ధూళిపూడి ఆంజనేయులు

డి.ఎ.గా ప్రసిద్ధులైన డి.ఆంజనేయులు పూర్తి పేరు ధూళిపూడి ఆంజనేయులు (1924 జనవరి 10 - 1998 డిసెంబరు 27) సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత, సంపాదకులు. వీరు గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, యలవర్రులో 1924 జనవరి 10వ తేదీన జన్మించారు. వీరు మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో ఎం.ఎ. పూర్తిచేసి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. విద్యార్థిదశ నుండి ఇంగ్లీషు భాషా సాహిత్యం పట్ల అభిరుచిని పెంచుకున్న వీరు రచయితగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా తనను తాను రూపుదిద్దుకున్నారు. ఇంగ్లీషు జర్నలిజంలో బాగా రాణించి పేరుతెచ్చుకున్న తెలుగువారైన సి.వై.చింతామణి, కోటంరాజు రామారావు, కోటంరాజు పున్నయ్య, చలపతిరావు, కుందూరి ఈశ్వరదత్తు, ఖాసా సుబ్బారావు, జి.వి.కృపానిధి, సి.వి.హెచ్.రావు, జి.కె.రెడ్డి, ఎ.ఎస్.రామన్ ల సరసన నిలబడ్డారు.

డి.ఎ.

మొదట ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంపాదకవర్గంలో 1948లో చేరి 1953లో ది హిందూ పత్రికలో చేరి అనుభవం సంపాదించిన తర్వాత 1959లో ఆకాశవాణి వారి వాణి పత్రిక సంపాదక బాధ్యతలు స్వీకరించారు.

తెలుగు సాహిత్యాన్ని రచయితలను ఆంధ్రేతరులకు పరిచయం చేయడంలో విశిష్టమైన కృషిచేశారు.[1] కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ వంటి పలువురి తెలుగు కవితలను ఆయన ఇంగ్లీషులోకి అనువదించారు. విశ్వనాథ సత్యనారాయణ రచనలను పరిచయం చేశారు. ద్వివేదుల విశాలాక్షి గారి 'గ్రహణం విడిచింది' నవల, అమరజీవి 'పొట్టి శ్రీరాములు జీవితచరిత్ర' వంటి కొన్ని తెలుగు పుస్తకాలను ఇంగ్లీషులోకి అనువదించారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా

మార్చు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగరీత్యా ఆంజనేయులు ఢిల్లీ, హైదరాబాద్, మద్రాసులో వుంటూ సమాచారశాఖలో జర్నలిస్టుగా వృత్తిధర్మం నిర్వర్తించారు. ఉద్యోగంలో వున్న వివిధ పత్రికలకు రాస్తూ ఆంజనేయులు మంచి పేరు తెచ్చుకున్నారు. అంతకుమించి, చక్కని రచనలు ప్రచురించారు. ఆయన రాసిన పత్రికలు క్వెష్ట్, ఇండియన్ రివ్యూ, థాట్, ఇండియన్ లిటరేచర్, త్రివేణి, ఫైనాంషియల్ ఎక్స్ ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, ఇండియన్ రైటింగ్ టుడే పేర్కొనదగినవి.

తెలుగు పత్రికలకు ఇంగ్లీషులో రాసి పంపగా, అనువదించి వేసుకునేవారు. స్వతంత్ర టైమ్స్, డక్కన్ హెరాల్డ్, న్యూస్ టుడే, ఇండియన్ బుక్ క్రానికల్ పత్రికలు కూడా ఆంజనేయులు వ్యాసాలు ప్రచురించాయి. భవాన్స్ జర్నల్లో ఎన్నో విలువైన వ్యాసాలు ఆంజనేయులు రాశారు. వృత్తిచేస్తూనే అనేక సెమినార్లకు, చక్కని వ్యాసాలు రాయడం ఆంజనేయుల జర్నలిస్ట్ కృషిలో భాగం అయింది. దీనిఫలితంగా జీవితచరిత్ర, కళ గురించేగాక, నెహ్రూ, రాధాకృష్ణన్, అంబేద్కర్, నిరాద్ చౌదరి మొదలైనవారిపై లోతైన పరిశీలనా వ్యాసాలు రాశారు.

వీరి స్వంత గ్రంథాలయం మన దేశంలో అతి పెద్దదైన వ్యక్తిగత గ్రంథాలయాలలో ఒకటి. తెలుగువారు గర్వించదగిన ఇంగ్లీషు జర్నలిస్టు తన 75వ ఏట 1998 సంవత్సరం డిసెంబరు 27 తేదీన చెన్నైలో పరమపదించారు. ఆయనకు భార్య మూలమూడి ఆదిలక్ష్మి, కూతురు శాంతిశ్రీ ఉన్నారు.

