దేవులపల్లి సోదరకవులు

(దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి నుండి దారిమార్పు చెందింది)

దేవులపల్లి సోదరకవులు: దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి (1853 - 1909), దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి (1856 - 1912) వీరి తల్లిదండ్రులు వెంకమాంబ, వేంకటకృష్ణశాస్త్రి. వీరి స్వగ్రామము కూచిమంచి తిమ్మకవి గ్రామమైన చంద్రంపాలెం. కూచిమంచి వేంకటరాయకవి ఈ సోదరకవులకు గురువు. ఈ సోదరకవులు ఇరువురు బాల్యంలో పిఠాపురం రాజా రావు ధర్మారావు చెంత, యవ్వనమున రావు వేంకటమహీపతి గంగాధరరామారావు ఆస్థానమున, వృద్ధాప్యములో రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు ఆస్థానంలో ఉన్నారు. ఎక్కువకాలం గంగాధర రామారావు ఆస్థానంలో సాహిత్యవ్యాసంగం చేశాడు.[1]

వంశ వివరాలు

మార్చు

వీరిది పండితవంశము. వీరి వంశ మూలపురుషుడు దేవులపల్లి వేంకటసూరి. కావ్యనాటకములను రచించిన ప్రతిభాశాలి. వేంకటసూరి తనయుడు రామసూరి పండితుడు. ఇతడు పూసపాటి విజయరామరాజు వలన వెలగవాడ అనే అగ్రహారం పొందాడు. రామసూరి తమ్ముడు వేంకటరామశాస్త్రి సంగీతవిద్వాంసుడు. అతని కుమారుడు బ్రహ్మసూరి "తారావళి" కావ్యాన్ని వ్రాసి పిఠాపుర ప్రభువైన రావు మహీపతిరావుకు అంకితం చేశాడు. ఆ ప్రభువు బ్రహ్మసూరికి ఫకర్దీను పాలెము అనే గ్రామంలో సుక్షేత్రాన్ని కానుకగా ఇచ్చాడు. వీరి వంశములో జన్మించిన దేవులపల్లి రామశాస్త్రి "రామచంద్రోదయము" అనే చంపువును, "సాహితీదర్పణము" అనే అలంకారశాస్త్రాన్ని, బాలభాగవత వ్యాఖ్యను, పెక్కు నాటకాలను వ్రాసిన గొప్ప విద్వాంసుడు. ఇతడు రావు నీలాద్రిరావు చేత సరసతర సాహితీసారచక్రవర్తి అనే బిరుదును పొందాడు. ఈ రామశాస్త్రికి బుచ్చయ్యశాస్త్రి అనే నామాంతరం ఉంది. బుచ్చయ్యశాస్త్రి (రామశాస్త్రి) ద్వితీయపుత్రుడు వేంకటకృష్ణశాస్త్రి తమ్మన అనే పేరుతో ప్రసిద్ధిపొంది సకలపండితమండలచక్రవర్తి అయినాడు. తమ్మన ప్రథమపుత్రుడు బుచ్చయ్యశాస్త్రి పదియేండ్లకే పంచకావ్యములు, పండ్రెండేండ్లకు నాటకాలంకారములు, పదునారేండ్లకు శబ్దన్యాయశాస్త్రములు చదివాడు. రావు నీలాద్రిరావు కాలములో విద్వాంసుడిగ ప్రసిద్ధి చెందిన రామశాస్త్రి తమ్ముడు వేంకటశాస్త్రి సర్వశాస్త్రాలలో నిష్ణాతుడు. ఇతని పుత్రుడు వేంకటకృష్ణశాస్త్రి మహాపండితుడు. ఇతని కుమారుడు సీతారామశాస్త్రి తన పాండిత్యముచేత రావు వేంకటనీలాద్రిరావును, అతని పుత్రుడు రావు వేంకటసూర్యారావును మెప్పించాడు. సీతారామశాస్త్రి పుత్రుడు వేంకట కృష్ణశాస్త్రి రావు గంగాధరరామారావుకు గురువై తారకబ్రహ్మ మంత్రముపదేశించాడు. వేంకటకృష్ణశాస్త్రి జనమంచి కృష్ణశాస్త్రి కుమార్తె వెంకమాంబను వివాహమాడి సీతారామశాస్త్రి, సుబ్బరాయశాస్త్రి, వేంకటకృష్ణశాస్త్రి అనే ముగ్గురు సుతులను పొందాడు. వీరిలో సుబ్బరాయశాస్త్రి, వేంకటకృష్ణశాస్త్రి పిఠాపురం ఆస్థానములో విద్వాంసులుగా దేవులపల్లి సోదరకవులు అనే పేరుతో ప్రసిద్ధులయ్యారు.

విద్యాభ్యాసం

మార్చు

దేవులపల్లి సోదరకవులకు ప్రపితామహుడు దేవులపల్లి సీతారామశాస్త్రి అక్షరాభ్యాసం చేశాడు. ఈ సోదరులు సీతారామశాస్త్రి వద్ద కాళిదాసత్రయము, తండ్రివద్ద కావ్యద్వయము, నైషదము, కొన్ని చంపువులు, అలంకారశాస్త్రము, సిద్ధాంతకౌముది, తర్కప్రకరణాలు, నాటకములు, కొంత జ్యోతిషశాస్త్రము నేర్చుకున్నారు. అమరము ఈ సోదరులకు కంఠస్థము అయ్యింది. కూచిమంచి వేంకటరాయకవి వీరికి ఆంధ్ర లక్షణశాస్త్రాలను ఉపదేశించాడు.

దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి

మార్చు

1879లో పిఠాపురం ప్రభువు రావు గంగాధర రామారావు సమక్షంలో నూజివీడు సంస్థాన ఆస్థానకవి మాడభూషి వేంకటాచార్యులు అవధానం చేసి మెప్పించగా, రాజా తమ ఆస్థానములో అట్టి విద్వాంసులు కలరా అని విచారించి దేవులపల్లి సోదరకవులు అంతటి శక్తి కలవారని తెలుసుకొని వెంటనే చంద్రంపాలెం నుండి పిలిపించాడు. సుబ్బరాయశాస్త్రి ఇంతకు ముందు అవధానప్రక్రియ చేపట్టకున్నా రాజావారి అనుజ్ఞపై తమ్మునితో కలిసి శతావధానాన్ని జయప్రదంగా చేసి రాజావారియొక్కయు, సభికులయొక్కయు మన్నికకు పాత్రుడైనాడు. ఈవిధంగా ఈ సోదరకవులు అప్పుడప్పుడు అవధానాలు చేసేవారు.

సంస్కృత రచనలు

మార్చు
 1. శ్రీరామ పంచాశత్తు
 2. శ్రీమద్రావువంశముక్తావళి

తెలుగు రచనలు

మార్చు
 1. మహేంద్రవిజయము (ప్రబంధము)
 2. రామరాయవిలాసము (ప్రబంధము)
 3. మల్హణస్తవము ( సంస్కృతమునుండి అనువాదము)
 4. శ్రీ కుమార శతకము (సంస్కృతము నుండి అనువాదము)
 5. మందేశ్వర శతకము

దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి (1856 - 1912)

మార్చు

ఇతనికి దేవులపల్లి తమ్మన్నశాస్త్రి అను నామాంతరము ఉంది. ఇతడు అన్నగారి వలె సంస్కృతములో కావ్యరచన చేయనప్పటికీ సంస్కృతభాషలో గొప్ప పండితుడు.

తెలుగు రచనలు

మార్చు
 1. స్వప్నఫలదర్పణము
 2. కవి ప్రభునామ గుంభిత విచిత్ర పద్యగర్భిత కందపద్య సకలేశ్వర శతకము
 3. కుక్కుటేశ్వరాష్టకము
 4. సత్యనారాయణ శతకము
 5. కమలాదండకము
 6. శ్రీరావు వంశముక్తావళి (దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి సంస్కృతకావ్యానికి తెలుగు అనువాదం)
 7. నయనోల్లాసము
 8. యతిరాజవిజయము

అవధానాలు

మార్చు

ఈ సోదరులు ఇద్దరూ కలిసి పిఠాపురంలో ఒక శతావధానము, మద్రాసులో ఒక అష్టావధానము, మైలపూరులో ఒక అష్టావధానము, పిఠాపురంలో ఎడ్వర్డ్ ప్రభువు పట్టాభిషేక మహోత్సవంలో ఒక అష్టావధానము, రెవెన్యూ అధికారి జె.అన్డూ ఎదుట ఒక అష్టావధానము, విద్యాధికారి ఎ.ఎల్.విలియమ్స్ ఎదుట ఒక అష్టావధానము మొత్తం 6 అవధానాలు మాత్రం ప్రదర్శించారు. వీరి అవధానాలలో చతురంగము, సమస్య, వ్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి, నిర్ధిష్టాక్షరి, ఉద్దిష్టాక్షరి, ఆశుధార, పుష్పగణనము, సంగీతములో రాగముల గుర్తింపు, వర్ణన మొదలైన అంశాలు ఉండేవి.[2]

వీరు పూరించిన కొన్ని అవధాన సమస్యలు:

 • సమస్య: కంబు సుమీ ముఖం బతిసుఖంబు సుమీ రతినోలలాడగన్

పూరణ:

 కంబు సుమీ గళంబు కనకంబు సుమీ చెలిమేను చక్రవా
కంబు సుమీ చనుంగవ శుకంబు సుమీ నుడి ద్రాక్షపండ్ల పా
కంబు సుమీ రదచ్ఛద ముఖంబు సుమీ నడుమబ్జవైరి పొం
కంబు సుమీ ముఖం బతిసుఖంబు సుమీ రతినోలలాడగన్

 • సమస్య: షట్పదశింజినీజనిత సాయకపంక్తికి నింతులోర్తురే?

పూరణ:

రుట్పతివంబు దోఁప నతిరూఢియు బ్రౌఢియుఁజూపి యామినీ
రాట్పవమాన కోకిల మరాళ శుక ప్రముఖాస్మదీయ వి
ద్విట్పటలందుఁ గూడి నను వేఁచుచు నేఁచెద వేర? మార నీ
షట్పదశింజినీజనిత సాయకపంక్తికి నింతులోర్తురే?

మూలాలు

మార్చు
 1. పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973
 2. రాపాక, ఏకాంబారాచార్యులు. "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 112–115.

ఇతర లింకులు

మార్చు