పంజా (సినిమా)
సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్క మీడియా వర్క్స్ పతాకాలపై నీలిమ తిరుమలశెట్టి, నగేష్ ముంతల, శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ కలిసి నిర్మించిన సినిమా పంజా. ఒక హంతకుడి అంతర్గత సంఘర్షణని చూపించే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సారా జేన్ డియాస్,[1] అంజలి లవానియా, జాకీ ష్రోఫ్, అడవి శేష్, ఆలీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించారు. ఇళయరాజా కొడుకు, ప్రముఖ తమిళ, తెలుగు సంగీత దర్శకులైన యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా డిసెంబర్ 9 2011న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
పంజా (2011 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విష్ణువర్ధన్ |
---|---|
నిర్మాణం | నీలిమ తిరుమలశెట్టి, నగేష్ ముంతల, శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ |
కథ | విష్ణువర్ధన్ |
చిత్రానువాదం | విష్ణువర్ధన్, రాహుల్ కోడా, అబ్బూరి రవి |
తారాగణం | పవన్ కళ్యాణ్, సారా జేన్ డియాస్, అంజలి లవానియా, జాకీ ష్రాఫ్, అడవి శేష్, తనికెళ్ళ భరణి, ఆలీ, బ్రహ్మానందం సంపత్ రాజ్ అతుల్ కులకర్ణి |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నేపథ్య గానం | యువన్ శంకర్ రాజా, హరిచరణ్, శ్వేతా పండిట్, సలోని, బెల్లీ రాజ్, ప్రియా హిమేష్, హేమచంద్ర, సత్యన్ |
నృత్యాలు | గీతా కపూర్, నిక్సన్, ఫిరోజ్ ఖాన్, దినేష్, పవన్ కళ్యాణ్ |
గీతరచన | చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి |
సంభాషణలు | అబ్బూరి రవి |
ఛాయాగ్రహణం | పి.ఎస్. వినోద్ |
కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్క మీడియా వర్క్స్ |
పంపిణీ | సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్క మీడియా వర్క్స్ |
నిడివి | 157 నిమిషాలు |
భాష | తెలుగు |
కథ
మార్చుతన తండ్రి చనిపోయాక జైదేవ్ తన అమ్మ, చెల్లెళ్ళతో కలిసి కలకత్తా చేరుకుంటాడు. అమ్మని బాగా చూసుకోవాలి, వయసొచ్చాక చెల్లికి మంచి సంబంధం తెచ్చి పెళ్ళి చెయ్యాలి అని ఎన్నో కలలతో కలకత్తాలో అడుగుపెట్టిన జైకి ఆ నగరం తన తల్లి, చెల్లెళ్ళపై కొందరి కామాంధుల బలాత్కారం చేత వారి చావుని చూపిస్తుంది. వారి శవాలను చూసి ఏడుస్తున్న జైని భగవాన్ (జాకీ ష్రోఫ్) అనే ఓ రౌడీ ఘటనాస్థలికి తీసుకెళ్ళి జై చేత వాళ్ళందరినీ చంపిస్తాడు. ఆ సహాయానికి కృతజ్ఞతగా జై నాటి నుంచీ భగవాన్ అనుచరుడిగా మారుతాడు. కొన్నాళ్ళకు భగవాన్ కలకత్తా మహానగరానికి మకుటం లేని మహారజుగా మారితే జై (పవన్ కళ్యాణ్) అతని కొడుకుకి సమానంగా చూడబడతాడు. భగవాన్ దగ్గర విశ్వాసంగా పనిచేస్తున్న జైని భగవాన్ శత్రువు కులకర్ణి (అతుల్ కులకర్ణి) డబ్బు ఆశ చూపించి భగవాన్ సామ్రాజ్యాన్ని కూల్చడంలో సహాయం చెయ్యమంటాడు. అందుకు జై ఒప్పుకోకపోయినా భగవాన్ మరో అనుచరుడు గురు (తనికెళ్ళ భరణి) తర్వాత రహస్యంగా కలిసి ఒప్పుకుంటాడు.
ఏనాటికైనా తను చిన్నప్పుడు కోల్పోయిన ప్రేమను పొందాలని కోరుకునే జైకి ఛోటూ (ఆలీ), జాహ్నవి (అంజలీ లవానియా) స్నేహితులు. జాహ్నవి జైని ప్రేమించినా జై తన ప్రేమని ఎప్పుడూ అంగీకరించడు. జై, ఛోటూ కలిసి ఒక నర్సరీని నడుపుతుంటారు. ఆ నర్సరీని అందంగా తీర్చిదిద్దేందుకు ఒక వ్యక్తి సహాయం కావాలని దినపత్రికలో ప్రకటన వేయిస్తారు. దానికి వ్యవసాయశాస్త్ర స్టూడెంట్, పర్యావరణవేత్తైన సంధ్య (సారా జేన్ డియాస్) వారిని కలుస్తుంది. మొక్కలు పెంచడం అనే పనిపై గల అభిమానం వల్ల తను జై నుంచి జీతం తీసుకోదు. అనతికాలంలో వీరిద్దరూ ప్రేమలో పడతారు. అప్పటికే భగవాన్ కొడుకు మున్నా (అడవి శేష్) విదేశాల నుంచి కలకత్తాకి వచ్చాడు. మున్నా ఒక సాడిస్ట్. మనుషుల విలువ, జాలి తెలియని దుర్మార్గుడు. జాహ్నవిపై మోజు పడ్డ మున్నా తనని ఎన్ని సార్లు కలవాలని ప్రయత్నించినా జాహ్నవి తనని దూరం పెడుతుంటుంది. మున్నాలోని కౄరస్వభావం వల్ల భగవాన్ దగ్గర విశ్వాసంగా పనిచేస్తూ తన రహస్యాలన్నీ తెలిసిన సభాపతి (పరుచూరి వెంకటేశ్వరరావు) కులకర్ణి పక్షాన చేరుతాడు. జై కులకర్ణి ఇంటికి వెళ్ళి విషయం తెలుసుకుంటాడు. అప్పటిదాకా కులకర్ణి తమ్ముడు సంపత్ (సంపత్ రాజ్) కొడుకుని జై భగవాన్ ఇంట్లో దాస్తాడు. మున్నాకి సంపత్ కొడుకుకీ జరిగిన ఘర్షణలో సంపత్ కొడుకుని చంపి జాహ్నవి జైని ప్రేమిస్తోందని తెలుసుకుంటాడు.
