దోమకొండ కోట

తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, దోమకొండ గ్రామంలో ఉన్న కోట

దోమకొండ కోట అనేది తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, దోమకొండ గ్రామంలో ఉన్న కోట.[1] దోమకొండ ప్రధాన రహదారి నుండి 6 కిలోమీటర్ల దూరంలో, కామారెడ్డి నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉంది. కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల పాలనలో దోమకొండ సంస్థానంగా ఉండేది. దోమకొండ సంస్ధానపు రెడ్డి రాజులు 18వ శతాబ్దంలో పూర్వం కోట ఉన్న స్థలంలోనే ఈ కోటను నిర్మించారు. 18వ శతాబ్దం నుంచి 20వ శాతబ్దం కామినేని వంశస్తులే ఈ కోటను పాలించారు.[2]

దోమకొండ కోట
దోమకొండ
కామారెడ్డి జిల్లా
తెలంగాణ
దోమకొండ కోటలోని వెంకటభవనం ముందుభాగంలోని శిల్పకళ - అండకారపు పాలరాతి ఫలకంపై ఉర్దూలో, తెలుగులో వెంకటభవనం వ్రాసి ఉండటం గమనించవచ్చు
రకముకోట
స్థల సమాచారం
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతిఅవును
స్థల చరిత్ర
కట్టిన సంవత్సరం18వ శతాబ్దం
కట్టించిందిదోమకొండ సంస్ధానపు రెడ్డి రాజులు
వాడిన వస్తువులురాతి

కోటలోన మహాదేవుని దేవాలయం కూడా ఉంది.[3] కోట ప్రధాన ముఖద్వారం అసఫ్‌జాహీల నిర్మాణ శైలికి అద్దంపడుతుంది. కోట చుట్టూ చదరపు, వృత్తాకార బురుజులు కట్టబడ్డాయి. కోట లోపల రెండు మహల్లు, దేవాలయ ప్రాంగణం ఉన్నాయి. కోటలోని శివాలయం కాకతీయ శైలిని అనుకరించి, ఆగమశాస్త్ర యుక్తముగా నిర్మించబడింది. ఈ కోట తెలంగాణా ప్రాంతపు సంస్థానాల రక్షణ కట్టడాల శైలికి ఒక మంచి ఉదాహరణ.

2022 నవంబరులో యునెస్కో నుండి ఈ కోటకు ‘అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌’ అవార్డు వచ్చింది.[4]

చరిత్ర

మార్చు

కోట నలభై ఎకరాల చుట్టూ నీటి కందకంతోపాటు కామినేని వంశస్థులే ఎత్తయిన రాతి గోడను నిర్మించారనీ కొందరంటే, కాకతీయులు ఆ గోడను నిర్మించగా సంస్థానాధీశులు అందులో భవనాలు కట్టుకున్నారని కొందరంటారు. కోటలోని మహదేవుని (శివుడు) దేవాలయం ఉండడమే కాకతీయుల నిర్మించారనటానికి తార్కాణమని భావిస్తారు. కాకతీయుల కాలంలో దేవాలయానికి రాణి రుద్రమదేవి వచ్చి పూజలు చేసి వెళ్లినట్లు శాసనంలో ఉంది.[5] దోమకొండ సంస్థానాధీశులు మొదట బికనూర్ (నిజామాబాద్ జిల్లా) సంస్థానాధిపతులనీ, బికనూర్ పక్కనే సైనికులు, కాశీ యాత్రికులు రాకపోకలు సాగించే 'దండు రాస్తా' ఉన్నందువల్ల ఇబ్బందిగా భావించి దోమకొండకు వచ్చారనీ, అప్పటికే దోమకొండలో కాకతీయులు ప్రహరీగోడ, మహదేవుని దేవాలయం నిర్మించారనీ కొందరి అభిప్రాయం. అయితే ఈ కథనానికి ఆధారాలేవీ లేవు.

1954 నుంచి ఆరేళ్లపాటు దోమకొండ కోటలో జనతా కాలేజీ నడిచింది. తర్వాత దాన్ని పాలెంకు తరలించారు.

 
దోమకొండ కోటలోని శివాలయం
 
దోమకొండ కోటలోని శివాలయం ముందువైపు

నిర్మాణం

మార్చు

నలభై ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ రాతి కట్టడంతో కూడిన ప్రహరీగోడతోపాటు బయటివైపు నుంచి శత్రువులు రాకుండా ఉండేందుకు నిజాం రాజుల కోటలాగా మొత్తం గోడ చుట్టూ అతి పెద్ద నీటి కందకం కూడా ఉంది. తెలంగాణ జిల్లాల్లోని మరే కోట చుట్టూ ఇలాంటి నీటి కందకం లేదు. కోటలో ప్రవేశించేందుకు పడమర వైపు ఒక పెద్ద కమాన్, తూర్పు వైపు మరొకటి ఉన్నాయి. విశాలమైన ప్రాంగణం మధ్యలో సంస్థానాధీశుల ప్రధాన నివాసం వెంకట భవనం ఏపుగా పెరిగిన కొబ్బరిచెట్లు, పూలమొక్కల మధ్యన రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. భవనం పైభాగంలోని పాలరాతి ఫలకంపై వెంకట భవనం అని తెలుగులో, ఉర్దూలో రాసి ఉంది. ఆ కాలంలోనే ఈ భవనంపై పిడుగులు పడకుండా నిరోధించే పరికరాన్ని (ఎర్తింగ్) బిగించారు.