తెలుగు సాహిత్యం లో కృషి

మార్చు

వృత్తిరీత్యానూ, వ్యక్తి దృష్ట్యా ఆంజనేయులుగారికి ఎందరో సన్నిహితులయ్యారు. వారిలో నార్ల వెంకటేశ్వారరావు, సంజీవదేవ్, బి.ఎస్.ఆర్.కృష్ణ, కె.శ్రీనివాస అయ్యంగార్, వామనరావు, పట్టాభిరాం, ఎ.ఆర్.బాజీ, భావరాజు నరసింహారావు ప్రభృతులెందరో ఉన్నారు. నార్ల వెంకటేశ్వరరావు తన ఇంగ్లీషు రచనల్ని ముందుగా ఆంజనేయులు పరిశీలించిన తరువాత ప్రచురించేవారు.

సాహిత్య అకాడమీ ప్రచురించిన కట్టమంచి రామలింగారెడ్డి, కేంద్ర ప్రచురణ సంస్థ వెలువరించిన కందుకూరి వీరేశలింగం పేర్కొనదగిన ఆంజనేయులు రచనలు.

విశ్వనాథ సత్యనారాయణ, గోపీచంద్, బైరాగి, పాలగుమ్మి పద్మరాజు, శ్రీశ్రీ, సి. నారాయణరెడ్ది, దాశరథి, దేవులపల్లి కృష్ణశాస్త్రి మొదలైన వారిని తెలుగేతరులకు చక్కగా మదించి పరిచయం జేయడం ఆంజనేయులు కృషిళొ భాగమే. ఆయన రెండో భార్య హేమలత హిందీ విద్వాంసురాలు. ఆమె కూడా ఆంజనేయులుగారి రచనల్లో, సమాచార సేకరణలో తోడ్పడుతుండేది. ఆంజనేయులు గారికి పుస్తకాల సేకరణ మంచి అభ్యాసం. ఆయన 1999లో చనిపోయిన తరువాత శాంతిశ్రీ, ఆ గ్రంథాలయాన్ని పూనాకు తరలించారు.

ద్వివేదుల విశాలాక్షి రచన "గ్రహణం విడిచింది" ఇంగ్లీషులోకి అనువదించారు.

ఆంజనేయులు రిటైర్ అయిన తరువాత మద్రాసులో స్థిరపడి, హిందూలో బిట్వీన్ యు అండ్ మి అనే శీర్షిక 10 సంవత్సరాలు (1981-91) నిర్వహించారు. సున్నిత హాస్యం, విమర్శ ఆయన రచనల్లో కనిపించేది. ఆంజనేయులు సెక్యులర్ జీవితం గడిపారు. కుమార్తె వివాహం రిజిస్టర్ చేయించి, కన్యాదాన పద్ధతి నిరసించారు. సంగీతం, సంస్కృతం, సాహిత్యం అంటే ప్రత్యేకాభిమానం.

మద్రాసు ప్రెస్ క్లబ్ లో 30 సంవత్సరాలు అధ్యక్షులుగా ఉన్నారు. సాహిత్య విమర్శ, సాంఘిక సంస్కరణలపై కూడా రచనలు చేశారు. చిట్టచివరగా ఖాసాసుబ్బారావు జీవితచరిత్ర రాశారు. అది ఇంకా వెలుగు చూడాల్సివుంది

రచనలు

మార్చు
  • డా.సి.ఆర్.రెడ్డి (Dr. C.R.Reddy, Makers of Indian Literature) పై మోనోగ్రాఫ్ సాహిత్య అకాడమీ కోసం 1973 లో రచించారు.[2]
  • సోవియట్ రష్యా, ఐరోపా లలో తన పర్యటన అనుభవాలతో 'విండో టు ది వెస్ట్' (Window to the West), త్రివేణి పబ్లిషర్స్, మద్రాసు, 1967.[3]
  • కందుకూరి వీరేశలింగం జీవితచరిత్ర, భారత ప్రభుత్వ పబ్లికేషన్ డివిజన్ కోసం 1976లో రచించారు.[4]
  • సెక్యులర్ సెయింట్ లిట్ ఎ సోరావ్ మెసేజ్
  • గ్లింప్సెస్ ఆఫ్ తెలుగు లిటరేచర్ (Glimpses of Telugu Literature), 1987.[5]
  • ఆథర్ యాజ్ ఆర్టిస్ట్
  • ది ఆర్ట్ ఆఫ్ బయోగ్రఫీ (The art of biography), క్రిస్టియన్ లిటరేచర్ సొసైటీ, మద్రాసు, 1982.[6]
  • డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ సోషల్ రిఫార్మ్ (Dynamics of Indian Social Reform), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ కల్చర్, బెంగళూరు.[7]

మూలాలు

మార్చు
  • 20వ శతాబ్దపు తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.

https://te.wikisource.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Abaddhala_veta_revised.pdf/339&action=edit