నవోదయ రామమోహనరావు
నవోదయ రామమోహనరావుగా అందరికీ సుపరిచితులు అట్లూరి రామమోహనరావు నవోదయ పుస్తక ప్రచురణ సంస్థ, నవోదయ పుస్తకాల అంగడి యజమాని.
జీవిత విశేషాలు సవరించు
బాల్యము, విద్యాభ్యాసం సవరించు
ఇతడు 1934, ఆగస్టు 1న కృష్ణా జిల్లా ఉంగుటూరు గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. తన 28వ యేట నుండి పుస్తక ప్రచురణరంగంలో ప్రవేశించి ఆరు దశాబ్దాలకు పైగా అదే రంగంలో ఉన్నాడు. ఇతనికి ముగ్గురు అక్కలు. తల్లి మతిస్థిమితం లేకపోవడంతో ఇతడు తన పెద్దక్క శేషారత్నం సంరక్షణలో పెరిగాడు. ఇతడు ప్రాథమిక విద్యను ఉంగుటూరులో, హైస్కూలు విద్యను గుడివాడలో చదివాడు. ఇతడు కమ్యూనిస్టు పార్టీపై మక్కువతో ఆ పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నాడు. గుడివాడలో చదివే సమయంలో కమ్యూనిస్టులపై నిర్భందం కారణంగా అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయాడు. తరువాత కైకలూరులో తన బావ వద్ద ఉంటూ పదవ తరగతి పూర్తి చేశాడు[1].
వృత్తి సవరించు
పై చదువులు చదివే స్తోమత లేకపోవడంతో నెలకు 50 రూపాయల జీతానికి విశాలాంధ్ర ప్రచురణాలయంలో పనిచేశాడు. అక్కడ అతనికి కమ్యూనిస్టు పార్టీతో మరింత సంబంధం ఏర్పడింది. కమ్యూనిస్టు నేతలతో పరిచయాలు పెంచుకున్నాడు. 1960లో ఇతని బావ తను స్థాపించిన నవోదయ పబ్లిషర్స్ సంస్థను ఇతనికి అప్పగించాడు. ఈ సంస్థను కష్టపడి అభివృద్ది చేసి గుంటూరు, మద్రాసులలో శాఖలను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమైన పుస్తక ప్రచురణ సంస్థగా రాణించింది. ఈ సంస్థనుండి శ్రీశ్రీ, రావిశాస్త్రి, ముళ్ళపూడి వెంకటరమణ, బాపు, గొల్లపూడి మారుతీరావు, నండూరి రామమోహనరావు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, నార్ల వెంకటేశ్వరరావు వంటి రచయితల పుస్తకాలు వెలుగు చూశాయి.[2] ఈ ప్రచురణ సంస్థ 2016లో మూత పడింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిషర్స్ అండ్ బుక్‌సెల్లర్స్ అసోసియేషన్‌ను స్థాపించి, ప్రచురణల రంగంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చి, ప్రచురణ కర్తలకు అండగా నిలిచాడు. విజయవాడలో పుస్తక ప్రదర్శనలకు ఆద్యుడు. ఇందుకోసం దేశమంతా తిరిగి విస్తృతంగా అధ్యయనం చేసిన కొద్దిమందిలో ఒకడు. 1989లో నేషనల్ బుక్ ట్రస్ట్ వారితో సంప్రదింపులు జరిపి, విజయవాడలో పుస్తక మహోత్సవాన్ని ఏర్పాటు చేయించాడు. అనంతర కాలంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీని ఏర్పాటు చేసి, 1991 నుంచి నిరంతరాయంగా పుస్తక మహోత్సవాలను నిర్వహించేలా ఆయన కృషి చేశాడు. ఈ సొసైటీకి వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆరవ పుస్తక మహోత్సవం వరకు ఆయన బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా కొనసాగాడు[1].
కుటుంబం సవరించు
ఇతనికి 1955లో పర్వతనేని ఝాన్సీలక్ష్మితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు సుధాకర్, కుమార్తె శోభ జన్మించారు.
మరణం సవరించు
ఇతడు తన 85వ యేట విజయవాడలోని తన స్వగృహంలో 2019, డిసెంబరు 15 ఆదివారం నాడు మరణించాడు[2].
మూలాలు సవరించు
- ↑ 1.0 1.1 సెంట్రల్ డెస్క్, ఆంధ్రజ్యోతి (16 December 2019). "'నవోదయ' రామ్మోహనరావు ఇక లేరు". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original on 17 December 2019. Retrieved 17 December 2019.
- ↑ 2.0 2.1 విలేకరి (16 December 2019). "నవోదయ రామ్మోహనరావు ఇకలేరు". ఈనాడు దినపత్రిక. Archived from the original on 17 December 2019. Retrieved 17 December 2019.