దీనికి నయనాలప్ప తిప్ప అని కూడా పేరు. కర్నూలు జిల్లాలో ఇది నొస్సం నుండి కోవెలకుంట్లకు వెళ్ళే మార్గంలో ఉంది. దీనిపై శివాలయం ఉంది. ఆ శివాలయము గర్భ గుడిలో ఒక బిలం ఉంది. ఈ బిలములోనే నారసింహారెడ్డి తాను చంపిన తహశీల్దారు, బొందిలి వాని తలలను ఉప్పు కుండలలో దాచాడని చెప్పుకుంటారు.

నయనాలప్ప కొండను గురించి ఒక ఐతిహ్యము ఉంది. పూర్వకాలములో ఒక గాజుల వ్యాపారి తన భార్య గర్భిణిగా ఉండగా దేశాంతరగతుడయ్యాడు. తరువాత 15 సంవత్సరాలకు తిరిగి యింటికి వచ్చాడు. అతడు ఇంటికి వచ్చేసరికి భార్య ఇంటిలో లేదు. 15 సంవత్సరాల కన్య ఉండింది. ఆమె సౌందర్యమును జూచి కంసాలి మోహపరవశుడైనాడు. ఆమెను బలాత్కరించి మానభంగం చేశాడు. తరువాత భార్య వచ్చింది. భర్తను గుర్తించి , ఆ కన్య తమ కూతురని తెలిపింది. అతడు చేసిన మహాపాపమునకు కారణము తన కన్నులే అని నిర్ణయించుకొని వానిని పెరకికొని, సమీపంలో ఉన్న కొండకు పోయి తపస్సు చేశాడు. నయనములు పోయినవాడు తపస్సు చేసిన కొండ కావున దానికి నయనాలప్పకొండ అని పేరు వచ్చింది.