పరాన్నజీవనం
(పరాన్న జీవులు నుండి దారిమార్పు చెందింది)
వేర్వేరు జాతులకు చెందిన రెండు జీవుల మధ్య సహవాసం ఏర్పడినప్పుడు, అందులో ఒకటి రెండోదానికి నష్టం కలిగిస్తూ, తాను లాభం పొందుతూ జీవిస్తుంది. లాభం పొందే జీవిని 'పరాన్నజీవి' (Parasite) అని, ఆశ్రయం ఇచ్చి, ఆహారాన్ని సమకూర్చి నష్టపోయిన జీవిని 'అతిథేయి' (Host) అని, అవి జీవించే విధానాన్ని 'పరాన్న జీవనం' (Parasitism) అని అంటారు.
పరాన్న జీవుల రకాలుసవరించు
- 1. బాహ్య పరాన్నజీవులు (Ectoparasites): ఇవి అతిథేయి శరీరం వెలుపలి తలం మీద జీవిస్తాయి. ఉదా: పేలు.
- 2. అంతః పరాన్నజీవులు (Endoparasites): ఇవి అతిథేయి శరీరం లోపలి భాగాల్లో జీవిస్తాయి. అవి నివసించే దేహభాగాలనుబట్టి వీటిని మూడు రకాలుగా గుర్తించారు.
- ఎ. కుహర లేదా గహ్వర పరాన్నజీవులు (Coelozoic or Luminal parasites): ఇవి దేహంలోని వివిధ కుహరాలలో జీవిస్తుంటాయి. ఉదా: 1. ట్రైకోమోనాస్ వెజైనాలిస్ అనే స్త్రీల యోనిలో ఉండే కశాభయుత ప్రోటోజోవా జీవి. 2. మానవుడి పేగులో ఉండే బద్దెపురుగులు, ఏలికపాములు.
- బి. కణాంతర లేదా కణజాల పరాన్నజీవులు (Histiozoic or Intercellular parasites): ఇవి అతిథేయి కణజాలల్లో, కణాల మధ్య జీవించే పరాన్నజీవులు. ఉదా: 1. ఎంటమీబా హిస్టోలైటికా యొక్క మాగ్నా రూపం. ఇది మానవుడి పెద్దపేగు, అంధబాహువు కుడ్యాలలో నివసిస్తుంది. 2. ఉచరీరియా బాంక్రాఫ్టి మానవుడి శోషరస నాళాలు, శోషరస గ్రంధుల్లో జీవిస్తుంది.
- సి. కణాంతస్థ లేదా కణాలలో జీవించే పరాన్నజీవులు (Cytozoic or Intracellular parasites): ఇవి కణాల లోపల జీవించే పరాన్నజీవులు. ఉదా: 1. ప్లాస్మోడియమ్ తన జీవిత చరిత్రలోని కొన్ని దశల్లో కాలేయ కణాల్లోను, రక్తంలోని ఎర్ర రక్తకణాల్లోను జీవిస్తాయి. 2. లీష్మానియా డోనావాని మానవుని రెటిక్యులో ఎండోథీలియల్ కణాలలో జీవిస్తుంది.
- 3. అవికల్పిక పరాన్నజీవులు (Obligate parasites): తప్పని సరిగా జీవితాంతం అతిథేయిపై ఆధారపడే పరాన్నజీవులు. ఇవి అతిథేయిని వదులుకొని స్వతంత్రంగా జీవించలేవు. వీటిలో కొన్ని అతిథేయి విశిష్టత (Host specificity) ను పాటిస్తాయి. ఉదా: టీనియా సోలియా మానవుడి పేగులోనే జీవిస్తుంది గాని ఇతర క్షీరదాల పేగుల్లో జీవించదు.
- 4. వైకల్పిక పరాన్నజీవులు (Facultative parasites): అతిథేయి అందుబాటులో లేనప్పుడు స్వతంత్రంగా జీవించగలిగే పరాన్నజీవులు. ఉదా: మానవుడిలోని క్షయవ్యాధిని కలిగించే మైకోబాక్టీరియం టుబర్కులోసిస్.
- 5. అధి పరాన్నజీవనం (Hyperparasitism): ఒక పరాన్నజీవి మీద మరొక పరాన్నజీవి జీవించడం. అలాంటి పరాన్నజీవులను అధిపరాన్నజీవులు అంటారు.
- 6. ఏకాతిథేయ పరాన్నజీవులు (Monogenetic parasites): ఈ రకమైన పరాన్నజీవులు తమ జీవిత చరిత్రను ఒక అతిథేయిలోనే పూర్తిచేసుకుంటాయి. ఉదా: ఎంటమీబా హిస్టోలైటికా, ఆస్కారిస్, ఎంటెరోబియస్, ఆంకైలోస్టోమా.
