పలనాడు సత్యాగ్రహం

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక ఉద్యమం

పలనాడు సత్యాగ్రహం భారతీయ స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక ఉద్యమం.

ఉన్నవ లక్ష్మీ నారాయణ

గుంటూరు జిల్లాలోని పలనాడు వెనుకబడిన ప్రాంతం. అక్కడ ఉన్న అడవి నుంచి ప్రజలు వంటచెరకు, పశువులకు గడ్డి మొదలైనవి సేకరించేవారు. వీటికోసం పన్నులు చెల్లించేవారు. రెవెన్యూ, అటవీ శాఖ ఉద్యోగులు ప్రజలను పీడించేవారు. 1921 లో కరువు వచ్చింది. ప్రజలు ప్రభుత్వాన్ని తాము అటవీ ఉత్పత్తులను ఉచితంగా వినియోగించుకోవడానికి అనుమతి కోరారు. దానికి ప్రభుత్వం అంగీకరించలేదు. మాచెర్ల, వెల్దుర్తి, సిరిగిరిపాడు, రెంటచింతల, వాటి పరిసర గ్రామాల ప్రజలు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా పశువుల్ని అడవుల్లోకి తోలేవారు. అధికారులు పశువుల్ని బంధిస్తే ప్రజలు వందల సంఖ్యలో పోయి వాటిని విడిపించుకుని వచ్చేవారు. దీనిని అరికట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం అదనపు బలగాలనూ రప్పించింది. ప్రజలు సహాయ నిరాకరణ ప్రారంభించారు. అటవీ, రెవెన్యూ అధికారులను సాంఘికంగా బహిష్కరించారు. అన్ని వృత్తుల వారు అధికారుల అవసరాలను తీర్చడానికి నిరాకరించారు. అధికారులు ఇళ్ళను ఖాళీ చేయాలని అడిగారు. అక్కడికి కలెక్టర్ వచ్చాడు. తాను వచ్చిన విషయాన్ని అందరికీ దండోరా వేసి తెలుపాలని సూచించాడు. కానీ వారు తమ తప్పెట్లు పాడైపోయాయని సమాధానమిచ్చారు. ఉద్యమ తీరు తెన్నులను గమనించడానికి కాంగ్రెస్ నాయకులైన ఉన్నవ లక్ష్మీ నారాయణ, వేదాంతం నరసింహాచారి అక్కడికి వచ్చారు. వీరిని ప్రజలు తప్పెట్లతో ఘనంగా ఊరేగిస్తూ తీసుకుని వచ్చారు. ఇది గమనించిన కలెక్టర్ ఆగ్రహం చెంది వారి రాకను శాంతి భద్రతలకు ముప్పుగా పేర్కొంటూ వారిని అరెస్టు చేయించాడు. దాంతో ప్రజల ఆందోళన తీవ్రతరమైంది. పశువులను అడవుల్లోకి వదిలారు. అనేక సార్లు పోలీసులతో ఘర్షణ జరిగింది. 1921 సెప్టెంవర్ 23 న అటవీశాఖాధికార్లు రిజర్వ్ పోలీసులను రప్పించి వారి సాయంతో ముత్పూరు అడవిపై దాడి చేసి మించాలపాడు వద్ద 300 పశువులను పట్టుకున్నారు. వారిపై 200 మంది ప్రజలు దాడిచేసి రాళ్ళు రువ్వారు. కాల్పుల్లో ప్రజానాయకుడు కన్నెగంటి హనుమంతు, మరో ముగ్గురు మరణించారు. దీంతో ఉద్యమం ఆగిపోయింది.