సూదిబెజ్జం కెమెరా
సూదిబెజ్జం కెమెరా (ఆంగ్లం: Pinhole Camera) కటకం లేని ఒక ప్రాథమిక కెమెరా. మిగతా ఏ దిశలోనూ కాంతికి ప్రవేశం కలుగనివ్వకుండా కేవలం ఒక సూక్ష్మరంధ్రం ద్వారా ప్రతిబింబాన్ని నమోదు చేసే ఒక పెట్టె. ఒక దృశ్యం యొక్క కాంతి రేఖలు పెట్టెకు ఒక వైపు ఉన్న సూక్ష్మరంధ్రం గుండా ప్రయాణించి, ఆ రంధ్రానికి ఎదురుగా ఉన్న పెట్టె మరోవైపున ప్రతిబింబాన్ని తలక్రిందులు చూపే కెమెరా.
ప్రతిబింబం ఏర్పడే వైపు తప్పితే, పెట్టె యొక్క లోపలి వైపు అన్ని వైపులా (రంధ్రం ఉన్న వైపుతో సహా) నల్లని రంగు పూయబడి ఉంటుంది. ఒక స్థాయి వరకు రంధ్రం ఎంత చిన్నగా ఉంటే ప్రతిబింబం అంత స్పష్టంగా ఏర్పడుతుంది. రంధ్రం యొక్క పరిమాణం రంధ్రం వద్దనుండి ప్రతిబింబం వరకు ఉన్న దూరంలో 100వ వంతు గానీ, అంత కంటే చిన్నగా గానీ ఉండాలి.
ఆవిష్కరణ
మార్చుకెమెరా అబ్స్క్యూరా యొక్క ఆవిష్కరణ వల్ల ఛాయాచిత్రకళలో పెద్దగా పురోగతి కనబడలేదు. కెమెరా అబ్స్క్యూరా సహజంగా సంభవించే సంఘటనల పై పని చేసేది. ఉదాహరణకి, సూర్యకాంతి చెట్ల ఆకుల గుండా ప్రయాణించినపుడు కాంతి సరళరేఖాత్మక వ్యాప్తి వలన భూమిపై ప్రతిబింబాలు ఏర్పడేవి. శతాబ్దాల తరబడి పలు ఆసక్తిపరులు కెమెరా అబ్స్క్యూరా యొక్క నిర్మాణానికి పరిపరి విధాలుగా సహకరించిననూ, ఇవన్నీ ప్రకృతిలోని కాంతి యొక్క అంతర్లీన ధర్మాలపై మాత్రమే ఆధారపడి ఉండేవి.
4వ శతాబ్దంలోనే గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్ Problems అని తను వ్రాసిన పుస్తకంలో దీనిపై చర్చించాడు. సూర్యకాంతి చతుర్భుజాల గుండా పయనించిననూ దాని పర్యవసానంగా ఏర్పడే ప్రతిబింబం వృత్తాకారంలో ఎందుకు ఉంటుంది? జల్లెడ గుండా లేదా చెట్టు యొక్క ఆకుల గుండా లేదా అరచేతులను ఒకదానిపై ఒకటి ఉంచుకొని, వ్రేళ్ళ మధ్య నుండి సూర్యగ్రహణముని చూచినపుడు సూర్యకిరణాలు చంద్రవంక ఆకారంలోనే ఎందుకు కనబడతాయి?
5వ శతాబ్దంలో చైనీయులు పగోడాలు తలక్రిందులుగా గోడలపై కనబడటం గమినించారు. 10వ శతాబ్దానికి చెందిన షెన్ కువో అనే చైనీసు శాస్త్రవేత్త కెమెరా అబ్స్క్యూరా పై పరిశోధనలు చేసి, మొట్టమొదట దానికి జ్యామితీయ, పరిమాణాత్మక గుణగణాలని ఆపాదించగలిగాడు. 10 నుండి 16వ శతాబ్దం వరకూ ఇబ్న్-అల్-హైతం, గెమ్మా ఫ్రిసియస్, గియాంబటిస్టా డెల్లా పోర్టా వంటి వారు సూదిబెజ్జం కెమెరాల వలన ప్రతిబింబం ఎందుకు తలక్రిందులగా ఏర్పడుతుందో రచనలు చేశారు. 1600 వ సంవత్సరానికి గియాంబటిస్టా డెల్లా పోర్టా సూదిబెజ్జం కెమెరాకి కటకాన్ని ఉపయోగించాడు. 1850 సంవత్సరంలో స్కాటిష్ శాస్త్రవేత్త డేవిడ్ బ్ర్యూస్టర్ సూదిబెజ్జం కెమెరాతో మొట్టమొదటి ఛాయాచిత్రాన్ని సృష్టించాడు.
