ఖాసా సుబ్బారావు

ఖాసా సుబ్బారావు భారతదేశపు ప్రముఖ పత్రికా సంపాదకులలో ఒకడు.

ఖాసా సుబ్బారావు
ఖాసా సుబ్బారావు
జననంఖాసా సుబ్బారావు
1896, జనవరి 23
నెల్లూరుజిల్లా, కావలి పట్టణం
మరణం1961 , జూన్ 16
ఇతర పేర్లుmother raamaabaayamma
ప్రసిద్ధిపత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత
మతంహిందూ
తండ్రిసుందర రామారావు
తల్లిరాంబాయి

బాల్యము, విద్యాభ్యాసము

మార్చు

ఖాసా సుబ్బారావు 1896, జనవరి 23న నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు,.[1] [2] ఇతని తల్లి రామాబాయమ్మ, తండ్రి సుందర రామారావు. యాజ్ఞవల్క్య బ్రాహ్మణుడు (ప్రథమశాఖ). ఇతని పూర్వీకులు మహారాష్ట్ర ప్రాంతం నుండి నెల్లూరుకు వలస వచ్చారు. ఇతడు ఉన్నత పాఠశాల విద్య నెల్లూరులో పూర్తి చేసి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల నుండి ఫిలాసఫీ ప్రధాన విషయంగా డిగ్రీ పుచ్చుకున్నాడు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ మద్రాసు కాలేజీలో ఇతనికి గురువు. ఖాసా సుబ్బారావుపై అతని గురువు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ బోధనల ప్రభావం జీవితాంతం ఉండేది. డిగ్రీ పూర్తి అయిన తరువాత న్యాయశాస్త్రంలో పట్టా సంపాదించాడు. కానీ కారణాంతరాల వల్ల న్యాయవాద వృత్తి చేపట్టలేదు. పైగా రాజమండ్రి వెళ్లి ఉపాధ్యాయ శిక్షణ పొందాడు. నెల్లూరు జిల్లా కందుకూరు జిల్లా బోర్డు మాధ్యమిక పాఠశాల ప్రధానోపాద్యాయ పదవిలో కొంతకాలం పనిచేశాడు. ఈ ఉద్యోగం అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. రాత్రి వేళల్లో స్కూలు సమీపంలో ఉన్న 50 మంది వయోజనులకు చదువు చెప్పి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాడు. ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి భార్య భవానిబాయి, తల్లి రామాబాయంమ్మలతో కలిసి నేల్లూరుజిల్లా పల్లిపాడులో గాంధీజీ ప్రాంరంభించిన పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమంలో ఉన్నాడు. చతుర్వేదుల వెంకటకృష్ణయ్య, దిగుమర్తి హనుమతరావు, బుచ్చికృష్ణమ్మ, కొండిపర్తి పున్నయ్య తదితర ఆశ్రమ వాసులతో కలిసి సత్యం, అహింస, బ్రహ్మచర్యం మొదలయిన 11 సూత్రాలను ఆచరిస్తూ, నిర్మాణకార్యక్రమంలో పాల్గొన్నాడు. భవానిబాయి ఆశ్రమంలో probationerగా, ఆశ్రమ ఉద్యోగినిగా ఉన్నట్లు రికార్డులో ఉంది. చిన్న అపార్దం వచ్చి సుబ్బారావు ఆశ్రమాన్ని విడిచిపెట్టినట్లు వెన్నెలకంటి రాఘవయ్య 'స్మృతి శకలాలు"లో గ్రంథస్తం చేసాడు. 1932 ప్రాంతాలలో భవానిబాయి మరనించిం సుబ్బారావు విధురుదయ్యాడు..

