దె కార్త్ (ఆంగ్లము : René Descartes) ఫ్రెంచి తత్వవేత్త. "నేను అలోచిస్తున్నాను, కనుక నేను ఉన్నాను" పాశ్చాత్యుల తత్వ శాస్త్రంలో ఇది సుప్రసిధ్ధమయిన వాక్యం. ఈ వాక్యకారుడు రెని దె కార్త్. పాశ్చాత్యుల తత్వ శాస్త్రాన్ని ఇతడు పూర్తిగా మార్చివేశాడు. కనుకనే ఇతనికి ఆధునిక తత్వశాస్త్ర జనకుడు అని పేరు వచ్చింది. దె కార్త్ రెండు వాదాలకు జనకుడు. ఒకటి - భావ వాదం (Idealism), రెండు - భౌతిక వాదం (Materialism). పరస్పర విరుధ్ధమయిన ఈ రెండు వాదాలకూ దె కార్త్ జనకుడు కావటం అతని ప్రత్యేకత.

బాల్యంసవరించు

దె కార్త్ ఫ్రాన్స్లో లా హే అన్న చోట 1596 మార్చి 31 న ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. తండ్రి పార్లమెంటరీ న్యాయవాది. న్యాయమూర్తి కూడా. తల్లి అతను పుట్టిన కొన్ని రోజులకే మరణించింది. అతనిని ఒక ఆయా పెంచింది. పుట్టడం తొనే రోగిష్టిగా పుట్టడంతో డాక్టర్ల సలహా మేరకు ఎక్కువగా విశ్రాంతిగానే గడిపేవాడు.

చదువుసవరించు

చిన్ననాటి నుంచీ జ్ఞానార్జన పట్ల ఎక్కువ ఆసక్తి ప్రదర్శించేవాడు. అదేమిటి? ఇదెందుకు? అని తండ్రిని ప్రశ్నిస్తూ ఉండే వాడు. ఎనిమిదవ ఏట జెసూయిట్ కాలేజీలో చేరి లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్ భాషలతో పాటు తర్కం, నీతి శాస్త్రం, ఖగోళ శాస్త్రం, తత్వ శాస్త్రం, భౌతిక రసాయన శాస్త్రాలతో పాటు సంగీతం, నటన, గుర్రపు స్వారీ, కత్తి సాము నేర్చుకున్నాడు.

గణిత పాండిత్యంసవరించు

దె కార్త్ తత్వ వేత్త కావటానికి ముందు గణిత వేత్త, గణితం లోనే కాకుండా భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, శరీర శాస్త్రం, ఖగోళ శాస్త్రం , మనస్తత్వ శాస్త్రాల, లో అతడు ఎన్నో మౌలిక విషయాలు కనుగొన్నాడు. బీజ గణితాన్ని రేఖా గణితానికి అన్వయించాడు. ఈ రంగంలో అతని కృషిని అనలటికల్ జ్యామెట్రీ లేదా కో ఆర్డినేట్ జ్యామెట్రీ అంటారు. అతని పేరు మీదుగా కార్టీషియన్ సిస్టం అని కూడా అంటారు. దె కార్త్ తత్వ చింతన గణిత శాస్త్రం పునాదిపై నిర్మించబడింది. గణిత శాస్త్రం స్వతస్సిధ్ధ సత్యాల (Axioms) తో ప్రారంభమవుతుంది. సరళ సూత్రాలతో ప్రారంభించి, పోను పోను సంక్లిష్ట సూత్రాలు కనుగొంటాము. ఇది డిడక్టివ్ పద్ధతి. స్వతస్సిధ్ధ సత్యాల నుంచి కొత్తవి, అంతకు ముందు తెలియనివి కనుగొనటమే ఈ విధానం. తత్వ శాస్త్రం కూడా ఇలాంటి ప్రాథమిక సత్యాలను కనుగొనగలిగితే ప్రపంచ స్వభావం గురించిన వివిధ వాదాల గందరగోళం తగ్గిపోతుంది. ఈ విశ్వాసంతో దె కార్త్ తత్వాన్వేషణకు ఉపక్రమించాడు.

రచనలుసవరించు

దె కార్త్ రచనలలో రెండు ముఖ్యమయినవి. ఒకటి - డిస్కోర్స్ ఆన్ మెథడ్. రెండు - మెడిటేషన్స్ వీటిలో అతడు తన నూతన తాత్విక చింతన అంతా పొందుపరిచాడు.

నేను, దైవం, దైవ భావంసవరించు

నేను ఎవరిని? నేను సందేహించే వస్తువుని. అంటే మనసుని. నాకు శరీరం లేకపోయినా మనస్సు లేకపోవటం జరగదు. ఎందుకంటే మనస్సు ఉందా లేదా అని సందేహించేది కూడా మనసే. అది లేకపోతే సందేహమే లేదు. నేను లేకపోతే 'లేను' అన్న ఆలోచన కలగదు. కనక నేను స్పష్టంగా ఉన్నాను. అంటే సందేహంతో బయలుదేరి సందేహాతీతమయిన ఒక సత్యాన్ని దె కార్త్ కనుగొన్నాడు. అయితే ఇంత స్పష్టమయిన సత్యాలు ఇంకేమయినా ఉన్నాయా? ఉన్నాయి. ఒకటి దేవుడు. రెండు నా శరీరం. అంటే భౌతిక ప్రపంచం.