సంపత్ కొడుకు చనిపోయిన విషయం కులకర్ణికి తెలిసేలోపు జై అక్కడి నుంచి ఎంతో కష్టపడి తప్పించుకుంటాడు. తన ఇంటికి వెళ్ళాక అక్కడ మున్నా జాహ్నవిని అత్యంత కిరాతకంగా చంపడం చూసి ఆగ్రహంతో జై మున్నాని కొట్టి పైనుంచి కిందకి పడేలా తంతాడు. కింద గురు వెళ్తున్న కారుపై మున్నా శవం పడుతుంది. గురు వల్ల విషయం తెలుసుకున్న భగవాన్ తన మనుషులని పంపి జైని చంపమంటాడు. భగవాన్ దగ్గరికెళ్ళి నిజం చెప్పాలని బయలుదేరిన జై భగవాన్ మనుషులతో పోరాడి తనకు కలకత్తాలో దారులన్నీ మూసుకుపోయాయని తెలుసుకుని తన కారుని నర్సరీ దగ్గర వదిలేసి ఛోటూకి డబ్బులిచ్చి ఎక్కడికైనా వెళ్ళిపొమ్మంటాడు. సంధ్య తన సొంత ఊరైన పలాస వెళ్ళిందని తెలుసుకుని జై అక్కడికి వెళ్తాడు. సంధ్య ఇంటికి చేరుకున్న జై అక్కడ సంధ్య అన్న అశోక్ (సుబ్బరాజు), కాబోయే వదిన లక్ష్మి (ఝాన్సి), సంధ్య బామ్మ (కిశోరి భల్లాల్)ని కలుస్తాడు. పోలీస్ అయిన అశోక్ ఒకపక్క తమ ఊరిలో తిరుగుతున్న ప్రమాదకరమైన హంతకుడు సాంబశివుడిని ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తుంటే తన గతాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తూ సంధ్యకి తన ప్రేమ విషయం చెప్పాలనుకున్న జై ఆ ఊరిలో మరో పోలీస్ పాపారాయుడు (బ్రహ్మానందం)ని వాడుకుంటే సాంబశివుడి అడ్డాని కనుక్కోవచ్చనుకుంటాడు.
ఆ రాత్రి పాపారాయుడిని పూర్తిగా తాగించి తన నోటి వెంట సాంబశివుడు ఉన్న చోటిని తెలుసుకుంటాడు. అక్కడికెళ్ళి సాంబశివుడిని చంపి పాపారాయుడు సాంబశివుడిని చంపాడని మరుసటి ఉదయం అతన్ని, ఊరివాళ్ళనీ నమ్మిస్తాడు. ఈ లోపు భగవాన్ చాందిని అనే డాన్సర్ ద్వారా ఛోటూని తన ఇంటికి రప్పించి అతన్ని, చాందినిని కిరాతకంగా చంపేస్తారు. సంధ్య ఫొటో చూసి భగవాన్ తనని ఇక్కడికి తీసుకురమ్మని గురుకి చెప్తే అతను సంపత్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్న జైని చంపమంటాడు. నిజమంతా సంధ్య ముందు ఒప్పుకుని తన మనసును గెలిచిన జై సంపత్ నుంచి తప్పించుకుని అతన్నీ, అతని మనుషులని అశోక్ సహాయంతో చంపేస్తాడు. కలకత్తాకి వెళ్ళి తన నర్సరీలో దాచిన మారణాయుధాలు తీసుకుని కులకర్ణి ఇంటికి వెళ్తాడు జై. అక్కడ కులకర్ణి ద్వారా గురుయే జై చావుకు కుట్ర పన్నాడని తెలుసుకుని కులకర్ణిని చంపేస్తాడు. గురు ద్వారా సంధ్య భగవాన్ దగ్గరుందని తెలుసుకుని జై గురుని కూడా చంపేస్తాడు. చివరికి భగవాన్ ఇంటికి వెళ్ళిన జై అంతర్గత సంఘర్షణలో సంధ్యను కాపాడటానికి భగవాన్ని చంపి సంధ్యను తీసుకుని పలాస వెళ్ళిపోతాడు.
మూలాలు
మార్చు- ↑ ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.