పచ్చయప్పా ముదలియార్

పచ్చయప్ప ముదలియార్ (1754–1794) మద్రాసుకు చెందిన వ్యాపారవేత్త, నాణాల సేకర్త, దుబాసీ, విద్యాదాత. మద్రాసులోనే కాక దక్షిణభారతదేశం మొత్తంమీద అత్యంత ప్రాచీనమైన ఆంగ్ల విద్యాసంస్థల్లో ఒకటైన పచ్చయప్ప కళాశాలను ఆయన ధర్మనిధి నుంచే నిర్మించారు.

పచ్చయప్పా ముదలియార్
పచ్చయప్పా ముదలియార్ ఛాయాచిత్రపటం.
జననం
పచ్చయప్పా ముదలియార్

(1754-07-01)1754 జూలై 1
మరణం
స్మారక చిహ్నంపచ్చయప్ప కళాశాల, కంచి ఏకాంబరేశ్వరుని ఆలయంలో పచ్చయప్ప విగ్రహం
జాతీయతభారతీయుడు
వృత్తిదుబాసీ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
విద్యాదాత
నికర విలువరూ.10లక్షల 70వేలు(1794 నాటికి)

చిన్నతనం

మార్చు

పచ్చయప్ప ముదలియార్ నేటి తమిళనాడు తిరువళ్లూరు జిల్లాలోని పెరియపాళైయంలో జన్మించారు. దుబాసీ నారాయణ పిళ్ళై ఆహ్వానంపై ఆయన మద్రాసు చేరుకుని[1] 16 ఏళ్ళకే దుబాసీ అయ్యి, 21 సంవత్సరాలకల్లా అదృష్టమని చెప్పుకోదగ్గ సంపదను ఆర్జించారు.

దుబాసీగా

మార్చు

నారాయణ పిళ్ళై శిష్యరికంలో, పచ్చయప్ప మొదలియార్ దుబాసిత్వానికి తన గురువు నారాయణ పిళ్ళై మరణించిన వెంటనే ఎదిగారు. అదే సమయంలో, పచ్చయప్పకు ఉద్యోగమిచ్చిన పోనీ కుటుంబానికి చెందిన హెన్రీ పోనీ, థామస్ పోనీ మద్రాసు మేయర్ పదవికి ఎదిగారు. ఇది పచ్చయప్ప ముదలియార్ స్థాయిని పెంచి, క్రమంగా మద్రాసు పట్టణంలోకెల్లా సంపన్నులు, శక్తిమంతుల్లో ఒకనిగా ఎదిగే వీలిచ్చింది.

జీవనశైలి

మార్చు

మద్రాసు పట్టణంలోకెల్లా సంపన్నుడైన వ్యక్తి అయినా, పచ్చయప్ప ముదలియార్ చాలా సామాన్యమైన, నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. 1790లో నెం.26, పగోడా వీధిలో ఆయన ఇల్లు నిర్మించుకున్నారు. ఆ ఇంటిలోనే ఆయన మరణించేవారకూ జీవించారు. ఆయన జీవితాన్ని సమకాలికుడైన రచయిత అత్యంత సమగ్రమైన జీవితచరిత్రగా మలిచారు.[2] ప్రత్యక్షంగా చూసినవారి జ్ఞాపకాల ప్రకారం ఆయన ప్రతిరోజూ తన సంపన్నులైన ఇరుగుపొరుగువారితో కలిసి వెళ్ళి కూవం నదిలో స్నానం చేసి కోమలీశ్వరన్‌పేటలోని దేవాలయంలో పూజాదికాలు చేసేవారు. కంచిలోని ఏకాంబరేశ్వరస్వామిని తరచుగా అర్చించేవారు. ఆయన ఏకాంబరేశ్వరస్వామి దేవాలయ పునర్నిర్మాణాలకు తన సొమ్ము వెచ్చించారు. స్వామి ఆలయంలోని స్తంభంపై పచ్చయప్ప ముదలియార్ విగ్రహాన్ని చూడవచ్చు. తరచు మద్రాసు నుంచి కంచికి వెళ్ళే ప్రయాణభారాన్ని తగ్గించుకునేందుకు పారీస్ కార్నర్, చైన్నైలో నమూనా ఆలయాన్ని నిర్మించారు. తన కాలాన్ని మద్రాసు, తంజావూరుల నడుమ విభజించుకుని స్వగ్రామంలో గడిపేవారు. ఆ క్రమంలో చేసే ప్రయాణాల్లో చిదంబరం వద్ద ఒక్కోసారి రోజులపాటు విడిదిచేసి చిదంబరేశ్వరస్వామిని సేవించుకునేవారు.

1794లో పచ్చయప్ప ఆరోగ్యం అత్యంత వేగంగా దెబ్బతింది. ఆ సంవత్సరం మద్రాసుకు, తంజావూరుకు నడుమ చేస్తున్న ప్రయాణాల్లో అనారోగ్య కారణాలతో పచ్చయప్ప మార్చి 21, 1794న కుంభకోణం వద్ద మరణించారు.

