పరశురాముడు

మహావిష్ణువు ఆరో అవతారం
(పరశురామావతారము నుండి దారిమార్పు చెందింది)

శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము (Parasurama Incarnation) ఆరవది.[1] త్రేతాయుగము ఆరంభములో జరిగింది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు, జామదగ్ని అని కూడా అంటారు.[2]

పరశురాముడు
రాజా రవివర్మ గీచిన గొడ్డలి తో ఉన్న పరశురాముని చిత్రము
శ్రీమహావిష్ణువు ఆరవ అవతారము
అనుబంధంభీష్ముడు , ద్రోణుడు,కర్ణుడు, కల్కి లకు గురువు.
ఆయుధములుgandra గొడ్డలి (పరశు)
తండ్రిజమదగ్ని
పరశురామావతారము

పరశురాముని జన్మవృత్తాంతం మార్చు

కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు.[3] ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఋచీకుడు యాగం చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తనకొడుకు సాత్వికుడిగ ఉండి, మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పల్కుతాడు.[4] ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతో జన్మించినవాడు పరశురాముడు.[3] గాధి కొడుకే విశ్వామిత్రుడు. భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు.

కార్తవీర్యునితో వైరం మార్చు

 
కార్త్యవీరునితో పోరాడుతున్న పరశురాముడు.

హైహయ వంశజుడైన కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు.[3] గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వేయి చేతులు పొంది, మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్ధంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు.[3] ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.

కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమౌతుంది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్దకొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని, సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా, అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకొమ్మనగా పరశురాముడు తల్లిని, సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకొంటాడు.

ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి మెండానికి అతికించి బ్రతికిస్తాడు.

ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు.[2] శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. దశరథునివంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.పరశురాముడు మహా పరాక్రమవంతుడు.

రామాయణంలో పరశురాముడు మార్చు

 
పరశురాముని ముందు రాముడు

సీతా స్వయంవరంలో శ్రీ రాముడు శివ ధనుస్సును విరచిన తరువాత సీతారాముల కల్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరుశురాముడు కోపించి, రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరధుని అభ్యర్ధనలను, రాముని శాంత వచనాలనూ పట్టంచుకొనలేదు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునకిచ్చాడు. రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు. రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు విడవాలి అని అడుగగా తన తపోశక్తి కొట్టై మని చెప్పి తాను మహేంద్రగిరిపై తపస్సు చేసికోవడానికి వెళ్ళిపోయాడు.[5] ఆ విధంగా ధనస్సును పరశురాముడు రామునకు అందించినపుడు పరశురామునికీ రామునికీ భేదం లేదని ఇద్దరికీ అవగతమైనది[6][6]

మహాభారతంలో పరశురాముడు మార్చు

  • మహాభారతంలో పరశురాముడు ముగ్గురు వీరులకు గురువైనాడు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్మునకు అస్త్రవిద్యలు బోధిం.చాడు. తరువాత అంబను వివాహంచేసుకొనమని చెప్పగా ఆజన్మబ్రహ్మచర్యవ్రతుడైనందున భీష్ముడు అందుకు తిరస్కరించాడు. ఇద్దరికీ జరిగిన మహాయుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు. దేవతల అభ్యర్ధనమేరకు యద్ధం నిలుపబడింది[7][8]
  • కర్ణుడు తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. తరువాత కర్ణుని అబద్ధాన్ని తెలిసికొన్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపించాడు.
  • ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు. అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకొన్నాడు.[7]

మరికొన్ని విషయాలు మార్చు

  • స్కాంద పురాణం ప్రకారం పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు జన్మించినట్లుగా పేర్కొనబడింది. అందువలన ఆ రోజు పరశురామ జయంతి జరుపుకుంటారు.
  • పరశురాముడు దత్తాత్రేయుని వద్ద శిష్యునిగా చేరి అనేక విద్యలను నేర్చుకొన్నాడు. ఈ అంశాలు స్కాంద పురాణంలో వివరించబడింది.
  • ఒకమారు పరశురాముడు శివుని దర్శించబోగా ద్వారం వద్ద వినాయకుడు అడ్డగించాడు. కోపంతో పరశురాముడు తన పరశువును విసిరేశాడు. తన తండ్రియైన శివుని ప్రసాదమైన పరశువుపై గౌరవంతో వినాయకుడు ఆ పరశువుతో తన దంతం విరిగేలా సమర్పించుకొన్నాడు.
  • పరశురాముడు చిరంజీవి. కల్క్యవతారమునకు విద్యలుపదేశిస్తాడనీ, తరువాతి మన్వంతరములో సప్తర్షులలో ఒకడవుతాడనీ కథ.
  • పరశురాముడు పూర్ణావతారము కాదనీ, అవశేషావతారమనీ అంటారు. కనుక పరశురాముని స్తోత్రాలూ, మందిరాలూ చాలా తక్కువ.
  • భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చిన తరువాత పరశురామునికి తపస్సు చేసికోవడానికి చోటు లేదు. ఆయన తన పరశువును సముద్రంలోకి విసిరేయగా, ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక. ఇలా వెలువడ భూమిలో గల 7 ప్రదేశాలను పరశురామక్షేత్రాలు అని అంటారు.
  • కేరళలో తిరువనంతపురం దగ్గర, తిరువళ్ళంలో కరమణ నది ఒడ్డున ఒక పురాతనమైన పరశురామ మందిరం ఉంది. ఇది 2వేల సంవత్సరాలనాటిదంటారు. ఇక్కడ పితృదేవతలను పూజించడం ఆచారం.

స్తోత్రాలు మార్చు

రామదాసు రచించిన దాశరధీ శతకములో పరశురాముని స్తుతి

ఇరువదియొక్క మాఱు ధరణీశులనెల్ల వధించి తత్కళే
బర రుధిర ప్రవాహమున బైతృక తర్పణమొప్పజేసి భూ
సురవరకోటికిన్ ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
ధరణినొసంగితీనె కద దాశరధీ కరుణా పయోనిధీ.

జయదేవుని దశావతార స్తుతి నుండి

క్షత్రియ రధిర మయే జగదపగతపాపమ్
స్నపయసి పయసి శమిత భవ తాపమ్
కేశవ! ధృత భృగుపతి రూప!
జయ జగదీశ ! హరే!

మూలాలు మార్చు

  1. Shahjahanpur – Etihasik Evam Sanskritik Dharohar
  2. 2.0 2.1 Pai, Anant (November 29, 2010). Parashurama – Sixth Incarnation of Vishnu. Amar Chitra Katha – Volume 764. p. 33.
  3. 3.0 3.1 3.2 3.3 Rai, Kayyara Kinhanna (June 13, 2010). BhargavaParashurama. Litent ePublishing. p. 33.
  4. "Parashurama". Rai, Kayarra Kinhanna. November 22, 2012. Archived from the original on 2012-04-28. Retrieved November 22, 2012.
  5. "DEBARRED FROM HEAVEN".
  6. 6.0 6.1 Valmiki; Ralph, T. H. The Ramayana. Amazon Digital Services. p. 1787.
  7. 7.0 7.1 Vyasa, Krishna-Dwaipayana; Ganguli, Kisari Mohan (1883–1896). The Mahabharata. Sacred Texts.
  8. "The Tragic Trio: Amba". Roychowdhry, Debalina PhD. June 13, 2012. Archived from the original on 2014-04-04. Retrieved November 22, 2012.