మన్వంతరం

(మన్వంతరము నుండి దారిమార్పు చెందింది)

హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు పాలనా కాలాన్ని మన్వంతరం అంటారు. ఒక్కొక్క మన్వంతరం 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినములో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతం మనము ఏడవ మన్వంతరంలో ఉన్నాము. ప్రతి మన్వంతరం 71 మహాయుగములుగా విభజించబడింది.

భాగవతం అష్టమ స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉంది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరం లోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.

మన్వంతరాల పేర్లు

మార్చు
  1. స్వాయంభువ మన్వంతరం
  2. స్వారోచిష మన్వంతరం
  3. ఉత్తమ మన్వంతరం
  4. తామస మన్వంతరం
  5. రైవత మన్వంతరం
  6. చాక్షుష మన్వంతరం
  7. వైవస్వత (ప్రస్తుత) మన్వంతరం
  8. సూర్య సావర్ణిక మనవు మన్వంతరం
  9. దక్షసావర్ణి మన్వంతరం
  10. బ్రహ్మసావర్ణి మన్వంతరం
  11. ధర్మసావర్ణి మన్వంతరం
  12. భద్రసావర్ణి మన్వంతరం
  13. దేవసావర్ణి మన్వంతరం
  14. ఇంద్రసావర్ణి మన్వంతరం

ఎన్నెన్ని సంవత్సరాలు?

మార్చు

దేవతల కాల ప్రమాణం మన (మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికం. అనగా మన ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక దివారాత్రం (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరం. ఇట్టి 12,000 దివ్య సంవత్సరాలు వారికి ఒక దివ్య యుగం (మహాయుగం). ఇది మనకు ఒక చతుర్యుగ కాలమునకు సమానం. ఈ విధంగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగం అగును.

  • కృత యుగము = 4,800 దివ్య సంవత్సరాలు = 17,28,000 మానవ సంవత్సరాలు
  • త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరాలు = 12,96,000 మానవ సంవత్సరాలు
  • ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరాలు = 8,64,000 మానవ సంవత్సరాలు
  • కలియుగము (3102 BCE) = 1,200 దివ్య సంవత్సరాలు = 4,32,000 మానవ సంవత్సరాలు
  • మొత్తము 12,000 దివ్య సంవత్సరాలు = 43,20,000 మానవ సంవత్సరాలు = ఒక దివ్య యుగం (చతుర్యుగం, మహాయుగం)

ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పం (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగాలు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయం అంటారు. అటువంటి 360 దివారాత్రాలు బ్రహ్మకు ఒక సంవత్సరం. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలం.

కాలమానం సౌర (మానవ) సంవత్సరాలు దివ్య సంవత్సరాలు
ఒక చతుర్యుగము 43,20,000 12,000
71 చతుర్యుగాలు 30,67,20,000 8,52,000
ప్రతి కల్పాదియందు వచ్చు సంధ్య 17,28,000 4,800
14 సంధ్యా కాలాలు 2,41,92,000 67,200
ఒక సంధ్యాకాలముతో పాటు ఒక మన్వంతరం 30,84,48,000 8,56,800
14 సంధ్యలతో పాటు కలిపిన 14 మన్వంతరాలు 4,31,82,72,000 1,19,95,200
14 మన్వంతరాలు + కల్పాది సంధ్య = ఒక కల్పం = బ్రహ్మకు ఒక పగలు 4,32,00,00,000 1,20,00,000
బ్రహ్మకు ఒక రాత్రి 4,32,00,00,000 1,20,00,000
బ్రహ్మకు ఒక దివారాత్రం (ఒక రోజు) 864,00,00,000 2,40,00,000
బ్రహ్మకు ఒక సంవత్సరం 311040,00,00,000 864,00,00,000