వీలునామా

మార్చు

పచ్చయప్ప ముదలియార్ వీలునామా వ్రాసిన మొట్టమొదటి భారతీయుల్లో ఒకరు. తన ఆస్తిలోంచి రూ.4.5లక్షలు హిందూ మతసంస్థల పోషణార్థం కేటాయించగా, మిగిలిన రూ.7లక్షలు హిందూ యువతకు ఆంగ్ల విద్యను అందించమని వ్రాసుకున్నారు. (ఆయన మరణ సమయంలో పచ్చయప్ప ఆస్తి నాటికి ఐదు లక్షల పగోడాలు లేదా రూ.10లక్షల 70వేలుగా అంచనా కట్టారు.[3] విద్యాదాత పచ్చయప్ప ముదలియార్ వ్రాసిన విల్లుకు వ్యతిరేకంగా, ఆయన మరణానంతరం పచ్చయప్ప దానధర్మాలకు కేటాయించిన లక్షలాది రూపాయల సొమ్మును వారసులు దావావేశారు. ఈ నేపథ్యంలో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ చెన్నై సుప్రీంకోర్టు అడ్వకేట్ జనరల్ కాంప్టన్, ఆయన అనంతరం వచ్చిన మరొక అడ్వకేట్ జనరల్ నార్టన్ పచ్చయప్ప దానధర్మాలకు కేటాయించిన సొమ్మును న్యాయపరంగా వెలికితీయించారు. ఆ వెలికి తీసిన సొమ్మును పచ్చయప్ప వీలునామా మేరకు ధర్మకార్యాలకు ఖర్చుచేసేందుకు 1832లో ధర్మకర్తల బోర్డు ఏర్పాటుచేశారు. ఆ బోర్డులో పోలీసు సూపరింటెండెంటు, దాత వెంబాకం రాఘవాచార్యులు అధ్యక్షునిగా, ప్రముఖ విద్యాదాత కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై ఒకానొక ధర్మకర్త గ ఉన్నారు. 1842లో వెంబాకం రాఘవాచార్యులు మరణించాకా అప్పటి నుంచి శ్రీనివాసపిళ్ళై అధ్యక్షుడై 1852లో తాను మరణించేవరకూ కొనసాగారు. ఈ క్రమంలోనే ఆ ధర్మనిధితో పచ్చయప్ప కళాశాలను నిర్మించారు.[4]

పచ్చయప్ప ట్రస్టు

మార్చు

పచ్చయప్ప ట్రస్టు 1990 నాటికి రూ.4,500 కోట్ల విలువైన ఆస్తులు కలిగివుందని అంచనా. ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద ఛారిటీ ట్రస్టుల్లో ఒకటిగా పేరొందింది. కన్యాకుమారి నుంచి వారణాసి వరకూ వివిధ మతపరమైన సేవాసంస్థలను నిర్వహించడంతోపాటుగా, పచ్చయప్ప ట్రస్టు తమిళనాడు రాష్ట్రంలో ఆరు కళాశాలలను, ఒక పాలిటెక్నిక్ విద్యాసంస్థను, 16 పాఠశాలలను నిర్వహిస్తోంది. వైద్యపరమైన సౌకర్యాల కల్పనలోనూ ట్రస్టు సేవలందించింది. ట్రస్టుకు రాష్ట్రంలో చాలా ఆస్తులున్నాయి.

పచ్చయప్ప కళాశాల

మార్చు

పచ్చయప్ప కళాశాల ద్వారా పచ్చయప్ప ముదలియార్ పేరు చిరస్థాయిగా నిలిచింది. జనవరి 1, 1842లో పచ్చయప్ప విద్యాసంస్థ పచ్చయప్ప ముదలియార్ తన వీలునామాలో విద్యాసంస్థల ఏర్పాటుకు కేటాయించిన సొమ్ముతో ప్రారంభించారు. 1856లో సంస్థ చైనా బజారులోని తన స్వంత స్థలానికి మారిపోయింది. దీనిలో 1850లో పాఠశాల, 1889లో కళాశాల ఏర్పాటుచేశారు. పచ్చయప్ప మిషనరీ కాని, బ్రిటీష్ ఆర్థిక సహకారం లేకుండా దక్షిణ భారతదేశంలో ఏర్పాటైన హిందూ విద్యాసంస్థలలొో ఇది ప్రప్రథమం.

మూలాలు

మార్చు
  1. M T Saju (October 8, 2012). "Legacy of Pachaiyappa". chennai. Times of India. p. 5.
  2. New Social Elites and an Early Colonial State, a dissertation by Kanakalatha Mukund[permanent dead link]
  3. నీల్డ్, సుసాన్ (1984). ద దుబాసీస్ ఆఫ్ మద్రాస్.
  4. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.