గ్రామ పంచాయతీ

(పంచాయతీ నుండి దారిమార్పు చెందింది)

మూడంచెలుగల పంచాయితీరాజ్ వ్యవస్థలో తొలి స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థనే గ్రామ పంచాయితీ అంటారు. ప్రభుత్వ ప్రకటన ద్వారా గ్రామ పంచాయితీలను నిర్ణయిస్తారు.[1] వీటికి ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

చరిత్ర సవరించు

ప్రాచీనకాలంలో గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితుల కనుగుణంగా ఐదు ప్రధాన వృత్తుల ప్రతినిధులతో వుండేది. అయితే వీటికి ఎక్కువగా అధికారముండేది కాదు. బ్రిటిష్ పాలన తొలిదశలో ఈ వ్యవస్థ అంతగా ఆదరించబడనప్పటికీ గవర్నర్ జనరల్ రిప్పన్ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాల ద్వారా బలం పుంజుకున్నాయి.

రాజ్యాంగంలో గ్రామపంచాయితీల ఏర్పాటు, వాటి అధికారాలకు ప్రాధాన్యం ఇచ్చింది. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్. 1959 నవంబరు 1న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, దేశంలోనే రెండవదిగా మహబూబ్ నగర్ జిల్లా, షాద్‌నగర్ లో ప్రారంభమైంది.

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీలు గ్రామపంచాయితీ చట్టం 1994 పై ఆధారపడినవి. జిల్లా కలెక్టర్ ఒక రెవెన్యూ గ్రామం లేదా దానిలోని ఏదైనా ఒక భాగాన్ని గ్రామ పంచాయితీగా నిర్ణయించవచ్చు.[2] [3]

దీనిలో పంచాయితీ నిర్వహణలో పంచాయితీ సమావేశం, గ్రామ సభ, ముఖ్యమైనవి

విధులు సవరించు

తప్పనిసరి విధులు సవరించు

  • వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ, గ్రామీణ విద్యుదీకరణ
  • ఆరోగ్యం, పారిశుద్ధ్యం, అంటు వ్యాధుల నివారణ చర్యలు, వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
  • గ్రామ ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ
  • జనన, మరణాల నమోదు
  • పరిధిలోని మార్కెట్ల నిర్వహణ
  • పశుగ్రాసాన్నిచ్చే పచ్చికబయళ్ల పెంపకం నిర్వహణ
  • తాగునీరు సరఫరా
  • మహిళా శిశు సంక్షేమం
  • ఎరువు నిల్వకు స్థలాల కేటాయింపు
  • జనగణనకు సహాయం
  • వ్యవసాయం,వర్తక వాణిజ్యాల వృద్ధి
  • భూమి అభివృద్ధి, భూసంస్కరణలకు సహాయం
  • రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన విధులనిర్వహణ, భూమి శిస్తు వసూలు
  • ప్రాథమిక పాఠశాలల స్థాపన, నిర్వహణ
  • సేంద్రీయ ఎరువుల తయారీ

అర్ధిక వనరులననుసరించి విధులు సవరించు

  • గ్రంథాలయాల ఏర్పాటు, వాటి నిర్వహణ
  • సాంప్రదాయేతర శక్తి వనరులు
  • పేదరిక నిర్మూలన పథకాలు
  • సాంస్కృతిక కార్యకలాపాలు మొదలగునవి

ఆర్థిక వనరులు సవరించు

  • పన్నుల ద్వారా వచ్చే ఆదాయం: ఇంటి పన్ను, వృత్తి పన్ను, ఆస్తుల బదిలీ పన్నులో వాటా, భూమి శిస్తులో వాటా , వాహన పన్ను, జంతువులపై పన్ను, ప్రకటనలపై పన్ను, దుకాణాలపై పన్ను మొదలగువవి
  • ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం: తన మూలధనం నుంచి వచ్చే ఆదాయం, విశ్రాంతి భవనాలు, ఖాళీ స్థలాలు, మార్కెట్లపై వచ్చే ఆదాయం.
  • ప్రభుత్వ సహాయక గ్రాంట్లు: సెస్సులు, అస్తులు పై రాబడి, గ్రామ పంచాయతి నిధులపెట్టిబడిపై వడ్డీ.
  • వివిధ సమాజాభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లు.
  • పాఠశాలలు, ఆసుపత్రులు, గ్రంథాలయాలను ఏర్పాటుచేసి నిర్వహించడానికి స్వచ్ఛందంగా దాతలు ఇచ్చే విరాళాలు.

