నీ సుఖమే నే కోరుకున్నా

నటుడు గిరి బాబు దర్శకత్వం వహించిన చిత్రం నీ సుఖమే నే కోరుకున్నా. ఈ చిత్రంలో రాజా, స్నేహ ప్రధాన పాత్రల్లో, రఘు బాబు, కోట శ్రీనివాసరావు, కోవై సరాలా, అలీ, బ్రహ్మానందం, కొండవలస లక్ష్మణారావు సహాయక పాత్రల్లో నటించారు. ఇది 2008 ఫిబ్రవరి 22 న విడుదలైంది.

నీ సుఖమే నే కోరుకున్నా
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం గిరిబాబు
తారాగణం రాజా, స్నేహ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎల్.బి.శ్రీరామ్
నిర్మాణ సంస్థ రణభేరి ఆర్ట్స్
విడుదల తేదీ 22 ఫిబ్రవరి 2008
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ మార్చు

మధు (రాజా) ఒక పేద కుటుంబానికి చెందినవాడు. కళాశాల స్పోర్ట్స్ ఛాంపియన్. అంతేకాకుండా, అతను చదువులో చాలా తెలివైనవాడు. స్వప్న (స్నేహ) లక్షాధికారి సార్వభౌమరావు (కోట శ్రీనివాసరావు) కుమార్తె. ఆమె కూడా చదువులో, ఇతర కార్యకలాపాలలోనూ ముందుంటుంది. ఆమె చాలా సరళంగా ఉండే అమ్మాయి. బస్సులో కాలేజీకి వెళుతుంది. కారును ఉపయోగించడం ఇష్టం ఉండదు. శేఖర్ (చక్రవర్తి) వారి క్లాస్‌మేట్. శేఖర్ స్వప్నను ప్రేమిస్తాడు. రమ్య కూడా వారి క్లాస్‌మేట్, స్వప్నకు బెస్ట్ ఫ్రెండ్. ఒకసారి, స్వప్న సోదరుడు (రఘుబాబు) శాంతి అనే అమ్మాయిని ఆటపట్టించినప్పుడు మధు ఆమెను రక్షిస్తాడు. కాబట్టి, అతను మధుపై పగ పెంచుకుంటాడు. శేఖర్ స్వప్నను ప్రేమిస్తున్నప్పటికీ, ఆమె మాత్రం మధును ప్రేమిస్తుంది. శేఖర్ నిశ్శబ్దంగా వారి నుండి దూరమవుతాడు.

మధు స్వప్న పుట్టినరోజు పార్టీకి వెళ్ళినప్పుడు, ఆమె సోదరుడు అతణ్ణి కొడతాడు. కాబట్టి, కొంతకాలం ఆమె నుండి దూరంగా ఉండాలని మధు నిర్ణయించుకుంటాడు. హైదరాబాదులో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్తాడు. కొంతకాలం తర్వాత తన తల్లిదండ్రులను, సోదరుడిని ఒప్పించి ఆమెను పెళ్ళి చేసుకుంటానని స్వప్నకు వాగ్దానం చేస్తాడు. వివాహం తర్వాత హైదరాబాద్‌ లోనే ఉంటున్న రమ్య, ఇంటి యజమాని కుమార్తె శాంతితో సన్నిహితంగా ఉన్న మధును చూసి తప్పుగా భావిస్తుంది. అంతేకాకుండా, ఆమెను ప్రేమిస్తున్న శాంతి సహచరులలో ఒకరు (నవభారత్ బాలాజీ), మధు శాంతి లపై దుష్ప్రచారం చేస్తాడు. ఇది రమ్య సందేహాలను బలపరుస్తుంది. స్వప్న హైదరాబాద్ వెళుతుంది. ఆమె కూడా మధు, శాంతిల స్నేహాన్ని అపార్థం చేసుకుంటుంది. ఎవరినైనా పెళ్ళి చేసుకోవడానికి స్వప్న అంగీకరిస్తుంది. యాదృచ్ఛికంగా, శేఖర్ సార్వభౌమ బాల్య స్నేహితుడి (నర్రా వెంకటేశ్వర రావు) కుమారుడు. వారు ఈ సంబంధం కుదుర్చుకుంటారు. అయితే, శేఖర్ కూడా మధు పెద్దమనిషి అని స్వప్నను ఒప్పించటానికి ప్రయత్నిస్తాడు కాని విఫలమవుతాడు. మధు స్వప్నను కలిసినప్పుడు, ఆమె అతన్ని తిట్టి ఒక మోసగాడు అని అంటుంది. పెళ్ళికి ముందే శేఖర్ ప్రమాదంలో మరణిస్తాడు. ఈ సమయంలో, శేఖర్ తండ్రి మేనకోడలు అయిన శాంతి, అతనిని ఓదార్చడానికి వచ్చి స్వప్నను చూస్తుంది. తన ప్రేమ ఏకపక్షమనీ, మధు నిజంగా ప్రేమిస్తున్నది స్వప్ననేననీ, అతని ఆలోచనలలో ఆమే ఉందనీ చెబుతుంది. స్వప్న తన తప్పును గ్రహిస్తుంది. స్వప్న మధు కలవడంతో సినిమా ముగుస్తుంది.

తారాగణం మార్చు

పాటలు మార్చు

వెన్నలకంటి రాసిన పాటలను మాధవపెద్ది సురేష్ స్వరపరిచాడు.[1]

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "చందమామ రావో జాబిల్లి రావో"  సునీత 3:55
2. "కన్నుల విందుగా నేను కలగన్నానులే"  కార్తిక్, సాధనా సర్గం 4:57
3. "మోనాలీసా హైలెస్సా"  టిప్పు 4:30
4. "ఓనా ప్రేమా మండే చందమామా"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 4:16
5. "ఆమ్మాయి పుట్టిందమ్మా ఆనందం తెచ్చిందమ్మా"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి 4:38
6. "ఏమిటో ఇది సరికొత్తగా ఉంది"  కార్తిక్, చిత్ర 4:05
26:21

మూలాలు మార్చు

  1. "Nee Sukhame Ne Koruthunna Songs - Nee Sukhame Ne Koruthunna Telugu Movie Songs - Telugu Songs Lyrics Trailer Videos, Preview Stills Reviews". Raaga.com. Retrieved 2012-08-06.