పురాణం పురుషోత్తమశాస్త్రి

పురాణం పురుషోత్తమశాస్త్రి కర్ణాటక సంగీత విద్వాంసుడు.

పురాణం పురుషోత్తమ శాస్త్రి
వ్యక్తిగత సమాచారం
జననం1925
మూలంమధిర, వరంగల్లు జిల్లా,
మరణం2010
సంగీత శైలికర్ణాటక సంగీతం (గాత్రం)
వృత్తిసాంప్రదాయ సంగీత కారుడు
క్రియాశీల కాలం1937 - 2010

విశేషాలు

మార్చు

పురుషోత్తమ శాస్త్రి 1925వ సంవత్సరంలో గుంటూరు జిల్లా, నల్లపాడు గ్రామంలో తన మాతామహుని ఇంట్లో జన్మించాడు.[1] ఇతని తండ్రి పురాణం కనకయ్య శాస్త్రి సంగీత విద్వాంసుడు. అతడు గద్వాల సంస్థానంలో, యాదగిరిగుట్ట దేవస్థానంలో ఆస్థాన విద్వాంసునిగా ఉన్నాడు. తండ్రి ప్రోత్సాహంతో ఇతడు తన 12వ యేటనే తొలి సంగీత ప్రదర్శనను ఇచ్చాడు. ఇతడు తన తండ్రితో పాటు ములుగు శివానందశాస్త్రి, ముసిలి సుబ్రహ్మణ్యశాస్త్రుల వద్ద సంగీతంలో మెలకువలు నేర్చుకున్నాడు. తరువాత మద్రాసు వెళ్ళి సెంట్రల్ కాలేజీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్‌లో 1950-52ల మధ్య డిప్లొమా చదివాడు. అక్కడ ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, టైగర్ వరదాచారి, టి.కె.రామాచారి, టి.బృంద, మాయవరం కృష్ణ అయ్యర్, సుందరేశ అయ్యర్ మొదలైనవారి వద్ద శిష్యరికం చేశాడు. మహావైద్యనాథ అయ్యర్ వద్ద త్యాగరాజ సంప్రదాయంలో ప్రత్యేక శిక్షణను తీసుకున్నాడు. డిప్లొమా చేసిన తరువాత తన స్వస్థలానికి తిరిగి వచ్చాడు. ఇతని మనోధర్మం, లయజ్ఞానం, గమకపుష్టి, గాత్ర విస్తృతి ఇతడికి శాస్తీయ సంగీత గాయకునిగా పేరు తెచ్చిపెట్టింది.

ఇతడు తన రాగాలాపనతో శారీరిక రుగ్మతలను పోగొట్టేవాడు. 1999లో తీవ్రమైన కరువును ఎదుర్కొన్నప్పుడు ఇతడు హరప్రియరాగ యజ్ఞాన్ని వారం రోజులు నిర్వహించాడు. ఫలితంగా పెద్ద వర్షం రావడంతో పాటు రిజర్వాయర్లు నిండిపోయాయి. ఎవరైనా గాయకుడు తప్పుగా పాడితే ఇతడు ఆ తప్పును ఎత్తిచూపడానికి వెనుకాడేవాడు కాదు. ఇతడి సంగీత స్థాయి ఎంత పెద్దదంటే ఆకాశవాణి ఇతడికి ఆడిషన్ పరీక్ష నిర్వహించకుండానే కార్యక్రమాలను రికార్డు చెసింది[1]. ఇతడు గాయకుడిగానే కాకుండా సంగీత గురువుగా గుంటూరులోని నాగార్జున సంగీత కళాశాలలో ఎంతో మంది విద్యార్థులకు సంగీత పాఠాలు చెప్పాడు. కర్ణాటక సంగీతం గురించి ఎన్నో వ్యాసాలను వివిధ పత్రికలలో వ్రాశాడు. ఎన్నో గ్రంథాలను రచించాడు.[2]

ఇతని విద్వత్తుకు గుర్తింపుగా భారత ప్రభుత్వపు సాంస్కృతిక శాఖ రాజీవ్‌గాంధీ పురస్కారాన్ని ఇచ్చింది. 2003లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంస అవార్డును ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ సంగీత విద్యానిధి అనే బిరుదును ప్రదానం చేసింది. 2009లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు ఇతడికి లభించింది.

ఇతడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ 2010లో మరణించాడు. ఇతనికి భార్య, ఒక కుమారుడు, 6గురు కుమార్తెలు ఉన్నారు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 G.S. (19 February 2010). "A legend of our times". The Hindu. Retrieved 6 February 2021.
  2. web master. "Puranam Purushottama Sastri". SANGEET NATAK AKADEMI. Sangeet Natak Akademi, New Delhi. Archived from the original on 6 ఫిబ్రవరి 2021. Retrieved 6 February 2021.