పంచాయతీ నిధులన్నీ పంచాయతీ తీర్మానాల ప్రకారం మాత్రమే సర్పంచ్ ఖర్చు చేయాలి. సర్పంచ్ కి చెక్ రాసే హక్కు వుంటుంది. నిధుల దుర్వినియోగం జరిగితే చెక్ పవర్ తొలగిస్తారు.

గ్రామ సభ సవరించు

ఒక గ్రామపంచాయితి పరిధిలోని ఓటర్ల జాబితాలో నమోదైన వ్యక్తుల సమూహాన్ని గ్రామసభ అంటారు. గ్రామసభ సంవత్సరానికి 180 రోజులకు మించకుండా తప్పకుండా రెండు పర్యాయాలు గ్రామ సభ జరపాలి. గ్రామ సభకు సర్పంచ్‌ లేదా ఉప సర్పంచ్‌ అధ్యక్షత వహిస్తారు. గ్రామసభకు కోరం నిర్దేశించలేదు. 50 మంది లేదా 1/10వ వంతు మంది సభ్యుల కోరికపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చు. గ్రామ బడ్జెట్ ఆమోదంలో గ్రామసభ కీలకం. గ్రామ పంచాయతీ గ్రామసభకు బాధ్యత వహిస్తుంది. గ్రామాభివృద్ధికి అవసరమైన విధానాలను రూపొందించడంలో కీలకపాత్ర వహిస్తుంది.

విధులు సవరించు

  • గ్రామ పంచాయతీకి సంబంధించిన సంవత్సర ఆదాయ వ్యయాయ లెక్కలు, గత కాలపు పరిపాలన, ఆడిట్‌ నివేదికలను ఆమోదించడం.
  • గ్రామ పంచాయతీ అభివృద్ది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు.
  • వచ్చే కాలానికి చేపట్టే పనులు, బడ్జెట్‌లో ఆమోదించాల్సిన అంశాలను సూచించడం.
  • పన్నుల మార్పుల ప్రతి పాదనలు, పన్ను బకాయిదారులను, కొత్త కార్యక్రమాల లబ్ధి దారుల ఎంపిక జాబితా రూపొందించడం.
  • సమాజాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ద్రవ్య, వస్తు సంబంధమైన విరాళాలు సేకరించడం.
  • అన్ని వర్గాల మధ్య శాంతి ఐక్యతా భావాలను పెంపొందించేందుకు కృషి చేయడం.

గ్రామ పంచాయితీ సవరించు

 
గ్రామ పంచాయతీ నిర్మాణం

వార్డు సభ్యులు సవరించు

గ్రామాన్ని జనాభా ప్రాతిపదికపై వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు రహస్య ఓటింగు పద్ధతిన ఐదేళ్ల కాలానికి ఎన్ను కుంటారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది. పార్టీ రహితంగా ఎన్నికలను నిర్వహిస్తారు. ఒక సభ్యుడు ఒకటి కంటే ఎక్కువ వార్డుల నుంచి పోటీ చేయడానికి వీల్లేదు. ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్‌తో కలిపి కనిష్టంగా 5, గరిష్టంగా 21 మంది వరకు సభ్యులు ఉంటారు. వార్డుల విభజన గ్రామ జనాభాను బట్టి కింది విధంగా ఉంటుంది. గ్రామజనాభా 300 వరకు ఉంటే 5 వార్డులు గాను, గ్రామజనాభా 300-500 వరకు 7 వార్డులు గాను, గ్రామజనాభా 500-1500 వరకు 9 వార్డులు గాను, గ్రామజనాభా 1500-3000 వరకు 11 వార్డులు గాను, గ్రామజనాభా 3000-5000 వరకు 13 వార్డులు గాను, గ్రామజనాభా 5000-10000 వరకు 15 వార్డులు గాను, గ్రామజనాభా 10000-15000 వరకు 17 వార్డులు గాను, గ్రామజనాభా 15000 పైన 19 నుంచి 21 వార్డులు గాను విభజిస్తారు.