సందేహం నుంచి సత్యంసవరించు

జ్ఞానం ఎలా లభిస్తుంది? అని ప్రశ్న వేసుకుని సందేహం ద్వారానే అని దె కార్త్ సమాధానం చెప్పాడు. అసలు సిసలయిన సత్యాన్ని ఆవిష్కరించేదే నిజమయిన జ్ఞానం. నూటికి నూరు పాళ్ళు నిజం అనిపించేదే సత్యం. ఏమాత్రం అనుమానం ఉన్నా అది సత్యం కాజాలదు. ఇందుకోసం ప్రతి విషయాన్ని సందేహించి తర్కించాలి. ఉదాహరణకు ఈ బాహ్య ప్రపంచం నిజంగా ఉన్నదా ? నేను యదార్ధంగా ఉన్నానా ? నేను ఇప్పుడు ఇక్కడ కూర్చుని కొన్ని వస్తువులను చూస్తున్నాను. వాటిని నేను చూడటం నిజమని ఎలా చెప్పగలను? ఎందుకంటే కలలు వస్తాయి. కలలో కూడా ఇవే వస్తువులు చూస్తాము. కానీ అవన్నీ నిజం కావు. అలాగే మేలుకున్నప్పుడు మనం చూసేవి కూడా నిజం కాకపోవచ్చు.

అయితే కలలో చూసేవి నిజం కాకపోవచ్చు కానీ కల రావటం మాత్రం నిజం. అలాగే భౌతిక ప్రపంచం నిజం కాకపోయినా దాన్ని గురించి నేను భావించటం నిజం. అలా భావించటం కూడా నిజం కాదని సందేహించవచ్చు. కానీ సందేహించటం కూడా ఆలోచనలో భాగమే. కనుక ఆలోచన ఉంది. ఆలోచించే మనస్సు ఉంది. అంటే నేనున్నాను.

"నేను అలోచిస్తున్నాను, కనుక నేను ఉన్నాను"

"I Think, therefore I am"

దేవుడు అంటే ?సవరించు

"నన్ను ఎప్పుడూ ఏదో ఒక సందేహం వెంటాడుతూనే ఉంటుంది. అంటే నా అస్తిత్వం పరిపూర్ణం, నిర్దుష్టం (Perfect) కాదన్నమాట. కాని నేను ఉన్న స్థితికి పూర్తి వ్యతిరేకంగా పరిపూర్ణమయినది, నిర్దుష్టమయినది వేరే ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అదే దేవుడు." ఇది దేవుడి గురించి దె కార్త్ భావన. ఇంకా దె కార్త్ దైవ భావాన్ని వివరిస్తూ "దేవుడు అంటే ఏమిటి? ఆయన సత్య స్వరూపుడు, పరిపూర్ణతా మూర్తి. సందేహం, అనిశ్చితి, అస్థిరత, అశాస్వతత్వం, క్రోధం, విషాదం, ద్వేషం ఇలాంటివి ఏవీ ఆయనను బాధించవు. ఇవన్నీ మానవ లక్షణాలు. ఇవి మనలని బాధించే దోషాలు. ఇవి లేని దివ్య మూర్తి వేరే ఉండి ఉండాలి. అతడు సర్వ స్వతంత్రుడు, అనంతుడు, సర్వ వ్యాపి అయి ఉండాలి. లేక పోతే ఈ లక్షణాలతో కూడిన దైవ భావం నాకు ఎలా వస్తుంది? దైవమే నాలో దైవ భావాన్ని ప్రవేశపెట్టి ఉండాలి.కనుకనే దైవం ఉన్నాడనే భావన కలుగుతుంది. శూన్యం నుంచి ఏదీ రాదు. ప్రతి దానికీ ఏదో కారణం ఉంటుంది. నాలో కలిగిన దైవ భానికి కూడా ఏదో కారణం ఉండాలి. ఆ కారణమే దైవం." అని చెప్పాడు.

మరణంసవరించు

స్వీడిష్ రాణి ఆహ్వానం మేరకు 1649 లో ఆమెకి తత్వ శాస్త్రం బోధించటానికి దె కార్త్ స్వీడన్ వెళ్ళాడు. స్వీడన్ చలిదేశం కావటం వల్ల అక్కడి చలిని తట్టుకోలేని దె కార్త్ తొందరలోనే న్యుమోనియాకి గురై మంచం పట్టి 1650 ఫిబ్రవరి 11 న మరణించాడు.

మూలాలుసవరించు

విశ్వ దర్శనం - పాశ్చ్యాత్య చింతన - నండూరి రామమోహనరావు

"https://te.wikipedia.org/w/index.php?title=దె_కార్త్&oldid=3160423" నుండి వెలికితీశారు