ముఖ్య సంఘటనలు

మార్చు

వెనుకటి మన్వంతరాలలో జరిగిని కొన్ని ముఖ్య సంఘటనలు

స్వాయంభువ మన్వంతరం

మార్చు
  • తండ్రి - బ్రహ్మ
  • మనువు - స్వాయంభువు.ప్రథముడు
  • భార్య - శతరూప (అనంతి)
  • మనుపుత్రులు - ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు తపస్సు చేసి, నారాయణుని దర్శనము పొందాడు.
  • మనుపుత్రికలు -ఆకూతి (రుచి ప్రజాపతి భార్య, ప్రసూతి (దక్ష ప్రజాపతి భార్య, దేవహూతి (కర్ధమ ప్రజాపతి భార్య).
  • భగవంతుని అవతారాలు - కపిలుడు, యజ్ఞుడు - దేవహూతి కడుపున కపిలునిగా జన్మించి ధర్మ జ్ఞానాలను లోకాలకు ఉపదేశించాడు. దీనినే కపిలగీత అని అన్నారు. స్వాయంభువ మనువు చిరకాలం రాజ్యం పాలించి, విరక్తుడై రాజ్యాన్ని త్యజించి, భార్యయైన శతరూపతో బయలుదేరి అరణ్యాలకు వెళ్ళాడు. సునంద నది ఒడ్డున తీవ్రమైన తపస్సు చేశాడు. క్షుధార్తులైన అసురులు, యాతుధానులు ఆ మనువును భక్షించడానికి వచ్చారు. నారాయణుడు ఆకూతి (స్వాయంభువ మనువు కూతురు) గర్భంలో యజ్ఞునిగా జన్మించి దుష్టులను సంహరించి త్రిదివాలను పాలించాడు. వేదశిరుడు అను విప్రుని కుమార్తెకు విభుడు అను పేరుతో అవతరించెను.
  • సప్తర్షులు - వశిష్ట, అత్రి, మరీచి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు
  • ఇంద్రుడు - రోచనుడు
  • సురలు - యామాదులు
  • ప్రహ్లాదుని జననము, నరసింహ అవతారము, వరహ అవతారము ఈ మన్వన్తరములో జరిగింది.

స్వారోచిష మన్వంతరం

మార్చు
  • మనువు - స్వరోచికి వనదేవతయందు కలిగిన కుమారుడు.
  • మనువు పుత్రులు - చైతుడు, రోచిష్మదుడు, కింపురుషుడు
  • భగవంతుని అవతారాలు - విభువు - వేద శిరసునికి తుషతయందు విభుడనే పేరుతో అవతరించి, కౌమార బ్రహ్మచారియై, ఎనభై అయిదు మంది మునులచే వ్రతాన్ని ఆచరింపజేశాడు.
  • సప్తర్షులు - స్తంభుడు, దత్త, ఔర్యుడు, వశిష్టపుత్ర, కశ్యపపాణి, బృహస్పతి, చ్యవనాత్రి
  • ఇంద్రుడు - విపశ్చింతుడు
  • సురలు - తుషితాదులు
  • సురత చక్రవర్తి వృత్తాంతము

ఉత్తమ మన్వంతరం

మార్చు
  • మనువు - ప్రియవ్రతుని కొడుకు. స్వాయంభువమనువు మనవడు
  • మనువు పుత్రులు - పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు
  • భగవంతుని అవతారాలు - సత్య సేనుడు - ధర్మునికి సూనృత యందు సత్యసేనుడనే పేర అవతరించి సత్యవ్రతం అనుష్టించి దుష్టులను సంహరించి సత్యజితునికి సుఖాన్ని కూర్చాడు.
  • సప్తర్షులు - ప్రమాదాదులు (వశిష్టుని సుతులు) ; కౌకుంది, కురుంది, దలయ, శంఖ, ప్రవాహిత, మిత, సమ్మిత - (సప్త ఊర్జులు)
  • ఇంద్రుడు - సత్యజిత్తు
  • సురలు - సత్యదేవ శృతభద్రులు