వార్డు సభ్యత్వానికి అర్హత సవరించు

  • పార్లమెంటు, శాసనసభలకు పోటీచేసే అభ్యర్థులకు వర్తించే అర్హతలు, అనర్హతలు స్థానిక సంస్థలకు వర్తిస్తాయి.
  • స్థానిక సంస్థలకు పోటీచేయడానికి కనీస వయస్సు 21 ఏండ్లు ఉండాలి.
  • ఆ సంస్థ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి.
  • ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నవారు పోటీకి అనర్హులు.

కోఆప్షన్ సభ్యులు సవరించు

గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి స్వయం సహాయక బృందం నుంచి ఒక ప్రతినిధిని కోఆప్షన్ ‌ సభ్యుడిగా ఎంపిక చేసుకోవచ్చు. వీరు సమావేశాల్లో పాల్గొనవచ్చు. అయితే వీరికి తీర్మానాలపై ఓటు చేసే అధికారం ఉండదు. వీరిని గ్రామ సభ ద్వారా ఎన్నుకోవాలి. గెలిచిన వారి కుటుంబ సభ్యులు అనర్హులు.

శాశ్వత ఆహ్వానితులు సవరించు

మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (ఎంపీటీసీ) (MPTC) శాశ్వత ఆహ్వానితుడిగా చర్చలో పాల్గొనవచ్చు. కానీ తీర్మానాలపై ఓటు వేసే అధికారం ఉండదు.

సర్పంచ్ సవరించు

గ్రామ పంచాయతీ అధ్యక్షుడిని 'గ్రామ సర్పంచ్' అంటారు. సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. సర్పంచ్‌ పదవీ కాలం ఐదేళ్లు. సర్పంచ్‌గా పోటీ చేయడానికి కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు జిల్లా ప్రాతిపదికన ఉంది. ఈ స్థానాలు ప్రతి సాధారణ ఎన్నికకు మారుతూ వుంటాయి.

సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. అయితే అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడిన సర్పంచ్‌ను జిల్లా కలెక్టర్‌ తొలగిస్తారు. గ్రామసభ సమావేశాలను ఏడాదిలో కనీసం రెండు పర్యాయాలు నిర్వహించకపోతే సర్పంచ్‌ తన పదవిని కోల్పోతారు. గ్రామ పంచాయతీ ఆడిట్‌ పూర్తి చేయనప్పుడు కూడా పదవిని కోల్పోతారు. సర్పంచ్‌ తన రాజీనామా విషయంలో గ్రామ పంచాయతీకి నోటీసు ఇచ్చి పదవికి రాజీనామా చేయవచ్చు. అయితే గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించడానికి వీలు లేనప్పుడు జిల్లా పంచాయతీ అధికారికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించవచ్చు. ఏదైనా కారణం వల్ల సర్పంచ్‌ పదవి ఖాళీ అయితే నాలుగు నెలల లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.

ఉప సర్పంచ్ సవరించు

గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కలసి ఒకరిని ఐదేళ్ల వ్యవధికి ఉప సర్పంచ్‌ను పంచాయతీ సభ్యులు మొదటి సమావేశంలో ఎన్నుకుంటారు. జిల్లా పంచాయతీ అధికారి లేదా ఆయన తరఫున సంబంధిత అధికారి ఈ ఎన్నికను నిర్వహిస్తారు. సర్పంచ్‌ కూడా ఈ ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఉప సర్పంచ్‌గా ఎన్నిక కావాలంటే వార్డు సభ్యులై ఉండాలి.

