పద్మజా నాయుడు

భారత రాజకీయవేత్త

పద్మజా నాయుడు (నవంబర్ 17, 1900 - మే 2, 1975) స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి. ఈమె ముత్యాల గోవిందరాజులు నాయుడు, సరోజినీ దేవి ల కుమార్తె.

పద్మజా నాయుడు

జననం మార్చు

పద్మజా నాయుడు 1900 సంవత్సరం నవంబర్ 17 వ తేదిన హైదరాబాద్ లో జన్మించింది.[1]

విద్యాభ్యాసం మార్చు

పద్మజా నాయుడు పెద్దగా చదువుకోలేదు. చిన్ననాడు చేరిన మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలలో నాలుగేళ్ళు మాత్రమే చదివింది. బాల్యంలో తరుచుగా అనారోగ్యానికి గురికావడం కూడా ఆమె చదువు సరిగా సాగకపోవడానికి ఒక కారణం. ఆమె నేర్చుకున్న విద్య, సంస్కారం అంతా గోల్డెన్ థ్రెషోల్డ్‌కు వచ్చి పోయే వారి మధ్యే సాగిపోయింది.

అభ్యుదయ పథంలో మార్చు

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వర్క్స్ శాఖను ఏర్పాటు చేసి ఆమె పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టింది. ప్రజారోగ్య పరిరక్షణకై ఆమే ఎంతో మంది ముస్లిం స్త్రీలను సభ్యులుగా చేర్చుకొని ప్లేగు రిలీఫ్ కమిటీని ఏర్పాటుచేసింది. పౌరుల స్వేచ్ఛ కొరకు, జాగిర్దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా స్థాపించబడిన స్వదేశీ లీగ్ అనే సంస్థకు అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే, ఆమె తన సంపాదకత్వంలో వన్ వరల్డ్ అనే పత్రికను నడిపింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో సామ్యవాద సిద్ధాంతానికి ప్రభావితులైన కొందరు ఉస్మానియా విద్యార్థులు కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించారు. ఈ సంస్థకు పద్మజానాయుడు సహకారాన్ని అందించారు. 1935లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు, రైతుల దుర్భర పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకరావడానికి ఏర్పడిన హైదరాబాద్ సహాయక సంఘానికి ఆమె అధ్యక్షురాలుగా వ్యవహరించారు. అనేక ప్రాంతాలు పర్యటించి, బాధితులకు తక్షణ సహాయం అందేలా ఏర్పాట్లు చేశారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కారాగారానికు వెళ్ళారు. అప్పటికి మహిళలకు ప్రత్యేకమైన కారాగారాలు లేకపోవడం, పలుకుబడి కలిగిన కుటుంబానికి చెందినది కావడం మూలానా ఆమెను హయత్ నగర్ లోని భేగం గారి దేవిడిలో సకల సౌకర్యాలు కలిగిన రాజభవనంలో ఆమెను నిర్బంధించారు. దానికి ఆమె సంతోషించక తనతో పాటు అరెస్ట్ అయిన తక్కిన మహిళలకు ఎందుకు ఈ వసతులు కల్పించలేదని ప్రశ్నించారు. చైనా యుద్ధ సమయంలో ఆమె తనకున్న విలువైన బంగారు ఆభరణాలను నేషనల్ డిఫెన్స్ ఫౌండేషన్ కు సమర్పించింది.

రాజకీయాలలో మార్చు

1950 లో పద్మజా నాయుడు భారతరాజ్యంగ సభకు ఎన్నికై రెండేళ్ళు ఆ పదవిలో కొనసాగారు. ఆ తరువాత ఈమె 1956 నుండి 1967 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నరుగా పనిచేశారు. స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా తల్లితో పాటు పనిచేసిన పద్మజ 21 యేళ్ల వయసులోనే హైదరాబాదులో భారత జాతీయ కాంగ్రేసు సహవ్యవస్థాపకురాలయ్యింది. స్వాతంత్ర్య్ర్యానంతరం పద్మజా నాయుడు పార్లమెంటుకు ఎన్నికైంది కానీ అనారోగ్యం వల్ల రాజీనామా చేసింది. ఆ తరువాత పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నరు గానూ, బంగ్లాదేశ్ శరణార్థుల సహాయచర్యలప్పుడు భారత రెడ్ క్రాస్ సంస్థ యొక్క ఛైర్మన్ గాను పనిచేసింది. పద్మజా నాయుడుకు భారత్ సేవక్ సమాజ్, అఖిల భారత హస్తకళల బోర్డు, నెహ్రూ స్మారక నిధి వంటి సంస్థలతో అనుబంధం ఉంది.

కవిగా మార్చు

1961లో పద్మజ తన కవితా సంకలనం "ది ఫెదర్ ఆఫ్ డాన్" పేరుతో ప్రచురించింది.[2] 1975లో పద్మజా నాయుడు స్మృత్యర్థం డార్జిలింగులోని జంతుప్రదర్శనశాలను పద్మజా నాయుడు హిమాలయ జంతుప్రదర్శనశాలగా అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ప్రారంభోత్సవం చేశారు.

పురస్కారాలు మార్చు

భారతజాతికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆమెకు పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది.

తుది శ్వాస మార్చు

పద్మజా నాయుడు 1975 మే 2[3] న పరమపదించారు.

మూలాలు మార్చు

  1. ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక, జనవరి,2014, పుట- 5
  2. http://www.thefamouspeople.com/profiles/sarojini-naidu-36.php
  3. S. C. Bhatt (2006-01-01). Land and people of Indian states and union territories (1 ed.). New Delhi: kalpaz publications. p. 521. ISBN 81-7835-385-7. Retrieved 14 March 2015.