తామస మన్వంతరం

మార్చు
  • మనువు - సురాష్ట్రుడు అనే రాజు వలన మృగి (లేడి) (ఉత్పలావతి శాపవశమున) కి జన్మించెను.
  • మనువు పుత్రులు - వృషాఖ్యాతి, కేతువు, జానుజంఘుడు, శాంతి, నరుడు, ప్రస్థలుడు, దృఢుడు, కృతబంధువు మొదలైన పదుగురు పుత్రులు
  • భగవంతుని అవతారాలు - హరి - హరిమేధసునికి హరిణియందు హరి యను పేరిట అవతరించి మకరగ్రస్తుడైన గజేంద్రుని రక్షించాడు. (గజేంద్ర మోక్షము)
  • సప్తర్షులు - ధాత, జహ్నుడు, పృథుడు, కావ్యుడు, కపీవంశుడు, అగ్ని, అకపీవంశుడు
  • ఇంద్రుడు - త్రిశిఖుడు (శిబి)
  • సురలు - విధృతి తనయులు వైధృతులు (వేదరాశి నశించినపుడు ఆ తేజస్సును తమలో జీర్ణం చేసుకొన్నవారు)

రైవత మన్వంతరం

మార్చు
  • మనువు - దుర్దమునకు రేవతియందు పుట్టినవాడు.
  • మనువు పుత్రులు - బలుడు, బంధుడు, స్వయంభావ్యుడు, సత్యకుడు, అర్జున ప్రతినింద్యాదులు
  • భగవంతుని అవతారాలు - వైకుంఠుడు - శుభ్రునకు వికుంఠయందు వైకుంఠునిగా అవతరించాడు. రమాదేవి ప్రార్థనను మన్నించి వైకుంఠాన్ని నిర్మించాడు.
  • సప్తర్షులు - హిరణ్యరోముడు, వేదశిరుడు, ఊర్ధ్వబాహుడు, దేవబాహుడు, సత్యనేత్రుడు, పర్జన్యుడు యదుధృడు
  • ఇంద్రుడు - విభుడు
  • సురలు - భూత దయాదులు

చాక్షుష మన్వంతరం

మార్చు
  • మనువు - చక్షుసుని భార్య అగు జృహతికి రిపుని వల్ల కలిగిన పుత్రుడు చాక్షుసుడు.
  • మనువు పుత్రులు - శతద్యుమ్నుడు, ఊరుడు, పూరుడు, తపస్వి శుచి, అగ్నిష్ఠోముడు, అతిరాత్రుడు, ప్రద్యుమ్నుడు, అభిమన్యుడు మొదలైనవారు.
  • భగవంతుని అవతారాలు - అజితుడు, కూర్మావతారం - వైరాజునికి సంఖ్యాతియందు అకితుడనే పేర అవతరించాడు. ఇదే మన్వంతరంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతము కొరకై క్షీరసాగర మథనము చేశారు. భగవంతుడు కూర్మావతారుడై మందరగిరిని నిలిపాడు. శివుడు కాలకూట విషము మింగాడు. లక్ష్మీ దేవి అవతరించింది. సాగర మథనం చివర ధన్వంతరి అమృతంతో వచ్చాడు. మోహినీరూపుడై భగవంతుడు అమృతాన్ని దేవతలకు అందజేశాడు.
  • సప్తర్షులు - విరజుడు, అతినాముడు, భృగుడు, నభుడు, వివస్వంతుడు, సుధాముడు, సహిష్ణుడు
  • ఇంద్రుడు - మనోజవుడు
  • సురలు - ఆప్యాదులు

వైవస్వత (ప్రస్తుత) మన్వంతరం

మార్చు

ఇది ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరము. చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు.