గ్రామ ఉప సర్పంచ్ రాజీనామా, తొలగింపు, పదవిలో ఖాళీలు: ఉప సర్పంచ్ తన రాజీనామా పత్రాన్ని మండల పరిషత్తు అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)కి సమర్పిస్తారు.

గ్రామ ఉప సర్పంచ్ అవిశ్వాస తీర్మానం: ఉప సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టవచ్చు. అయితే పదవి చేపట్టిన నాలుగేళ్ల వరకు ఎటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టరాదు. అవిశ్వాస తీర్మాన నోటీసుపై సగానికి తక్కువ కాకుండా సభ్యులు సంతకాలు చేసి రెవెన్యూ డివిజన్ అధికారికి సమర్పించాలి. 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి. మొత్తం సభ్యులలో 2/3వంతు తక్కువ కాకుండా సభ్యులు ఆమోదిస్తే ఉపసర్పంచ్‌ను తొలగిస్తారు. సస్పెండ్ అయిన సభ్యులకు కూడా ఈ సమయంలో ఓటు హక్కు ఉంటుంది.

గ్రామ ఉప సర్పంచ్ అధికారాలు: సర్పంచ్‌ లేని సమయంలో ఉప సర్పంచ్‌ గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహిస్తారు. ఆ సమయంలో సర్పంచ్‌కి ఉన్న అన్ని అధికార విధులు ఉప సర్పంచ్‌కు ఉంటాయి.

పంచాయితీ కార్యదర్శి సవరించు

గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరిచి, సమగ్ర సమాచారం సేకరించి, ప్రజాప్రతినిధులకు అందజేయడానికి, ప్రజలకూ, ప్రభుత్వానికీ వారధిగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండాల్సిన అవసరాన్నీ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయితీకి ఒక గ్రామ పంచాయితీ కార్యదర్శి పదవిని కేటాయించింది. ఇది 2002 జనవరి 1 నుంచి అమలులోకి తెచ్చింది. [4]

గ్రామ రెవిన్యూ అధికారి సవరించు

గతంలో గ్రామ సహాయకులు, గ్రామ పాలన అధికారి పదవులకు బదులు, 2007 ఆగస్టు నుంచి గ్రామ రెవిన్యూ అధికారుల (Village Revenue Officer) (వీఆర్వో)ల విధానం అమలులోకి వచ్చింది. వీరు తహసీల్దారు (ఎంఆర్ఒ) అజమాయిషీలో పని చేస్తారు. కొన్ని పంచాయితీల గుంపుకు ఒక రెవిన్యూ అధికారి కేటాయించగా ప్రతి గ్రామానికి గ్రామంలోనే నివసించే రెవిన్యూ సహాయకుని కేటాయించారు.

ఆచరణలు సవరించు

  • 2009, అక్టోబరు 2 నుంచి 2010, అక్టోబరు 2 మధ్య ఏడాదిని గ్రామసభ సంవత్సరంగా నిర్వహించారు. సంవత్సరంలో 180 మించకుండా గ్రామ సభ తప్పనిసరిగా రెండుసార్లు జరపాలి.
  • 2010 నుంచి ఏప్రిల్ 24ను జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.[5][6]

ఇవీ చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. కె నాగేశ్వరరావు, ed. (2008). ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ - అభివృద్ధి. తెలుగు అకాడమీ. pp. 557–559.
  2. "గ్రామ పంచాయతి కరదీపిక" (PDF). Archived from the original (PDF) on 2014-03-27. Retrieved 2010-04-25.
  3. "గ్రామ పంచాయతి సమాచార దర్శిని" (PDF). Archived from the original (PDF) on 2014-03-27. Retrieved 2010-04-25.
  4. జి.ఒ నెం 369 : పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (మండల్‌ -2) తేదీ. 9.12.2001
  5. PM Modi to address conference on National Panchayati Raj Day, Zee News, 24 April 2015, retrieved 24 April 2019
  6. "PM Modi to address conference on National Panchayati Raj Day". Yahoo News. 24 April 2015. Archived from the original on 2019-04-23. Retrieved 24 April 2019.

వనరులు సవరించు

బయటి లింకులు సవరించు