నగారా భవంతి

మార్చు

కోటలో నగారాను వినిపించడం కోసం ప్రత్యేకంగా ఒక భవంతిని నిర్మించారు. ఆ భవంతిపైన ఒక నీటి తొట్టెను ఏర్పరచి, దాంట్లో ఒక గిన్నెకి రంధ్రం చేసి ఉంచేవారట. తొట్టిలోని నీరు గిన్నెలోకి నిదానంగా చేరి మునిగిపోయేది. దీని ఆధారంగా సమయాన్ని చెప్పేవారట. తెల్లవారు ఝామున నాలుగు గంటల నుండి నగారా మోగించేవారట. ఇది కూడా శుక్ర, ఆదివారాల్లో ప్రతి మూడు గంటలకొకసారి, మిగతా రోజుల్లో ఆరు నుండి పన్నెండు గంటలకొకసారి నగారా మోగించేవారట.

రాజ దర్బార్

మార్చు

కోటలో నగారా భవంతికెదురుగా అతిపెద్ద రాతిగోడలు, వాటి చివర్లో ఎత్తయిన బురుజులు ఉన్నాయి. గోడకు ఉన్న అతి పెద్ద దర్వాజాకు శత్రువులు ఏనుగులపై వస్తే వాటిని అడ్డుకోవడానికి అనేకమైన ఇనుప శూలాలను బిగించారు. అలాగే దర్వాజాపైన గల రంధ్రాల్లోంచి సలసల కాగే నూనెను పోసే ఏర్పాటు కూడా చేసుకున్నారు. దర్వాజా దాటి లోపలికి వెళ్తే వచ్చే అందమైన భవంతే రాజ దర్బారు. అందులోనే హరికథలు, పురాణాలు, కవితాగానాలు, నృత్యాలు రోజంతా జరిగేవట. ఆ భవంతిపైన దాసీలు నృత్యం చేయడానికి జిట్రేగి కట్టెలతో చేసిన వేదిక కూడా ఉంది. ఈ కోటలో కూడా దాసీ వ్యవస్థ ఉండేదట. అద్దాల మేడ ముందు నీళ్లని ఎగజిమ్మే ఫౌంటెన్‌లను ఏర్పరిచారు. దీని పక్కనే రాణీమహలు ఉన్నప్పటికీ అది పూర్తిగా శిథిలమైపోయింది.

పునర్నిర్మాణం

మార్చు

కామినేని వంశస్తుడైన దోమకొండ సంస్థానాధీశుడు కామినేని అనిల్‌కుమార్‌ ఈ కోటకు మరమ్మతులు చేసి అందంగా తీర్చిదిద్దాడు. సినీ నటుడు రాంచరణ్‌ – ఉపాసన (కామినేని అనిల్‌కుమార్‌ కుమార్తె) పెళ్ళి దోమకొండ కోటలోనే జరిగడంతో ఈ కోట గురించి అందరికి తెలిసింది. దాంతో ఈ కోటను సందర్శించేందుకు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. శివరాత్రి సమయంలో కోటలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.[6]

అవార్డులు

మార్చు

పౌరులు, పౌర సంస్థలు పునరుద్ధరించిన వారసత్వ సంపద కేటగిరీలో ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ల నుండి ఈ కోటకు ‘అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌’ అవార్డు వచ్చింది. కట్టడాల విశిష్టత, పౌరులు, పౌరసంస్థలు పునరుద్ధరించిన తీరు తదితర అంశాలపై జ్యూరీ సభ్యులు పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించి అవార్డుకు ఎంపికచేశారు.[7][4]

మూలాలు

మార్చు
  1. "Domakonda Fort, Domakonda (V) & (M) | District Kamareddy, Government of Telangana | India". kamareddy.telangana.gov.in. Archived from the original on 2022-05-20. Retrieved 2022-12-01.
  2. Nov 27, TNN / Updated; 2022; Ist, 05:34 (2022-11-27). "Hyderabad: Unesco honour for bowlis and Domakonda Fort | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2022-11-27. Retrieved 2022-12-01. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  3. నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 41
  4. 4.0 4.1 "UNESCO Awards: గోల్కొండ మెట్లబావి, దోమకొండ కోటలకు యునెస్కో పురస్కారాలు". Sakshi Education. 2022-11-28. Archived from the original on 2022-11-30. Retrieved 2022-12-01.
  5. Telugu, TV9 (2022-11-29). "Domakonda Fort: రాజఠీవికి నిలువెత్తు నిదర్శనం దోమకొండ కోట.. యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డుకి ఎంపిక". TV9 Telugu. Archived from the original on 2022-12-01. Retrieved 2022-12-01.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. ABN (2022-11-28). "Domakonda Fort: రామ్‌చరణ్-ఉపాసన పెళ్లి జరిగిన ఈ కోటకు అవార్డ్ ఎందుకొచ్చిందంటే." Andhrajyothy Telugu News. Archived from the original on 2022-11-28. Retrieved 2022-12-01.
  7. ABN (2022-11-28). "Golkonda: గోల్కొండ మెట్లబావి.. దోమకొండకు యునెస్కో సలాం". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-11-27. Retrieved 2022-12-01.