  • మనువు - వివస్వంతుడని పుత్రుడు వైవస్వతుడు.
  • తండ్రి - వివస్వంతుడు
  • తల్లి - సంజ్ఞ
  • భార్య - శ్రద్ధ అందుకే ఇతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది.
  • మనువు పుత్రులు - ఇక్ష్వాకుడు, నాభాగుడు, ధృష్టుడు, సంయాతి, కరుషుడు, వృషధ్రుడు, వసుమంతుడు, నరిష్యంతుడు, పృషపదుడు.
  • మనువు పుత్రికలు - ఇల (సుద్యుమ్నుడు).
  • భగవంతుని అవతారాలు - కశ్యపునకు అదితి యందు వామనుడిగా జన్మించి బలి చక్రవర్తి నుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
  • సప్తర్షులు - కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు
  • ఇంద్రుడు - ఓజస్వి
  • సురులు - వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వదేవుడు, నాసత్యుడు, మరుత్తు

ఈ మన్వంతరమున పరశురామ, శ్రీ రామ, బలరామ, శ్రీ కృష్ణ, వరాహ అవతారములు జరిగినవి,, కల్కి అవతరిస్తారు.

సూర్యసావర్ణిక మన్వంతరం

మార్చు

రాబోయే మన్వంతరం

  • మనువు - సావర్ణి - విశ్వకర్మకు సంజ్ఞ, ఛాయ అను ఇద్దరు పుత్రికలు. వీరు వివస్వంతుని భార్యలయ్యారు. వివస్వంతునికి బడబ అనే మూడవ భార్య కూడా ఉన్నదంటారు. సంజ్ఞకు యముడు, యమి, శ్రాద్ధదేవుడు జనించారు. ఛాయకు సావర్ణి, తపతి, శనైశ్చరుడు కలిగారు. బడబకు అశ్వినులు జనించారు. వీరిలో సావర్ణియే కాబోయే ఎనిమిదవ మనువు.
  • తండ్రి - సూర్యుడు
  • తల్లి - ఛాయ
  • మనువు పుత్రులు - నిర్మోహ వారజస్కాదులు
  • భగవంతుని అవతారాలు - సార్వభౌముడు - వేదగుహ్య అయిన సరస్వతి యందు సార్వభౌముడనే పేర అవతరిస్తాడు. ఇంద్ర పదవిని పురందరుని నుండి బలికి అప్పగిస్తాడు. వైవస్వత మన్వంతరంలో వామనునికి మూడడుగుల నేల దానమిచ్చినందుకు ప్రతిఫలంగా బలికి ముల్లోకాల సార్వభౌమత్వం సిద్ధించనుంది. బలి ఇప్పుడు సుతల లోకంలో ఉన్నాడు.
  • సప్తర్షులు - అజర, అశ్వత్థామ, గౌతమ, శరద్వంత, కౌశిక, కాశ్యప, ఔర్వ .
  • ఇంద్రుడు - విరోచన సుతుడైన బలి
  • సురలు - సుతపసులు, విరజులు, అమృత ప్రభులు

దక్షసావర్ణి మన్వంతరం

మార్చు
  • మనువు - దక్షుని పుత్రుడు దక్ష సావర్ణి
  • మనువు పుత్రులు - ధృతకేతువు, దీప్తి కేతువు మొదలైనవారు.
  • భగవంతుని అవతారాలు - (ధర్మసేవ్యుడు?) భగవంతుడు ఆయుష్మంతునికి అంబుధార వలన ఋషభుడనే పేర అవతరించి అద్భుతునికి ఇంద్ర పదవిని ప్రసాదిస్తాడు.
  • సప్తర్షులు - మేథాతిధి, వసువు, సత్యుడు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, సవనుడు, హవ్యవాహనుడు
  • ఇంద్రుడు - అద్భుతుడు (కుమారస్వామి)
  • సురలు - పరమరీచి గర్గాదులు

బ్రహ్మసావర్ణి మన్వంతరం

మార్చు
  • మనువు - ఉపశ్లోకుని సుతుడు బ్రహ్మసావర్ణి
  • మనువు పుత్రులు- భూరిషేణుడు మొదలైనవారు
  • భగవంతుని అవతారాలు - భగవంతుని అంశచే విశ్వసృజునికి విషూచియందు జనించి ఇంద్రునిగా ఉంటాడు. శంభునికి శక్తినిస్తాడు.
  • సప్తర్షులు - హవిష్మంతుడు, సుకృతి, సత్య, అపంమూర్తి, నాభాగ, అప్రతిమౌజసుడు, సత్యకేతు
  • ఇంద్రుడు - శంభుడు
  • సురలు - విభుదాదులు

