దివాన్ బహదూర్ పద్మారావు ముదలియార్

దివాన్ బహదూర్ సి.వి.పద్మారావు ముదలియార్ సమాజసేవకుడు, విద్యావేత్త, 19వ శతాబ్దం చివరలో మరియు 20వ శతాబ్దం ప్రారంభంలో హైదరాబాదులో ప్రముఖ వ్యక్తిగా పేరుగాంచాడు. ఆయన పాలన, పౌర అవసరాలు, సంక్షేమ కార్యక్రమాల్లో చేసిన సేవల ద్వారా హైదరాబాద్ అభివృద్ధికి తనదైన ముద్ర వేశాడు. విద్యావేత్తగా అనేక విద్యాసంస్థలతో ఈయనకు అనుబంధం ఉంది.[1]

పద్మారావు నగర్లో దివాన్ బహదూర్ పద్మారావు ముదలియార్ విగ్రహం

పద్మారావు ముదలియారు, నిజాంల పరిపాలనా కాలంలో హైదరాబాదులో స్థిరపడిన తమిళ ముదలియార్ సముదాయానికి చెందినవాడు. తమిళ భాష మాట్లాడే ఈ సముదాయం వారు తరతరాలుగా హైదరాబాదు పాలనలో ముఖ్య భూమిక వహించారు. పద్మారావు ముదలియారు, 1875, నవంబరు 7 న జన్మించాడు. ఈయన తండ్రి మహబూబ్ కళాశాల స్థాపకుడు సోమసుందరం ముదలియార్[1][2] సి. పాడురంగ ముదలియార్ కుటుంబంలో జన్మించిన ఈయన, తన విద్యాభ్యాసాన్ని సికింద్రాబాదులోని మహబూబ్ కళాశాలలో, మద్రాసు కైస్తవ కళాశాలలో పూర్తిచేసుకున్నాడు. తండ్రి స్థాపించిన వ్యాపారంలో చేరి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.[3]

1881లో వేణుగోపాల పిల్లై బాలికల విద్యాభ్యాసం కొరకై ఒక పాఠశాలను ఏర్పాటుచేసి, ఐదారు వేర్వేరు ప్రైవేటు ఇళ్లలో తరగతులు నిర్వహించేవాడు. ఈయన ఇంటింటికీ వెళ్లి పిల్లలను ఎద్దుల బండిలో ఎక్కించుకొని పాఠాలు చెప్పడానికి తీసుకెళ్లేవాడు.[4] పద్మారావు ముదలియారు ఈ పాఠశాలకు శాశ్వతమైన భవనము కట్టేందుకై భూమిని సేకరించడానికి కృషిచేశాడు. ఈయనకు ఆ పనిలో, 1930 నుండి 1933 వరకు హైదరాబాదు బ్రిటీషు రెసిడెంటుగా పనిచేస్తున్న బ్రిగేడియర్ జనరల్ సర్ టెరెన్స్ హంఫ్రీ కీస్ స్థలాన్ని సంపాదించడంలో సహాయం చేశాడు. అందువలన ఈ పాఠశాలకు "కీస్ బాలికల ఉన్నత పాఠశాల" అని పేరు పెట్టారు. ఈ పాఠశాలకు పద్మారావు ముదలియారు తొలి కార్యదర్శి. హెచ్.ఎం.డేవిస్ తొలి ప్రాధానోపాధ్యాయురాలు.[4]

కీస్ హైస్కూలు ఆవరణలోనే పద్మారావు ముదలియార్ మహిళా కళాశాలను స్థాపించారు. ఈయన మహబూబ్ కళాశాలకు కొన్నాళ్లు గౌరవాధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.[5] హరిజనుల సంక్షేమాభిలాషి అయిన పద్మారావు ముదలియార్, హరిజనులకై 1906లో ఎం.ఎల్.ఆదయ్య స్థాపించిన పాఠశాలకు గౌరవ కార్యదర్శిగా పనిచేశాడు. [6] పద్మారావు ముదలియార్, ఆదయ్యకు సహాయం చేసి, లీజుపై పాఠశాల భవనం నిర్మించడానికి భూమిని ఇప్పించాడు. స్థానిక ప్రభుత్వం నుండి భవన నిర్మాణానికి, యాజమాన్యానికి కావలసిన నిధులు సమకూర్చాడు.[7] స్థలాన్ని దానం చేసిన బ్రిటీషు రెసిడెంట్ సర్ విలియం బార్టన్ పేరుమీద పాఠశాలకు సర్ విలియం బార్టన్ పాఠశాల అని పేరు పెట్టారు.[6] పద్మారావు, బార్టన్ సహాయంతో ఈ పాఠశాలను ప్రాధమికోన్నత స్థాయికి తీసుకువెళ్లాడు.[7] ఈ పాఠశాలే తర్వాత కాలంలో ప్రభుత్వ అదయ్య స్మారక ఉన్నత పాఠశాలగా రూపొందింది.[8]

ఈయన సికింద్రాబాదుకు చేసిన సేవలను గుర్తిస్తూ, నగరపాలిక ఈయన స్మృత్యర్ధం సికింద్రాబాదులో ముదలియార్లు స్థిరపడి అభివృద్ధి చేసిన ఒక ప్రాంతానికి పద్మారావు నగర్ అని నామకరణం చేశారు.[9][3] ఈ ప్రాంతాన్ని దానికి ముందు వాకర్‌టౌన్ అని పిలిచేవారు.[3]

పద్మారావు, 1934, జనవరి 8 న హైదరాబాదులో గుండె క్షీణించి మరణించాడు.[3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 M. L., Nigam (1997). Romance of Hyderabad Culture. Hyderabad (India): Deva Publications. p. 24. Retrieved 8 September 2024.
  2. Prasad, Dharmendra (1986). Social and Cultural Geography of Hyderabad City: A Historical Perspective. Hyderabad (India): Inter-India Publications. p. 89.
  3. 3.0 3.1 3.2 3.3 Naidu, M.V. (1955). City Of Secunderabad (deccan). p. 98-99. Retrieved 8 September 2024.
  4. 4.0 4.1 "Dewan Bahadur Padmarao Mudaliar College for women - College History". dbpmcollege.com. Retrieved 8 September 2024.
  5. పి., జ్యోతి (1 July 2024). "ఆదాబ్ హైదరాబాద్ - 1". సంచిక తెలుగు సాహిత్య వేదిక. Retrieved 7 September 2024.
  6. 6.0 6.1 Kshīrasāgara, Rāmacandra (1994). Dalit Movement in India and Its Leaders, 1857-1956. M.D. Publications. p. 168. Retrieved 8 September 2024.
  7. 7.0 7.1 P.R., Venkatswamy (2 February 2020). Our Struggle for Emancipation: The Dalit Movement in Hyderabad State, 1906-1953. Hyderabad Book Trust. p. 44. Retrieved 8 September 2024.
  8. C.R., Gowri Shanker (30 January 2024). "School for SC, BC in Ranigunj faces existential crisis; student strength declines, pressure to shift it out". Siasat. Retrieved 8 September 2024.
  9. "Padmarao Nagar Locality". www.onefivenine.com. Retrieved 2021-02-05.