థామస్ రాబర్ట్ మాల్థస్
బ్రిటీష్ ఆర్థికవేత్త అయిన థామస్ రాబర్ట్ మాల్థస్ 1766లో ఇంగ్లాండు లోని సర్రే ప్రాంతంలో జన్మించాడు. జేసస్ కళాశాల, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్య అభ్యసించాడు. 1805 నుంచి మరణించేవరకు హైలీబరీలోని ఈస్టిండియా కళాశాలలో రాజకీయ అర్థశాస్త్రం బోధించాడు. అతను అర్థశాస్త్రానికి చేసిన ప్రధాన సేవ జనాభా సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మాల్థస్ 1798లో ఎన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాప్యులేషన్ (An Essay on the Principles of Population) గ్రంథంలో ప్రచురించాడు. ఈ సిద్ధాంతం అర్థశాస్త్రంలోనే కాదు భూగోళ శాస్త్రం, సామాజికశాస్త్రములలో కూడా ప్రముఖ పాత్ర వహించి అతనికి మంచి పేరు తెచ్చింది. ఆహారధాన్యాల పెరుగుదల రేటు కంటే జనాభా పెరుగుదల రేటు హెచ్చుగా ఉంటుందని మాల్థస్ తన సిద్ధాంతంలో వివరించాడు. అయిననూ కరువు, కాటకాలు, వరదలు, దుర్భిక్షాలు, యుద్ధాలు మొదలైన కారణాలు దీర్ఘకాలంలో జనాభాను తగ్గిస్తాయని తెల్పినాడు. ఈ విధంగా జనాభాపై శాస్త్రీయంగా పరిశోధించిన వారిలో థామస్ రాబర్ట్ మాల్థస్ మొట్టమొదటి వాడని చెప్పవచ్చు. అతని సిద్ధాంతాలు అతని తర్వాతి ఆర్థికవేత్తలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా డేవిడ్ రికార్డో యొక్క వేతన సిద్ధాంతం మాల్థస్ సిద్ధాంతంపై ఆధారపడింది. అతని ఇతర రచనలు ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలికటికల్ ఎకానమీ (Principles of Political Economy). ఇతను 1834లో మరణించాడు.
జనాభా సిద్ధాంతం
మార్చు1798లో ప్రచురించిన ఎన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాప్యులేషన్ గ్రంథంలో మాల్థస్ తన జనాభా సిద్ధాంతాన్ని విశదీకరించాడు. జనాభా పెరుగుదలకు, ఆహార ధాన్యాల పెరుగుదలకు గల తారతమ్యాన్ని కూడా ఈ సిద్ధాంతంలో ఉదాహరణలతో సహా నిరూపించాడు. ఆహారం అంకగణిత శ్రేణిలో పెరిగితే (1,2,3,4,5........) జనాభా గుణశ్రేణిలో (1,2,4,8,16.......) పెరుగుతుందని మాల్థస్ పేర్కొన్నాడు. కానీ దీర్ఘకాలంలో జనాభా పెరుగుదల రేటును అనేక కారణాలు ప్రభావితం చేసి జనాభా పెరుగుదలను అడ్డుకుంటాయని కూడా విశదీకరించాడు. దానికి సహజ కారణాలు, నైతిక కారణాలు, యుద్ధాలు, రోగాలు మొదలగు కారణాలు కూడా తోడ్పడతాయని వివరించాడు.