- 7. ద్వంద్వాతిథేయి పరాన్నజీవులు (Digenetic parasites): ఈ రకమైన పరాన్నజీవులు వాటి జీవిత చరిత్ర పూర్తిచేసుకోవడానికి రెండు అతిథేయుల మీద ఆధారపడతాయి. ఒకదాన్ని 'ప్రాథమిక అతిథేయి' అని, రెండోదాన్ని 'ద్వితీయ అతిథేయి' అని అంటారు. ఉదా: ప్లాస్మోడియం, టీనియా, ఉచరీరియా.
- 8. హానికర పరాన్నజీవులు (Pathogenic parasites): ఇవి ప్రధాన అతిథేయిలో వ్యాథిని కలిగిస్తాయి.
- 9. హానికలిగించని పరాన్నజీవులు (Non-pathogenic parasites): ఇవి అతిథేయిలో ఏవిధమైన వ్యాథిని కలిగించవు. ఉదా: ఎంటమీబా జింజివాలిస్.
- 10. తాత్కాలిక పరాన్నజీవులు (Intermittant parasites): ఈ రకమైన పరాన్నజీవులు శాశ్వతంగా అతిథేయిని అంటిపెట్టుకొని ఉండవు. అవసరమైనప్పుడే అతిథేయిని చేరి పోషణ జరుపుకొంటాయి. ఉదా: దోమ, నల్లి, జలగ.
అతిథేయుల మీద పరాన్నజీవుల ప్రభావంసవరించు
పరాన్నజీవులు అతిథేయుల్లోని కణజాలాలు, రక్తం, ఇతర శరీర ద్రవాలమీద పోషణ జరపటం వల్ల అతిథేయులు బలహీనులవుతాయి. వాటి పెరుగుదల క్షీణిస్తుంది. చివరకు మరణం కూడా సంభవించవచ్చును.
- హానికరమైన ప్రోటోజోవాకు చెందిన పరాన్న జీవులు కొన్ని వ్యాధులను కలుగజేస్తాయి. ఉదా: మలేరియా.
- పేగులో జీవించే జియార్డియా లాంబియా అనే ప్రోటోజోవా పరాన్నజీవి అతిసార వ్యాధిని కలిగిస్తుంది.
- ఎంటమీబా హిస్టోలైటికా కణజాల పరాన్నజీవిగా ఉండి, రక్తవిరోచనాలు, పేగులో పుళ్ళు, అప్పుడప్పుడూ కాలేయం, ఊపిరితిత్తులలో చీముగడ్డలు కలగజేస్తుంది.
- కుహర పరాన్నజీవులైన టీనియా వంటి చదును పురుగులు, ఆస్కారిస్ వంటి గుండ్రని పురుగులు అతిథేయి పేగులోని ఆహారప్రసరణకు అడ్డుపడుతూ కడుపునొప్పిని కలిగిస్తాయి. వీటివల్ల రక్తహీనత కూడా కలుగుతుంది.
- ఉచరీరియా బాంక్రాఫ్టీ వంటి గుండ్రటి పురుగులు మానవ అతిథేయిల్లో ఫైలేరియాసిస్ లేదా ఎలిఫెంటియాసిస్ అనే వ్యాధిని కలుగజేస్తాయి.
- కొన్ని పరాన్న జీవులు అవి నివసించే అతిథేయుల అవయవల్లో కణవిభజన రేటును త్వరితం చేస్తూ కణాల సంఖ్యను పెంచుతాయి. ఈ స్థితిని హైపర్ ప్లాసియా ( ) అంటారు. ఉదా: లివర్ ఫ్లూక్ పిత్తాశయ నాళంలో హైపర్ ప్లాసియాని కలుగజేసి ఫలితంగా పైత్యనాళ కుహరం చిన్నదై పచ్చకామెర్లు వస్తుంది.
- కొన్ని పరాన్న జీవులు అవి నివసించే అతిథేయి శరీరాన్ని విపరీతంగా పెరిగేటట్లు చేస్తాయి. లివర్ ఫ్లూక్ డింభకాలు దాని మాధ్యమిక అతిథేయి అయిన నత్త యొక్క దేహం పెరిగేటట్లు చేస్తుంది.
- పరాన్నజీవులు ప్రతిరక్షకాల ఉత్పత్తికి అతిథేయిని ప్రేరేపిస్తాయి. వాటికి ప్రతిచర్యగా పరాన్నజీవులు కూడా రక్షణను వృద్ధి చేసుకొంటాయి.
- కొన్ని పరాన్నజీవులు, అతిథేయుల జీజకోశాలను శిథిలంచేసి వాటిని వంధ్యజీవులుగా మారుస్తాయి. సాక్యులైనా అనే క్రష్టేషియా జీవి కార్సినస్ మోనాస్ అనే పీత అతిథేయిలో ఇలా వంధ్యత్వాన్ని కలుగజేస్తుంది.
ఇవి కూడా చూడండిసవరించు
Look up పరాన్నజీవనం in Wiktionary, the free dictionary.