స్వరాజ్య

మార్చు

ఉపాధ్యాయ వృత్తి తర్వాత 1921లో ఖాసా సుబ్బారావు మద్రాసుకు వచ్చి స్వరాజ్య ఆంగ్ల దినపత్రికలో ఉపసంపాదకుడిగా చేరాడు. టంగుటూరి ప్రకాశం ఈ పత్రికను స్థాపించాడు. మద్రాసు ప్రెసిడెన్సీలో నివసించే ఆంధ్రులు వివక్షకు గురయ్యేవారని టంగుటూరి ప్రకాశం భావించాడు. మద్రాసాంధ్రులకు బాసటగా స్వరాజ్యను ప్రారంభించాడు. ఈ పత్రికకు ప్రకాశం పంతులు మేనేజింగ్ డైరెక్టర్‌గా, సంపాదకుడిగా వ్యవహరించాడు. కె.ఎం.ఫణిక్కర్ ఇన్‌ఛార్జ్ ఎడిటర్‌గా వ్యవహరించేవాడు. ఖాసా సుబ్బారావుతో పాటు ఎస్.ఎన్.వరదాచారి, కోలవెన్ను రామకోటేశ్వరరావు, ఎం.చలపతిరావు మొదలైన వారు ఈ పత్రిక ఉపసంపాదకులుగా వ్యవహరించారు. ఈ పత్రిక 1921లో ప్రారంభమై 1935 వరకు వెలువడింది. జర్నలిస్టుగా ఖాసా సుబ్బారావు రాణించడానికి ఈ పత్రిక ఎంతగానో తోడ్పడింది. ఈ పత్రిక ఉత్థాన పతనాలను ఇతడు తన Men in the Lime light గ్రంథంలో ఎంతో హృద్యంగా వర్ణించాడు. ఆర్థిక సంక్షోభం వల్ల ఈ పత్రిక మూతబడింది. టంగుటూరి ప్రకాశంపత్రికలో పనిచేసే కార్మికులకు వేతనాలు చెల్లించలేక పోతే ఇతడు కార్మికుల పక్షాన నిలిచాడు. కార్మికులకు వేతనాలు చెల్లించాలని ప్రకాశంకు ఘాటైన లేఖలు వ్రాసేవాడు.

స్వతంత్ర

మార్చు

స్వతంత్ర భావాలు కలిగిన ఇతడు ఇతర పత్రికలలో ఇమడలేక స్వంతంగా పత్రికను ప్రారంభించాడు. తన మిత్రుడు ఉప్పులూరి కాళిదాసు సహకారంతో 1946లో స్వతంత్ర[3] అనే ఆంగ్ల వారపత్రికను ప్రారంభించాడు. 1948లో తెలుగు స్వతంత్రను ప్రారంభించాడు. ఈ రెండు వారపత్రికలను పదేళ్ల పాటు బలమైన రాజకీయ వార్తాపత్రికలుగా నడిపాడు. తెలుగు స్వతంత్రలో చాలా అపురూపమైన సాహిత్యం ప్రచురితమైంది. ఈ రచనలకు పారితోషికం ఇచ్చే సంప్రదాయం తొలినాళ్ళలో లేకున్నా అప్పటికి ఔత్సాహిక రచయిత అయిన భరాగో ఉత్తరంలో కోరడంతో సరిదిద్దుకుని ఆపైన రచనలకు పారితోషికం ఇచ్చే సంప్రదాయం ప్రారంభించాడు.[4]

ఇతర పత్రికలు

మార్చు

ఇతడు స్వరాజ్య దినపత్రిక మూతబడిన తర్వాత కలకత్తాలోని లిబర్టీ, ఇండియన్ ఫైనాన్స్, బొంబాయిలోని ఫ్రీప్రెస్ జర్నల్, మద్రాసులో ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ దినపత్రికలలో సంపాదకుడిగా పనిచేశాడు.