-
సూదిబెజ్జం కెమెరా పని చేసే తీరు
-
చెట్టు యొక్క ఆకుల గుండా ప్రయాణించిన సూర్యకాంతి భూమిపైకి ప్రసరించే తీరు
-
పురాతన కోటల గోడకి ఉన్న కిటికీ రంధ్రాల ద్వారా పయనించిన కాంతి ఎదురుగా ఉన్న గోడపై ప్రతిబింబాలని ఏర్పరచే తీరు
నిర్మాణం
మార్చుసూదిబెజ్జం కెమెరాలని ఇంట్లోనే తయారుచేయవచ్చును. వేరే ఏ దిశలోనూ కాంతి ప్రవేశించని ఒక డబ్బాకి సూదితో రంధ్రం చేసి దానికి ఎదురుగా ఉన్న డబ్బా మరో వైపున ఫిలింని గానీ, ఫోటోగ్రఫిక్ పేపర్ ని గానీ అమర్చగలిగితే అదే సూదిబెజ్జం కెమెరాగా పనిచేస్తుంది. కటకం దెబ్బతిన్న కెమెరాకి, ఆ కటకాన్ని తొలగించి దాని స్థానంలో సూదిబెజ్జాన్ని అమర్చగలిగినా అది ఒక చక్కని సూదిబెజ్జం కెమెరా వలె పనిచేస్తుంది.
-
అగ్గిపెట్టెతో తయారు చేయబడిన ఒక సూదిబెజ్జం కెమెరా
-
సాధరణ కెమెరాకే కటకం స్థానంలో సూదిబెజ్జం అమర్చితే అది సూదిబెజ్జం కెమెరాగా ఉపయోగపడుతుంది
-
కటకం స్థానంలో ఇమడటానికి రూపొందించబడిన సూదిబెజ్జం
సూదిబెజ్జం కెమెరా యొక్క ధర్మాలు
మార్చురంధ్రానికి, ఎదురుగా ఉన్న ఉపరితలానికి మధ్య ఉన్న దూరం తగ్గే కొద్దీ
- దృష్టి కోణం పెరుగుతుంది
- ఏర్పడే ప్రతిబింబంలో దృక్కోణపు వక్రీకరణ పెరుగుతుంది
- ప్రసరించే కాంతి తక్కువ వైశాల్యంలోనే ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి స్పష్టత పెరుగుతుంది
- ఫిలిం/పేపర్ పై బహిర్గత వ్యవధి యొక్క అవసరం తగ్గుతుంది
ఈ దూరం పెరిగే కొద్దీ దృష్టి కోణం తగ్గుతూ ప్రతిబింబంలో వక్రీకరణ తగ్గుతూ, ప్రతిబింబంలో స్పష్టత లోపిస్తూ, బహిర్గత వ్యవధి యొక్క అవసరం పెరుగుతుంది.
పనితీరు
మార్చుకటకాలని ఉపయోగించే కెమెరాలలో దృశ్యం ఉన్న దూరాన్ని బట్టి, కావలసినంత నాభ్యంతరాన్ని ఎంచుకొని మీట నొక్కగానే షట్టరు అత్యంత వేగవంతంగా (సెకనులో ఒక భాగం మాత్రమే) తెరచుకొని వెంటనే మూసుకుపోతుంది. సూక్ష్మరంధ్రానికి, దృశ్యానికి మధ్య ఉన్న కటకం ఈ లోపే ప్రతిబింబాన్ని ఫిలిం పై గానీ, సెన్సర్ పై గానీ నమోదు చేస్తుంది. ఎక్కువ సమయం షట్టరుని తెరచి ఉంచినచో బహిర్గతం మితి మించి నమోదు అయిన ప్రతిబింబం అధిక కాంతిలో అదృశ్యమైపోయే ప్రమాదం ఉంది. కానీ, సూదిబెజ్జం కెమెరాలో, ఇతర కెమెరాలతో పోలిస్తే సూక్ష్మరంధ్రం చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి, ప్రతిబింబాన్ని నమోదు చేయటానికి షట్టరు వేగాన్ని బాగా తగ్గించవలసి ఉంటుంది. అవసరాన్ని బట్టి షట్టరుని 5 సెకనుల నుండి పలు గంటల వ్యవధి వరకు తెరచే ఉండవలసిన అవసరం ఉంటుంది. ఈ వ్యవధి అంతనూ, కెమెరాకి (మీటని నొక్కటం వలన వచ్చే) స్వల్ప కదలికలు కూడా కలుగకూడదు. కాబట్టి మీట ద్వారా నియంత్రించబడే షట్టరు కాకుండా, కావలసినపుడు తెరచి, మరల కావలసినపుడు మూసేందుకు అనువుగా మూత వలె ఉండే షట్టరులు, మీటతో పని చేసే షట్టరు అయినచో దానిని కావలసినంత సేపు నొక్కి పట్టి ఉంచే కేబుల్ ని సూదిబెజ్జం కెమెరాతో బాటు ఉపయోగిస్తారు. సాధారణంగా సూదిబెజ్జం కెమెరాలు దీర్ఘకాలిక వ్యవధిలో సూర్యుని కదలికని చిత్రీకరించటానికి ఉపయోగిస్తారు. దీనినే సోలార్ గ్రఫీ అని అంటారు.
