీలు పెరిగాయన్నమాట. పాత ముద్రణలో లేని సాహిత్య విషయాలను, ఛందస్సు, సంస్కృత శ్లోకాలు, భౌగోళిక విషయాలను యిందులో చేర్చారు. దానిని బాల వివేకకల్పతరువుగా రూపొందించారు. అందుకనే అప్పటిదాకా బాలశిక్షగా ప్రచారంలోవున్న పుస్తకం పెద్ద బాలశిక్షగా కొత్త పేరును దాల్చింది. ఈ పెద్ద బాలశిక్ష ఇందులో విషయపరిజ్ఞానికి - అంటే భాషాసంస్కృతులకు కావాల్సిన పునాదిరాళ్ళనదగిన భాషా విషయాలు - అక్షరాలు, గుణింతాలు వత్తులు, సరళమైన పదాలు- రెండు మూడు నాలుగు అక్షరాలతో కూడిన మాటలు, తేలిక వాక్యాలు - నీతి వాక్యాలు, ప్రాస వాక్యాలు, సంప్రదాయ సంస్కృతికి సంబంధించినవీ, అందరూ తెలుసుకోదగ్గవీ నాటికి తెలిసిన చారిత్రక, భౌగోళిక, విజ్ఞాన సంబంధ విషయాలను రూఢి వాచకాలను ఈ పుస్తకం ఆది స్వరూపంలోనే ఆనాడు పూదూరువారు పొందుపరచారు.

ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం

మార్చు

లక్ష్మణరావు సాహితీ జీవితంలో మిగిలినవన్నీ ఒకయెత్తు, విజ్ఞాన సర్వస్వం ఒక్కటీ ఒకయెత్తు. ప్రపంచ విజ్ఞానాన్ని తెలుగువారందరికీ పంచిపెట్టాలని ఆయన తపించిపోయాడు. బ్రిటిష్ ఎన్సైక్లోపీడియా తరహాలో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని వెలువరించాలనేది ఆయన ప్రబల వాంఛ. 1912-13 కాలంలో ఈ బృహత్కార్యానికి పూనుకొన్నాడు. తాను ప్రధాన సంపాదకునిగానే కాదు, ప్రధాన రచయితగా కూడా పనిచేశాడు. లక్ష్మణరావుకు అనేక శాస్త్ర విషయాలలో ప్రవేశం ఉండేది. స్వయంగా పండితుడే గాక నిష్పాక్షిక పరిశోధన, సమతుల్యత ఆయన స్వభావాలు. ఎందరెందరో మహనీయులు ఆయనకు తోడుగా శ్రమించినా, లక్ష్మణరావు రాసినన్ని వ్యాసాలు ఇంకెవరూ రాయలేదు. ఏ విధమైన సంపదా, ధన సహాయమూ, ప్రభుత్వాదరణా లేకుండానే అంత బ్రహ్మాండమైన ప్రయత్నాన్ని తలకెత్తుకొన్నాడు.

గాడిచర్ల హరిసర్వోత్తమరావు, ఆచంట లక్ష్మీపతి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, రాయప్రోలు సుబ్బారావు వంటివారు ఆయనకు తోడు నిలిచారు. ఒక్కరోజు కూడా విడవకుండా లక్ష్మణరావు, హరిసర్వోత్తమరావు మద్రాసు కన్నెమెరా గ్రంథాలయానికి వెళ్ళి, అది మూసేంతవరకు ఉండి, కుప్పలు తెప్పలుగా ఉన్న పుస్తకాలనుండి సమాచారం సేకరించేవారు.

అలాగని వారి రచనలు అనువాదాలకు పరిమితం కాలేదు. లక్ష్మణరావే ఒక విజ్ఞాన సర్వస్వం. ప్రతివిషయాన్ని కూలంకషంగా పరిశోధించి, సమగ్రమైన స్వతంత్ర వ్యాసంగా వ్రాసేవాడు. మొదట 'అ'కారాదిగా నెలకు నూరు పేజీల చొప్పున దీనిని వెలువరించారు. రేయింబవళ్ళు శ్రమించి, మూడు సంపుటములు ప్రచురించారు. ఇందులో సైన్సు, భాష, ఖగోళశాస్త్రము, చరిత్ర, కళ వంటి వివిధ విషయాలపై ఉన్న నూరు వ్యాసాలలో ఆయన స్వయంగా 40 వ్యాసాలను కూర్చాడు. అధర్వవేదం, అద్వైతం, అభిజ్ఞాన శాకుంతలం, అలంకారాలు, అష్టాదశ మహాపురాణాలు, అట్ట బైండు, అష్టాధ్యాయి వంటి ఎన్నో వైవిధ్యమైన విషయాలపై ఆయన వ్యాసాలు రాశాడు.

"అ"కారంతో మూడు సంపుటాలు పూర్తిచేసిన తరువాత "ఆంధ్ర" సంపుటాన్ని తయారుచేయడం కోసం పూనుకొన్నాడు. తెలుగువారి గురించి అప్పటికి జరిగిన పరిశోధన అత్యల్పం. కనుక మౌలిక పరిశోధన అవుసరమైంది. లక్ష్మణరావు రాత్రింబవళ్ళు శిలాశాసనాలు, ఇతర గ్రంథాలు పరిశోధనలో గడిపాడు. ఆ సమయంలో ఆయనకు ఉబ్బసం వ్యాధి ఉధృతమైంది. మదనపల్లెలో కొంతకాలం విశ్రాంతి తీసుకొని మళ్ళీ మద్రాసు వచ్చాడు. ఆంధ్ర సంపుటం రాయడానికి శాసనాలు పరిశీలిస్తూనే 1923 జూలై 12న లక్ష్మణరావు మరణించాడు.