సత్యాగ్రహం

మార్చు

గాంధీమహాత్ముడు సహాయనిరాకరణ ఉద్యమం ప్రారంభించినపుడు ఖాసా సుబ్బారావు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. ఉప్పుసత్యాగ్రహపు లక్ష్యాలను ప్రజలకు వివరించడానికి అనేక చోట్ల పర్యటించాడు. ఇతనితో పాటు ఇతని తల్లి కూడా గ్రామగ్రామాలలో పర్యటించి ఖాసా సుబ్బారావుకు సహకరించింది. కొడుకు ఆశయాలకు వత్తాసు పలికి తల్లి తన ఆరోగ్యాన్ని ఖాతరు చేయక కొడుకుతో పాటు గ్రామగ్రామంలో తిరిగి అతని బాగోగులను చూసుకోవడం చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఇతడు 6 నెలల కఠిన కారాగార శిక్షను అనుభవించాడు. 1931లో మద్రాసులోని చైనాబజారులో విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. అప్పుడు ఇతడికి పోలీసు లాఠీ దెబ్బలు తగిలి తీవ్ర రక్తస్రావం జరిగి మూర్ఛ పోయాడు. ఈ సంఘటన బ్రిటీష్ పార్లమెంటులో ప్రకంపనలను సృష్టించింది. ఈ సంఘటనపై విచారణ జరిపిన ఏక సభ్య కమిషన్ లార్డ్ లూథియన్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖాసా సుబ్బారావును పరామర్శించి ఈ చర్యను ఖండించింది. కానీ తర్వాత ఇతడికి 6 నెలల కఠినశిక్ష విధించి వెల్లూరు జైలులో నిర్బంధించారు. 1942-44ల మధ్య ఇతడు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని సుమారు 20 నెలల కారాగార వాసం అనుభవించాడు.

రచనలు

మార్చు

మానవతావాది

మార్చు

ఖాసా సుబ్బారావు గొప్ప సంపాదకుడే కాకుండా అంతకు మించిన మానవతావాది. ఇతరుల కష్టాలను తన కష్టాలుగా భావించేవాడు. ఇతని మిత్రుడైన సి.ఎస్.రంగస్వామి యొక్క సోదరుడు షేర్ మార్కెట్టులో నష్టపోయి అప్పులపాలైతే ఇతడు తన స్వంత భూములను అమ్మి మరీ సహాయం చేశాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో తన సహ ఉద్యోగికి జరిగిన అన్యాయం కోసం తన పదవికి రాజీనామా చేశాడు. విద్యార్థి దశలో ఒక బీద విద్యార్థికి తన రెండు జతల బట్టలను దానం చేసి తను ఒక జత దుస్తులతో సర్దుకున్నాడు. సంపాదకుడిగా పేరు ప్రఖ్యాతులు గడించినా కూడా తనకు బట్టలు ఉతికిపెట్టే వరదన్ అనే వ్యక్తి గురించి స్వతంత్ర పత్రికలో ఒక పెద్ద వ్యాసం వ్రాశాడు.

మూలాలు

మార్చు
  1. రాపాక, ఏకాంబరాచార్యులు (2012-11-01). Eminent Editors. హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 37–44.
  2. D. ANJANEYULU (1996-01-21). "The man and the journalist". THE HINDU. Archived from the original on 23 సెప్టెంబరు 2005. Retrieved 13 February 2015.
  3. "ప్రెస్ అకాడెమీ ఆర్కీవ్స్‌లో స్వతంత్ర సంచిక". Archived from the original on 2016-03-05. Retrieved 2015-02-13.
  4. అత్తలూరి, నరసింహారావు (మార్చి 1990). ఇట్లు మీ విధేయుడు (పదినిమిషాల్లో భరాగో పరిచయము వ్యాసం). విశాఖపట్టణం: విశాఖ సాహితి. Retrieved 10 March 2015.

5 వెన్నెలకంటి రాఘవయ్య "స్మ్రుతిశకలాలు"

6.A report of Pinakini Satyaagraha Asram, published by Chaturvedula Venkata Krishnaih ( extracts produced in Zamin Ryot Weekly.