ధర్మసావర్ణిక మన్వంతరం

మార్చు
  • మనువు - దక్షసావర్ణి కుమారుడు
  • భార్యలు - కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ, లజ్జ
  • మనువు పుత్రులు - సత్య ధర్మాదులు, శముడు, కాముడు హరుడు పదిమంది.
  • భగవంతుని అవతారాలు - సూర్యునికి ధర్మసేతువనే పేర జన్మించి వైధృతునికి త్రైలోక్య సామ్రాజ్యాన్నిస్తాడు.
  • సప్తర్షులు - భరద్వాజ, ఆత్రేయ, రామ, వ్యాస, దీప్తిమంత, బహుశృత, ద్రౌణి
  • ఇంద్రుడు - వైధృతుడు
  • సురలు - విహంగమాదులు

రుద్రసావర్ణిక మన్వంతరం

మార్చు
  • మనువు - రుద్రసావర్ణిక [1]
  • మనువు పుత్రులు - దేవసుతాదులు
  • భగవంతుని అవతారాలు - సత్య తాపసుడు - సత్యతపసునికి సూనృత యందు అవతరిస్తాడు.
  • సప్తర్షులు - తపస్వి, సుతపసుడు, తపోమూర్తి, తపోనిధి, తపోధృతి, ధ్యుతి, తపోధనుడు
  • ఇంద్రుడు - ఋతధాముడు
  • సురలు - పరితారులు

దేవసావర్ణి మన్వంతరం

మార్చు
  • మనువు - దేవసావర్ణి
  • మనువు పుత్రులు - విచిత్ర సేనాదులు
  • భగవంతుని అవతారాలు - దేవహోత్రునికి బృహతియందు దైవహోత్రుడు అనుపేర అవతరిస్తాడు. దివస్పతికి ఐశ్వర్యం అనుగ్రహిస్తాడు.
  • సప్తర్షులు - నిర్మోహ తత్వదర్శనాదులు; నిర్మోహ, తత్వదర్శనుడు, నిష్ప్రకంప, నిరుత్సుక, ధృతిమతుడు, అవ్యయుడు, సుతప
  • ఇంద్రుడు - దివస్పతి
  • సురలు - సుకర్మాదులు

ఇంద్రసావర్ణి మన్వంతరం

మార్చు
  • మనువు - ఇంద్ర సావర్ణి
  • మనువు పుత్రులు - గంభీరాదులు
  • భగవంతుని అవతారాలు - సత్రాయణునకు బృహద్భానుడు అను పుత్రునిగా జన్మిస్తాడు.
  • సప్తర్షులు - అగ్నిబాహ్యాదులు; అగ్నిబాహు, శుచి, శుక్ర, మగధ, గృధ్ర, యుక్త, అజిత
  • ఇంద్రుడు - శుచి
  • సురలు - పవిత్రాదులు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. సమూల శ్రీమదాంద్ర ఋగ్వేద సంహిత, చతుర్థ సంపుటము, 9,10 మండలంలు, పుట:861, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి

వనరులు, లింకులు

మార్చు
  • జయదయాల్ గోయందకా రచన - శ్రీమద్భగవద్గీత తత్వవివేచనీ వ్యాఖ్య - గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ (తెలుగు అనువాదం -గోలి వెంకట్రామయ్య)
  • శ్రీమద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన - ఏల్చూరి మురళీధరరావు - ప్రచురణ: శ్రీరామకృష్ణ మఠము, దోమలగూడ, హైదరాబాదు
  • http://www.indiaheritage.org/rendez/article1.htm#image1 - వి కృష్ణమూర్తి వ్యాసం
  • పూర్వగాథాలహరి- కృతికర్త శ్రీ వేమూరి శ్రీనివాసరావు - వెంకట్రామ అండ్ కో
"https://te.wikipedia.org/w/index.php?title=మన్వంతరం&oldid=4340374" నుండి వెలికితీశారు