అలా ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం "అ"కారం మూడు సంపుటాలతో ఆగిపోయింది. ఆ రోజుల్లో విజ్ఞాన సర్వస్వం అంత చక్కని ముద్రణ, అంత చక్కని కాగితం, చిత్రాలు, పటాలు భారతదేశంలో ఏ ప్రచురిత గ్రంథాలోను కనిపించలేదట. చేసిన ప్రతిపనిని పరిపూర్ణంగా చేయడం ఆయన అలవాటు. తర్వాత కాశీనాధుని నాగేశ్వరరావు మరింత మంది పండితుల సహకారంతో తిరిగి 'అ'కార పరంపరనే రెండు ముచ్చటైన సంపుటాలలో ప్రచురించాడు.

తెలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వం

మార్చు

1947లో చెన్నయిలో ప్రారంభమైన తెలుగు భాషా సమితి బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షతన ఆంధ్రవిజ్ఞాన సర్వస్వము కార్యక్రమాన్ని కొనసాగించి, అకారాది క్రమంలో కాక విషయానుక్రమంగా రూపకల్పన చేసింది. ఆ తరువాత హైదరాబాదునుండి పనిచేసి 14 కోశాల విజ్ఞాన సర్వస్వమును ప్రచురించింది. 1986 అక్టోబరు 15 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయములో భాగమై ఇప్పుడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వ కేంద్రము [1] అని పిలవబడుతున్నది. క్రింద ఇవ్వబడిన శీర్షికలకు, దగ్గరి సంబంధమున్నతెలుగు వికీపీడియా వ్యాసాల లింకులు ఇవ్వబడినవి.

  1. తెలుగు సంస్కృతి సంపుటి-I
  2. లలిత కళలు
  3. న్యాయ పరిపాలనా శాస్త్రంలు
  4. జీవ శాస్త్రములు
  5. సాంఘిక శాస్త్రములు
  6. అభియాంత్రికత, సాంకేతికం (?) (Engineering and Technology)
  7. గణిత ఖగోళ శాస్త్రంలు
  8. మతములు- దర్శనములు
  9. తెలుగు సంస్కృతి సంపుటి-II
  10. విశ్వసాహితి [2]
  11. భారత భారతీ

తెలుగు వికీపీడియా

మార్చు

ప్రధాన వ్యాసం: తెలుగు వికీపీడియా

2001 లో మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియాను జిమ్మీ వేల్స్, లారీ సాంగెర్ ఆరంభించారు. దీని ముఖ్య ఊహ, స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం మరియుమార్చగలగటం. పలువురి ఆదరాభిమానాన్ని చూరగొని విజయవంతంగా నడక సాగించి, ప్రజాదరణ పొందిన వెబ్సైటులలో 7 వ స్థానంలోకి వచ్చింది. ప్రపంచ నలుమూలల నుండి సమాచారం సేకరించడం భద్రపరచడం సాధ్యమైన కార్యమేనని రుజువు కావడంతో తరువాతి దశలలో ప్రపంచ భాషలన్నిటిలో ఆయా భాషాభిమానుల కృషితో వికీపీడియా అనే విజ్ఞాన సర్వస్వం అభివృద్ధి పధంలో నడవటం మొదలైంది. దానిలో ఒక భాగమే తెలుగు వికీపీడియా ఆవిర్భావం. ద్వారా తెవికీ 2003 డిసెంబర్ 9న ఆవిర్భవించింది. నిరంతర కృషి వలన తెవికీ దినదిన ప్రవర్థమానమవుతూ వచ్చింది. ప్రస్తుతం తెలుగు వికీపీడియా ప్రస్తుత సభ్యుల సంఖ్య 1,31,689, వ్యాసాల సంఖ్య 99,381. ప్రధాన వర్గాలు :ఆంధ్ర ప్రదేశ్, భాష, సంస్కృతి, భారత దేశము, ప్రపంచము, విజ్ఞానము, మరియుసాంకేతికం

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష

మార్చు

గాజుల సత్యన్నారాయణ రాసిన "తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష" [3] మొదటిసారిగా జనవరి 2004లో అన్నపూర్ణ పబ్లిషర్స్ విడుదల చేశారు. ఇది అత్యంత ప్రజాదరణ పొందింది. కేవలం 116 రూపాయలు విలువతో భాష విజ్ఞానము, సంస్కృతి సంప్రదాయం, బాలానందం, శతక, నీతికథా, సంఖ్య శాస్త్రము, ఆధ్యాత్మిక, కంప్యూటర్, గణిత శాస్త్ర, విజ్ఞాన, వాస్తు, పంచాంగమ, మహిళ, ఆరోగ్యం, క్రీడారంగము, ఆంధ్రప్రదేశ్, భారతదేశం, ప్రపంచం అనే 18 పర్వాలతో 1000 పైగా పేజీలతో ఒకే ఒక కోశంగా ముద్రితమైంది.

వనరులు

మార్చు
  1. "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము విజ్ఞాన సర్వస్వ కేంద్రము". Archived from the original on 2009-02-01. Retrieved 2009-01-03. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. విశ్వసాహితి ఆర్కైవ్.ఆర్గ్లో నకలు
  3. "తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష" గాజుల సత్యన్నారాయణ, అన్నపూర్ణ పబ్లిషర్స్, జనవరి 2004

ఇతర లంకెలు

మార్చు
  1. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం సంపుటి 1. Retrieved 2020-07-11.
  2. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం సంపుటి 2. Retrieved 2020-07-11.
  3. విజ్ఞాన సర్వస్వము - తెలుగు సంస్కృతి PDF