-
దీర్ఘ బహిర్గతానికై సూదిబెజ్జం కెమేరా యొక్క షట్టరుకి అమర్చిన కేబుల్
this very small hole camera very use full
సూదిబెజ్జం కెమెరా యొక్క ఉపయోగాలు
మార్చు- నిర్మాణం చాలా సులభం. ఇంటిలో లభించే వస్తువులతో కూడా నిర్మాణం చేసుకొనవచ్చును. పాత కెమెరాలకి కొంత మార్పులు/చేర్పులు చేసి నిర్మాణం చేసుకొనవచ్చును.
- వినియోగం కూడా సులభమే. ఛాయాచిత్రకళ యొక్క ప్రాథమిక సూత్రాలు తెలిస్తే చాలు.
- కటకాల గురించి, క్షేత్ర అగాథాల గురించి తెలియవలసిన అవసరమే లేదు. సూదిబెజ్జం కెమెరా ద్వారా, ఒకే ఛాయాచిత్రంలో దగ్గరగా ఉన్న వస్తువు, దూరంగా ఉన్న వస్తువు కూడా సమాన స్పష్టతతోనే కనబడతాయి.
- నాభ్యంతరాలు, బహిర్గత వ్యవధుల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని అర్థం చేసుకొనేందుకు అద్భుతమైన పరికరంగా ఉపయోగపడుతుంది.
- పని చేసే తీరు పై కొంత అవగాహన వచ్చిన తర్వాత, ప్రయోగాలతో పలు ఆసక్తికరమైన ప్రభావాలని ఛాయాచిత్రాలలో తీసుకురావచ్చును. అత్యంత ఖరీదైన కెమెరాలతో తీసే ఛాయాచిత్రాలతో పిన్ హోల్ ఫోటోగ్రాఫ్ లు పోటీపడేలా చేయవచ్చును.
కొన్ని ఆసక్తికరమైన పిన్ హోల్ ఛాయాచిత్రాలు
మార్చు-
20 నిముషాల బహిర్గత వ్యవధితో కోట నేపథ్యంలో సూర్యాస్తమయం
-
దీర్ఘ వ్యవధి బహిర్గతంతో మృదుత్వం పాళ్ళు పెరగటానికి ఉదాహరణ
-
దృశ్యాలని స్వాప్నిక దృశ్యాల వలె చిత్రించే పిన్ హోల్ ఫోటోగ్రఫి
-
పిన్ హోల్ ఛాయాచిత్రంలో చీకటిమయంగా కనబడే మూలలు (విగ్నెటింగ్)
-
సూదిబెజ్జానికి, నమోదు చేసే మాధ్యమానికి మధ్య దూరం తగ్గటంతో అత్యధికంగా ఉన్న దృక్కోణపు వక్రీకరణ
-
సూదిబెజ్జానికి, నమోదు చేసే మాధ్యమానికి మధ్య దూరం సరిపడేంత ఉండటంతో అత్యల్పంగా ఉన్న దృక్కోణపు వక్రీకరణ
-
ఒక సూదిబెజ్జం కెమెరాతో ఏర్పడే నజర్థకం, దాని ధనాత్మకం
సూదిబెజ్జం దినోత్సవం
మార్చుప్రపంచ సూదిబెజ్జం దినోత్సవం ప్రతి ఏప్రిల్ చివరి వారం జరుపబడుతుంది. [1]
మూలాలు
మార్చు- Pinhole Photography: A Guidebook for Teachers by N.C.Dvoracek
- The Beginner's Guide to Pinhole Photography by Jim Shull (Amherst Media, Inc.)